మిషన్ డోలోలో భాగంగా మెట్రో సిటీల్లో నరమేధాన్ని సృష్టిస్తున్న ‘సూసైడ్ వెపన్’ దశను డీయాక్టివేట్ చేశాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్టుగా శ్రీలంకకు వెళ్లాలని తన టీమ్‌కు చెప్పాడు. ‘అంటే, హ్యూమన్ షీల్డ్ దశ అక్కడే స్టార్ట్ అయ్యిందని అంటున్నావారా?’ అంటూ జయ అడుగుతుండగానే.. రుద్ర మొబైల్‌కు ఓ మెసేజీ వచ్చింది. ‘వాచ్ లైవ్ న్యూస్ నౌ’ అంటూ ఆ మెసేజీ సారాంశం. వెంటనే మొబైల్లో లైవ్ న్యూస్ ఆన్ చేశాడు రుద్ర.
ఆన్యూస్లో ఇలా చెప్తున్నారు. ‘దేశంలోని కొన్ని పల్లెల్లో ప్రజలు వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసుల్లాగా ఒకరినొకరు దాడులు చేసుకొంటూ శరీర భాగాలను తింటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకావట్లేదు’ అంటూ భీతావహ దృశ్యాలను సదరు చానెల్ ప్రసారం చేస్తున్నది. దీన్ని చూసిన రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ.. పీఎంవోకు కనెక్ట్ అయ్యాడు. ‘అవును రుద్ర.. ఈ ఘోర కలి గంట నుంచి కొనసాగుతున్నది. తొలుత 15 నిమిషాలు ఒక్క వ్యక్తే ఇలా ప్రవర్తించాడు. అయితే, 15 నిమిషాలు గడవగానే ఇద్దరు అలా ప్రవర్తించారు. గంట గడిచిందో లేదో.. ఈ వింత ధోరణి 16 మందికి పాకింది. ఇది ఇలా ఎంతదూరం పోతుందో ఏమో??’ అంటూ పీఎంవో అధికారి భయంతో చెప్తూ పోయాడు.‘సార్.. అసలు ఎగ్జాక్ట్‌గా అక్కడ ఏం జరుగుతుంది?’ అంటూ భయంభయంగా అడిగాడు.
‘ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పినదాని ప్రకారం.. తొలుత ఓ రైతు మీద డ్రోన్‌తో ఎవరో ఏదో ద్రావణాన్ని చల్లినట్టు చేశారట. క్షణాల వ్యవధిలో ఆ ద్రావణం గట్టి కవచంగా విస్తరించి ఆ రైతు బాడీ మొత్తాన్ని ఆక్రమించిందట. అంతే, ఆ రైతు పిచ్చిపట్టిన వాడిలా అమాంతం వ్యక్తులపై పడి పీకలు కొరికేస్తున్నాడట. రైతు పంటి గాటు పడిన వెంటనే.. బాధిత వ్యక్తులపై కొత్తగా కవచం ఏర్పడి వారు కూడా ఆ రైతులాగే పిచ్చిగా ప్రవర్తిస్తూ.. మిగతావారిపై దాడులు చేస్తున్నారట.. మాకైతే, ఇదంతా ఓ జాంబీ మూవీలాగా అనిపిస్తుంది. భద్రత కోసం వెళ్లిన పోలీసులు కూడా రాక్షసులుగానే మారిపోయారు’ అంటూ ఆ అధికారి చెప్తుంటే, రుద్ర నుదుటన చెమటలు పట్టాయి. ఇంతలో ఆ అధికారి ఏదో గుర్తొచ్చినట్టు.. ‘హలో రుద్ర.. ఒకటి చెప్పడం మరిచిపోయా.. డ్రోన్ తొలుత ఆ ద్రావణాన్ని జారవిడుస్తుండగా.. ఓ చీటీ కూడా పడినట్టు కొందరు గుర్తించారు. అలా అక్కడి నుంచి తప్పించుకొన్న కొందరు యువకులు ఆ చీటీని మాకు ఫొటో తీసి పంపించారు. ఇదేమైనా క్లూ కావొచ్చు. ఏదో ఒకటి చేసి ఈ ఘోర కలిని ఆపేలా చేయండి. మిగతా విషయాలు తర్వాత చెప్తా’ అంటూ చీటీ ఫొటోను రుద్రకు పంపించి సదరు అధికారి ఫోన్ కట్ చేశాడు. అప్పటికే రుద్ర ఫోన్ లౌడ్‌స్పీకర్‌తో ఉండటంతో మొత్తం విషయాన్ని అర్థం చేసుకొన్న జయ, రామస్వామి, కరణ్, స్నేహిల్, హరిశ్వతో పాటు మిగతా సిబ్బంది ముఖాల్లో నెత్తుటి చుక్క లేకుండాపోయింది.
చీటీని రుద్ర ఓపెన్ చేశాడు. ‘ఈ దశ ఆగిపోవాలంటే డివైజ్‌ను స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ డివైజ్ ఎక్కడ ఉందంటే? లిటిల్ ఇంగ్లండ్‌లో సీతమ్మ ఏడుస్తోంది’ అని రాసి ఉంది. వెంటనే తన టీమ్‌తో శ్రీలంకలోని ఓ రహస్య ప్రాంతానికి 4 గంటల్లో చేరుకొన్నాడు రుద్ర. చీటీలో ఇంగ్లండ్ అని ఉంటే శ్రీలంకకు రుద్ర ఎందుకు తీసుకొచ్చాడో ఎవరికీ అర్థంకాలేదు. అలా రహస్య ప్రాంతానికి చేరుకొన్న రుద్ర ఆ వెంటనే డివైజ్‌ను కనిపెట్టాడు. ఆ డివైజ్‌లో ఇలా రాసి ఉంది. ‘హేయ్ రుద్ర.. మొత్తానికి వచ్చేశావన్న మాట? ఈ డివైజ్‌ను ఆఫ్ చేస్తే, హ్యూమన్ షీల్డ్ దశ ఆగిపోతుంది అంతే. కానీ, ఇప్పటివరకూ అంటే గడిచిన 5 గంటల్లో మా హ్యూమన్ షీల్డ్‌కు బానిసలుగా మారిన నీ 10,48,576 మంది భారత పౌరులు జాంబీలుగానే అలాగే ఉండిపోతారు. అలా కాకుండా.. వాళ్లను మునుపటి మనుషులుగా మార్చాలంటే, ఆ షీల్డ్ వాళ్ల బాడీ నుంచి వాటికవే ఊడిపోవాలి. అప్పుడే వాళ్లు వైద్య చికిత్సకు స్పందించి.. మామూలు స్థితికి రాగలరు. అది జరగాలంటే, ఈ డివైజ్‌పై డిస్ప్లే అయ్యే పజిల్‌ను సాల్వ్ చెయ్యి. లేదూ… 10,48,576 మందితో నాకు పనిలేదు.. మిగతా వాళ్లను కాపాడితే చాలు అనుకొంటే, ఈ డివైజ్ మీద రెడ్ బటన్ నొక్కు.. అప్పుడు డివైజ్ ఆఫ్ అవుతుంది. రెండో దశ ఆగిపోతుంది. లేదూ.. సెకండ్ ఫేజ్‌ను ఆపడంతో పాటు 10,48,576 మందిని కాపాడాలనుకొంటే పజిల్‌ను ఓకే చేసే గ్రీన్ బటన్ నొక్కు. అన్నట్టు.. పజిల్‌ను 10 సెకండ్లలో కరెక్ట్‌గా సాల్వ్ చేయాలి. పజిల్‌ను సాల్వ్ చేయకపోయినా, తప్పుగా ఆన్సర్ ఎంటర్ చేసినా డివైజ్ పేలిపోతుంది. అంటే, రెండో దశ కొనసాగుతూనే ఉంటుంది. దీనర్థం.. నీ దేశ ప్రజలందరూ జాంబీలుగా మారిపోతారు’ అంటూ ఆ మెసేజీ ఉంది.
ఏం చేస్తాడోనని ఆందోళనతో అందరూ రుద్ర వైపు చూస్తుండగా.. డివైజ్‌లోని గ్రీన్ బటన్‌ను నొక్కాడు రుద్ర. ఆ వెంటనే పజిల్ స్టార్ట్ అయ్యింది. ‘భారత్‌లో 143 కోట్ల జనాభా ఉందనుకొందాం. వీళ్లందరూ హ్యూమన్ షీల్డ్‌గా మారాలంటే రఫ్‌గా ఎంత టైమ్ పడుతుంది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ..’ అని స్టాప్‌వాచ్ స్టార్ట్ కాగానే.. టైమ్‌ను ఎంటర్ చేశాడు రుద్ర. అంతే, కరెక్ట్ ఆన్సర్ అంటూ డిస్ప్లేపై మెసేజీ కనిపించడంతో పాటు.. హ్యూమన్ షీల్డ్ దశ ఆగడమే కాకుండా 10,48,576 మందికి ఉన్న షీల్ట్స్ ఊడి పోయినట్టు రుద్రకు సమాచారం అందింది. అది పక్కనబెడితే, శ్రీలంకలో డివైజ్ ఎక్కడ ఉందో రుద్ర ఎలా కనిపెట్టాడు? పజిల్లో ఎంత టైమ్‌ను రుద్ర ఎంటర్ చేశాడో మీరు కనిపెట్టారా?
రెండో దశ శ్రీలంకలో ప్రారంభం అవుతుందని డోలో ముందే చెప్పాడు. అంటే, చీటీలో చెప్పిన ‘లిటిల్ ఇంగ్లండ్‌లో సీతమ్మ ఏడుస్తోంది’ క్లూ శ్రీలంకకు సంబంధించిందని రుద్ర గుర్తించాడు. లంకలోని అశోక వనంలో సీతమ్మ శోకించినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఆ అశోక వనమే నేటి శ్రీలంకలోని నువరా ఎలియా ప్రాంతం. దాన్ని లిటిల్ ఇంగ్లండ్‌గా కూడా పిలుస్తారు. దీంతో అక్కడే డివైజ్ ఉన్నదని రుద్ర కనిపెట్టాడు. ఇక, పీఎంవో అధికారి చెప్పిన లెక్క ప్రకారం.. తొలుత 15 నిమిషాలు ఒక్క వ్యక్తే వింతగా ప్రవర్తించాడు. 15 నిమిషాలు గడువగానే ఇద్దరు అలా ప్రవర్తించారు. గంట గడిచిందో లేదో.. ఈ వింత ధోరణి 16 మందికి పాకిందని చెప్పాడు. గడిచిన 5 గంటల్లో 10,48,576 మంది పౌరులు జాంబీలుగా మారినట్టు డివైజ్‌లో డిస్ప్లే అయ్యింది. అంటే, ప్రతీ 15 నిమిషాలకు లెక్క డబుల్ అవుతున్నట్టు రుద్ర కనిపెట్టాడు. అంటే, 143 కోట్ల జనాభా హ్యూమన్ షీల్డ్‌గా మారడానికి రఫ్‌గా 7.45 గంటల సమయం పడుతుంది. డివైజ్‌లో ఈ టైమ్‌నే రుద్ర కరెక్ట్‌గా ఎంటర్ చేశాడు. దీంతో రెండో దశ ఆగిపోయింది.