క్రీడల్లో గెలవాలంటే పట్టుదల ఉండాలి. కళల్లో మెరవాలంటే ఆసక్తి కావాలి. ఆ రెండిటిలో రాణించాలంటే మరెంత ప్రతిభ కావాలో చెప్పడం కష్టమే. ఉభయ రంగాల్లో నిష్ణాతులు అయినవాళ్లు అరుదుగా తారసపడతారు. ‘మరణం’ సినిమాతో కొత్త జీవితం మొదలుపెట్టిన సంగీత దర్శకుడు ప్రతిపాటి సాయి శ్రీవర్ధన్ ఈ తరహా సమర్థుడే! అయితే, పాట కోసం తనకు ఇష్టమైన ఆటను దూరం చేసుకున్నాడు. ఎన్నెన్నో ఆటుపోట్లను అధిగమించి, సంగీత సాగరంలో ఓలలాడుతూ.. సుస్వర ఝరుల్ని కురిపిస్తున్న శ్రీవర్ధన్ అంతరంగం ఇది..
మా నాన్న ఓ ఫైనాన్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. అమ్మ సైకాలజీ కౌన్సెలర్. మా ఇంట్లో నాతోనే సంగీతం అడుగుపెట్టింది. ఊహ తెలియనప్పటి నుంచి నాకు సంగీతం ఇష్టం. బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ స్కూల్లో వారానికి ఒకరోజు మ్యూజిక్ క్లాస్ ఉండేది. అక్కడే విద్యాసాగర్ గారి దగ్గర కీ బోర్డ్ నేర్చుకున్నాను. అలా నా సంగీత ప్రయాణం మొదలైంది.
ఈతకు బైబై
ప్రతిరోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవాణ్ని. తర్వాత స్కూల్. అది అయిపోయాక మ్యూజిక్. ఇంటికి రాగానే చకచకా హోమ్‌వర్క్ చేసేవాణ్ని. ఏ కాస్త సమయం దొరికినా మ్యూజిక్ ప్రాక్టీస్ చేయొచ్చనే తపన నాది. కొన్నేండ్లపాటు ఇదే నా జీవితం. మా ఫ్రెండ్స్ ఆటల్లో, చదువులో ముందుండేవాళ్లు. నేను యావరేజ్! టీచర్లు, స్నేహితులు కాస్త చిన్నచూపు చేసేవాళ్లు. చాలా బాధ కలిగేది. నాకు నచ్చిన సంగీతంలో సత్తా చాటాలని భావించాను. పదో తరగతి పరీక్షలు అయిపోయాక సమ్మర్లో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు జరిగాయి.
అందులో అండర్ 20- కేటగిరిలో మెడల్స్ గెలిచాను. అయినా అదే కెరీర్ అనుకోలేదు. ఆ పోటీల తర్వాత స్విమ్మింగ్‌కి ఫుల్స్టాప్ పెట్టేసి.. సంగీతమే సర్వస్వమని ఫిక్సయ్యాను. ‘ఏమవుతావ్?’ అని ఎవరు అడిగినా.. ‘మ్యూజిక్ డైరెక్టర్’ అని చెప్పేవాణ్ని. నా సమాధానం విని అందరూ ఎగతాళి చేసేవారు. మరోవైపు ఇంటర్ రెసిడెన్షియల్ కాలేజ్‌లో చేర్పించారు. దాంతో నా సంగీత సాధనకు బ్రేక్ పడింది. తర్వాత రెండేండ్లకు ఎంసెట్ రాసిన తర్వాత గానీ, కీ బోర్డ్ నా చేతికి రాలేదు.
కరోనా.. కలిసొచ్చింది
సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా చేస్తారో అర్థమయ్యేది కాదు. మ్యూజిక్ కంపోజిషన్ కోసం సాఫ్ట్వేర్ ఉంటుందని నా ఫ్రెండ్ తరంగ్ చెప్పాడు. ఆ సాఫ్ట్వేర్ కోసం అమ్మానాన్నల్ని ఒప్పించి అమెరికా నుంచి ఖరీదైన ల్యాప్‌టాప్ తెప్పించాను. అది 2019 డిసెంబర్లో నా చేతికి వచ్చింది. నాలుగు నెలల్లో కరోనా వచ్చింది. లాక్డౌన్ పడింది. అంతే.. సంగీతం నేర్చుకోవడానికి కావాల్సినంత సమయం దొరికింది. డే అండ్ నైట్ మ్యూజిక్‌తోనే గడిపాను. సినిమా పాటలకు కీ బోర్డ్ ప్లే చేశాను. వాటిని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవాణ్ని.
ఇలా కరోనా అందరికీ పీడకల అయితే.. నాకు మాత్రం మధుర స్వప్నంగా మిగిలిపోయింది! ఎప్పుడూ వేరెవరో కంపోజ్ చేసిన పాటలను కాపీ చేయడమే ఉండేది. నా ప్రతిభకు స్వీయ పరీక్ష పెట్టుకుందామన్నా అవకాశం లేదు. అలాంటి సమయంలో ‘నేను పాటలు కూడా రాస్తాను సార్’ అంటూ మా కాలేజ్ బ్యాండ్ గాయని నందిని వచ్చింది. ఆమెతో నా పోరాటం గురించి చెప్పి.. ఇలా ఉండాలని రాయించుకున్నాను.
ఆ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేశాను. తనే పాడింది. ‘అంతర్యుద్ధం’ పేరుతో సిల్లీ మాంక్స్లో ఆ పాట రిలీజ్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. దానివల్ల మ్యూజిక్ డైరెక్టర్ ప్రతీక్ గారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. తర్వాత శిరీష్ గారి దగ్గర మూడు సినిమాలకు చేశాను.
ఒక అవార్డు.. రెండు కోరికలు
వెబ్ సిరీస్‌లు, పాడ్‌కాస్ట్, జింగిల్స్ లాంటి అన్నిటికీ మ్యూజిక్ చేయాలని నా కోరిక. కానీ, ఆ అవకాశాలు వెతుక్కోవడం చాలా కష్టం. ఆఫర్స్ కోసం యూట్యూబ్ కంపెనీల్లో జాబ్‌లో చేరాను. జింగిల్స్, సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ చేశాను. ఆ ఉద్యోగం వల్ల కొంత అనుభవం వచ్చింది. పదికి పైగా సినిమాలకు సంగీత దర్శకుల దగ్గర పనిచేశాను. ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కి అయినా బిగ్ స్క్రీన్ మీద తన పేరు చూసుకోవాలన్నదే ఫస్ట్ డ్రీమ్. కొద్దిరోజుల్లోనే ఆ కల నెరవేరింది.
‘మరణం’ అనే సినిమాతో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘మానసిక’, ‘మళ్లీ రాని ఆ క్షణం’ సినిమాలకు సంగీతం అందించాను. నాకు డ్రామా, లవ్ ఇష్టం. కానీ, ఇప్పటివరకు కామెడీ, థ్రిల్లర్, హరర్ సినిమాల్లోనే చేశాను. ‘మరణం’ సినిమా సంగీతానికి గానూ కోడి రామకృష్ణ యువ ప్రతిభ అవార్డు వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా అనిపించింది. మంచి ప్రొడక్షన్ హౌజ్‌కి, మంచి డైరెక్టర్‌తో, మంచి కథకు పని చేయాలని నా కోరిక. పనిలో సంతృప్తి రెండో కోరిక. ఈ రెండూ అతి త్వరలో నెరవేరుతాయని ఆశిస్తున్నా!
ఒక్క ఏడాదే చాన్స్
గోకరాజు రంగరాజు కళాశాలలో బీటెక్ కంప్యూటర్స్‌లో చేరాను. కాలేజ్‌లో ‘రిథమ్స్’ అనే బ్యాండ్ ఉంది. నేను అందులో చేరాను. కాలేజ్ ఈవెంట్స్‌లో మా బ్యాండ్ పేరు మార్మోగిపోయేది. ఇంకేముంది చదువు మీద ఉన్న కొద్దిపాటి ఆసక్తీ కరిగిపోయింది. సెకండ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అవుతానని ఇంట్లో చెప్పాను. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం అని చెప్పాను. ‘ముందు బీటెక్ పూర్తిచెయ్! తర్వాత ఏడాది టైమ్ ఇస్తాం. నిన్ను నువ్వు నిరూపించుకో. అవకాశాలు వస్తే ముందుకెళ్లు. లేదంటే జాబ్ చూసుకో’ అని అమ్మానాన్న చెప్పారు. తప్పదనుకొని బీటెక్ కంటిన్యూ చేశాను.