‘దబంగ్’ సినిమాతో బాలీవుడ్లో దుమ్ము రేపిన నటి సోనాక్షి సిన్హా. రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబంగ్ 2.. ఇలా వరుస హిట్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా స్థిరపడింది. బాలీవుడ్ షార్ట్‌గన్ శతృఘ్న సిన్హా గారాలపట్టిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ‘జటాధర’ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన సోనాక్షి పంచుకున్న కబుర్లు ఇవి..
2010లో నా మొదటి సినిమా దబాంగ్ రిలీజైంది. ఆ సినిమా ఎంత విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే. మొన్నామధ్య ఎవరో ఈ విషయం గుర్తు చేసి.. ‘మీరు ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేండ్లు అవుతున్నది’ అన్నారు. ఆ మాట వినగానే నాకు ఆశ్చర్యం కలిగింది. నాకైతే నిన్నే సినిమాల్లోకి అరంగేట్రం చేశానా అనిపిస్తుంది. నేను ప్రతి సినిమానీ నా మొదటి చిత్రంగా భావిస్తాను.
కెరీర్లో హెచ్చుతగ్గులు మామూలే! ఓడినప్పుడు హేళన చేయడం, గెలిచినప్పుడు మెచ్చుకోవడం ఇవన్నీ చాలా కామన్. నన్ను చులకనగా చూసిన వారున్నారు. నా శరీరాకృతి గురించి అసభ్యంగా మాట్లాడిన వారూ ఉన్నారు. ఇప్పటికీ ఆ మాటలు నా చెవిన పడుతూనే ఉన్నాయి. అవమానాలకు కుంగిపోయినా, మెచ్చుకోలుకు పొంగిపోయినా.. మనం అనుకున్నది సాధించలేం.
ఏడాదిన్నర కిందట వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. మా ఆయన జహీర్ ఇక్బాల్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో నటించాం. పెండ్లికి ముందు ఏడేండ్లు మేం డేటింగ్లో ఉన్నాం. ఈ విషయం సీక్రెట్‌గానే ఉంచాం. ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్‌గా పెండ్లి చేసుకున్నాం.
చాలామంది ‘మీ కెరీర్లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెబుతారు?’ అని అడుగుతుంటారు. నేను నిత్య విద్యార్థిని. ఒకసారి బెస్ట్ అనుకున్నామంటే.. మన ప్రయాణం అక్కడితో డీలా పడిపోతుంది.
నేను తెలుగు ప్రేక్షకులకు పరిచితురాలినే! గతంలో తమిళంలో రజిని సార్‌తో కలిసి ‘లింగ’ సినిమా చేశాను. అది తెలుగులోకీ డబ్ అయ్యింది. తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాలని చాలాసార్లు అనుకున్నా. కానీ, రకరకరాల కారణాల వల్ల చేయలేకపోయాను. ‘జటాధర’తో తెలుగు ప్రేక్షకులను పలకరించాను. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి సంతోషంగా ఉన్నాను. మంచి కథలు వస్తే.. ఇంకొన్ని తెలుగు సినిమాలు తప్పకుండా చేస్తాను.
టాలీవుడ్ చాలా విషయాల్లో బాలీవుడ్‌కు ఆదర్శంగా నిలుస్తున్నది. షూటింగ్ వేళలు ఇక్కడ పక్కాగా పాటిస్తున్నారు. ఉదయం తొమ్మిది అంటే.. తొమ్మిదింటికి రెడీ టు షాట్ అన్నట్టుగా ఉంటుంది. సాయంత్రం ఆరింటికి ప్యాకప్ అంతే! బాలీవుడ్లో షూటింగ్ టైమ్‌కు స్టార్ట్ అవ్వదు, సమయానికి పూర్తవ్వదు. ఒక్కోసారి ప్యాకప్ చెప్పేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది.