సిటీ బ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఒక్కొక్క ఉన్నతాధికారికి రూ.లక్షల్లో జీతాలు.. అన్ని అలవెన్స్‌లు వర్తించేలా సర్వీస్ రూల్స్.. ప్రభుత్వ శాఖలన్నింటి కంటే మెరుగైన వసతులు.. స్వయం ప్రతిపత్తి కలిగి ఉండటంతో ఇంక్రిమెంట్లు, పదోన్నతుల్లో మిగతా శాఖల కంటే ఉన్నతమైన సదుపాయాలు… ఇవీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉద్యోగులకు అందుతున్న సౌకర్యాలు. అయినా వారిలో కొంతమంది ఉన్నతాధికారులు, ఉద్యోగులు సంతృప్తి చెందడం లేదు. మరిన్ని డబ్బులు వెనకేసుకునేందుకు ఇతర మార్గాలను వెతుకుతున్నారు. వారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాల్లో రవాణా సదుపాయం ఒకటి. ఈఈ, ఎస్ఈఈ, ఎస్ఈఎస్ స్థాయి ఉద్యోగులకు అద్దె వాహనాలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.
అందులో భాగంగా నెలకు రూ.34 వేలు ఇస్తారు. ఆ డబ్బుతో వారు అద్దె వాహనాన్ని సమకూర్చుకోవచ్చు. కానీ వారిలో మెజార్టీ ఉద్యోగులు సొంత వాహనాల ద్వారానే కార్యాలయాలకు వస్తూ.. అద్దె పేరుతో ప్రతినెలా రూ.34 వేలు జేబులో వేసుకుంటున్నారు. అదేవిధంగా దిగువ స్థాయి ఉద్యోగుల రవాణా సదుపాయం కోసం నెలకు 50 లీటర్ల పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు. అందులో కొంతమంది ఉద్యోగులు దీన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కార్యాలయ వాహనాలనే వాడుతున్నారు. 50 లీటర్ల పెట్రోల్‌కు సంబంధించిన డబ్బును జేబులో వేసుకుంటున్నారు. ఇలా రూ.వేలాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తమ జేబులు నింపుకొంటున్నారు.
అద్దె తీసుకుంటూ ప్రభుత్వ వాహనాల్లోనే…
కొంత మంది ఉన్నతాధికారులు తమ కార్లు కానీ, తమ బంధువుల కార్లను కానీ అద్దె వాహనాల పేరిట చూపుతూ రూ.34 వేలు కాజేస్తున్నట్లు తెలుస్తున్నది. అలాగైనా వారి వాహనాలను వినియోగిస్తున్నారా.. అంటే అదీ లేదు. వారు కార్యాలయానికి తీసుకొచ్చిన వాహనాలను పార్కింగ్ చేసి.. ప్రభుత్వ వాహనాలను వాడుతున్నట్లు సమాచారం. అద్దె ద్వారా వచ్చే రూ.34 వేలను తీసుకుంటూ తమ వాహనాలను మాత్రం వినియోగించడం లేదు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ అలవెన్స్‌లను కూడా పక్కదారిలో తమ జేబుల్లో వేసుకుంటుండటంపై విమర్శలు వస్తున్నాయి. తమ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులు తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం సరైన పద్ధతి కాదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలవెన్స్ తీసుకుంటూ ఆఫీస్ కార్లలోనే రాకపోకలు
కొంతమంది దిగువ స్థాయి ఉద్యోగులు తమకు నెలనెలా వచ్చే 50 లీటర్ల పెట్రోల్ అలవెన్స్ తీసుకుంటూ పీసీబీ కార్యాలయ వాహనాల్లోనే రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇండ్ల నుంచి మెట్రో, బస్సుల ద్వారా వచ్చి మెయిన్ రోడ్ నుంచి ఆఫీస్‌కు రావడానికి వెళ్లడానికి కార్యాలయ వాహనాలనే వాడుతున్నారని సమాచారం. తమను పికప్, డ్రాప్ చేయడానికి డ్రైవర్లను వేధిస్తున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులను బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల దగ్గర డ్రాప్ చేయడానికి ఎంత ఆలస్యమైనా డ్రైవర్లు వేచి ఉండాల్సిందే.
అలా వెళ్లే అధికారులు తమను డ్రాప్ చేయకుండా వెళ్లొద్దని డ్రైవర్లకు హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. డ్రైవర్లు తమ పనివేళలు ముగిసినా అధికారులను డ్రాప్ చేసేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. అడ్మిన్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు కూడా కార్యాలయ వాహనాలనే వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి సొంత అవసరాలకు ఎటైనా వెళ్లినా కార్యాలయ వాహనంలో వెళ్లాల్సిందే. ఇలా అన్ని రీజియన్ కార్యాలయాల్లో కూడా జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ కార్యాలయ వాహనాలను వాడుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధికారులను గుర్తించి ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.