జీవితం ఒక్కసారిగా తలకిందులైతే… ‘అంతా నా కర్మ, ప్రారబ్ధం’ అనేస్తుంటారు. ఇప్పుడు ఈ మాటలను ఆన్లైన్ వరల్డ్కూ అన్వయించుకోవచ్చు. ఎందుకంటే.. మనం పోస్ట్ చేసే ప్రతీ విషయం, కామెంట్ చేసే ప్రతీ వ్యాఖ్య, క్లిక్ చేసే ప్రతీ లింక్… ఇవన్నీ మన ఆన్లైన్ జీవితంపై ఓ ముద్ర వేస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న సంఘటల్ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తున్నది. మన ఆన్లైన్ కర్మలన్నీ కలిసి ఇమేజ్, గోప్యత, మానసిక ఆనందాలపై ప్రభావం చూపడమే ఇందుకు కారణం. అందుకే.. ప్రాపంచిక కర్మల్లోని మూడు రకాలైన సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు మన డిజిటల్ దునియాలో ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకోవాలి. అప్పుడే ఆన్లైన్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ నైతికంగా, సేఫ్‌గా నెట్టింట్లో సంచరించొచ్చు.
సంచిత కర్మ అంటే మీ గత జన్మలలో మన ఆలోచన, మాట, పని అన్నమాట. అంటే.. ఇది ఇప్పటికే మనం కూడగట్టుకున్నది. డిజిటల్ కోణంలో చూస్తే… నెట్టింట్లో ఇది మన డిజిటల్ ఫుట్‌ప్రింట్ లాంటిది. సోషల్ మీడియా, ఇ-మెయిల్స్, వెబ్సైట్లలో మనం చేసిన పనుల చిట్టా అనుకోవచ్చు. చదువుకున్న రోజుల్లో సరదాకి వాడిన చాటింగ్ అకౌంట్ మొదలు.. నేడు ఆఫీషియల్‌గా ఉపయోగిస్తున్న కంపెనీ ఇ-మెయిల్ వరకూ మన వ్యవహారాలన్నీ రికార్డు అయ్యి ఉంటాయి. ఎప్పుడో.. చేసిన పోస్ట్, పంపిన ఫొటో, చేసిన కామెంట్.. ఆన్లైన్ విశ్వంలో ఎక్కడో ఒకచోట స్టోర్ అయి ఉండొచ్చు. అవి మరొకరి కంట పడొచ్చు. అది సాఫీగా సాగుతున్న మన జీవితంలో ఊహించని ఉపద్రవాన్ని తీసుకురావొచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మన డిజిటల్ ఫుట్‌ప్రింట్ మనల్ని ప్రపంచం చూసే విధానాన్నే మార్చేయొచ్చు. సో.. బీ కేర్‌ఫుల్. ఏదైనా పోస్ట్ చేసేముందు ఆగి ఆలోచించాలి. భవిష్యత్తులో బౌన్స్ బ్యాక్ అవుతుందా అని రివ్యూ చేసుకోవాలి. డిజిటల్ దునియాలో దుష్కర్మకు పాల్పడితే.. పరిహార మార్గాలు కూడా ఉండవని గుర్తుంచుకోండి.
డిజిటల్ ఫుట్‌ప్రింట్ క్లియర్‌గా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
ప్రారబ్ధ కర్మ.. తక్షణ పరిణామాలు
ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ జీవితం ప్రారబ్ధ కర్మ ఫలితం. ఇదీ మన గత కర్మలో ఒక భాగమే. కానీ, ఇది ఇన్‌స్టాంట్‌గా ఫలితాన్నిస్తుంది. డిజిటల్ ప్రపంచంలోనూ.. ఇలాంటి కర్మలు తక్షణ ప్రభావాన్ని చూపుతుంటాయి. ఉదాహరణకు ఏదైనా ఫేక్ సమాచారాన్ని పంచుకోవడం, ఇతరులను ట్రోల్ చేయడం, సైబర్ మోసానికి పాల్పడటం లాంటివి అన్నమాట! ఫేక్ సమాచారాన్ని గుడ్డిగా నమ్మేసి మోసపోతే.. నష్టం జరగడానికి ఎంతో సమయం పట్టదు. తెలిసో తెలియకో ఎవరినైనా ట్రోల్ చేసినా.. రివర్స్‌లో బద్నాం అవ్వడం ఖాయం. సైబర్ నేరానికి పాల్పడితే.. శిక్ష పడకుండా ఉండదు. నకిలీ లింక్‌లు క్లిక్ చేసినా, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమచారం అతిగా పంచుకున్నా.. ప్రారబ్ధ కర్మ ఉచ్చులో చిక్కుకోక తప్పదు.
అలా కావొద్దంటే.. ఈ సూచనలు పాటించండి.
ఆగామి కర్మ.. డిజిటల్ భవిష్యత్తును నిర్మించడం
ఆగామి కర్మ అంటే మీ ప్రస్తుత కర్మే గానీ.. ఇది భవిష్యత్తులో ఫలితాలను చూపిస్తుంది. దీన్నే డిజిటల్ కోణంలో చూస్తే.. మనం మాట్లాడే తీరు, సృష్టించే కంటెంట్, ఇతరులతో వ్యవహరించే పద్ధతి ద్వారా భవిష్యత్తు ఉంటుంది. మనం చేసే ప్రతి చిన్న పనీ డిజిటల్ ఫ్యూచర్‌ను తారుమారు చేయొచ్చు. ఈ కర్మను కాస్త ఎరుకతో చేస్తే కొన్ని లాభాలూ ఉంటాయి. సాంకేతికతను పాజిటివ్‌గా వాడినప్పుడు పాజిటివ్ ఫలితాలు కలుగుతాయి. నిజాయతీగా ఉంటూ, ఇతరుల గోప్యతను గౌరవిస్తే.. మంచి డిజిటల్ కర్మను సృష్టించుకున్నట్టు అవుతుంది. ఇది మనకు భద్రతతోపాటు గౌరవం, అర్ధవంతమైన సంబంధాలను అందిస్తుంది. ఇందుకు వ్యతిరేకంగా.. ద్వేషం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, ఇతరుల డేటాలోకి తొంగి చూడటం లాంటివి చేస్తే డామిట్ అనేలా కథ అడ్డం తిరుగుతుంది. ప్రతిఫలంగా ఒత్తిడి, అపనమ్మకం, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కావొద్దంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.
కర్మ యోగా అంటే రియల్ లైఫ్‌లో మీ విధిని నెరవేర్చే కళ. ఆన్లైన్ జీవితాలకు కూడా అలాంటి సాధన అవసరం ఏర్పడింది. అదే సైబర్ యోగా. దీనికి కాన్సియస్ క్లిక్‌లు, అర్థవంతమైన పోస్టులు, పాజిటివ్ ఆన్లైన్ రిలేషన్స్ అవసరం. సామాజిక మాధ్యమాల్లో మంచి విషయాలను, సదుద్దేశంతో పోస్ట్ చేయాలి. ఇదే డిజిటల్ సంక్షేమానికి కొత్త మంత్రం. కర్మ సిద్ధాంతం మీ గమ్యాన్ని ఎలా నిర్దేశిస్తుందో.. ఆన్లైన్ ప్రవర్తన మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తుంచుకోవాలి. ఆన్లైన్లో మంచి కర్మ చేయడం అంటే.. ఆఫ్‌లైన్‌లో పాజిటివ్ లైఫ్‌ని క్రియేట్ చేసుకోవడమే!
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్