ఒకే ముహూర్తంలో జట్టుకట్టిన ఈ జోడు జంటలకు తోడు-నీడగా ఉన్నది మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్, సంజీవని ఆశ్రమం. తల్లిదండ్రులు లేని వధూమణులకు ఆశ్రమ నిర్వాహకులే అన్నీ అయ్యారు. దిగులుగా తమ వేలు పట్టుకొని ఆశ్రమానికి వచ్చిన ఆడకూతుళ్లను బాధ్యత తెలిసిన అయ్యల చేతిలో పెట్టారు. అందమైన కుటుంబానికి కోడళ్లుగా సాగనంపారు. విధి వెక్కిరించి, వీధి పాలైన బాలలకు ఈ ఆశ్రమం ఇన్నాళ్లూ నీడనిచ్చింది. ఇప్పుడు తోడునిచ్చింది. మానవ సేవే మాధవ సేవగా తరిస్తున్న సంజీవని ఆశ్రమ ప్రస్థానం సామాజిక సేవకు సిసలైన చిరునామాగా కనిపిస్తుంది.2025
మార్చి 12, వరంగల్ జిల్లా నర్సంపేటలోని సిటిజన్ క్లబ్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణం అంతా కోలాహలంగా ఉంది. మేళతాళాలు మార్మోగుతున్నాయి. ఎందరో ప్రజాప్రతినిధులు అథితులుగా విచ్చేశారు. పుర ప్రముఖులు పెండ్లి పెత్తనం మీదేసుకున్నారు. డాక్టర్ మోహన్‌రావు దంపతుల ఆనందానికైతే అవధుల్లేవు. కడుపున పుట్టకున్నా.. కన్నబిడ్డల పెండ్లి చేస్తున్నంత సంబురంగా ఇదైపోయారు ఆయన. పెండ్లి దుస్తుల్లో మంటపానికి చేరిన ఆ ఆడబిడ్డల కండ్లల్లో కన్నీళ్లు. పసితనంలో దూరమైన తల్లిదండ్రులు గుర్తొచ్చి బాధపడ లేదు వాళ్లు. దేవుడిచ్చిన తల్లిదండ్రులు మోహన్‌రావు-వినోద దంపతులు తమపై చూపిస్తున్న అవ్యాజమైన ప్రేమకు ఉప్పొంగి వచ్చిన ఆనందాశ్రువులు అవి.
విజయ ‘గీతిక’
గీతిక (రోజా) తల్లిదండ్రులు బుల్లెమ్మ, బిచ్యునాయక్. నర్సంపేట మండలం భోజ్యనాయక్ తండాలో ఉండేవాళ్లు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అనారోగ్య కారణాలతో తక్కువ కాలవ్యవధిలోనే వారి తల్లిదండ్రులు కాలం చేశారు. ముగ్గురు బిడ్డలు అనాథలయ్యారు. అప్పుడు గీతికకు ఏడేండ్లు ఉంటాయేమో! చెల్లి, తమ్ముడు ఆరేండ్ల లోపువాళ్లే! బంధువులు అటేసి చూడలేదు. అయినవారు మనకెందుకులే అనుకున్నారు! మోహన్‌రావు దంపతులు చొరవ చూపకపోతే ఆ బిడ్డల బతుకులు ఏమయ్యేవో! ఎవరి ద్వారానో ఈ అనాథల దీనస్థితి తెలుసుకున్న మోహన్‌రావు భోజ్యానాయక్తండాకు చేరుకున్నారు.
తండా పెద్దలతో మాట్లాడి.. ఆ పిల్లలను తనవెంట తీసుకెళ్లారు. నర్సంపేటలో మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాను నిర్వహిస్తున్న సంజీవని ఆశ్రమంలో చేర్పించారు. 2007లో జరిగిందీ సంఘటన. అప్పటి నుంచి ముగ్గురు పిల్లలు ఆశ్రమంలోనే పెరిగారు. ఇలా ఎందరో అనాథ పిల్లలు ఈ ఆశ్రమంలో హాయిగా ఎదిగారు. చక్కగా చదువుకున్నారు. పండుగలు చేసుకున్నారు. గీతిక మంచి చదువరి. ఆమెను ఆశ్రమ నిర్వాహకులు ప్రోత్సహించారు. బీటెక్ చదివింది. సాఫ్ట్వేర్ కొలువు కూడా సాధించింది. ‘తన కాళ్ల మీద తాను నిలబడింది కదా! ఇక మా బాధ్యత తీరిపోయింది’ అని భావించలేదు మోహన్‌రావు. మంచి సంబంధం చూసి పెండ్లి చేయాలని నిర్ణయించారు. గీతిక దూరపు బంధువుల్లోనే మంచి సంబంధం చూశారు. పెండ్లి చూపులు తతంగం నిర్వహించారు. అమ్మాయి ఇష్టాన్ని తెలుసుకున్నారు. ఆమె సంతృప్తి చెందిన తర్వాతే పెండ్లి ఖాయం చేశారు. మార్చి 12న పట్టణంలోని సిటిజన్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా వివాహం జరిపించారు. నర్సంపేటకే చెందిన బోడ అచ్చమ్మ- లక్ష్మణ్‌నాయక్ దంపతుల చిన్నకుమారుడు గణేష్ పెండ్లి కొడుకు. రూపాయి కట్నం తీసుకోకుండా ఈ వివాహానికి అంగీకరించిన అబ్బాయి అందరి మన్ననలకూ పాత్రుడయ్యాడు.
ఇష్టపడిన వాడితోనే..
ఇదే రోజు పెండ్లిపీటలు ఎక్కిన మరో వధువు అశ్విని (నాగరాణి). వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లికి చెందిన అందె వెంకటేశ్వర్లు-వరలక్ష్మీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. అశ్విని పెద్దమ్మాయి. 2009లో అనారోగ్య కారణాలతో ఆమె తల్లిదండ్రులు కన్నుమూశారు. అప్పటికి అశ్వినికి ఏడేండ్లు. ‘అమ్మానాన్న ఎక్కడ?’ అని చెల్లెలు అడిగితే ఏం సమాధానం చెప్పాలో కూడా తోచని వయసది. గుక్కపట్టి ఏడుస్తున్న చెల్లిని ఎలా ఓదార్చాలో తెలియక, తానూ కన్నీళ్లు పెట్టుకునేది! ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల పరిస్థితి మోహన్‌రావుకు తెలిసింది. వెంటనే వెళ్లి ఆ ఇద్దరు చిన్నారులను అక్కన చేర్చుకున్నారు. ఆశ్రమానికి తీసుకొచ్చి పెద్దదిక్కు అయ్యారు. అశ్విని ఆశ్రమంలోనే ఉండి డిగ్రీ వరకు చదువుకుంది. ఆమెకూ పెండ్లి చేయాలని నిశ్చయించారు మోహన్‌రావు. కుదిరితే గీతిక, అశ్విని ఇద్దరి పెండ్లిళ్లూ ఒకేసారి చేయాలని తండ్రిలా ఆలోచించారు. అశ్విని తన చిన్నప్పటి క్లాస్మేట్ రాకేష్ ఇష్టపడిందని తెలిసింది. వాకబు చేస్తే అబ్బాయి మంచివాడనీ, అమ్మాయిని తనూ ఇష్టపడుతున్నాడని తెలిసింది. వారి పెద్దలతో మాట్లాడారు. అబ్బాయి తల్లిదండ్రుల అంగీకారంతో ముహూర్తం నిర్ణయించారు. ఘనంగా వివాహం జరిపించారు.
రెండు రూపాయల డాక్టర్
సంజీవని ఆశ్రమ నిర్వాహకుడు ఆర్శనపల్లి మోహన్రావుది నర్సంపేట మండలం ముగ్దుంపూర్. ఆయన తల్లిదండ్రులు చంద్రకళ, నారాయణరావు. కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు మోహన్‌రావు. 1974లో నర్సంపేటకు వచ్చి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రోగుల దగ్గర కేవలం రూ.2 మాత్రమే ఫీజుగా తీసుకునేవారు. అందుకే, ఆయన్నందరూ రెండు రూపాయల డాక్టర్ అని పిలిచేవారు. కొన్నాళ్లకు అది రెండున్నర రూపాయలైనా.. మోహన్‌రావు పేరు మాత్రం రెండు రూపాయల డాక్టర్‌గా స్థిరపడింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో రోగులు వైద్యం కోసం ఆయన దగ్గరికి వచ్చేవారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైద్యం అందించేవారు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆర్థికంగా కుదురుకున్న మోహన్‌రావు సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలని భావించారు. 2003 ప్రాంతంలో ఓ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. అయితే, విద్యతోనే మనిషి వికాసం సాధ్యమనీ, అభివృద్ధికి చదువే నిచ్చెన అనీ ఆయన బలంగా నమ్మారు.
ఈ క్రమంలో 2006లో మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంజీవని ఆశ్రమం నెలకొల్పారు. మిత్రుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి విరాళంగా ఇచ్చిన రెండెకరాల స్థలంలో శ్రేయోభిలాషుల సహకారంతో మోహన్‌రావు సంజీవని ఆశ్రమం ఏర్పాటు చేశారు. నాటి నుంచి అనాథ పిల్లలను చేరదీస్తూ, వారికి తల్లిదండ్రులు లేని లోటు లేకుండా చూసుకున్నారు. 17 మంది అనాథలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు 270 మంది ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆశ్రమంలో 60 మంది ఏ లోటూ లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందిన వాళ్లలో చాలామంది ఉన్నతంగా చదువుకున్నారు. ఐదుగురు విద్యార్థులు బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా సెటిలయ్యారు. ఐఐటీ చెన్నైలో ఒకరు చదువుతున్నారు. కొందరు పాలిటెక్నిక్ విద్య అభ్యసిస్తున్నారు. ఒకరు సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నారు. ఈ నిరుపేద విద్యార్థులకు మోహన్‌రావు చొరవతో దాతల సహకారం కూడా అందుతుండటం విశేషం.
సంప్రదాయ బద్ధంగా
తమ ఆలనాపాలనలో పెరిగిన చిన్నారులు.. పెండ్లీడుకొచ్చారని మోహన్‌రావు బెంగపడలేదు. వారికి మంచి సంబంధాలు నిశ్చయించాలని ప్రయత్నించారు. సంబంధాలు కుదిరిన తర్వాత అనాథలే కదా.. తూతూ మంత్రంగా పెండ్లి చేసేయొచ్చులే అని భావించలేదు. భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి వేయకున్నా.. విశాల హృదయాలే పెండ్లిపీటలుగా వివాహ వేడక నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖులంతా పెండ్లి పెద్దలయ్యారు. ముహూర్తానికి ముందురోజు నుంచే ముత్తయిదువుల హడావిడి మొదలుపెట్టారు. పసుపులు ముట్టించడం దగ్గర్నుంచి పెండ్లి కూతుళ్లకు మంగళ స్నానాలు చేయించడం వరకు క్రతువంతా సశాస్త్రీయంగా, కన్నులపండువగా జరగడం మోహన్‌రావు బాధ్యతకు అద్దంపడుతుంది. పెండ్లి వేడుక జరుగుతున్నంత సేపు మేళతాళాలకు దీటుగా వేళాకోలాలు కొనసాగాయి. సిరిగలవారింటి పెండ్లి ముచ్చటకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ అనాథ పిల్లల కల్యాణం కమనీయ కావ్యంగా సాగింది. మోహన్‌రావు ఆశయంతో ఎందరికో నీడనిస్తున్న సంజీవని ఆశ్రమంలో.. ఆశ్రయం పొందిన వాళ్లను అనాథలు అనడం కన్నా, అదృష్టవంతులు అంటేనే సబబు!
ఖండాలు దాటొచ్చి కన్యాదానం
రాములోరి పెండ్లికి ఊరంతా పెద్దలే అని సామెత. ఈ ఆడపిల్లల కల్యాణానికి మోహనరావు పెద్ద అయితే, మరెందరో అండగా నిలిచారు. అందులో మహేశ్‌రావు- లక్ష్మీ దంపతులు కూడా ఉన్నారు. మోహన్‌రావుకు అత్యంత ఆత్మీయులైన మహేశ్‌రావు దంపతులు అమెరికాలో ఉంటారు. ఆశ్రమ నిర్వాహణకు తమవంతుగా సాయం అందిస్తున్నారు. రెండేండ్లకు ఒకసారి అమెరికా నుంచి వచ్చి రెండువారాల పాటు ఆశ్రమంలో గడుపుతారు. గీతిక, అశ్వినిల పెండ్లిళ్ల సంగతి తెలిసి.. తమ ఇంటి పిల్లల వివాహమే కుదిరిందన్నంత సంబురపడ్డారు వాళ్లు. కన్యాదానం చేయడానికి ముందుకొచ్చారు. పెండ్లికి రెండు రోజుల ముందే అమెరికా నుంచి నర్సంపేటలో వాలిపోయారు. పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. వరుడు గణేష్‌కు కాళ్లు కడిగి గీతికను కన్యాదానం చేశారు. అదేవిధంగా మరోవరుడు రాకేష్ కాళ్లు అశ్విని మేనమామ కడిగి కన్యాదానం చేశారు
మా బాధ్యత అనుకున్నాం..
గీతిక, అశ్విని మా కండ్లముందు పెరిగారు. ఆశ్రమానికి తీసుకొచ్చిన రోజే.. ఆ పిల్లల బాధ్యత మాది అనుకున్నాం. చక్కగా చదివించాం. మా చేతుల మీదుగానే వారికి పెండ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. చక్కగా చదువుకొని ప్రయోజకులు అయ్యారు. మంచి, చెడు వారికి తెలుసు. వారి కుటుంబాన్ని సమర్థంగా నిర్వహించుకుంటారన్న నమ్మకం ఉంది. పెండ్లి చేసి మా బాధ్యత తీరింది అనుకోవడం లేదు. భవిష్యత్తులోనూ వారి బాగోగులు కనిపెడుతూనే ఉంటాం. వీరి పెండ్లిళ్లు ఇంత ఘనంగా నిర్వహించడానికి ఎందరో దాతలు సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు.
– డాక్టర్ మోహన్‌రావు
-పిట్టల కుమారస్వామి, నర్సంపేట