మణికొండ, సెప్టెంబర్ 23 : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొన్నిరోజులుగా వరుస దొంగతనాలు, చైన్స్నాచింగులతో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుంది. ఇటీవల హైదర్షాకోట్, పుప్పాలగూడ ప్రాంతాల్లో ఒంటరిగా రహదారిపై వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను అపహరించుకుపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
తాజాగా ఈ ప్రాంతాల్లోనే ఇళ్లలో దొంగలు చొరబడి విలువైన ఆభరణాలను దోచుకెళ్లిన ఘటనలు జరిగాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోమవారం నగరానికి చెందిన ఓ ఫొటో ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు స్నేహితులు నిత్యం పని ఒత్తిడి కారణంగా సేద తీరేందుకు గౌలిదొడ్డిలోని తన ఆఫీస్ నుంచి కోకాపేట నియోపోలీస్ ప్రాం తానికి కారులో వచ్చారు. రాతిగుండు పక్కన కారు నిలుపుకుని మాట్లాడుతుండగా ఆరుగురు యువకులు బైక్‌లపై వచ్చి వెకిలి చేష్టలు చేశారు.
బూతులు తిడుతూ దాడిచేసి జేబులోని నగదు, బంగారు గొలుసుతో పాటు పరారయ్యారు. ఇదంతా అందరూ చూస్తుండగానే పట్టపగలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇదంతా ఏదో సినిమా షూటింగ్ జరుగుతుందా? అన్న సందేహంలో ప్రజలు నిమ్మకుండిపోయారు. జరిగిన ఘటన నుంచి తేరుకుని వారు తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పేదాక ఎవరికీ అర్థం కాలేదు. విషయాన్ని ఫోన్ ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సదరు సిబ్బంది ఫోన్ పెట్టేశారు. దీంతో భాధితులు దిక్కుతోయక స్టేషన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటే అప్పుడు తీరిగ్గా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టినట్లు తెలిసింది.