‘అప్పుడే వచ్చింది ఉయ్యాలో.. బతుకమ్మ పండుగ ఉయ్యాలో’ తెలంగాణ జానపదం పూల పరిమళాలు అద్దుకున్నది. అడవి పూలు అందమైన బతుకమ్మగా ముస్తాబవుతున్నయి. ఏ పల్లెకువోయినా ‘పల్లెల్లో బతుకమ్మ నాగమల్లేలో.. పువ్వయి పూసింది తీగమల్లేలో’ అని పాడుకుంటున్నరు. ఎవలి స్ట్టేటస్ చూసినా బతుకమ్మే! పట్నపోల్లు ఏమన్నా తక్కువనా! ‘పట్నంల బతుకమ్మ నాగమల్లేలో.. పండుగ చేసింది తీగమల్లేలో’ అని ఆడుకుంట ఇన్‌స్టాగ్రామ్‌ని నింపేస్తున్నరు!
‘చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ’ పాటల బిందె దీస్కోని రమణి నీళ్లకు పోతే.. ఏ వాడకు పోయినా భగవంతుడు ఎదురైనడంట. ఇప్పుడు అట్లనే ఏ ఊరికి పోయినా బతుకమ్మ ఎదురైతున్నది. ఏ ఊర్ల చూసినా బతుకమ్మ ఆటే కానవస్తున్నది! బతుకమ్మ పాటలే వినపడుతున్నయి! ‘చిన్నలకు వచ్చింది ఉయ్యాలో.. చిన్న బతుకమ్మ ఉయ్యాలో’ పాడుకుంట చిన్నలు, ‘పెద్దలకు వచ్చింది ఉయ్యాలో.. పెద్ద బతుకమ్మ ఉయ్యాలో’ పాడుకుంట పెద్దలు ఆకాశమంత సంబురం చేసుకుంటున్నరు! బతుకమ్మ సంబురం మనది. మన తెలంగాణది. మన నాగరికత, చరిత్ర, సంతోషాలు, దుఃఖాలు.. అన్నీ తనలో ఇముడ్చుకున్న బతుకమ్మ పాటలు వాగ్గేయకారుల కీర్తనలంత గొప్పయి. ప్రబంధ కవుల పద్యాలంత పసందైనయి! బతుకు పాఠాలు చెప్పిన బతుకమ్మ పాటల వైచిత్రిని ఈ పూల పండుగ సందర్భంగా తలుచుకుందాం..
ఒక తల్లి బిడ్డను కనడానికి తొమ్మిది నెలలు కడుపుల మోస్తది. ఆ బిడ్డల బతుకు కోరే తల్లులు తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడుతరు. ఈ కాలంల ప్రకృతి పరవశించి కనువిందుగా ఉంటది. వానలు పడి నేలంతా పచ్చబారుతది. తీరొక్క పువ్వులతో సింగిడీని తలపిస్తది. చెరువు నిండుకుండ లెక్క ముచ్చటగుంటది. చేతికొచ్చిన పంటతో పల్లె నిండా సంబురమే. ఇంత ముచ్చటైన పూట ఆడపిల్ల లేకపోతే ఇల్లు చిన్నబోతది. మెట్టినింటికి పోయిన ఆడబిడ్డను ఏడాదికోపాలన్నా పుట్టింటికి పిలిపించుకోవాల్నని పెద్దల ఆశ. పుట్టింటికి చేరి తనవాళ్లతో సంబురం చేసుకోవాల్నని ఆడబిడ్డల కోరిక. ఈ ఆశల్ని తీర్చే పండుగే బతుకమ్మ. ‘మా యన్నలొచ్చారు ఉయ్యాలో.. మమ్మంపుతార ఉయ్యాలో’ అంటూ పట్టెమంచం మీదున్న అత్తని, మల్లె తోటల ఉన్న మామ గారిని, వంటశాలలోని తోడి కోడల్ని, భారతం చదివేటి బావగారిని, రచ్చమీద కూర్చున్న రాజేంద్ర భోగి లాంటి భర్త అనుమతి కోరి వచ్చిన ఆడబిడ్డలతో ఊళ్లన్నీ వేడుకగా ఉంటయి. వానలకు పచ్చబడ్డ ప్రకృతిలాగే ఆడబిడ్డల రాకతో వాడలన్నీ కళకళలాడుతుంటయి.
పుట్టింట సంబురం ఏడాదంతా మెట్టినింటికే పరిమితమై ఉండే ఆడవాళ్లు పుట్టింటికి చేరుకోడానికి బతుకమ్మను మించిన సంబురం ఏముంటది? అందుకే ఇది ఆడబిడ్డల పండుగ. అమ్మల పండుగ. బతుకుని కోరే బతుకమ్మల పండుగ. ఆ సంబురాన్ని చిన్నలు, పెద్దలు ఉత్సాహంగా ఎవరికి వాళ్లు చేసుకుంటరు. అందుకే బతుకమ్మ ఆడేప్పుడు ఇట్ల పాడుకుంటరు.
‘పెద్దలకు వచ్చింది ఉయ్యాలో..
పెత్రామాస పండుగ ఉయ్యాలో
బాలలకు వచ్చింది ఉయ్యాలో..
బొడ్డెమ్మ పండుగ ఉయ్యాలో
ముత్తైదువులకు వచ్చింది ఉయ్యాలో..
బతుకమ్మ పండుగ ఉయ్యాలో’
పుట్టింటికి చేరిన తల్లులందరు కూడి ఆడే పండుగ కోసం ‘ఆకాశమెత్తు ఉయ్యాలో.. పందిర్లు వేసి ఉయ్యాలో’ అని పాడుకున్నట్టే ఏర్పాట్లు చేస్తుంటరు. ‘భూలోకమంత ఉయ్యాలో.. పీటలు పరిసి ఉయ్యాలో’ అన్నట్టే పెద్ద సిబ్బి మీద ఒక్కో పువ్వుని పేర్చుకుంట బతుకమ్మను సింగారించుకుని ఆడేందుకు వస్తరు. ఆడబిడ్డలందరికీ పుట్టింటికి పోయే అవకాశం రాదు. అప్పుడు వాళ్లు మెట్టినింటే ఉండి బతుకమ్మ ఆడుతరు. అట్లాంటి ఆడబిడ్డల కోసం కట్టిన పాటే.. ‘ఇద్దరక్కచెల్లెండ్లను ఉయ్యాలో.. ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో’ పాట. ఈ పాటల ‘ఒక్కడే మాయన్న ఉయ్యాలో.. వచ్చన్న పోడాయె ఉయ్యాలో’ అంటూ ఆడబిడ్డకు పుట్టింటి మీద ఎంత అభిమానం ఉంటదో చాటుకుంటరు.
పాట లేకుండ పువ్వుల బతుకమ్మ లేదు. బతుకమ్మ పాటలన్నీ ఆడవాళ్ల పాటలే. వాటి నిండా ఆడవాళ్ల ఆకాంక్షలే వినిపిస్తయి. పదాలల్లి తమ జీవితాల్ని తామే పాడుకున్నరు. ఒక్క మాటల చెప్పాల్నంటె బతుకమ్మ పాటల బతుకంతా ఉంది! సామూహికంగా పాడుకునే ఈ పాటలల్ల ఊరుమ్మడి బతుకుంది. తరతరాలుగా పాడుకుంట వస్తున్న ఈ పాటలు జానపదుల చరిత్రే!
బతుకమ్మకు ఏమేమి పూలు సేకరించాలో బతుకమ్మ పాటల్నే కనిపిస్తది. ‘ఏమేమి పువ్వొప్వునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ’ అని అడిగితే.. ‘ఘనమైన పొన్నపూలే గౌరమ్మ.. గజ్జెల వడ్డాణమే గౌరమ్మ’ అని అందమైన వర్ణనతో వివరంగా చెప్పే పాటలెన్నో ఉన్నయి. బతుకమ్మ ఆడేప్పుడు పాడే పాటలల్ల సేకరించిన పూలే కాదు, ఆ పూల కొమ్మన సేదతిరే ‘పాట చిలుకలు, ఆట చిలుకలు, కందమ్మ గోరంకల’ను కూడా పలకరిస్తరు. ఆ పూలు కోయనీకి పోతుంటే, పూలు కోసుకుని వస్తుంటే ‘పోను తంగేడు పూలు.. రాను తంగేడు పూలు’ ఎంత ముచ్చటగా ఉన్నయో గుర్తుచేసుకుంటరు. అట్లా కోసుకొచ్చిన పూలను ఎట్లా పేర్చాలో బతుకమ్మ పాటే చెబుతది.
‘తొమ్మిది రోజులూ ఉయ్యాలో..
నమ్మికా తోడుత ఉయ్యాలో
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో..
అరుగులు వేయించిరి ఉయ్యాలో
గోరంట పూలతో ఉయ్యాలో..
గోడలు కట్టించి
ఉయ్యాలో
తామరపూలతో ఉయ్యాలో..
ద్వారాలు వేయించి ఉయ్యాలో
మొగిలి పూలతోని ఉయ్యాలో..
మొగురాలు వేయించి ఉయ్యాలో
వాయిలి పూలతో ఉయ్యాలో..
వాసాలు వేయించి ఉయ్యాలో
పొన్నపూలతోని ఉయ్యాలో
ఇల్లునూ కప్పించి ఉయ్యాలో
దోసపూలతోని ఉయ్యాలో..
తోరణాలు కట్టించి ఉయ్యాలో
పసుపుముద్దను చేసి ఉయ్యాలో..
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో
చేమంతి పూలతోని ఉయ్యాలో..
చెలియను పూజించిరి ఉయ్యాలో’
జానపదులు కట్టిన ఈ పాట తీరుగ బతుకమ్మని ఈ రోజులల్ల పేర్చలేకపోతున్నరు. అయినా ఏ పూలైనా బతుకమ్మలో ఇమిడితే అవి మరింత అందంగ కనిపిస్తయి.
‘బతుకమ్మ ఎట్లాడాలె?’అని అడిగితె.. అది చెప్పేటందుకు ఇంకో పాటుంది. అడిగినోళ్లకు అడిగినంత, ఆడినోళ్లకు ఆడినంత పుణ్యం దక్కుతదని మేలు తలిచే పాట ఇది!
‘సుందరాంగులెల్ల ఉయ్యాలో..
సుట్టూత తిరిగిరి ఉయ్యాలో
ఆటలు ఆడిరి ఉయ్యాలో..
పాటలూ పాడిరి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో..
కాంతలందరికి ఉయ్యాలో
పాడిన వారికి ఉయ్యాలో..
పాడిపంటలు కలుగు ఉయ్యాలో
ఆడినా వారికి ఉయ్యాలో..
ఆరోగ్యము కల్గు ఉయ్యాలో
విన్నట్టి వారికి ఉయ్యాలో..
విష్ణుపథము కల్గు ఉయ్యాలో’
ఆటంతా అయిపోయినంక ‘నీ నోము నీకిత్తునే గౌరమ్మ’ అంటూ రోజుకో నైవేద్యాన్ని బతుకమ్మకిస్తరు. మేదరి సిబ్బిపై తీరొక్క పువ్వుతో ఇల్లుకట్టినట్టే పేర్చిన బతుకమ్మను ‘పోయిరా బతుకమ్మ మళ్లీ రావమ్మ’ అంటూ సాగనంపుతరు.
బతుకమ్మకు కావాల్సిన పూలు, పేర్చాల్సిన తీరు, ఆడాల్సిన పద్ధతి, నైవేద్యాలన్నీ బతుకమ్మ పాటలయినయి. బతుకమ్మ ఆడనీకి ఆడవాళ్లు ముచ్చటగా ముస్తాబైన తీరు మీద గిన పాటలు కట్టుకున్నరు. రంగు రంగుల రవికలు గట్టి, అందమైన చీరలు చుట్టి, బంగారు నగలు పెట్టి, కాలికి గజ్జల పట్టీలు, నడుముకి గజ్జల వడ్డాణం చుట్టుకుని వస్తరు. తల దువ్విన తీరు నుంచి అందంగా ముస్తాబైన వైనం వరకు బతుకమ్మ దగ్గర పాడుకుంటరు. బతుకమ్మకు ఏ రోజున ఏయే నివేదనలు ఇయ్యాలో పాడుకుంటరు. ‘వరమున పుట్టింది ఉయ్యాలో’ పాటల మగువలు ముస్తాబు అయిన తీరు ఇట్లుంది.
‘పైడి దువ్వెనతోని ఉయ్యాలో..
పాపెట తీసి ఉయ్యాలో
పాపెట్ల పొందుగా ఉయ్యాలో..
బంతులమరించెను ఉయ్యాలో
వెండి దువ్వెనతోని ఉయ్యాలో..
వెలచిక్కు దీసి ఉయ్యాలో
రాగి వెంట్రుకల్లోన ఉయ్యాలో..
రతనాలు నింపు ఉయ్యాలో
కొంగునా బంగారు ఉయ్యాలో..
చీర కట్టింది ఉయ్యాలో’
ఇలా సాగిపోతుంది కలికి చిలకలు తయారైన ముచ్చట.
‘చినుకు చినుకుల వాన ఉయ్యాలో..’ పాటల గద్వాల చీర కట్టుకుని, సన్నంచు చీరలతో ముస్తాబైనట్టు, అత్తరు, పన్నీరు రాసుకుని బతుకమ్మ ఆడేందుకు బయలెల్లిన తీరు కనిపిస్తది. ‘అక్కను చెల్లెండ్లను ఉయ్యాలో.. ఒక్కూరికిస్తె ఉయ్యాలో’ పాటల
‘తీరొక్క నగలేమొ ఉయ్యాలో..
పెట్టుకున్నారమ్మ ఉయ్యాలో
రాజ్యాన లేనివి ఉయ్యాలో..
రవికలు తొడిగిరి ఉయ్యాలో
దేశాన లేనివి ఉయ్యాలో..
చీరలు కట్టిరి ఉయ్యాలో
బంగారు ఒడ్డాణం ఉయ్యాలో..
బిర్రుగా పెట్టిరి ఉయ్యాలో’ అని బతుకమ్మ
ఆడేందుకు ఎట్ల అలంకరించుకున్నరో పాడుకుంటరు.
ఆడపిల్ల ఎట్ల పెరిగితే పెండ్లికి అనుకూలమో ‘జనకు జనకూనింటా కోల్.. సాజనకూనింట్లా కోల్’ పాటల ఉన్నది. జనక మహారాజు ఇంట్లో సీత గురించి పాడుకున్నా… ఇది అందరి ఇళ్లల్లో పెరిగే ఆడబిడ్డకు వర్తించేదే. పెంపకంతోనే పెండ్లి జరిగిపోదు. దానికి దైవానుగ్రహమూ ఉండాలని జానపదుల నమ్మకం. ఆ నమ్మకంతోనే గౌరీ దేవికి పెండ్లి చేస్తే కన్యలకు పెండ్లవుతుందనే నమ్మకం పుట్టింది. ‘ఈడునా పెండ్లాడవే గౌరమ్మ.. జోడునా పెండ్లాడవే గౌరమ్మ’ అనే పాట బతుకమ్మతో జోడు కట్టింది.
మెట్టినింట అడుగుపెడితే ఆడపిల్ల కొత్తవాళ్లతో, అత్తవారింటివాళ్లతో, ఇరుగుపొరుగు వారితో కలిసిమెలిసి ఉండాలె. కలిమిలేములెన్నున్నా కలిసిమెలిసి ఉండాలె. అప్పుడే పచ్చని కాపురం పండంటి కాపురమవుతది. ‘తోటివారల తోడ ఉయ్యాలో’ పాటల ఇల్లాలు ఎట్లుండాలో చెప్పుకొన్నరు. ఈనాటి సైకాలజీ కౌన్సెలింగ్ ఇచ్చేటోల్లు ఎట్లయితే పరిస్థితులకు అనుగుణంగా ఒద్దికగా ఉంటూనే.. అనువైనప్పుడు పరిస్థితులు మార్చుకోవాల్న’ని చెబుతున్నరో… ఈ పాట అదే విషయం చెబుతది. నెట్టుకొచ్చిన సంసారంల అనుభవాలు, కాపురాన్ని దిద్దుకునే సూత్రాలతో కొత్త ఇల్లాలికి వ్యక్తిత్వ వికాస పాఠం చెబుతుంది.
‘తోటి వారల తోడ ఉయ్యాలో..
కూడి యుండుట మేలు ఉయ్యాలో
కలహించుకోరాదు ఉయ్యాలో..
కాంతలు తమలోన ఉయ్యాలో
ఓర్పుగల్గినవారు ఉయ్యాలో..
ఉత్తమ కాంతలు ఉయ్యాలో’
పెద్దల అనుభవాన్ని రంగరించుకున్న ఇట్లాంటి పాటలు బతుకమ్మ ఆటలో ఎన్నో ఉన్నయి!
కాపురంలో అపోహలొస్తె అనుబంధాలు తెగిపోతయి. కాబట్టి మేనరికం పెండ్లి చేస్తే.. వచ్చే కష్టాలు మా ఇంటి ఆడబిడ్డకు రావొద్దనే మాట ‘పచ్చిమిరపచెట్టు జయరామ రామ’ పాటల ఉంది. మంచి సావాసమున ఉయ్యాలో.. మంచి గుణముకల్గు ఉయ్యాలో’ అని ఒద్దికగా ఉండాలని చెబుతున్నారు. ‘పనిలేక కూర్చుంటె ఉయ్యాలో’ పదాల్లో చక్కని సుద్ది ఉంది. బతుకమ్మ ఆటలకాడ పెండ్లి పాటలు వింటుంటె.. వ్యక్తిత్వ వికాసం కోసం ఆనాటి స్త్రీలు చేసుకున్న ఏర్పాటేమో అనిపిస్తది. తాగుబోతు మగడితో ఎట్లుండాలో ఈనాటికీ చానామందికి తెలియదు. మద్యపానం ఒక్క తాగేటోడినే కాదు ఇంటిల్లిపాదినీ పీడిస్తది. తన భార్యాపిల్లల పట్ల అమర్యాదగా ప్రవర్తించడమే కాదు సరైన తిండి, బట్ట కల్పించలేడు. ఆ దయనీయస్థితి నుంచి బయటపడాలని ఈనాటి ఆడబిడ్డలు అనుకున్నట్టే ఆనాడూ అనుకునేటోళ్లు. ఆ స్థితిల ఉన్నప్పుడు భార్య ఏమి చేయాలో బతుకమ్మ పాటతోని జానపదులు నేర్పిండ్రు.
‘మగవారు తాగితే ఉయ్యాలో..
మన్నించగా వలెను ఉయ్యాలో
మంచి మాటలచేత ఉయ్యాలో..
మనసు గరిగించు ఉయ్యాలో
వినయంబు తోడనే ఉయ్యాలో..
వేడుకొనవలయును ఉయ్యాలో’
ఇప్పుడు ఇది చాదస్తం అనిపిస్తదేమో! కానీ, తిరగబడి తలబడితే బంధం తెగిపోతది. నిలబడి నిలువరిస్తే.. విలువ పెరుగుతదని మన పెద్దల మాట.
కొత్త దంపతుల్లో చిగురించిన ప్రేమ అందర్నీ ఎట్ల మరిపిస్తుందో! అదంతా చెప్పనీకి పెద్ద ప్రేమకావ్యమే రాయాలె. అంతపెద్ద ముచ్చటని ఒక్క ‘అల్లనేరేడు చెట్టు కింద’ పాటల చెప్పిండ్రు జానపదులు.
‘ఆలెంత అమృతమాయె ఉయ్యాలో.. అన్నా రాఘవులు ఉయ్యాలో
చెల్లెలెంత చేదాయె ఉయ్యాలో.. అన్నా రాఘవులు ఉయ్యాలో’ పదాలు మచ్చుకే. ఇట్ల ప్రతి పదాన ప్రేమ తొణికిసలాటే! ఈ ప్రేమ ఫలించాలంటే బిడ్డ పుట్టాలని కొత్త దంపతులు కోరుకుంటరు. బిడ్డ కలగాలని కోరుకునే నవ వధువులు దేవుళ్లకు మొక్కుతూ ఉంటరు. ఇక సంతానం ఆలస్యమైతే మొక్కులు చెల్లించుకునేందుకు బయలుదేరుతరు. బిడ్డలు లేక మానసికంగ కుంగిపోయిన నీలమదేవి మొగుడితో కలిసి ఎంతెంత దూరం తిరిగిందో చెబుతూ ‘కానొచ్చిన చెట్లకు ఉయ్యాలో’ పాట చెబుతున్నది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా బిడ్డ పుట్టకపోతే ఆ ఇల్లాలు పడే మాటలు అన్నీ ఇన్నీ కావు. బిడ్డ పుట్టకపోవడం స్త్రీ దోషంగా చూస్తుంది కుటుంబం. సమాజం కూడా స్త్రీనే దోషిని చేస్తది. ఎన్నో మాటలు పడాలె. ఓర్చుకుని అత్తవారింట్లనే బతకాలె. అందరి బిడ్డల్ని చూసుకుంట లోలోన కుమిలిపోతది ఆ ఇల్లాలు. వారసుణ్ని తేలేదనే అత్తవారింటి మాటలే కాక ఆడబిడ్డలు, అయినవాళ్ల మాటలూ పడాల్సిందే. పిల్లలు కలగక కుంగుబాటుల ఉన్న ఓ చెల్లెలి దుఃఖం విని.. ‘తొట్లెండ్ల బాలుడు/ తొలుకాడెదాక/ ఆకిట్ల బాలుడు/ అంబాడెదాక/ ఫలములందె దాక/ ఫడవాలె చెల్లె’ అని ‘దచ్చన్నదారి పూలావయ్యారి’ పాటల ఆర్తితో పలికిండు ఓ అన్న. ఏ చెల్లెలి దుఃఖమో! ఏ తల్లులు ఆ పాటకట్టిన్రో? అత్తవారింట్లో ఉన్నప్పుడు.. అన్న వస్తె ఆడబిడ్డకు ఎంత సంతోషమయితదో! ఆ సంతోషాన్నంతా నింపుకొన్న పాట ఇది. అన్నంటే చెల్లెకి ఎంత పాయిరమో ఈ దచ్చన్నదారి పాట మొదట్ల ఉంటది. ‘కూర్చుండు అన్నయ్య/ కుర్చీపీట మీద/ కూర్చో అన్నయ్య/ పట్టెమంచం మీద/ పడుకో అన్నయ్య/ పట్ట్టుమంచము మీద/ అన్నయ్య వచ్చిండు/ కూరేమి లేదు/ తోట గుమ్మడికాయ/ తొడిమ వంకాయ/ అర్సంత పప్పేసి/ ఆవునెయ్యి పోసి/ తినమని అన్నకు/ మారు అన్నం పెట్టె’ తోబుట్టువుల ప్రేమకు ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఏముంటది? ఒక దుఃఖ గీతంల ఇంతటి తీపిని నింపుడు ఎంత గొప్ప కవికైనా కష్టమే. అంతగొప్ప పాట కైగట్టుకున్నరు జానపదులు.
నెల తప్పినాంక ఆడవాళ్లకు పౌష్టికాహారం ఇయ్యాలె. తల్లీబిడ్డలు ఆరోగ్యంగ ఉండాలంటే మంచి తిండి పెట్టాలని ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నరు. అప్పట్లో కూడా ఇదే చెప్పిండ్రు. అయితే.. అప్పుడు ఇప్పటిలెక్క రాసుకొనుడు, చదువుకొనుడు లేదు. కాబట్టి ఏడాదంతా యాదికుండేట్టు పాట కట్టుకున్నరు. ఆ పాట బతుకమ్మ ఆడేటోళ్లంతా పాడుకునేది. గర్భం దాల్చినంక ఏ నెలలో ఏమి తినాలో పాట కట్టుకుని చెప్పుకొన్నరు.
‘ఒక్కోమాసం నెలతన గర్భిణి ఓనగాయలడిగె.. చెలియా ఓనగాయలడిగె’ అని మొదలై రెండో మాసంల రేనుపండ్లు, మూడో మాసంల ములకపండ్లు, నాలుగో మాసంల నారింజపండ్లు, అయిదో మాసంల అత్తిరసపండ్లు, ఆరోమాసంల అన్ని సద్దులు, ఏడో మాసంల వెలగపండ్లు, ఎనిమిదో మాసంల ఎన్నముద్దలు, తొమ్మిదో మాసంల బంగారు తొట్టె’ సమకూర్చాలని పాటకట్టి ఆరోగ్యపాఠాలు పాడుకున్నరు. ప్రజారోగ్యం అనే వ్యవస్థ ఉనికిలో లేని కాలంల తల్లుల బాగుకోరి ఆనాడు ఎసుంటి ఏర్పాట్లు చేసుకున్నరో ‘నెలతన గర్భిణి’ పాటల ఉంది. అట్లనే కడుపులో పిండం పరిణామం చెందే క్రమం ‘శివలోక పట్నాన ఉయ్యాలో’ పాటల ఉంది.
‘నాల్గేసి నెలల్లొ ఉయ్యాలో..
నెలసంద్రమాయె ఉయ్యాలో
ఐదేసి నెలల్లో ఉయ్యాలో..
ఆవుసల్లె పోసి (ఆయుష్షు పోసి) ఉయ్యాలో
ఏడేసి నెలల్లో ఉయ్యాలో..
ఏర్పడే పిండము ఉయ్యాలో
తొమిదేసి నెలల్లో ఉయ్యాలో..
తొలుకాడె పిండము ఉయ్యాలో’ అని బిడ్డ ఎదిగే తీరుని ఇడమరిచిండ్రు.
పుట్టింటి ప్రేమ కావాలని ఆడబిడ్డ కోరుకుంటది. కష్టమొచ్చినప్పుడు అమ్మానాన్నల ఆసరా కావాలనుకుంటది. తోడబుట్టిన వాళ్లు తోడురావాలని కోరుకుంటది. ఆ ప్రేమలు బతుకమ్మ పాటగా హృద్యంగా అల్లుకున్నరు. ‘చిలుక కొరికిన పోక ఉయ్యాలో’ పాటల కష్టమొస్తే పుట్టింట ఉండిపొమ్మనే తల్లిదండ్రుల ప్రేమ సందేశం, వచ్చిపొమ్మనే అన్నదమ్ముల ఎదురుచూపులు, వస్తే భారమనుకునే వదిన మరదళ్ల స్పర్ధలుంటయి. తాహతుకు తగ్గట్టు ఉన్నదాంట్లో కొంత ఇచ్చే అన్నలు, ఎవరెవరు ఏమేమి చెల్లికిచ్చినరో ‘శుక్రవారం నాడు లేచెనే గౌరమ్మ’ పాటల ఉంది. అందరి ఆడబిడ్డలకు పుట్టింటిలో ఆదరణ ఉంటదని లేదు. పేదరికమో, తోబుట్టువులకు మంచి మనసు లేకపోవడమో ఉంటది. అసుంటి ఇంట పుట్టిన ఆడబిడ్డకు ఎన్నికష్టాలుంటయో.. తెలియజెప్పేదే ‘ఏడుగురన్నదమ్ములు ఉయ్యాలో’ పాట. చెల్లె కోసం ప్రాణమిచ్చే అన్నలే కాదు, స్వలాభం కోసం చెల్లెల్ని బలిచ్చే అన్నలుంటరని ఆ పాటల ఉంది. పుట్టింటి ఆస్తికోసం ఇప్పుడు కోర్టుకెక్కిన ఆడబిడ్డలు ఆ పాటలున్న అంజమ్మ లాంటోళ్లె! ఈ జానపదంల బస్సు ప్రయాణం ప్రస్తావన వస్తది. అంటే.. ఈ గీతం వందేండ్లకు ఇవతలే పుట్టి ఉంటది. అభివృద్ధితోపాటే సామాజికంగ వస్తున్న మార్పులతోని మనుషులు మారిపోతున్నరు. అట్లనే బతుకమ్మ పాటల్లోనూ పెట్టుపోతల పరిణామం కానవచ్చింది. అన్నదమ్ముల బాగుకోరిన ఆడబిడ్డలూ ఈ పాటల్ల ఉన్నరు. పేదలని పిలిచి ఆశ్రయమిస్తే.. చెల్లి రాజ్యాన్నే కబళించాలనుకున్న అన్న గురించి ‘ఔరా బేగము ఉయ్యాలో’ పాటల ఉంది. అటు కాలేసినంక ఇటుకాలెయ్యని (మెట్టినింటికి పోయినంక పుట్టింటికి రాని) ఆడబిడ్డలు తమ బాధలెన్నో బతుకమ్మ పాటలల్ల చెప్పుకొన్నరు.
పెళ్లయినంక వచ్చే మొదటి బాధ అత్త ఆరడి. అత్తలేని కోడలుత్తమురాలు అనే సామెత ఆ ఆరళ్ల నుంచి పుట్టిందే. ఆ బాధలన్నీ పాటగట్టి ఆడుకునే కాడ కోడళ్లు పాడుకుంటరు. ‘వీధిలో తలతిప్పి ఉయ్యాలో దువ్వాద్దంటి ఉయ్యాలో’ అన్నట్టే ఇప్పటికీ కోడళ్లను కాపుగాసే అత్తలున్నరు. అసుంటి అత్తలకు సరిజోడైన కోడళ్లూ ఉన్నరు. అసుంటి కోడలే ‘పోతె పోతివి గాని ఉయ్యాలో మల్లెన్నడొస్తవు ఉయ్యాలో’ అని అత్తడిగితె.. ‘నక్కలు నాగళ్లు ఉయ్యాలో.. దున్నిన నాడొస్త ఉయ్యాలో/ గుడ్డోళ్లు గుంటకలు ఉయ్యాలో.. వేసిన్నాడొస్త ఉయ్యాలో’ అంటూ బయలెల్లే గడసు కోడళ్లూ పాటలల్ల ఉన్నరు. ‘పచ్చిపాల మీద ఉయ్యాలో.. మీగడేమాయె ఉయ్యాలో/ వేడిపాల మీద ఉయ్యాలో.. వెన్నలేమాయె ఉయ్యాలో’ అని ఆరడి పెట్టే అత్తని తప్పు పడుతూ.. ‘పచ్చిపాల మీద ఉయ్యాలో.. మీగడుంటుందా ఉయ్యాలో / వేడిపాల మీద ఉయ్యాలో.. వెన్నలుంటాయా ఉయ్యాలో’ అంటూ తెలివైన కోడలు బదులిచ్చే పాట సరదాగా సాగిపోతుంది.
తరాలు మారినా స్త్రీని వదలని కష్టం వరకట్నం. ఈ కట్న పిశాచి ఆడవాళ్ల జీవితాలను ఆగం చేయడమే కాదు.. దేశాన్ని అపఖ్యాతి పాలు చేసిందని బతుకమ్మ ఆడేకాడ పాటగట్టి చెప్పినరు ఆడబిడ్డలు. వరకట్న దురాచారం వల్ల స్త్రీలపై జరుగుతున్న హింసని ‘ఎల్ల లోకములందు ఉయ్యాలో’ పాట ఏకరువు పెట్టింది.
‘ఆది పరాశక్తి ఉయ్యాలో..
అన్నింట మూలమని ఉయ్యాలో
ఇక్కడీ జనులు ఉయ్యాలో..
ఎంత నమ్ముదురు ఉయ్యాలో
ఆడపిల్ల అంటె ఉయ్యాలో..
ఆడిపిల్లా అని ఉయ్యాలో
రాను రాను జగతి ఉయ్యాలో..
ఎట్ల మారిందంటె ఉయ్యాలో
కట్నంబు కోసమే ఉయ్యాలో..
మగవాడు పుడుతుండ ఉయ్యాలో
అనిపెంచె రీతిలో ఉయ్యాలో..
ఎన్నెన్నో హింసలు ఉయ్యాలో’
మన సమాజంలో అనేక కులాలు ఉన్నాయి. కులానికో వృత్తి ఉంది. ఆ వృత్తి జీవితంల ఉన్న స్త్రీలకు అనేక అనుభవాలున్నయి. అనుభవాలు, ఆకాంక్షలు పాడుకునే బతుకమ్మ పాటలల్ల ఈ వృత్తి విశేషాలూ చేరినయి. ‘ఊరికి ఉత్తరాన వలలో’ పాటల కమ్మరి చెల్లెలు కొలిమిల గొడ్డలిని తయారు చేయడం నుంచి ఆ తర్వాత గొడ్డలేమి చేసిందో పాడింది.
‘ఊదేటి తిత్తూలు వలలో..
ఉరుములా బోలు వలలో
వేసేటి సమ్మెట్లు వలలో..
పిడుగులా బోలు వలలో
లేచేటి రవ్వలూ వలలో..
మెరుపులా బోలు వలలో
చుట్టున్న కాపూలూ వలలో..
చుక్కల్లా బోలు వలలో
నడుమ కమ్మరి బిడ్డా వలలో..
చంద్రుణ్ని బోలు వలలో
నెయిబసి గొడ్డళ్లు వలలో..
నేర్పూ లెక్కించి వలలో
పాలుబోసి గొడ్డళ్లు వలలో..
పదునూ లెక్కించి వలలో
నీరోసి గొడ్డళ్లు వలలో నునుపూ లెక్కించి వలలో
పాయిరే అన్నలూ వలలో..
అడవి మార్గాన వలలో’
బతుకమ్మ ఆడేందుకు వచ్చిన ఆడోళ్లు అందమైన చీరలు కట్టుకొని వస్తరు. ఆ చీరలల్ల ఉండే అందమంతా శాలోళ్ల ప్రతిభే. ఓ చేనేత కార్మికుడు తన ప్రియురాలికి అందమైన చీర నేసి ఇచ్చిండు. ఆ చీర గురించి ఆడబిడ్డలు పాడుకునే పాటల పడుగు, పేకతోని మగ్గం మీద తయారయ్యే చీరపైన రూపుదాల్చే అందాలన్నీ పాడుకుంటరు.
‘నేసేను శాలోడు ఉయ్యాలో
నెలకొక్క పోగు ఉయ్యాలో
మొదటనా నేసిండు
ఉయ్యాలో
మొగ్గలా తోని ఉయ్యాలో
అంచును నేసిండు
ఉయ్యాలో
ఆకుల కొమ్మలు ఉయ్యాలో
చెంగున నేసిండు ఉయ్యాలో
చామంతి వనము ఉయ్యాలో
చల్లదనమిచ్చే ఉయ్యాలో
చంద్రునీ నేసెను ఉయ్యాలో
ఆటపాటల రెండు ఉయ్యాలో
హంసలా నేసెను ఉయ్యాలో’
ఈ చీరల అందాలు చెప్పుకొని మురుసుడే కాదు, ఆ చీరనేసిన శాలోళ్ల శ్రమనీ మెచ్చుకునే పాటగట్టిండ్రు.
తమ కష్టాలు పోవాలని ఏ దేవుడినైనా వేడుకునేదే. పరుల బాధలు తలుచుకుని, వారి కష్టాలు పోవాల్నని వేడుకునుడు అరుదు. కానీ, బతుకమ్మ ఆటలో అది సాధారణం. బతుకమ్మ పాటలల్ల ప్రజల కష్టాలెన్నో ఉన్నయి. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు ఆగమైన బతుకుల్ని, అసువులొడ్డినవాళ్లని బతుకమ్మ పాట యాది చేసుకుంటది.
‘పందొమ్మిదొందల ఉయ్యాలో..
యాబది నాలుగు ఉయ్యాలో
సెప్టెంబరు నెల ఉయ్యాలో..
ఇరవై ఏడవ తేదీ ఉయ్యాలో
ఆ రోజు అమవాస్య ఉయ్యాలో..
సోమవారము నాడు ఉయ్యాలో
గాయాల నెత్తురు ఉయ్యాలో..
వరదలై పారింది ఉయ్యాలో’
రఘునాథపల్లి (జనగామ దగ్గర) రైలు ప్రమాద బాధితులకు ప్రజలు తెలిపిన సానుభూతికి ఈ బతుకమ్మ పాట సాక్ష్యం.
‘పగిలినా భూమితో ఉయ్యాలో..
పునాదులే కదిలి ఉయ్యాలో
తాము కట్టిన యిండ్లె ఉయ్యాలో..
తమకు శత్రువులాయె ఉయ్యాలో
ఆశల మేడలు ఉయ్యాలో..
పేక మేడల వోలె ఉయ్యాలో
కట్టుకున్న యిండ్లు ఉయ్యాలో..
కుప్పలయి కూలెను ఉయ్యాలో
లాతూరు జిల్లాను ఉయ్యాలో..
ఖిలారు జిల్లాను ఉయ్యాలో
సస్తూరు గ్రామాన్ని ఉయ్యాలో..
ఉస్మాన్బాదును ఉయ్యాలో
భూకంపమొచ్చింది ఉయ్యాలో..
కంపించి వేసింది ఉయ్యాలో’
లాతూర్ భూకంప బాధితులకు సామూహిక సంఘీభావం ప్రకటిస్తూ బతుకమ్మ ఆడే తల్లులు ఇట్ల పాటకట్టి
పాడుకున్నరు.
‘ముందల లారమ్మ ఉయ్యాలో..
ఎనుకాల బస్సమ్మ ఉయ్యాలో
అర్ధమ్మరాతిరి ఉయ్యాలో..
కట్టదాటినాది ఉయ్యాలో
పాయెగా మారింది ఉయ్యాలో..
కట్ట తెగినాది ఉయ్యాలో
నీటి మట్టం పెరిగి ఉయ్యాలో..
బస్సు కొట్టుకపాయె ఉయ్యాలో
అందరికి అందరూ ఉయ్యాలో..
ప్రాణాలు విడిచిరి ఉయ్యాలో
మేలు చేయబోయి ఉయ్యాలో..
అబ్బాసు అమరుడాయె ఉయ్యాలో’
దేవరకొండ దగ్గర మల్లెపల్లికి సమీపంలో ఉప్పాగు కట్ట తెగినప్పుడు జరిగిన ప్రమాదంలో సాటి వారిని కాపాడబోయి ప్రాణం విడిచిన ఓ మనిషిని అమరుడిగా కీర్తిస్తూ నివాళి అర్పించినరు.
సమ్మక్క, సారలమ్మ వీరవనితలు. కాకతీయులతో తలపడిన కోయ రాజుల పోరాటాన్ని తెలంగాణల నేటికీ తలుచుకుంటరు. రెండేళ్లకోపాలి జరిగే ‘సమ్మక్క-సారలమ్మ జాతర’కు తెలంగాణ తరలిపోతది. ఆ తల్లీబిడ్డల త్యాగాన్ని తలచుకుంట ఎన్నడో జానపదులు ఓ పాటల్లుకున్నరు. బతుకమ్మ ఆటల ఇప్పటికీ ఆ పాట పాడుకుంటనే ఉన్నరు.
పోరు జరగని నేల లేదు. పోరాటం లేని జీవితం లేదు. బతుకమ్మ బతుకు పాటల్ల మన బతుకుల్లో భాగమైన పోరాటముంది. నైజాం రాజ్యంలో దొరల, పటేళ్ల దుర్మార్గాలకు ప్రజలుపడ్డ కష్టాలెన్నో పాటగట్టుకున్నరు. తెలంగాణ గడ్డ మీద సాగిన రైతాంగ సాయుధ పోరాట కాలంల వీరుల త్యాగాలని కైగట్టి పాడుకున్నరు. ఆనాటి కూలి తల్లుల కష్టాలు బతుకమ్మ పాటల్ల ఉంది. విసునూరి రామచంద్రారెడ్డి వ్యవసాయ కూలీకి వచ్చిన బాలింత బిడ్డకు పాలియ్యబోతనంటే నిరాకరించిండు. అవమానించిండు. ఆ తల్లి కష్టాన్ని తల్లులంతా గలిసి పాటగట్టుకున్నరు.
‘పాలు సేపుల కొచ్చె ఉయ్యాలో..
పాలియ్య వేళాయె ఉయ్యాలో
పసిపిల్ల తల్లులం ఉయ్యాలో..
పాలియ్య వేళాయె ఉయ్యాలో
పాలియ్య దోలవా ఉయ్యాలో..
ఓయిని దొరవారు ఉయ్యాలో’
ఆ దొరలు పెట్టే కష్టాలు పోవాల్నంటె గడీలు కూలాల్నని ఆనాటి ఆడోళ్లు కోరుకున్నరు. అదే బతుకమ్మ పాటలల్ల ఉన్నది. కమ్యూనిస్టు పార్టీ గ్రామగ్రామాన సంఘం పెట్టినంక చైతన్యం వచ్చింది. పోరాటం షురువైంది. దొరల భూములు కూలీల పాలైన సందర్భాన్ని..
‘జయ జయ ధ్వానాలతో ఉయ్యాలో..
ఎర్రజెండాను బట్టి ఉయ్యాలో
వాని గడినంత ఉయ్యాలో..
కూలగొట్టిరమ్మ ఉయ్యాలో
రామ రామ రామ ఉయ్యాలో..
శ్రీరామ రామ ఉయ్యాలో’
జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి అనే దొర గడీని కూల్చి, అతని భూముల్ని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పేదలకు పంచినారు. ఆ చరిత్ర అనేక బతుకమ్మ పాటలల్ల ఉంది. ఈ జానపదాల్లో సాయుధ పోరాట గాథలున్నయి. సంఘంలో చేరిన రేణికుంట దొర రామిరెడ్డిని మర్చిపోకుండ జనం పాటగట్టి బతికిచ్చిండ్రు. వీరనారి చాకలి ఐలయ్య పోరాటాన్ని పాటగట్టి పాడుకున్నరు. నక్క ఆండాళ్లమ్మ మరణాన్ని గుర్తుచేసుకున్నరు. ఇట్ల బతుకమ్మ పాట పోరాటంలో అసువులు బాసిన యోధులను అమరులుగా కీర్తించింది.
తెలంగాణ పోరాటం షురువైనాంక జనప్రవాహమైన ఉద్యమంల పోరుపాటలు పోటెత్తినయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల దగాపడ్డ జనం గోస పాటలల్లకొచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బతుకమ్మ ఆటలోకి వచ్చింది. బతుకమ్మ పాటలోకి తెలంగాణ వచ్చింది. మన జీవితాల్ని సంతోషమయం చేసుకోవాలనే తలపోత. అందుకే బతుకమ్మ ఆట ఉద్యమ బాటయ్యింది.
తెలంగాణ కోసం తండ్లాడిన కాలాన ఎన్నో పోరాట రూపాలు. అన్ని చోట్లా బతుకమ్మ ఊరేగింది. పెత్తరామస నుంచి తొమ్మిది రోజులే ఆడుకునే బతుకమ్మ ఆట తెలంగాణ అస్తిత్వ చిహ్నమైనంక ఏడాది పొడుగునా పల్లవించింది. ఆ ఉద్యమ ఊపులో బతుకమ్మ ఆటలోకి కొత్త పాటలు ఎన్నో వచ్చినయి. ఆడబిడ్డల పాట స్వరాష్ట్ర ఆకాంక్ష జతకట్టడంతో అందరి ఆటగా మారింది. ఆడమగా భేదాల్లేకుండా బతుకమ్మ సాక్షిగా అందరూ తెలంగాణకు జై కొట్టిండ్రు. ‘నా తల్లి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాల- తల్లడిల్లి పోతుందమ్మ ఉయ్యాలో’ పాట ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది. విద్యార్థి ఉద్యమ గాయకుడు శరత్ రాసిన ఈ పాట ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయల్లో పోటెత్తిన విద్యార్థి గళాల్లో మార్మోగింది. అట్లనే శిరీషా రాణి, జి.శ్యామల, గడ్డం భీం రెడ్డి కూడా బతుకమ్మ పాటలు రాసి ఉద్యమానికి బలాన్నిచ్చిండ్రు.
తెలంగాణ పోరాటం విదేశాలకు విస్తరించినంక బతుకమ్మ ఆట కూడా అక్కడ కదం తొక్కింది. మన దగ్గర ఊరూరా మోగిన పాటల్ని విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు అందుకున్నరు. తల్లివేరు పట్టుకుని బిడ్డలంతా బతుకమ్మకు జేజేలు పలికిండ్రు.
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తెలంగాణలొ పుట్టింది ఉయ్యాలో..
ఇంగ్లండు కొచ్చింది ఉయ్యాలో
తెల్లోళ్ల దేశంలో ఉయ్యాలో..
తంగేడు పూలేవి ఉయ్యాలో
గునుగుపూలు లేక ఉయ్యాలో..
గౌరమ్మ పుట్టింది ఉయ్యాలో’
నవత రాసిన ఈ పాట కాలానికే కాదు, స్థలానికీ సంబంధించినది. సంస్కృతికి, ప్రాంతానికి ఉండే బంధాన్ని చక్కగా చెప్పింది.
స్వరాష్ట్రం కోసం సకల జనుల పోరాటం నడిచింది. తెలంగాణ తెగించి కొట్లాడింది. తెలంగాణ కల సాకారమైంది. ఆడబిడ్డల కాంక్షలు మారినయి. కొత్త రాష్ట్రంలో కోటి ఆశలతోని పాటలల్లుకున్నరు. పాత పాటలు యాది చేసుకుంటనే కొత్త కొత్త గీతాలు అల్లుకున్నరు. బొడ్రాయి కాడే కాదు యూట్యూబ్‌ల గిన బతుకమ్మ పాట మోత మోగుత్నుది. టీవీ చానెళ్లు ఏడాదికో పాట బతుకమ్మ ఆట కోసం తెస్తున్నయి. ఇట్ల బతుకమ్మ సంబురం కొత్త పుంతలు తొక్కి సరికొత్త పాటలతోని కోటి ఆశలు రేకెత్తిస్తున్నది. అయితే, ఇప్పుడొచ్చిన ఓ కొత్తపాట దశాబ్దంగా మురిసిన తెలంగాణ ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతున్నది.
‘రేవంతు సారు ఉయ్యాలో..
నీ జాగల నువ్వుండు ఉయ్యాలో
మా ఇంట్ల మమ్మల్ని ఉయ్యాలో..
ఉండనియ్యవయ్య ఉయ్యాలో
మా ఇండ్ల జోలికి ఉయ్యాలో..
నువ్వు రావొద్దయ్య ఉయ్యాలో’
ఇది నీళ్ల పండుగాయె. ఇప్పుడు నీళ్ల జపం చేస్తూ పేదోళ్లని దూరం పెడుతున్నది హైడ్రా. మూసీ గట్టున బతుకమ్మ ఆడే ఆశలే కాదు, ఆ నీడన ఉండే అవకాశం లేకుండా చేస్తనంటున్నది ప్రభుత్వం. హైడ్రా బాధలు పడలేక రేవంత్ సర్కారు మీద ఆడబిడ్డలు ఆ పాటగట్టిండ్రు. చరిత్ర పునరావృతమవుతుందని చరిత్రకారులు అన్నట్టే.. సాయుధ పోరాట కాలం తర్వాత స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉంటయనుకున్నరు. కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు ఆ స్వేచ్ఛలేకుండా జేసిండ్రు. మళ్లీ పోరాటమందుకున్న కాలాన ఆడబిడ్డలు పాటగట్టిన్రు.
‘నిదుర మేల్కోనవమ్మ ఉయ్యాలో..
నిలిచి పోరాడు తల్లి ఉయ్యాలో
నైజాము దొంగలను ఉయ్యాలో..
నాశనము చేశాము ఉయ్యాలో
కాంగ్రేసు దొంగలు ఉయ్యాలో..
కదిలి వచ్చీరమ్మ ఉయ్యాలో
నీ వీరశక్తితో ఉయ్యాలో..
నిలిచి పోరాడుతల్లి ఉయ్యాలో
కాంగ్రెసు సర్కారు ఉయ్యాలో..
కంగారుపడి లేచి ఉయ్యాలో
పల్లెలను దోచుటకు ఉయ్యాలో..
ప్లాన్లు వేస్తున్నారు ఉయ్యాలో
అందరము ఒక్కటై ఉయ్యాలో..
అణగ గొడుదాము తల్లి ఉయ్యాలో’
అప్పట్లో కాంగ్రెస్‌ను తిట్టుకుంటూ మన ఆడబిడ్డలు అల్లుకున్న పాట ఇది. మళ్లీ అదే పాటను ఈ బతుకమ్మ వేదికగా పాడుకునే కాలమొచ్చింది.
బతుకమ్మకు ముందు బొడ్డెమ్మ
బతుకమ్మ ఆటకు ముందు రోజుల్లో బొడ్డెమ్మ ఆడుతరు. ఇది పెండ్లి కాని ఆడపిల్లలు ఆడే ఆట. పుట్టమన్ను, పూలు, పేడతో బొడ్డెమ్మను తయారు చేసుకుంటరు. బొడ్డెమ్మ ఆడిన తర్వాత కన్నెపిల్లలంతా కూర్చుని…
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా
నిద్రకు నూరేళ్లు నీకు వెయ్యేండ్లు
పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేళ్లు
నినుగన్న తల్లికి నిండు నూరేళ్లు’ అని పాడుకుంట
బొడ్డెమ్మను నిద్రపుచ్చుతరు.
బతుకమ్మపాటల్లో రామాయణ, భారత పురాణ కథల ఆధారంగా అల్లిన జానపదాలున్నయి. రేణుక ఎల్లమ్మ కథ ఆధారంగా అల్లుకున్న పాటలున్నయి. బతుకమ్మ పాటల్లోని రాజ రంపాలుడి కథ మహాభారతం ఆధారంగా అల్లింది. ఎములాడ రాజన్న, యాదగిరి నరసన్న, శ్రీశైలం మల్లన్న కరుణా కటాక్షాలు చూపమని ‘రామరామ ఉయ్యాలో’ పాటల కోరుకుంటరు.
‘చల్లకుండ కాడ ఉయ్యాలో..
దాగి ఉన్నవు నాగ ఉయ్యాలో
చల్లల్ల పురుగాని ఉయ్యాలో..
చంపేరు నిన్ను ఉయ్యాలో’
అంటూ నాగుపాముకి జాగ్రత్తలు చెప్పే ‘నాగుల పంచమి నాడు ఉయ్యాలో’ పాటల పాములకూ ప్రాణహాని కలిగించొద్దని చెబుతరు.
బతుకమ్మ గురించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నయి. వైశ్యులు బతుకమ్మను కన్యకా పరమేశ్వరిగా కొలుస్తరు. కొంతమంది మహిషాసుర మర్దినిగా భావిస్తరు. రుద్రమదేవి కాపాడే ప్రయత్నంల ఓ అంగరక్షకురాలు ప్రాణాలు కోల్పోయిందట. ఆమెని బతుకమ్మగా కొలుస్తరని చెప్పే ఓ గాథ ఉంది. వదిన ఆడబిడ్డలకు తగవు జరిగిందట. వారిద్దరిలో ఒకరు చనిపోయారట. ఈ వివాదంల రెండు కథనాలు ప్రచారంల ఉన్నయి. మరదలు చనిపోయిందని ఒక కథ, వదిన చనిపోయిందని ఇంకో కథ ఉంది. ఏదేమైనా వాళ్లిద్దరినీ బతుకమ్మగా ఆరాధిస్తున్నరు.
బతుకమ్మ పాటల్లో భార్యాభర్తలు, వదినా మరదళ్ల పరిహాసముంటది. ఊహాలోకంలో అల్లిన కథని ఆలపిస్తూ సాగే ఈ పాటలల్ల భలే సరదా ఉంటది. ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్.. నీ బిడ్డ పేరేమి కోల్’ పాటల ‘అద్దంలో గౌరమ్మ కోల్.. నీ మొగుడెవరమ్మా కోల్’ అనే పాటల ఉన్న గౌరీదేవి వదినో, మరదలో అయి ఉండొచ్చు. బతుకమ్మ పాటలల్ల సీత, రాముడు, శివుడు, పార్వతి, గౌరీ పేర్లుంటయి. వాళ్ల ప్రేమ, అలకలు, కోపాలు, పరిహాసాలుంటయి. అవన్నీ పురాణ కథలు కావు. దేవతల పేర్లతో ఉండే ఆ పాత్రలు జానపదులకు ప్రతీకలు. అన్న, తమ్ముడు, వదిన, మరదలు, భర్త, భార్యలకు దేవతల పేర్లు పెట్టి పాటకట్టినరు.
‘శ్రీరాములే మీ అన్న ఉయ్యాలో..
చిందులేస్తాడమ్మ ఉయ్యాలో
మీ అన్న రాముడు ఉయ్యాలో..
రట్టు చేస్తాడమ్మ ఉయ్యాలో
బతుకమ్మలైతె ఉయ్యాలో..
పట్టుకున్నామ్మ ఉయ్యాలో’ చక్కగ ఉంటది. ఇట్ల పురాణ పాత్రలతోని తమ జీవితానందాలను కలబోసి పాటల్లుకున్నరు జానపదులు. దైవాన్ని, అనుభవాలను యాది చేసుకొంటూ పాడే పాటలు భక్తిని, ఉత్సాహాన్ని పెంచుతయి.
చాలా దేశాల్లో పూల పండుగలు ఉన్నయి. మన దేశంలోగూడ పూల పండుగలు ఉన్నయి. ఆంధ్రలో గొబ్బెమ్మలు, కేరళలో ఓనం, పూలను పేర్చి ఆడుతరు. కానీ, మనకున్న ప్రత్యేకత వాళ్లకు లేదు. తంగేడు, గునుగు, కట్ల, గోరింట, తామర పూలను ప్రకృతి నుంచి సేకరిస్తరు. వీటిని సాగు చేయరు. ప్రకృతి ఇచ్చిన పూలతోనే ఈ పండుగ చేసుకుంటారు. గుమ్మడి, బీర మాత్రమే పెరటిలో పెరిగే మొక్కలు. ఈ మధ్యకాలంలనే బతుకమ్మల బంతిపూలు చేరినయి. మొదట్ల ఈ సంప్రదాయం లేదు.
– నాగవర్ధన్ రాయల