సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 26 లక్షలు కాజేశారు. మీర్‌పేట్‌కు చెందిన బాధితుడికి ఫోన్ చేసి తన పేరు రామ్ మనోహర్ అంటూ పరిచయం చేసుకున్నాడు ఓ సైబర్ నేరగాడు. ఫేర్ఫీ ప్లాట్ ఫామ్‌కు సంబంధించిన లింక్ ఎఫ్పీఏపైమ్. స్టోర్ లింక్ పంపిస్తున్నామం టూ సూచించారు. బాధితుడి నెంబర్‌ను ఈ-7గ్రో విత్ పంగ్మార్క్, వీఐపీ 153 పంగ్మార్క్ హబ్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో నంబర్‌ను యాడ్ చేశారు.
ఫలానా షేర్స్‌లో పెట్టుబడి పెడితే లాభం వచ్చిందంటూ ఒక్కొక్కరు చెబుతున్నారు. చూసిన బాధితుడు మొదట రూ.20 వేలు పెట్టుబడి పెట్టాడు, అందులో కొంత లాభం చూపించారు. ఆ తరువాత మీకు లోన్ వస్తుందని, మీరు కొనే షేర్ల విలువ రోజు 5 శాతం పెరుగుతాయంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా బాధితుడి నుంచి రూ.27.20 లక్షలు పెట్టుబడి పెట్టించారు. కాగా అందులో రూ.1.05 లక్షలు లాభంగా వెనక్కి ఇచ్చి రూ.26.15 లక్షలు కొట్టేసి మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వృద్ధుడి డిజిటల్ అరెస్ట్
పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధముందని, మనీలాండరింగ్‌లో నీ పాత్ర ఉందం టూ నగరానికి చెందిన ఓ వృద్ధుడిని సైబర్‌నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేశారు. హుమాయున్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధుడికి ఫోన్ కాల్ వచ్చింది. అందులో తాము ఏటీఎస్, ఎన్ఐఏ ఆఫీసర్లమని, డీజీపీనంటూ మాట్లాడి బాధితుడిని బెదిరించారు. వాట్సాప్ వీడియో కాల్స్‌లో మాట్లాడుతూ.. బాధితుడికి ఫోర్జ్డ్ అరెస్ట్ వారెంట్లు, మరికొన్ని నకిలీ పత్రాలను చూపించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు.
దీనికి సంబంధించి అకౌంట్స్ చెక్ చేయాలంటూ చెప్పి ఒత్తిడి చేయడంతో బాధితుడు తన ఫిక్స్డ్ డిపాజిట్లను ముందుగానే క్లోజ్ చేసి మొదట రూ.6.06లక్షలు పంపించారు. అతడి భార్య అకౌంట్ నుంచి మరో రూ.20లక్షలు పంపించినట్లు బాధితుడు తెలిపారు. డబ్బులు మొత్తం హెన్రీజోన్స్ అనే వ్యక్తి అకౌంట్లోకి పంపినట్లు చెప్పారు. అంతేకాకుండా నేరగాళ్లు ఫోర్జరీ చేసిన ఆర్బీఐ డాక్యుమెంట్లను కూడా తనకు పంపారని, తనను వాటితో నమ్మించి బెదిరించారని అతడు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.