కంటోన్మెంట్, సెప్టంబర్ 23. ఎక్కడో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న బస్తీల్లో ఇళ్లను కూల్చేందుకు సిద్ధమవుతున్నారు ఎయిర్పోర్ట్ అథార్టీ అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. 1వ వార్డు, రెండవ, మూడవ వార్డు నుంచి ప్లయింగ్జోన్గా ఉన్న నాలుగు, ఐదు, ఆరు వార్డులకు చెందిన పలు కాలనీల, బస్తీల్లో సుమారు లక్షన్నరకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు.
అయితే బేగంపేట పక్కనే ఉన్న రెండవ వార్డులోని పలు బస్తీల ప్రజలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా పొందిన ఇంటి అనుమతి పత్రాలతో పాటు ఎన్వోసీ ప్రతాలు చూయించాలని ఎయిర్పోర్ట్ అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో పలువురు భయాందోళనకు గురవుతున్నారు. పైసాపైసా కూడబెడ్డి కట్టుకున్న భవనాలకు సంబంధించి గ్రౌండ్‌ఫ్లోర్ వరకు కూల్చివేయవచ్చు లేదా పూర్తిగా నేలమట్టం చేసే అవకాశం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతుండటంతో స్థానికులు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రత్యేక రూల్స్‌తో గెజిట్ విడుదల…
ఎయిర్ క్రాప్ట్ డిమాలిషన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ రూల్స్-2025 పేరుతో పౌరవిమానాయన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్‌తో బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకవచ్చింది. ఈ చట్టంతో బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బహుళ అంతస్థుల భవనాల ఎత్తును తగ్గించడం లేదా పూర్తిగా కూల్చివేసేందుకు చర్యలు చేపట్టే వీలుంటుంది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కంటోన్మెంట్ 2వ వార్డులోని పలు బస్తీల్లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు..
భద్రతా ప్రమాణాలకు అనగుణంగా లేవని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులకు అనుమతి పత్రాలు చూపడంతో పాటు రెండు నెలల్లో తమ అభ్యంతరాలు తెలియజేయాలని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక గెజిట్ విడుదల చేయడంతో ఎయిర్పోర్ట్ అథార్టీ అధికారులు 2వ వార్డు పరిధిలోని అన్నానగర్, అర్జున్‌నగర్, ఇందిరమ్మనగర్, శ్రీలంకబస్తీ, ఎయిర్‌లైన్స్ గేట్ వరకు ఉన్న పలు బస్తీల్లోని వేలాదిమంది పేదలకు నోటీసులు జారీచేస్తున్నారు. నిజానికి ఇక్కడి ఎయిర్పోర్ట్ శంషాబాద్‌కు తరలివెళ్లడంతో కేవలం వీవీఐపీల రాకపోకల విమానాలు, శిక్షణకు సంబంధించిన విమానాలతో పాటు ప్రత్యేక విమానాలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
మరోపక్క ఢిపెన్స్ ఎస్టేట్ నోటీసులు..
ఓ పక్క ఎయిర్పోర్ట్ అథార్టీ అధికారులు ఇండ్లకు నోటీసులు జారీ చేస్తుండగా మరోపక్క కంటోన్మెంట్‌లోని ఢిఫెన్స్ ఎస్టేట్ అధికారులు జీఏల్ఆర్ సర్వేనంబర్ 606లోని 2.71 ఏకరాల్లోని బీ-4 డిఫెన్స్ స్థలాల్లో ఆలయాలు నిర్మించారని నోటీసులు అంటించారు. అన్నానగర్‌లోని పోచమ్మ దేవాలయం, పెద్దమ్మ, బీరప్ప, ఎల్లమ్మ ఆలయాలకు మోడల్ డెయిరీ, హర్యాణా స్పెషల్ జిలేబీ షాపుతో పాటు అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్న వారికి నోటీసులు జారీచేశారు.
అన్నానగర్ రోడ్‌లోని సుదర్శన్, యాదగిరి, కుంటయ్య. నర్సింహగౌడ్, మహేష్‌యాదవ్, అచ్యుత శర్మ, సి.వెంకటేశ్వర్లు, ఆర్.అగర్వాల్‌కు డిఫెన్స్ ఎస్టేట్ అండర్ సబ్ సెక్షన్ (1), క్లాజ్ (బి) (11) ఆఫ్ సబ్‌సెక్షన్(2) ఆఫ్ సెక్షన్ (4) యాక్ట్ 1971 ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఓ పక్క ఎయిర్పోర్ట్ అధికారులు, మరోపక్క డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు నోటీసులు జారీ చేస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేవాలయాలకూ నోటీసులు అంటించడమేటని వారు ప్రశ్నిస్తున్నారు.