ఒక ఉద్యమం ఎందుకు పుడుతుంది? ఒక తిరుగుబాటు ఎందుకు తలెత్తుతుంది? ఒక సమాజం నిరంతరం అణచివేతకు గురైనప్పుడు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో కుంగిపోయినప్పుడు.. సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు! ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేతలు తాతాలికం కావచ్చు.. కానీ, సాంస్కృతిక విధ్వంసం మాత్రం శాశ్వతమైంది. ‘మనుగడ కోసం పోరాటం’ డార్విన్ సూత్రీకరించాడు. తెలంగాణ జనజీవనంలో ప్రతి అడుగులోనూ అది కనిపిస్తుంది. నిరంతర అణచివేతలు.. కుట్రలు.. తెలంగాణ ప్రజలను శతాబ్దాలపాటు గోసపెట్టాయి. ప్రాచీన కాలంలో హర్షవర్ధనుడు, మధ్యయుగంలో ఖిల్జీలు, తుగ్లక్‌లు.. ఆ తరువాత బహుమనీలు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, ఆ తరువాత సీమాంధ్రులు తెలంగాణపై వరుస దండయాత్రలు సాగించినవారే.
1956కు ముందు ఎన్ని దండయాత్రలు జరిగినా.. తమ అస్తిత్వాన్ని, సంస్కృతిని తెలంగాణ ప్రజలు కాపాడుకున్నరు. కానీ, 1956లో మొదలైన పెత్తనం తెలంగాణను దారుణంగా వంచించింది. తేనెపూసిన కత్తిలా తెలంగాణపై విషం చిమ్మింది. నీళ్లు మలుపుకున్నరు. అదేమంటే నీరు పల్లమెరుగు అన్నరు… ఎత్తుమీదున్న తెలంగాణకు నీరెట్లా ఎక్కుతుందన్నరు? నిధులు గుంజుకున్నరు. అదేమంటే..‘మేం ఉన్నాం కదా మీకు రేషన్ బియ్యం పడేసేందుకు’ అన్నరు. ఉద్యోగాలను చెరబట్టారు… అదేమంటే ‘మీకు తెలివి లేదు.. మేము ఉద్యోగాలు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తాం’ అన్నరు.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 60 ఏండ్లదాకా దేశానికి నడిబొడ్డున ఉన్న ఒక ప్రాంతం.. ఉత్తర, దక్షిణాలకు అనుసంధానంగా ఉన్న ఒక ప్రాంతం తల్లడిల్లిపోతూనే ఉన్నది. ఈ ప్రాంతం స్వేచ్ఛా వాయువులు పీల్చాలని భావించిన ప్రతిసారీ గొంతు పిసుకుతూనే వచ్చారు. ప్రజలను చిన్నగా చేస్తూ… బతుకులను చిధ్రం చేస్తూ… పండుగలను ఖూనీ చేస్తూ… చదువులను చట్టుబండలు చేస్తూ… సంస్కృతిని కాలరాస్తూ… పరాజితులకు తాము పరాజితులం అయ్యామని కూడా తెలియని చిత్తభ్రమల్లో ముంచెత్తుతూ… అందలాలపై ఆడంబరాలు చేసుకున్నారు. 56లో మోసపోయిన తెలంగాణ 69లో ఒకసారి తెలివి తెచ్చుకున్నది. కానీ, ఏడాది తిరకుండానే ఆ తెలివిని తొక్కేశారు. విషం ఇచ్చి మరీ గొంతు నులిమి చంపేశారు. 1972లో మరోసారి గొంతు పెకిలింది. కొద్దిరోజులకే ఆ గొంతును ఖతం పట్టించారు.
పరాయి భాష.. పరాయి చూపులు.. పరాయి భావాలు.. పరాయి చెవులు.. పరాయి నడక.. పరాయి చేతలు.. అన్నీ పరాయివే. అందరిలో ఆశ చచ్చిపోయింది. ఇక మన బతుకులు ఇంతేనన్న నిరాశ ఆవహించింది. తెలంగాణ ఇక మోడువారిన చెట్టే అని అనుకున్నం. దీనికి స్వతంత్రమైన బతుకే లేదని అనుకున్నం. కానీ, శతాబ్దాలపాటు పోరాటం చేసిన తెగువ తెలంగాణ సమాజానిది. కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే బతుకును దేవులాడుకున్న ప్రజలున్న గడ్డ తెలంగాణ. నీళ్లు చల్లనివి.. కానీ, ఆ నీటిలోనే బడబాగ్ని దాగి ఉంటుందన్నట్టుగా ఈ మట్టిలో దాగిన బడబాగ్ని తిరిగి రగిలించడానికి ఒక రాపిడి.. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి రూపంలో మొదలైంది. ‘సిపాయిల తిరుగుబాటు విఫలం అయిందని అనుకుంటే వచ్చేనా దేశానికి స్వాతంత్య్రం. రాజీలేని పోరాటమే జయిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ వచ్చితీరుతుంది’ అని ప్రతినబూని బయలుదేరిండు కేసీఆర్. దశాబ్దాల దాష్టీకాన్ని భరించలేక తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన కేసీఆర్.. తెలంగాణ కోసం దివిటీ పట్టుకొని ధిక్కార స్వరం వినిపించారు.
తెలంగాణ ఆత్మగౌరవ జెండా చేబూని పల్లెర్లమీద నడుస్తూ.. ముళ్లనూ, రాళ్లనూ ఒకొకటిగా తొలగించుకుంటూ లక్ష్యం వైపు తన జాతిని నడిపించుకుంటూ సాగారు. ఆతని తొలి అడుగుకు ఇది రజతోత్సవం. బీఆర్ఎస్ సాధించిన లక్ష్యానికి ఇది పుషర సంబురం. పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటం… పదేండ్ల దార్శనిక పాలనతో ఆయనే తెలంగాణకు చుక్కాని అయిండు. తెలంగాణ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసిండు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఆపద వచ్చిన ప్రతీసారి పిల్లలకోడై రక్షించుకున్నడు. ఇది క్రీస్తుపూర్వం చరిత్రకాదు… ఇరవైనాలుగేండ్ల చరిత్ర. అటుకులు తిన్నా… అన్నం తిన్నా.. ఉప్పిడి ఉపాసం ఉన్నా తెలంగాణకు కేసీఆరే రక్ష. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. జై తెలంగాణ..!
తెలంగాణది మహత్తరమైన పోరాటాల చరిత్ర. ప్రపంచానికే పాఠాలు నేర్పిన మహోజ్జల ఉద్యమగాథ. భారతదేశ జాతీయోద్యమాన్ని మించిన రోమాంచిత ఘట్టం. ఆరు దశాబ్దాల అణచివేత సంకెళ్లను తెంచుకున్న విజయగాథ. ఎకడినుంచి వస్తున్నామో తెలియకపోతే… ఎటుపోవాలో కూడా అర్థం కాదంటారు. చరిత్ర చదవకుండా భవిష్యత్తును నిర్మించలేం. గతం తెలుసుకోకుండా గమ్యాన్ని నిర్ణయించుకోలేం. ప్రతిజాతి తన ఘనమైన గత వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను నిత్యం గానం చేస్తూనే భవిష్యత్ తరాలకు అందిస్తుంది. అలాంటి వీరోచిత పోరుగానం తెలంగాణ ఉద్యమం.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దండియాత్ర, సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా వంటి పోరాట ఘట్టాలు ఉన్నట్టే… మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ మరపురాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ అద్భుత ఘట్టాలను సృష్టించిన చరిత్ర కేసీఆర్‌ది. బీఆర్ఎస్ పార్టీది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలంగాణ ఆరు దశాబ్దాల అణచివేత, విధ్వంసం, మూడు తరాలు పీడనకు లోనైంది. ఈ నేపథ్యంలో ఒక తరానికి ఆత్మగౌరవ పోరాటం నేర్పి తెలంగాణ విముక్తి ఎట్ల అయ్యిందో తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఈ పోరాటంలో హీరోలు ఎవరు? విలన్లు, శిఖండులు ఎవరు? ఎవరి పాత్ర ఏమిటో తెలుసుకొని మసలుకోవాల్సిన అనివార్యతలు నెలకొన్న కాలం ఇది.
శత్రువు ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉంటాడు. తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు ఇప్పుడు మళ్లీ ఏదో రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతున్నాయి. కాబట్టి, ఇది మరింత అప్రమత్తంగా అడుగులు వేయాల్సిన సందర్భం. ఆత్మగౌరవం, అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతాం. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే… తెలంగాణ ప్రయోజనాల కోసం పట్టుబట్టే వాడేలేడు. నాడు.. నేడు.. ఏనాడైనా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ఉన్న ఒకే ఒక్క ప్రతినిధి బీఆర్ఎస్. తెలంగాణ ఇంట పుట్టిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పరిరక్షకుడు కేసీఆర్.
తెలంగాణ ఉద్యమంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీచేసి, అసంతృప్తితో రగులుతున్న ప్రజలను రాష్ట్ర ఏర్పాటు దిశగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నడిపించింది. తెలంగాణ ఏర్పాటు ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాజకీయంగా బీఆర్ఎస్ విజయవంతమైంది. అయితే, అది ఒక్కరోజులో సాకారం కాలేదు. బీఆర్ఎస్ పార్టీని స్థాపించేందుకు పురికొల్పిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. నాడు వర్షాభావ పరిస్థితులు, బోర్లు, బావుల్లో నీరు లేకపోవడం రైతులను సంక్షోభంలోకి నెట్టింది.
అప్పుల భారం పెరిగిపోయి తెలంగాణ వ్యాప్తంగా 1997 2000 మధ్యకాలంలో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయం భారమై బతకలేని దుస్థితి దాపురించింది. ఇటువంటి పరిస్థితులు ఒకవైపు నెలకొంటే మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచింది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో విద్యుత్ సంసరణలు తీసుకొచ్చారు. వీటిని నిరసిస్తూ తొమ్మిది వామపక్ష సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఊరేగింపుగా వస్తున్నవారిపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
ఈ ఘటన అప్పటికే డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ను తీవ్రంగా కలచివేసింది. దీంతో 2000 సెప్టెంబర్‌లో చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతుల దయనీయ పరిస్థితిని ఆ లేఖలో కండ్లకు కట్టారు. అంతకుముందే చంద్రబాబు రూపొందించిన విజన్ 2020 డాక్యుమెంట్‌నూ కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. దళిత, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల ప్రసక్తిలేని, తెలంగాణ అభివృద్ధిని గురించి అసలు ప్రస్తావించని ఆ విజన్ డాక్యుమెంట్ తమకు 420 డాక్యుమెంట్‌తో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం బహిరంగలేఖ రాసి ఊరుకోలేదు. ఒక్క కరెంట్ చార్జీలే కాదు మొత్తం తెలంగాణ బతుకు మారాలంటే ‘ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే పరిష్కారం’ అని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
తెలంగాణ సాధనలో ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ అనేక సమరోజ్వల ఘట్టాలను ఆవిష్కరించింది. అణచివేతపై ధిక్కార బావుటాను ఎగురవేసింది. శాంతియుత పయనం సాగించింది. తెలంగాణ ఏర్పాటు ప్రకటించి, ఆ తర్వాత కేంద్రం యూటర్న్ తీసుకోవటంతో అప్పటిదాకా అనుసరించిన మార్గాలను కొనసాగిస్తూనే విప్లవాత్మక నిరసన పోరాటాలకు నాందిపలికింది. జాక్‌తో ఉమ్మడి కార్యాచరణను అమలు చేస్తూనే కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ సమయోచిత పోరాటాలను నెరపింది. రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధాలు, మానవహారాలు, సాగరహారం, మిలియన్‌మార్చ్, సకల జనుల సమ్మె తదితరాలతో తెలంగాణ తల్లికి ఉద్యమం ప్రణమిల్లి రణం చేసింది. వంటావార్పులై తెలంగాణ వ్యతిరేకులకు ముద్దదిగని అనివార్యతలు సృష్టించింది. ఆత్మబలిదానాలతో ఎడతెగని దుఃఖాన్ని దిగమింగుతూనే దిగంతాలను ఏకం చేసింది. ఒక్కో సందర్భం ఒక్కో అధ్యాయంగా నూతన పోరాట చరిత్రను లిఖించింది. 2009 నుంచి 2014 జూన్ 2 వరకు తెలంగాణ రాష్ర్టాన్ని సిద్ధించే దాక అలుపెరుగని ఆత్మగౌరవాన్ని ప్రదర్శించింది.
అంతే అప్పటికే తెలంగాణలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీడీపీలో తన సహచరులు, పలువురు కాంగ్రెస్ నాయకులతో చర్చోపచర్చలు చేశారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్, ఆర్. విద్యాసాగర్‌రావు, పురుషోత్తమరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, కేశవరావు జాదవ్, బియ్యాల జనార్దన్‌రావు సహా వివిధ రంగాల నిష్ణాతులతో సుదీర్ఘంగా మేధోమథనం జరిపారు. ఫలితంగా తెలంగాణ ప్రజల సామూహిక ప్రతీకగా కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పురుడుపోసుకునే క్షణం వరకు తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా ఉన్న జలదృశ్యంను పార్టీ కార్యాలయంగా వాడుకోవడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చారు. అలా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఆవిర్భవించింది. తెలంగాణ 10 జిల్లాల చిత్రపటంతో కూడిన గులాబీ రంగు జెండాను పార్టీ జెండాగా కేసీఆర్ ఎగురవేశారు. ఆ జెండాను తెలంగాణ తన గుండెకు హత్తుకున్నది. పార్టీ ఏర్పాటైన తొమ్మిది రోజుల్లోపే 19 లక్షల మంది సభ్యులుగా చేరారు. బీఆర్ఎస్ను తెలంగాణ అస్తిత్వ, ఆత్మగౌరవ పతాకగా భావించారని చెప్పటానికి అంతకన్నా పెద్ద సాక్ష్యం అక్కర్లేదు.
టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) పురుడు పోసుకున్న కొద్దిరోజులకే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఉద్యమమే ధ్యేయంగా వ్యూహాలు రచించి తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు (జూలై 11, 2001) చేసుకున్న తెల్లారినుంచే స్థానిక సంస్థల ఎన్నికలు.. ఫలితాలు రావడం మొదలైంది. గులాబీ జెండాను, బీఆర్ఎస్ పార్టీని ‘రాజకీయ పార్టీ’గా ఎన్నికల సంఘం గుర్తించే (ఆగస్టు 18,2001) నాటికే తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగిరింది.
తెలంగాణ భావజాలం వ్యాప్తి, రాష్ట్ర సాధన ఆకాంక్ష తీవ్రతను పల్లెపల్లెకు చేర్చాలన్న బలమైన వ్యూహంతో కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. గులాబీ జెండా.. రైతునాగలి గుర్తుతో పోటీచేసిన బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా వందలాది ఎంపీటీసీలు, 87 జడ్పీటీసీలను కైవసం చేసుకొంది. కరీంనగర్, నిజామాబాద్ రెండు జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా సగర్వంగా ఎగురవేసింది. ఒంటరిగా పోటీచేసిన ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ 25 శాతం ఓట్లను సాధించి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ సంచలన సంతకం చేసింది. అలాగే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12వేల వార్డులను గెలుచుకోవటం, 3వేల గ్రామాల్లో సర్పంచ్‌లను సొంతం చేసుకున్న బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి తొలి చారిత్రక సంతకం చేసింది.
తెలంగాణ పట్ల బలమైన విశ్వాసాన్ని కల్పించాలంటే ‘కేసీఆర్ పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు’ అని నిరూపించాలి? అందుకు తన డిప్యూటీ స్పీకర్ (మంత్రి హోదా), ఎమ్మెల్యే, టీడీపీ ప్రాథమిక సభ్యత్వం అనే మూడు పదవులను కేసీఆర్ గడ్డిపోచలా విసిరికొట్టారు. తెలంగాణ చర్చకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశారు. అధికార, రాజకీయ పదవులకు రాజీనామా చేయటమే కాకుండా ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు మరో ప్రతినబూనారు.
తెలంగాణ కోసం కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టుకున్నారే తప్ప, ఏనాడూ తెలంగాణకు కించిత్ హాని తలపెట్టలేదని గడచిన 25 ఏండ్ల చరిత్ర చెప్తున్న సత్యం. తెలంగాణ ఆత్మగౌరవమే తన ఆత్మగౌరవంగా కేసీఆర్ భావించారు. కేసీఆర్ 2006లో కూడా తెలంగాణ కోసం కేంద్రమంత్రి పదవి, ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపారు. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాదం లేదని విర్రవీగిన నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విరచిత కుట్రలను కరీంనగర్ పార్లమెంట్ ఉపఎన్నికల్లో రెండు లక్షల పైచిలుకు భారీ మెజారిటీతో గెలిచి తెగ్గోశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి బిగ్గరగా వినిపించారు.
రెండున్నర దశాబ్దాల ప్రయాణంలో ఉమ్మడి రాష్ట్రంలోనేకాదు భారతదేశ రాజకీయ పార్టీల చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని ఉప ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నదనటంలో అతిశయోక్తి లేదు. 2001లో తెలంగాణ కోసం తన నుంచి మొదలైన రాజీనామాల పరంపరను 2014లో రాష్ట్రం సాధించే దాక కేసీఆర్ వ్యూహాత్మకంగా కొనసాగించారు.
పదవుల కోసమే తెలంగాణ వాదం ఎత్తుకున్నారని, తెలంగాణ వాదం లేదని, తెలంగాణ ప్రజల్లో అసలు రాష్ట్ర ఆకాంక్ష లేదని, ఒకవేళ ఉన్నా ఒకట్రెండు జిల్లాలకే పరిమితమని… ఇలా అనేకానేక అనుమానాలను ప్రజల్లో చొప్పించడానికి ప్రయత్నించిన ప్రతీసారి ఇక్కడి ప్రజలు తమ గుండె చీల్చి తెలంగాణ పటాన్ని ఆవిష్కరించిన సందర్భాలు అనేకం. కేసీఆర్ ఒక్కరే కాదు ఆయన తయారుచేసిన ప్రతి బీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ కోసం తమ పదవులకు ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేశారు. తెలంగాణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. 2001, 2006, 2008, 2010, 2012 సాధారణంగా అయితే ఇవి సంవత్సరాలు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో సువర్ణాధ్యాయాలు.
ప్రపంచ చరిత్రలోనే ఏ నాయకుడూ.. ఏ పార్టీ ఇన్ని రాజీనామాలు చేయలేదు. పదవులను త్యజించడం, ప్రజల్లోకి వెళ్లి మరింత రాటుదేలడం రాజీనామాల వెనకున్న అపూర్వమైన వ్యూహం. ఇంకేముంది? పనైపోయిందని అనుకునేలోపే ఇంతింతై వటుడింతై విస్మయపర్చడం కేసీఆర్ అమ్ములపొదిలో అమోఘమైన అస్త్రం. పడిపోయిందని ప్రచారం జరుగుతుండగానే ఉవ్వెత్తున ఎగసి ఉప్పెన సృష్టిస్తుంది గులాబీ జెండా. 2006 కరీంనగర్ ఉప ఎన్నిక సదా స్మరించుకునే ఎత్తుగడ. శత్రువులందర్నీ ఒకచోట ఓడించిన ఆ గెలుపు చిరస్మరణీయం. వాదానికి వెయ్యి ఏనుగుల బలం.
స్వతంత్ర భారతం ఏ ఉద్యమాన్నీ అనుమతించ లేదు.. అంగీకరించనూ లేదు ఒక్క తెలంగాణ తప్ప. ఉద్యమాలు దేశ ఐక్యతకు సవాల్‌గా పరిణమిస్తాయని కేంద్రం భావించింది. 1950వ దశకం నుంచి 1970వ దశకం దాకా దేశంలో జరిగిన వివిధ ఉద్యమాలను అప్పటి ప్రభుత్వాలు అణచివేశాయి. పంజాబ్‌లో మిశ్రమపోరాటం ఫలితంగా హర్యానా, పంజాబ్‌ను ప్రత్యేక రాష్ర్టాలుగా విభజించారు. అయితే, ఇతర ఉద్యమాలు.. ఇతర రాష్ర్టాల్లో జరిగిన ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమానికి అసలు పోలికే లేదు. అతి సుదీర్ఘ కాలంగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమాన్ని భారతదేశం చూసింది. చూస్తున్నది. సామాజిక కోణంలో ఆలోచించలేదనే వాదన బలంగా ఉంది.
ఇక ఆదివాసీ, దళిత ఉద్యమాలనూ పూర్తిస్థాయిలో అనుమతించలేదు. అయితే, తమతమ రాజకీయ అవసరాల రీత్యా రిజర్వేషన్ల కల్పన పేరుతో… మరోపేరుతో వాటిని కొంతమేరకు ఇన్‌బిల్ట్ చేసుకోగలిగింది. దేశంలో అన్ని ఉద్యమాలు హింసతో ముడిపడి ఉండటం వల్ల అవి తెలంగాణ ఉద్యమం లాగా విజయతీరాలను చేరుకోలేకపోయాయి.
భారతదేశంలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలన్నిటిలో తెలంగాణ ఉద్యమం మాత్రమే విజయం సాధించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 1952లో ముల్కీ ఉద్యమం రూపంలో, ఆ తర్వాత 1969 తొలి దశ మొదలుకుని 2001లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన (దీన్నే మలిదశ అంటున్నాం) తర్వాత హింసకు తావులేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో ఉద్యమాన్ని నడిపించటం అనే వ్యూహంతో విజయం సాధించింది.
ఇది విశాల ప్రాతిపదికన, సబ్బండ వర్గాల ఆకాంక్షగా ప్రతిఫలించిన ఉద్యమం. ప్రజలందరి భాగస్వామ్యంతో జరిగిన పోరాటం. ఉద్యమ ఆకాంక్షతోపాటు ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నడిపించిన క్రమం ఆదర్శప్రాయమైంది. ప్రత్యేక రాష్ట్ర మహాలక్ష్య సాధనలో అన్ని రాజకీయ పార్టీలను బీఆర్ఎస్ ఏకం చేయగలిగింది. ఉద్యమ గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని హింసకు ఏ మాత్రం తావు లేకుండా ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకుంటూ వెళ్లటం వల్ల మాత్రమే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.
2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిననాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2014లో రాష్ర్టాన్ని సాధించేదాకా కేసీఆర్ అలుపెరగని పోరు సలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాలు, చేసిన పోరాటాలు అనన్యసామాన్యం. అనుభవాలు నేర్పిన పాఠాలతో ‘ఈసారి తెలంగాణ తిరిగి వెనక్కి మళ్లితే.. అసెంబ్లీలోనే కాదు సమాజంలోనూ తెలంగాణ పదం శాశ్వత నిషేధం’ అని గ్రహించిన కేసీఆర్ పుట్టినగడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని అవమానాలను దిగమింగారు. కాటగలిసిపోయిన తెలంగాణకు తానే చుక్కానిలా మారారు. ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వని తెలంగాణకు దేశంలో 36 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేస్థాయికి తీసుకొచ్చారు. తెలంగాణకు తాను ‘అడ్డమూ కాదు.. నిలువూ’ కాదు అన్నవాళ్లతోనే ‘జై తెలంగాణ’ అనిపించారు.
‘మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు’ అన్నవాళ్లతోనే ‘అనుకూలం’ అని లేఖ రాయించారు. ఎదుటివారి రాజకీయ అనివార్యతను తెలంగాణకు అనుకూలంగా మలచి దాన్నే తెలంగాణకు బలంగా మార్చిండు. తెలంగాణ కోసం ‘గొంగడి పురుగునైనా ముద్దాడుతా…’ అని 2004లో వరంగల్ ప్రెస్‌క్లబ్ సాక్షిగా ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యమని తేటతెల్లం చేశారు.
కరీంనగర్ వేదికగా సోనియాగాంధీ నోట తెలంగాణ అనిపించారు. 26 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలను గెలిచి పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు కేసీఆర్ బాటలు వేశారు.
పొత్తుధర్మాన్ని వీడిన కాంగ్రెస్ పార్టీ 2006లో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకొన్నది. అలా తెలంగాణ నినాదం చచ్చిపోయిందని నిరూపించే ప్రయత్నం చేసినప్పుడు నిటారుగా నిలబడి సడలిపోని పోరుసలిపారు. తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించిన టీడీపీతో 2009లో ఎన్నికల పొత్తుపెట్టుకొన్నారు. ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా అనివార్యతను కేసీఆర్ సృష్టించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే తెలంగాణ సాధ్యమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒప్పుకొంటే తెలంగాణ ఇస్తామని మెలికపెడితే… ‘ఆర్ఎస్ఎస్ టు ఆర్ఎస్యూ’ దాకా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఒప్పించేందుకు పడరానిపాట్లు పడ్డారు.
2009, నవంబర్ 29… తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ మేలిమలుపు. తెలంగాణ స్వరాష్ట్ర చరిత్రను ముందు, తర్వాతగా విభజించిన కాలరేఖ. ఢిల్లీ మెడలు వంచిన కేసీఆర్ ఆమ‘రణ’ దీక్షాస్త్రం. మహాత్ముడి బాటలో మహోన్నత సత్యాగ్రహం. చావు నోట్లో తలబెట్టిన సాహసం. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో, తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రాణాలను పణమొడ్డిన త్యాగధనుడి ఆమరణ సంతకం. కులం లేదు, మతం లేదు. ప్రతి మనిషిదీ అదే వాదం.
అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూకంపం పుట్టినట్టు, కడలి ఉప్పొంగినట్టు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు తెలంగాణ తాండవమాడింది. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసింది. విద్యార్థి లోకాన్ని ఉద్యమదారుల్లో ఉరికించింది. పల్లెపల్లెనూ స్వాభిమాన కేంద్రంగా మలిచింది. ప్రతి ఇంటిమీదా తెలంగాణ జెండా ఎగిరింది. పల్లెపల్లె వీరతిలకం దిద్దుకున్నది. ప్రజాగ్రహం బోనమెత్తింది. ఊరూరూ బతుకమ్మలాడింది. ఫలితంగా తెలంగాణ ప్రక్రియ మొదలైందని కేంద్రం డిసెంబర్ 9న ప్రకటించింది. తెలంగాణ జాతకచక్రం మారింది.
రాష్ట్ర సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తొలినాళ్ల నుంచి స్వరాష్ట్ర సాధన దాకా కేసీఆర్ తెలంగాణ అంతటా పక్షిలా తిరిగారు. ఎర్రటి ఎండ ఉన్నా.. ఎంతటి జ్వరం ఉన్నా ముందు నిర్దేశించిన కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించారు. అది పాదయాత్ర అయినా, సైకిల్ యాత్ర అయినా ఆపలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ సాగునీరు, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య కోసం పాదయాత్రలు చేపట్టారు. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ద్వారా ఉత్పన్నమైన సమస్యలపై ప్రజా చైతన్యాన్ని కూడగట్టేందుకు 2003 మే 20 నుంచి 25 వరకు మండుతున్న ఎండల్లో అలంపురం నుంచి గద్వాల వరకు ఐదు రోజులపాటు పాదయాత్ర చేశారు.
ఇదే 2003లో ఏప్రిల్ 26, 27 తేదీల్లో తీవ్ర జ్వరంతోనే రెండ్రోజులపాటు సిద్దిపేట నుంచి వరంగల్ దాకా 100 కిలోమీటర్లు సైకిల్‌యాత్ర చేపట్టారు. ఓవైపు నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతుల సాగునీటి కోసం, మరోవైపు గొంతు ఎండిన నల్లగొండ దూప తీర్చేందుకు 2003లో ఆగస్టు 25 నుంచి 30 వరకు ఆరు రోజులపాటు కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారు. ఇక కరీంనగర్ ఎంపీ అయినప్పటికీ 2006లో ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపడానికి చౌటుప్పల్, నారాయణపురం, కొత్తగూడెం, వావిళ్లపల్లి, అంతంపేట, మర్రిగూడెం, నాంపల్లి, చండూరు, కనగల్ మీదుగా నల్లగొండ వరకు పాదయాత్ర చేపట్టారు. మర్రిగూడెంలో బసచేశారు. జల సాధన సమితి నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి నాయకుడు కంచుకట్ల సుభాష్ తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ సమయంలోనే ‘చూడు చూడు నల్లగొండ.. ఎద మీద ఫ్లోరైడ్ బండ’ పాటను స్వయంగా కేసీఆరే రాశారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి విస్తృత కార్యాచరణకు నడుంకట్టారు.
బీఆర్ఎస్ పుట్టుక నుంచే తెలంగాణ సమాజం తమ ఇంటిపార్టీగా గుండెలకు అద్దుకున్న అపూర్వ సందర్భాల్లో ప్రధానమైంది 45 రోజులపాటు (నవంబర్ 25, 2002 – జనవరి 6, 2003 వరకు) ఏకబిగిన సాగిన జలసాధన ఉద్యమం. మన్నూమిన్ను తెలంగాణ వైపు చూడక తప్పని కార్యాచరణకు కేసీఆర్ ఈ ఉద్యమం ద్వారా అంకురార్పణ చేశారు. సామూహిక నిరాహారదీక్షలు, విద్యా సంస్థల బంద్, రాస్తారోకోలు, మహిళాశక్తి ప్రదర్శన, దీపాల వెలిగింపు వంటి వినూత్న నిరసన కార్యక్రమాలను బీఆర్ఎస్ చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో జలసాధన ఉద్యమానికి ప్రత్యేకత ఉన్నది.
కాంగ్రెస్, టీడీపీ ఏలుబడిలో ఛిద్రమైన తెలంగాణ జీవనచిత్రాన్ని చూసి కేసీఆర్ తల్లడిల్లారు. చేనేత కార్మికుల ఆకలిచావులను చూసి చలించిపోయారు. రైతన్నల ఆత్మహత్యలు నిత్యకృత్యంలా సాగుతున్నకాలానికి ఎదురువెళ్లి కర్షక లోకంలో ధైర్యం నింపారు. తలాపునే గోదావరి, కృష్ణమ్మలు పారుతున్నా చుక్కనీరులేక గొంతులెండుతున్న తెలంగాణ కష్టాన్ని చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో నాటి నేతన్నలు ఒకవైపు పడుగు పేకలుగా అల్లుకుపోయి కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర .. మరోవైపు ‘ఆత్మహత్యలు చేసుకోవద్దు’ అని కలెక్టర్లు గోడల మీద రాతలు. తనువు చాలిస్తున్న నేతన్నలను సాదుకున్న పాపానపోని సమైక్య పాలకుల ప్రేక్షకపాత్ర.
కండ్లుండీ చూడలేని తెలంగాణ ప్రజాప్రతినిధులు… సిరిసిల్ల, పోచంపల్లి ప్రాంతాల్లో నేత కార్మికుల ఆత్మహత్యల పరంపరకు తాళలేక కేసీఆర్ జోలెపట్టి (2002 మే 22, తదితర తేదీల్లో) విరాళాలు సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు రూ. 50వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ములుగులో బిడ్డపెండ్లి కోసం అప్పుతెచ్చిన సొమ్ము, బంగారం ఆగ్ని ప్రమాదానికి గురై కాలిబూడిద కావడంతో కన్నీరుమున్నీరైన తండాకు అన్నీతానై కేసీఆర్ అండగా నిలిచారు. కల్పన అనే గిరిజన యువతి పెండ్లికి ఆర్థిక సాయం చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి నేపథ్యం ఈ ఘట్టమే.
ఉడుకునెత్తురు ఉరకలు వేసే విద్యార్థి లోకాన్ని కేసీఆర్ పటుతరమైన వ్యూహం, ముందుచూపుతో తెలంగాణ పోరాటంలో దించారు. తెలంగాణ కోసం పల్లెలను, పట్టణాలను ఏకం చేసి అన్నివర్గాలకు బీఆర్ఎస్ అన్ని కోణాల్లో చైతన్యాన్ని దశలవారీగా నూరిపోసింది. పార్టీని స్థాపించిన ఏడేండ్లకు ఈ ప్రాంత విద్యార్థి లోకానికి తెలంగాణ రావలసిన అనివార్యతను వివరించింది. తెలంగాణ భవన్ వేదికగా 50 రోజులపాటు తెలంగాణలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 21వేల మంది విద్యార్థులకు 2007లో ఆగస్టు 11 నుంచి అక్టోబర్ 9 వరకు శిక్షణ తరగతులు నిర్వహించింది.
అక్కడినుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లో విద్యార్థి సదస్సులు నిర్వహించింది. వరంగల్ (హనుమకొండ), కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లా కేంద్రాల్లోనే కాకుండా కోరుట్ల, మహబూబాబాద్, మంచిర్యాల, గోదావరిఖని లాంటి ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ విద్యార్థి సదస్సులు జరిగాయి. వీటికి 15వేల నుంచి 50వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ప్రతీ సదస్సులో వివిధ రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అణచివేత, విధ్వంసాలను స్వయంగా కేసీఆరే వివరించారు. 2008 డిసెంబర్ 29న లక్షలాది మందితో ‘విద్యార్థి గర్జన’ పేరుతో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. 1969 ఉద్యమం చేదు అనుభవాలను పరిగణనలోకి తీసుకొని శాంతియుతంగా విద్యార్థిలోకం ఉద్యమంలో మమేకం అయ్యేందుకు కేసీఆర్ చేసిన వ్యూహం ఫలించింది. అంతేకాకుండా తెలంగాణలో అన్ని విశ్వవిద్యాలయాలు సహా విద్యా సంస్థల్లోని యువశక్తి పరిణామాత్మక, గుణాత్మక ఫలితాలను సాధించింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఈరోజున్న యువనాయకత్వం అంతా ఆ సదస్సుల్లోంచి ఎదిగిందే.
భారత స్వాతంత్య్రోద్యమంలో చరఖా, ఖాదీని గాంధీజీ ఎలా అయితే అస్ర్తాలుగా చేసుకున్నారో తెలంగాణ ఉద్యమం, ప్రత్యేకించి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మన సాంస్కృతిక చిహ్నాలను ఆయుధాలుగా మలచుకున్నది. ‘బడి పలుకుల భాష కాదు… పలుకుబడుల భాష కావాలె’ అని ప్రజాకవి కాళోజీ నినదించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కూడా ప్రజల వాడుక భాషనే తెలంగాణ వాద భాషగా చేసుకొని నాలుగుకోట్ల మందిలో భాషాభిమానాన్ని నూరిపోశారు. పదిమంది పాల్గొన్న సమావేశంలో కానీ, పదిఇరవై లక్షల మంది పోగైన భారీ బహిరంగ సభల్లోనూ తెలంగాణ యాసను కేసీఆర్ అస్త్రంగా ప్రయోగించారు. తెలుగుతల్లి తెలంగాణపై సవతితల్లి ప్రేమను కనబరచిన దరిమిలా ‘ఎవరి తెలుగుతల్లి…ఎక్కడి తెలుగుతల్లి’ అని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.
మేధావులతో కమిటీ వేసి ‘తెలంగాణ తల్లి’కి ప్రాణప్రతిష్ట జరిపారు. 2007 నవంబర్ 11న తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా బోనాలు, బతుకమ్మలు, పోతురాజులు, ఒగ్గు, డోలు, కోయ కొమ్ముబూరలు, బంజారా నృత్యాలు సహా యావత్ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలు పరవశించాయి. ప్రజాకవులు, వాగ్గేయకారులు, కవులు, కళాకారులు సాహితీవేత్తలు సృష్టించిన సాహితీసొబగులు తెలంగాణ అంతటా ఉద్యమ కుసుమాలను పూయించాయి. 2007 మార్చి 23 నుంచి ఐదు రోజులపాటు నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ సంబురాలు ‘ధూం..ధాం’ చేశాయి. ధూం.. ధాం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రవహించిన సాంస్కృతిక జీవధార ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కుట్రలను ఛేదించింది.
ఎత్తిన బోనం… పట్టిన బతుకమ్మ కనిపిస్తే చాలు అవి మన అస్తిత్వ ప్రతీకలై తెలంగాణ వ్యతిరేకుల గుండెలను చీల్చినంత పనిచేసేవంటే అతిశయోక్తికాదు. ‘వేదంలా ఘోషించే గోదావరి…’ అనే సినిమా పాట మాయలో పడి అసలు గోదావరి నది రాజమండ్రి (రాజమహేంద్రి)లోనే పుట్టిందన్నట్టుగా స్థిరపడిపోయిన స్థితిని కేసీఆర్ పటాపంచలు చేశారు. 2003లో వచ్చిన గోదావరి పుష్కరాలను ఇక్కడ ఎందుకు నిర్వహించరని కేసీఆర్ నిలదీయటం వల్ల మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ గోదావరి పుష్కరాలకు నోచుకున్నది. కేసీఆర్ దంపతులు ధర్మపురిలో పుష్కరస్నానం చేశారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రకృతి పరవశించేలా గోదావరి పుష్కరాలు జరుపుకోవటం తెలిసిందే.
పార్టీని స్థాపించిన కొద్దిరోజులకే ఉద్యమవ్యాప్తికి పార్టీ నిర్మాణం కీలకమని కేసీఆర్ భావించారు. ఈ క్రమంలో తెలంగాణలో ప్రతి మండలానికి నాటి టీఆర్ఎస్ పార్టీ ఒక బ్రిగేడియర్‌ను నియమించింది. స్వయంగా కేసీఆర్ కామారెడ్డి మండలానికి బ్రిగేడియర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో రెండు రోజులు అక్కడే బసచేశారు. మండలంలో అన్ని గ్రామాలకు పార్టీ అనుబంధ కమిటీలను కేసీఆరే ప్రత్యక్షంగా నియమించారు.
ఉద్యమంలో భాగంగా బహిరంగసభల నిర్వహణ కోసం నిధులు సమకూర్చడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొదలుకుని సమస్త గులాబీ శ్రేణులు కూలీ పనిచేశారు. అలా తెలంగాణ కోసం పనిని ఒక పవిత్రకార్యంగా చేపట్టి ఉద్యమ ఆకాంక్షను ప్రతి ఒకరిలో పాదుకొల్పింది. కూలీపనిని స్వీకరించటం, సామూహిక సమానత్వాన్ని తెలియజెప్పటం అనే మౌలిక సూత్రాన్ని బీఆర్ఎస్ ఆచరించింది. తొలిసారి కామారెడ్డి పట్టణంలోని బాంబే క్లాత్ హౌస్, దేశాయి బీడీవర్క్స్ మొదలైన చోట్ల కేసీఆర్ కూలీపని చేశారు. ఈ ప్రక్రియ బీఆర్ఎస్ నిర్వహించిన ప్రతీ సభకు ముందు ప్రతీ కార్యకర్త, నాయకుడు భాగస్వామ్యం కావడానికి స్ఫూర్తినిచ్చింది.
తెలంగాణ ఆత్మగౌరవ బావుటాగా ఎగిరిన గులాబీ జెండా స్వరాష్ట్ర ఆకాంక్షకు అద్దంపట్టింది. పార్టీ స్థాపించిన నెలలోపే 2001 మే 17న కరీంనగర్ సింహగర్జన సభ జరిగింది. మే 17న ఉదయం 10 గంటలకు జలదృశ్యం నుంచి వందలాది వాహనాలతో పార్టీ అధినేత కేసీఆర్ సహా మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, ఉద్యోగులు తమ తమ వాహనాల్లో కరీంనగర్‌కు బయల్దేరారు. దారి పొడవునా వివిధ గ్రామాలు, పట్టణాల ప్రజలు కాన్వాయ్‌ని ఆపి మరీ కేసీఆర్‌కు వీరతిలకం దిద్దారు. మంగళహారతులు పట్టారు. అడుగడుగునా ‘జై తెలంగాణ’ నినాదాలు మారుమోగుతుండగా సాయంత్రం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకున్నారు.
ముఖ్య అతిథిగా వచ్చిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధ్యక్షుడు శిబు సోరెన్.. అకడి జనసందోహాన్ని చూసి ముగ్ధులయ్యారు. రాత్రి ఏడు గంటలకు మొదలైన సభ 11 గంటల దాకా కొనసాగింది. ప్రొఫెసర్ జయశంకర్‌కు పాదాభివందనం చేసి కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రైతులు, చేనేత కార్మికుల కడగండ్లు, పెరుగుతున్న ఆత్మహత్యలు, మూసివేసిన ఫ్యాక్టరీలు, ఉద్యోగ నియామకాలు, గిరిజనుల దయనీయ స్థితిపై నిప్పులు చెరిగారు.
సీమాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణితో పాలకులు ఏవిధంగా వ్యవహరిస్తున్నారో కండ్లకు కట్టారు. రామగుండంలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రప్రభుత్వం మూసివేయడానికి ఒప్పుకొని, డీలాపడిన విశాఖపట్నం ఉకు కర్మాగారం మూతపడకుండా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఏకరువుపెట్టారు. అలా స్వరాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసి సింహగర్జన సభ తెలంగాణ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది.
కరీంనగర్ సింహగర్జన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలో బీఆర్ఎస్లాగా బహిరంగ సభల ద్వారా ప్రజలను ఉద్యమోన్ముఖులను చేసిన పార్టీ మరొకటి లేదంటే అతిశయోక్తికాదు. 2001లోనే కరీంనగర్ సింహగర్జనతోపాటు 2001 జూన్ 1న మహబూబ్‌నగర్‌లో, 2న నల్లగొండలో, 4న నిజామాబాద్‌లో, 5న నిర్మల్‌లో, 21న వరంగల్‌లో భారీ సభలు నిర్వహించింది. అన్ని సభల్లోనూ కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేదాకా తాను మడమ తిప్పనని శపథం చేశారు. ఒకవేళ తాను ఉద్యమానికి ద్రోహం చేస్తే ‘రాళ్లతో కొట్టిచంపండి’ అని తెలంగాణ ప్రజల చేతిలో తన ప్రాణాలను పెట్టారు. 2003 జనవరి 6న హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ‘తెలంగాణ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత ఏప్రిల్ 27న వరంగల్‌లో ‘తెలంగాణ జైత్రయాత్ర’ పేరుతో భారీ బహిరంగ సభ జరిపారు. దీనికి 15 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
ఈ జనసంద్రాన్ని చూసి సభకు అతిథులుగా వచ్చిన మాజీ ప్రధాని దేవేగౌడ, అజిత్‌సింగ్ వంటి నాయకులు అచ్చెరువొందారు. కేసీఆర్ పోరాటానికి, ప్రజల బలమైన ఆకాంక్ష జత కలవడంతో తెలంగాణ రాష్ట్రం తప్పక సిద్ధిస్తుందని ఆశించారు. అదే సంవత్సరం జిల్లా కేంద్రాల్లోనే కాకుండా కొల్లాపూర్ కోలాహాలం, నాగర్‌కర్నూల్ నగారా, సింగూరు సింహగర్జన, ఓరుగల్లు వీరగర్జన, కరీంనగర్ కదనభేరి, ఇందూరు కదిలింది, ఖమ్మం పోరుసభ, పోలవరం గర్జన, తెలంగాణ ఆత్మగౌరవ సభ, తెలంగాణ, సూర్యాపేట శంఖారావం ఇలా ఒకటా రెండా తక్కువ వ్యవధిలోనే కేసీఆర్ తాలూకా కేంద్రాల్లోనూ భారీ బహిరంగసభలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యతను ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేశారు. 2001లో మొదలైన బీఆర్ఎస్ బహిరంగ సభల భేరీ కేసీఆర్ ఆమరణదీక్షతో దిగివచ్చిన కేంద్రం 2009 డిసెంబర్ 9వతేదీన ప్రకటించింది. కానీ, పక్షం రోజుల్లోపే మాట వెనక్కి తీసుకోవడంతో డిసెంబర్ 16న వరంగల్ వేదికగా ‘తెలంగాణ మహాగర్జన’ చేశారు. దాదాపు 25లక్షల మంది ఈ సభకు హాజరయ్యారు. గాంధీజీ దండియాత్ర, మార్టిన్ లూథర్‌కింగ్ పోరాటం వంటి మహాపోరాటాలతో పోల్చదగిన సభగా, ప్రపంచంలోని పది మహాజన సమ్మేళనాలతో ఈ మహాగర్జనను పోలుస్తూ నూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని సైతం ప్రచురించటం తెలంగాణ ధిక్కార ప్రకటనకు తార్కాణం.
కేసీఆర్ ఆమ‘రణ’దీక్షతో దిగివచ్చిన కేంద్రం సీమాంధ్ర నేతల చేష్టలకు, ప్రలోభాలకు తలొగ్గింది. 2009 డిసెంబర్ 9 ప్రకటనపై డిసెంబర్ 23న యూటర్న్ తీసుకున్నది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అని కేంద్రం ప్రకటించిన సంతోషం 13 రోజులైనా మిగలలేదు. కేంద్రం ప్రకటించిన మరుక్షణమే మరోఆలోచన లేకుండా రాజకీయ పట్టుదలకు పోకుండా, చాంపియన్‌షిప్ కోసం పోటీపడకుండా, భేషజాలకు పోకుండా కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఇంటికి వెళ్లారు. ‘ఇప్పటిదాకా తెలంగాణ కోసం ఏమేం చేయాలో అన్నీ చేశాం. అటుపక్క (సీమాంధ్ర ప్రాంత నేతలు) అంతా ఒక్కటయ్యారు. ఇంత జరుగుతున్నా మీరు (కాంగ్రెస్) ఏమీ పట్టనట్టు ఉంటే మంచిది కాదు.
తెలంగాణ కోసం అందరం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అనివార్యతలు నెలకొన్నాయి. ఇప్పటికైనా ఒక్కటిగా కదలకపోతే తెలంగాణ భవిష్యత్ తరాలు క్షమించవు’ అని తేల్చిచెప్పిన కేసీఆర్ అదే రోజు రాజకీయ జేఏసీని ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. ఆ తెల్లారే డిసెంబర్ 24న హైదరాబాద్‌లోని కళింగ ఫంక్షన్హాల్లో తొలి జాక్ సమావేశం నిర్వహించారు. ఉద్యమపార్టీగా, కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు నాయకత్వం వహించిన పార్టీగా నాటి బీఆర్ఎస్ జాక్ కార్యాచరణకు పెద్దన్నపాత్ర పోషించింది.
స్థానిక కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కలిసిరాకపోయినా, జాక్లోనే ఉంటూ దాని విచ్ఛిన్నానికి టీడీపీ కుట్రలు పన్నినా (జాక్ కొద్దిరోజులకు టీడీపీని బహిష్కరించింది), బీఆర్ఎస్ పార్టీ సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలతోపాటు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు సహా తెలంగాణ సబ్బండ సమాజాన్ని కలుపుకొని ఉద్యమాన్ని నడిపించింది. తెరవెనుక ఉంటూ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ తెరముందు ఉమ్మడి కార్యాచరణ విజయవంతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన ‘లక్ష్య’కవచంగా నిలబడింది.
జాక్‌లోని కొన్ని భాగస్వామ్య పక్షాలు అప్పుడప్పుడూ రాగద్వేషాలు సృష్టించాలని చూసినా.. ఉద్యమాన్ని హింసవైపు మరల్చే తాత్కాలిక ఆవేశ కార్యాచరణకు దిగుదామని చెప్పినా…1969 అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఉద్యమం పొరపాటున హింసవైపు మళ్లితే తెలంగాణ పదమే డిక్షనరీలో వెతుక్కోవాల్సిన దయనీయ దుస్థితి నెలకొనే ప్రమాదం ఉంటుందని కేసీఆర్ గ్రహించారు. దీంతో హింస దిశగా కార్యాచరణ లేకుండా గాంధేయ మార్గంలోని పోరాట పంథానే అనుసరించారు. తుదకు ఆ వ్యూహమే తెలంగాణను విజయతీరాలకు చేర్చింది.
ప్రభుత్వాలకు ప్రజల యోగక్షేమాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని, పాలకుడి దక్షతను ఉన్నతాధికారులు బేరీజు వేసి చూసుకోవటం పరిపాటి. ప్రజల కోణంలో పాలించటం, ప్రజల అవసరాలు తీర్చటం అన్నదే పాలకుల ధర్మంగా కేసీఆర్ బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు. కేసీఆర్ పాలనాదక్షతకు జిల్లాల పునర్విభజన, సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ కీర్తిని ఆకాశమంత ఎత్తుకు నిలిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, శాంతిభద్రతల్లో మేటిగా నిలిచే కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకో మెడికల్ కాలేజి, దేశ వ్యవసాయ రంగ ముఖచిత్రానికి మార్గదర్శిగా నిలిచిన రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్… ఇలా అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపారు.
ఫలితంగా తలసరి ఆదాయంలో జాతీయ సగటుకన్నా రెండు రెట్లు సాధించటం, సగటు విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్‌గా తెలంగాణ నిలవటం, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలపటం, టీఎస్ ఐపాస్ ద్వారా నూతన పారిశ్రామిక విధానం ఇలా అనేక రంగాల్లో తెలంగాణను బీఆర్ఎస్ అగ్రస్థానానికి చేర్చింది. ఈ నేపథ్యంలో వీటినీ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంరంభం వేడుకగా తెలంగాణలో ప్రతి వ్యక్తికీ చేర్చాలని పార్టీ భావిస్తున్నది.
2001లో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి దాకా బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. అసలు ఈ పార్టీ కొసెళ్లదని…‘మఖలో పుట్టి పుబ్బలో పోతది’ అని, పదవుల కోసమే కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తిండని సీమాంధ్ర నాయకులే కాకుండా వారి ఆధిపత్యంలో ఉన్న ఈ ప్రాంతంలో అన్ని స్థాయుల్లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నేతలు నిందలు వేశారు. చంద్రబాబు ఎత్తులతో చిక్కిశల్యమైన కాంగ్రెస్ పార్టీ 2004లో బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవటం వల్ల ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాదం లేదని నిరూపించేందుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నకాలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ను నిట్టనిలువునా చీల్చారు. పరిస్థితిని పసిగట్టిన కేసీఆర్ 2006లో కేంద్ర మంత్రిపదవికి, కరీంనగర్ ఎంపీ సభ్యత్వానికీ రాజీనామా చేశారు.
సమరశంఖం పూరించారు. అలాగే 2009లో టీడీపీ బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకొన్నది. కానీ, పొత్తుధర్మానికి వెన్నుపోటు పొడిచి వరంగల్ లోక్‌సభ, నర్సంపేట అసెంబ్లీ సహా అనేక చోట్ల అభ్యర్థులను నిలిపింది. తెలంగాణ వాదం లేదని నిరూపించే ఎత్తుగడ వేసింది. అంతేకాదు ఆఖరికి తెలంగాణ ఆవిర్భవించి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా… టీడీపీ తన విచ్ఛిన్నకుట్రలను ‘ఓటుకు నోటు కేసు’ సాక్షిగా కొనసాగించింది. ఈ కేసుతో తెలంగాణ రాష్ర్టాన్నే విఫల ప్రయోగంగా దేశం ముందు నిలపాలనే కుతంత్రాలను చూశాం.
బీఆర్ఎస్ను లేకుండా చేద్దామని, కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణకు దూరం చేద్దామనే ప్రయత్నాలు అవతలివైపు జరిగిన ప్రతీ సందర్భంలోనూ తెలంగాణ నిట్టనిలువు ప్రతిరూపంగా బీఆర్ఎస్ సింహనాదం చేస్తూనే ఉన్నది. ‘మఖలో పుట్టి పుబ్బలో పోతది’ అని శాపనార్థాలు పెట్టినా బీఆర్ఎస్ తన 25 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నది. గులాబీ జెండా ఎగిరిందన్న అక్కసుతో చంద్రబాబు సర్కార్ జలదృశ్యాన్ని విధ్వంసం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి కిరాయికి ఇల్లు ఎవరూ ఇవ్వకుండా, అసలు షెల్టరే ఇవ్వకుండా కుట్రలు చేసినప్పుడు తన ఇంటినే పార్టీ కార్యాలయంగా కేసీఆర్ ఎంచుకున్నారు.
హైదరాబాద్, నందినగర్‌లో ఉన్న కేసీఆర్ ఇల్లే గులాబీ అడ్డాగా మారింది. తర్వాత ఎమ్మెల్యే కాలనీలో కొంతకాలం… ఆ తర్వాత 2006 ఏప్రిల్ 24న తెలంగాణ భవన్‌కు భూమిపూజ.. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆగస్టు 14న ప్రారంభోత్సవం చకచకా జరిగిపోయాయి. 60 లక్షల మంది సభ్యులు… రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలతో బలమైన రాజకీయ వ్యవస్థగా కొనసాగుతున్నది. అంతేకాదు దేశంలో ప్రతీ కార్యకర్తకు ప్రమాదబీమా సౌకర్యాన్ని క్రమం తప్పకుండా కల్పిస్తున్న ఒకే ఒక్క పార్టీగా బీఆర్ఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్‌కు రావటానికి దాదాపు రెండేండ్ల ముందే ఢిల్లీలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, సాగునీటి రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావుతో కేసీఆర్ జరిపిన మేథోమథనంలో పుట్టిన పథకమే..మిషన్ కాకతీయ. శతాబ్దాలుగా తెలంగాణ పల్లెల ఆర్థిక, ప్రజాస్వామిక ప్రగతికి చెరువు ఆదరువుగా ఉన్నది. అటువంటి చెరువులను ఉమ్మడి పాలకులు ధ్వంసం చేశారు.
‘గంగాళంలా ఉన్న చెరువులు తాంబాలంలా అయ్యాయి. నిర్లక్ష్యం, వివక్షకు ఇంతకన్నా పెద్ద ఉదహరణ ఏం కావాలి?’ అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ఊరూరా నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో వందల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46 వేల చెరువులను పునరుద్ధరించటమే లక్ష్యంగా మిషన్ కాకతీయ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. 2015 మార్చి 12న కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువులో పూడిక తీసి కేసీఆర్ ఈ విశిష్ట పథకానికి నాంది పలికారు.