ఉద్యమ శిఖరం కేసీఆర్. పాలనా సౌధం కేసీఆర్. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన అంతరంగం తెలంగాణ. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు కేసీఆర్ పయనం అనన్య సామాన్యం. స్వరాష్ట్రంలో ఆయన సాగించిన పదేండ్ల సుపరిపాలన ఓ సువర్ణ అధ్యాయం. పాతికేండ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో కేసీఆర్ తరచూ ‘ఆరంభింపరు నీచ మానవులు..’ అనే పద్యాన్ని ఉటంకించేవారు. అవును ఆయన కార్య సాధకుడు. అనుకున్న లక్ష్యం సాధించే వరకూ విశ్రమించని ధీరుడు. అందుకున్న లక్ష్యాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టిన అరుదైన నాయకుడి వ్యక్తిగత ఆసక్తులు కూడా వినూత్నమే!
కేసీఆర్‌కు ఇష్టమైన వ్యాపకం వ్యవసాయం. సాగుబడిలో ప్రయోగాలు చేయడమంటే ప్రీతి. గతంలో కలర్ క్యాప్సికం, ఆలు, అల్లం.. ఇలా వివిధ పంటల్లో ప్రయోగాలు చేశారు. వాణిజ్యపంటలపై దృష్టి పెడతారు. కారు డ్రైవింగ్ కూడా కేసీఆర్‌కు ఇష్టమైన వ్యాపకాల్లో ఒకటి.
నాటుకోడి, టమాటా పప్పు, రోటి పచ్చడి, పచ్చిపులుసు అంటే ఇష్టం. పదార్థం ఎంత రుచిగా ఉన్నా.. మితంగా తినడమే ఆయనకు అలవాటు. తెలంగాణ రాష్ట్రం సాధించడమే తన జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలని తరచూ చెబుతుంటారు.
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. అడపాదడపా సతీమణి శోభమ్మకు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు ఇస్తుంటారు. ఓసారి ఆన్లైన్లో చీరలు ఆర్డర్ చేసి మరీ ఆశ్చర్యపరిచారు. జేమ్స్‌బాండ్ సిరీస్ సినిమాలంటే ఇష్టం. షోలే, ఆరాధన, సాగరసంగమం, స్వాతిముత్యం ఫేవరెట్ సినిమాలు. పెద్ద ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు ఇష్టంగా చూస్తారు.
కేసీఆర్‌కు నచ్చిన పుస్తకం ‘ఓల్గా నుంచి గంగకు’. రాహుల్ సాంకృత్యాయన్ హిందీలో రాసిన ‘ఓల్గా సే గంగా తక్’ పుస్తకాన్ని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సత్యనారాయణరాజు తెలుగులో అనువదించారు.
తెలుపు, మెరూన్ రంగులను ఎక్కువగా ఇష్టపడతారు. అబిడ్స్‌లోని మెట్రో ఫుట్‌వేర్‌లో చెప్పులు కొనుగోలు చేస్తుంటారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉండే శ్రీసాయి ఖాదీ వస్ర్తాలయంలో దుస్తులు కొనుగోలు చేస్తారు. యాభై ఏండ్లుగా అక్కడ ఉండే టైలర్‌తోనే తన దుస్తులు కుట్టించుకుంటున్నారట.
తనకు సంబంధించినంత వరకు రాజకీయాలు అంటే ఒక టాస్క్ అంటారు కేసీఆర్. అదే ఆయనను దేశ రాజకీయాల్లో విలక్షణ నేతగా నిలబెట్టింది. నిరంతర అధ్యయనం, సునిశిత పరిశీలన కేసీఆర్‌ను గొప్ప రాజకీయవేత్తగా మాత్రమే కాదు, అద్భుతమైన వక్తగా, అరుదైన వ్యక్తిగా నిలబెట్టాయని ఆయన్ను దగ్గరగా చూసినవాళ్లు చెబుతుంటారు.
అటజని గాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్