పరీక్షల జనవరి చివరికి వచ్చిందంటే విద్యార్థి లోకం బెంబేలెత్తిపోతుంది. ఏడాదంతా పడిన కష్టానికి ఫలితం పొందడానికి నెలన్నర రోజుల గడువు మిగిలి ఉంటుంది. పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు పిల్లలు. అర్థం కాని సబ్జెక్టు బుర్ర వేడెక్కిస్తుంది. గుర్తుకురాని ఫార్ములాలు మతి చెదరగొడతాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా.. ఏడాదంతా గమ్మున ఉన్న పేరెంట్స్ రంగప్రవేశం చేసి పరిస్థితులను మరింత గంభీరంగా మార్చేస్తుంటారు. ఫలితం.. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ, పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోతుంటుంది.
సీజన్ వచ్చేసింది. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు వాటికి సన్నద్ధమవుతున్నారు. గతంలో కంటే విద్యార్థులపై ఇప్పుడు చదువుల భారం పెరిగింది. ఈ పోటీ ప్రపంచంలో ముందు ఉండటం కోసం పిల్లలు మరింతగా కష్టపడాల్సి వస్తున్నది. ఆశించిన రీతిలో మార్కులు రాకపోతే తల్లిదండ్రుల ప్రేమను పొందలేమోనన్న ఆందోళన పిల్లలకు కలుగుతున్నది. స్కూల్లో ఉండే ఒత్తిడితోపాటు పేరెంట్స్ ఆకాంక్షలు నెరవేరుస్తామో, లేదో అనే ఆలోచన పిల్లల్లో మరి కొంచెం ఒత్తిడిని పెంచుతున్నది. ఇది వారి ప్రిపరేషన్ మీద, పరీక్షలు రాసే విధానం మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. రెండేండ్ల క్రితం నిర్వహించిన ఒక సర్వేలో తల్లిదండ్రుల ఆకాంక్షలు తమకు పరీక్షలపైన ఒత్తిడి పెంచుతున్నాయని 40 శాతం మంది విద్యార్థులు తెలపడం గమనార్హం. అందుకనే ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించొచ్చు. తద్వారా వారు పరీక్షల్ని సమర్థంగా ఎదుర్కొనేట్లుగా తీర్చిదిద్దవచ్చు. తల్లిదండ్రులు కొన్ని సూచనలను పాటిస్తే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా నివారించవచ్చు.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261