సైకో ఇచ్చిన వన్ మినిట్ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు ఇన్స్పెక్టర్ రుద్ర.ఇంతలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ఓ పిల్లాడు వేలాడుతున్నట్టు రుద్రకు సమాచారం వచ్చింది. దీంతో టీమ్‌తో అక్కడికి ప్రయాణమయ్యాడు.
దారిలో వెళ్తున్న రుద్రకు ‘ఆ పిల్లాడిని మామూలుగా వదిలేస్తే కిక్ ఏముంది చెప్పు??’ అన్న సైకో మాటలే మెదడులో గిర్రున తిరుగుతున్నాయ్. అంటే, నెక్ట్స్ విడిచిపెట్టే పిల్లాడిని అంత ఈజీగా సైకో వదిలిపెట్టడని అర్థమైపోయింది. పది నిమిషాల్లో దుర్గం చెరువు వచ్చింది. కేబుల్ బ్రిడ్జి మీదినుంచి ఓ పెద్ద సంచిలో ఓ పిల్లాడిని ఎవరో వేలాడదీశారు. అయితే, సంచిలో ఎలాంటి కదలికలూ కనిపించలేదు. బ్రిడ్జి మీదినుంచి వేలాడుతున్న పిల్లాడిని ఎందుకు పైకి లాగలేదని రుద్ర అక్కడ ఉన్న సిబ్బందిని గద్దించాడు. దీంతో సంచికి కట్టిన తాడు మొదట్లో ఓ లెటర్ అతికించి ఉందన్న విషయాన్ని రుద్రకు చెప్పారు అక్కడి కానిస్టేబుల్స్. బ్రిడ్జ్ మీదికి ఏ వాహనాలూ రాకుండా ట్రాఫిక్‌ను మళ్లించి ఆ లెటర్ చదవడం ప్రారంభించాడు.
‘హలో రుద్రా.. పిల్లల్లో ఒకడిని ఈ సంచిలో పెట్టి వేలాడదీసింది నేనే. సీసీటీవీ ఫుటేజీ వగైరా అంటూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా నేను ఇచ్చే రెండు పజిల్స్‌ను నిమిషంలో సాల్వ్ చెయ్యి. ఒకవేళ జవాబు తప్పుగా చెప్పినా లేక, ఇన్‌టైమ్‌లో ఆన్సర్ చేయలేకపోయినా.. పిల్లాడికి కట్టిన తాడు దానంతట అదే ఊడిపోతుంది. పిల్లాడు అంతెత్తు నుంచి నీటిలో పడిపోతాడు. పాపం.. మత్తులో ఉన్నాడు కదా.. ఈత కొట్టే అవకాశం కూడా ఉండదు. మరో విషయం.. నీ పోలీసు బుద్ధితో ఇప్పుడే పిల్లాడిని విడిపించుకోవాలని చూస్తావేమో! ఆ ప్రయత్నం చేస్తే.. అబ్బాయే కాదు.. మొత్తం బ్రిడ్జి పేలిపోతుంది. మరి ఈ ‘ఆపరేషన్ దుర్గం చెరువు’ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తావా?’ అంటూ లెటర్ ముగించాడు సైకో.
ఇంతలో ఆకాశం నుంచి ఓ డ్రోన్ ద్వారా ఓ లెటర్ రుద్ర ముందు పడింది. దాన్ని తెరిచి చదవడం ప్రారంభించాడు రుద్ర. ‘మిస్టర్ రుద్రా.. ఇప్పుడు టైమ్ రాత్రి 10.20 గంటలు. 10.30 గంటల నుంచి 10.31 గంటల వరకూ అంటే ఒక్క నిమిషంలో నేను అడిగే పజిల్‌కు నువ్వు ఆన్సర్ చేయాలి. క్వశ్చన్లు సరిగ్గా 10.30 గంటలకు ఈ డ్రోన్ నుంచి ఓ లెటర్ రూపంలో కింద పడతాయి. నువ్వు ఆన్సర్స్‌ను డ్రోన్లోని వాయిస్ రికార్డర్‌కు వినిపించేంత గట్టిగా ఒక్క నిమిషంలో చెప్పాలి. సమాధానం కరెక్ట్ అయితే.. పిల్లాడు, బ్రిడ్జి రెండూ సేఫ్.. లేదంటే.. పిల్లాడు, బ్రిడ్జ్ రెండూ ఫినిష్! వెయిట్ ఫర్ మై క్వశ్చన్స్’ అని రాసి ఉంది. దీంతో రుద్ర హార్ట్‌బీట్ మరింతగా పెరిగింది.
సమయం.. రాత్రి 10.30 గంటలు. డ్రోన్ నుంచి ఓ లెటర్ కిందపడింది. అందులో ఇలా ఉంది.. ‘రుద్రా.. మొదటి ప్రశ్న.. సునందకు నలుగురు కూతుళ్లు. ప్రతీ కూతురికి ఒక బ్రదర్ ఉన్నాడు. ఇప్పుడు సునందకు ఎంతమంది పిల్లలు ఉన్నారో.. సంచిలో ఉన్న ఈ అబ్బాయి ఇంట్లో కూడా అంతమంది ఉంటారు. ఈ అబ్బాయి ఎవరి కొడుకు? రెండో ప్రశ్న.. కుడి చెయ్యి చేసే ప్రతీ పనిని.. ఎడమ చెయ్యి కూడా చేయగలదు. అయితే ఒక్కపని తప్ప. అదేంటో గట్టిగా అరిచి చెప్పు’ అని ఉంది. ప్రశ్నలు చదవడానికే అర నిమిషం పూర్తయింది. దీంతో అప్రమత్తమైన రుద్ర.. ఐదుగురి పిల్లల పేరెంట్స్‌ను వెంటనే పిలిచి.. ఎవరింట్లో ఎంతమంది ఉంటారో అడిగాడు. మొదటి వ్యక్తి 8, రెండో వ్యక్తి 9, మూడోవ్యక్తి 5, నాలుగో వ్యక్తి 6, ఐదో వ్యక్తి ఏడుగురు అని సమాధానం చెప్పారు. దీంతో సంచిలో ఉన్న పిల్లాడు ఎవరి కొడుకో రుద్ర గట్టిగా అరిచి చెప్పాడు. ఇంకో పది సెకండ్ల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. కుడి చెయ్యి-ఎడమ చెయ్యి పజిల్‌కు ఆన్సర్ ఏంటో రుద్రకు స్ఫురించట్లేదు. ఏమైతుందోనని అంతా ఒకటే టెన్షన్. ఇంతలో ఏదైతే అదైందని తాను అప్పటికప్పుడు అనుకొన్న ఆన్సర్‌ను గట్టిగా అరిచి చెప్పాడు రుద్ర. అయితే, గాలి గట్టిగా వీయడంతో వాయిస్ రికార్డర్‌కు ఆ శబ్దం వినబడలేదు. దీంతో మరో మూడు సెకండ్లు ఉందనగా.. రుద్ర మళ్లీ గట్టిగా అరిచి రెండో పజిల్ ఆన్సర్ చెప్పాడు. టైమ్ పూర్తయ్యింది. తాను చెప్పిన ఆన్సర్లు కరెక్ట్.. అవునా? కాదా? అని రుద్రతో పాటు అందరూ టెన్షన్‌తో ఎదురు చూస్తున్నారు.
రెండు నిమిషాల తర్వాత మరో డ్రోన్ అక్కడికి వచ్చి ఓ లెటర్‌ను కిందకు విసిరేసింది. ‘బ్రిలియంట్ రుద్ర. నా రెండు పజిల్స్‌కు నువ్వు కరెక్ట్‌గా ఆన్సర్ చేశావ్. సో.. ఆపరేషన్ దుర్గం చెరువు సక్సెస్. ఇక ఈ పిల్లాడిని నువ్వు తీసుకెళ్లొచ్చు. అయితే, ఈ పిల్లాడిని నువ్వు వాళ్ల ఇంటికి తీసుకెళ్తావా? లేక శ్మశానానికా? మరిన్ని వివరాల కోసం.. నీ మొబైల్లో మెసేజ్ చూడు’ అని ఆ లెటర్లో ఉంది. అది చదవగానే రుద్ర కాళ్లకింద భూకంపం వచ్చినంత పనైంది. అంతలోనే ఓ ఇంటర్నెట్ స్పామ్ నంబర్ నుంచి అప్పుడే రుద్ర ఫోన్‌కు మెసేజీ డెలివరీ అయ్యింది. కంగారుగా ఓపెన్ చేశాడు రుద్ర.
‘హాయ్ రుద్రా.. టెన్షన్ అంటే ఏంటో మొదటిసారి చూస్తున్నావా? ఇది జస్ట్ ఫస్ట్ రౌండ్ మాత్రమే. అసలు ఆట ముందు ఉంది. ఈ పిల్లాడికి నేను ఓ ఇంజెక్షన్ ఇచ్చా. అయితే, ఎలాంటి విషాన్ని, మందును, కనీసం నీళ్లను కూడా నేను ఆ బాబు ఒంట్లోకి ఎక్కించలేదు. అయినప్పటికీ కొద్దిసేపట్లో అతను చనిపోతాడు. అసలేం జరిగిందో టెస్టులు చేసి డాక్టర్లు తెలుసుకొనే లోపే పిల్లాడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అందుకే, ఈ బాబును డైరెక్టుగా శ్మశానానికి తీసుకుపో.. లేదు. కాపాడతా అంటావా? అయితే, నా ఇన్ఫర్మేషన్లోనే ఆన్సర్ ఉంది. దమ్ముంటే కాపాడుకో’ అని ఆ మెసేజీలో ఉంది. దీంతో కంగారు పడిపోయిన రుద్ర.. హుటాహుటిన పిల్లాడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. టెస్టులకు సమయం పడితే, పిల్లాడి ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన రుద్ర.. సైకో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను డీకోడ్ చేసి అసలు సమస్యేంటో డాక్టర్స్‌కు చెప్పాడు. దీంతో ఆ డైరెక్షన్లోనే టెస్టులు చేసిన వైద్యులు సమస్య అదే అని కనిపెట్టారు. సకాలంలో వైద్యం చేయడంతో పిల్లాడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇంతకీ, సైకో అడిగిన రెండు పజిల్స్‌కు సమాధానమేంటి? పిల్లాడికి సైకో ఏ ఇంజెక్షన్ ఇచ్చినట్టు? దాన్ని రుద్ర ఎలా కనిపెట్టినట్టు??
సమాధానం:
మొదటి పజిల్లో సునందకు నలుగురు కూతుళ్లు అని సైకో చెప్పాడు. ప్రతీ కూతురికి ఒక బ్రదర్ అని కూడా చెప్పాడు. అంటే ఈ లెక్కన సునందకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. అంటే సునందకు మొత్తం ఐదుగురు సంతానం. మూడో వ్యక్తి ఐదుగురు అన్నాడు. అంటే అతనే పిల్లాడి తండ్రి. ఇక, రెండో పజిల్లో కుడి చెయ్యి చేసే ప్రతీ పనిని.. ఎడమ చెయ్యి కూడా చేయగలదు. అయితే ఒక్కపని తప్ప అని సైకో అడిగాడు. ఎడమ చెయ్యి తన మోచేతిని తాకలేదు. అయితే, కుడి చెయ్యి ఎడమ చెయ్యి మోచేతిని తాకగలదు. ఇదే ఆన్సర్. దీన్ని రుద్ర కరెక్ట్‌గా చెప్పాడు. ఇక, ఎలాంటి విషాన్ని, మందును, కనీసం నీళ్లను కూడా లేని ఇంజెక్షన్‌ను పిల్లాడికి ఇచ్చానని సైకో చెప్పాడు. అంటే పిల్లాడికి సైకో ఎయిర్ ఎంబ్లాయిజమ్ (రక్త నాళాల్లోకి గాలిని ఎక్కించడం) చేశాడని రుద్ర కనిపెట్టాడు. డాక్టర్లకు ఆ విషయాన్ని చెప్పడంతో సకాలంలో చికిత్స అంది పిల్లాడు బతికి బయటపడ్డాడు….
-రాజశేఖర్ కడవేర్గు