‘మిషన్ డోలో’ తొలి దశ చైనాలో ఎగ్జాక్ట్‌గా ఎక్కడ యాక్టివేట్ అవుతుందో తెలుసుకోవడానికి కంచిలోని వరదరాజ పెరుమాళ్ టెంపుల్‌కు చేరుకొన్నారు ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్. అప్పటికే పరిస్థితిని వివరించడంతో తమిళనాడు ప్రభుత్వం, ఆలయాధికారులు ఆలయంలో భక్తులను ఖాళీ చేయించారు. అలాగే రుద్ర అండ్ టీమ్‌కు ఆలయ సిబ్బంది సహాయాన్ని అందించారు.
గర్భగుడిలోకి వెళ్లిన రుద్ర అండ్ టీమ్.. స్వామి వారి పాదాల దగ్గర వెతకడం ప్రారంభించారు. అయితే గర్భాలయంలో లైట్లు లేవు. మూలవిరాట్టుకు ఇరువైపులా వేలాడదీసిన దీపమాలలు మాత్రమే ఉన్నాయి. దీంతో వెలుతురు చాలా తక్కువగా ఉన్నది. ఏమీ కనిపించకపోవడంతో అప్పటికే తనతో తెచ్చుకొన్న టార్చిలైటును వేయబోయాడు హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి. అయితే, వెంటనే వారించిన అక్కడి పూజారులు.. ఆగమ శాస్త్రం ప్రకారం నిషిద్ధమని ఆ ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. రామస్వామిని వద్దంటూ సంజ్ఞ చేసిన రుద్ర.. మరింత తీక్షణంగా వెతుకుతుండగా.. ‘సార్.. వేకువజాము నుంచి రాత్రి వరకూ ఇక్కడ ఉండేది మేమే. మమ్మల్ని దాటుకొని ఎవ్వరూ ఇక్కడకు రాలేరు. అలాంటిది, ఇక్కడ ఏదో పెట్టారంటే మాత్రం నమ్మడానికి విడ్డూరంగా ఉంది’ అంటూ ఓ పూజారి పూర్తి చేశాడో లేదో.. స్వామి పాదాల మీద అలంకరించిన ఓ పూల దండలోని దారానికి ఓ కాగితం చుట్టుకొని ఉన్నట్టు రుద్ర గ్రహించాడు. వెంటనే దాన్ని తీసుకొని గర్భాలయం నుంచి బయటకు వచ్చి తెరిచి చదివాడు.
‘ఈ కాగితం విగ్రహం దగ్గరకు ఎలా వచ్చిందని ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేసుకోకు. మిషన్ డోలోను ఆపే ప్రయత్నాలను మొదలుపెట్టు. అది జరగాలంటే ఈ గుడిలోనే అత్యంత ఖరీదైన విషపూరిత వస్తువు ఒకటి ఉన్నది. దాని దగ్గరకు వెళ్లి నిలబడి జాగ్రత్తగా పైకి చూడు’ అంటూ ఆ కాగితంలో రాసి ఉంది. దాన్ని చదవడం పూర్తి చేయగానే, రుద్ర ఏదో ఆలోచనలో పడ్డాడు. అప్పటికే సీసీటీవీ ఫుటేజీ తీసుకొచ్చిన ఆలయ సిబ్బంది.. స్వామి వారి పాద పూజ చేయడానికి ఓ జంట ఆ దండను సమర్పించిందని, అందులోనే ఈ కాగితం ఉన్నట్టు చెప్పారు. ఆ జంటను కూడా ప్రశ్నించామని, అయితే, తమకు ఏమీ తెలియదని చెప్పినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆ జంట ఈవో ఆఫీసులో ఉన్నట్టు పేర్కొన్నారు.
‘వాళ్ల సంగతి తర్వాత చూద్దాం సార్.. ముందు ఈ ఆలయంలో అత్యంత ఖరీదైన విషపూరిత వస్తువు ఏంటో వెతకాలి’ అని రామస్వామి మధ్యలో కలుగజేసుకొంటూ అన్నాడు. ‘దానికి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది రామస్వామి గారు.. పెరుమాల్ టెంపుల్లో బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ కాగితంలో పేర్కొన్నట్టు అత్యంత ఖరీదైన విషపూరిత వస్తువు అదే కదా’ అంటూ జయ చెప్తూ ఉండగానే.. అవునన్నట్టు తలూపాడు రుద్ర. వాళ్లంతా అక్కడికి చేరుకొని బంగారు, వెండి బల్లి కింద నిలబడి చూశారు. అయితే, ఏమీ కనిపించలేదు. ‘సార్.. గర్భగుడిలో దండ ఉంచిన ఆ జంటే.. ఈ బంగారు బల్లి దగ్గర కాసేపు నిలబడ్డారు. దీనిపై ఏదో రాసినట్టు కూడా అనిపించింది’ అని ఈవో చెప్పాడు. ‘ఆ జంటను తీసుకురండి’ అంటూ రుద్ర అంటుండగానే.. ‘సార్.. సార్.. ఆఫీసులో ఉన్న ఆ జంట రక్తం కక్కుకొని చనిపోయారు’ అంటూ ఒకతను వచ్చి బాంబు పేల్చాడు. వెంటనే అక్కడికి వెళ్లారు రుద్ర అండ్ టీమ్. చనిపోయిన జంటను హిప్నొటైజ్ చేశారని, వాళ్లకు వాళ్లే సూసైడ్ చేసుకొన్నారని జయ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇది కూడా డోలో మిషన్‌లో భాగమేనని గ్రహించిన రుద్ర.. అమాయకమైన ఆ జంట ప్రాణాలు పోవడాన్ని తట్టుకోలేక నిల్చుండిపోయాడు. ‘రుద్ర.. మనం బాధపడుతూపోతే, మిగతా వారిని కాపాడలేం’ అన్న కరణ్ మాటలతో మళ్లీ తమాయించుకొన్న రుద్ర.. బంగారు బల్లి దగ్గరకు వచ్చి జాగ్రత్తగా పరిశీలించాడు. తనతో తెచ్చుకొన్న ఇన్ఫ్రారెడ్ రే ఎక్విప్మెంట్ను జయ ట్రై చేసింది. ఆశ్చర్యం.. బంగారు బల్లిపై ఏదో రాసినట్టు అందరూ గుర్తించారు.
‘విషం బల్లిలోనే కాదు.. ఇంకా ఎన్నో జీవుల్లో ఉంటుంది. అలాంటి ఓ జీవి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకొంటుంది. అయితే, అలా కాపాడుకొన్న పిల్లలే.. ఆ తల్లిని బతికి ఉండగానే పీక్కు తింటాయి. అలాంటి జీవులు విపరీతంగా ఉన్న చోటుకి వెళ్లి వెతుకు. మిషన్ డోలో తర్వాతి స్టెప్ ఏంటో తెలుస్తుంది’ అంటూ రాసి ఉంది. అది చదవగానే.. ‘తల్లిని బతికి ఉండగానే పీక్కు తినే పిల్లలా?’ అంటూ స్నేహిల్, రామస్వామి ఆశ్చర్యపోయారు. ‘వెంటనే మనం బ్రెజిల్‌కు వెళ్లాలి’ అని రుద్ర అనగానే.. మిగతావారందరూ షాకయ్యారు. ఇంతకీ, రుద్ర బ్రెజిల్‌కు ఎందుకు వెళ్దామన్నట్టు??
తేలు తోకలో విషం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక, మ్యాట్రిఫగీ అనే తేలు జాతి ఎంతో భయంకరమైనది. ఆహారం దొరకని సమయాల్లో తల్లి తేలును దాని పిల్లలే పీక్కుతింటాయి. ఈ జీవులు ఎక్కువగా బ్రెజిల్లో కనిపిస్తాయి. ఇక, బంగారుబల్లి మీద రాసిన సూచనలను అర్థం చేసుకొన్న రుద్ర.. ఆ విషపూరిత జీవి మ్యాట్రిఫగీ తేలు అని గ్రహించి తన టీమ్‌తో బ్రెజిల్‌కు వెళ్దామన్నాడు.