వేసవి అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి మామిడి, పుచ్చకాయ, ద్రాక్షలే. కానీ భారతదేశంలో వీటితో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకమైన, అరుదైన వేసవి పండ్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, అడవుల్లో, కొండప్రాంతాల్లో దొరికే ఈ పండ్లు కేవలం రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కొన్ని పండ్లు శరీరాన్ని చల్లబరిస్తే, మరికొన్ని శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా సహజమైన పోషకాలతో నిండిన ఈ పండ్లు ఇటీవల పెరిగిన ఆరోగ్య చైతన్యం కారణంగా మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అలాంటి కొన్ని ప్రత్యేక సమ్మర్ ఫ్రూట్స్ గురించి
తెలుసుకుందాం.
తీపి పులుపుల లకూచా

లకూచా లేదా మంకీ జాక్ ఫ్రూట్ … ప్రధానంగా ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అడవి ప్రాంతాల్లో కనిపించే అరుదైన వేసవి పండు. ఇది పుల్లటి-తీపి రుచితో ఉంటుంది. స్థానికంగా చట్నీలు, జ్యూస్‌లు, పచ్చళ్లలో కూడా ఉపయోగిస్తారు. ఎండాకాలంలో శరీరంలో వేడి పెరిగినప్పుడు సహజంగా చల్లదనం ఇచ్చే పండ్లలో లకూచా కూడా ఒకటి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని వేసవి ప్రత్యేక పండుగా భావిస్తారు. ఎండవల్ల ఏర్పడే అలసటను ఇది తగ్గిస్తుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలు నీరసం వచ్చినప్పుడు తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అందాల స్టార్ ఫ్రూట్

వేసవిలో మార్కెట్లో కనిపించే ప్రత్యేకమైన పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒకటి. దీన్ని కోసినప్పుడు నక్షత్రం ఆకారంలో కనిపించడం వల్ల దీనికి స్టార్ ఫ్రూట్ అనే పేరు వచ్చింది. ఆకర్షణీయమైన రూపం, తీపి పులుపు కలిసిన రుచి, ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఇప్పుడు ఈ పండు చాలామందిని ఆకర్షిస్తున్నది. తెలుగు రాష్ర్టాలతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. నక్షత్రాకారంలో ఉండే ఈ పండులో నీటి శాతం ఎక్కువ. అందువల్ల ఇది డీహైడ్రేషన్‌ని అరికడుతుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో వచ్చే చర్మ సమస్యలు, సన్ డ్యామేజ్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫుడ్ ప్రెజెంటేషన్‌కు డిమాండ్ పెరిగింది. స్టార్ ఫ్రూట్ ప్రత్యేక ఆకారం వల్ల ఫుడ్ డెకరేషన్లో విరివిగా వాడుతున్నారు.
సువాసనల.. రోజ్ ఆపిల్

వేసవిలో మార్కెట్లో అప్పుడప్పుడూ కనిపించే, మనలో చాలామందికి పెద్దగా పరిచయం లేని పండ్లలో రోజ్ ఆపిల్ ఒకటి. దీనిని వాటర్ ఆపిల్, జామ్ ఫలం, వాక్స్ ఆపిల్ అనే పేర్లతోనూ పిలుస్తారు. కోసినప్పుడు గులాబీ పరిమళం రావడం వల్ల దీనికి రోజ్ ఆపిల్ అనే పేరు వచ్చింది. ఇది తెలంగాణ-ఆంధ్రాలో కొన్నిచోట్ల, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తుంది. చెట్టుపైన గంట ఆకారంలో వేలాడుతూ ఉండే ఈ పండ్లు చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంటాయి. లేత గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఇవి కనిపిస్తాయి. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో తినేందుకు ఎంతో తేలికగా అనిపిస్తుంది. అంతేకాదు ఒంట్లో నీటిని సైతం పట్టి ఉంచుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఇది డైట్ ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఇందులో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉపయోగకరం. నేరుగా ముక్కలుగా కట్ చేసి, ఫ్రూట్ సలాడ్లలో, జ్యూస్‌గా ఇలా ఇష్టాన్ని బట్టి దీన్ని తినొచ్చు. ఇప్పటి తరం ఆరోగ్యకరమైన, తక్కువ క్యాలరీల ఆహారాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండటం, సోషల్ మీడియాలో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ట్రెండ్ పెరగడంతో రోజ్ ఆపిల్‌కు డిమాండ్ ఎక్కువ అవుతున్నది.
వెలగ వేసవి వెలుగు

వెలగపండు వేసవిలో కడుపుకు చల్లని వరం అని చెప్పొచ్చు. దీనిని బేల్ ఫ్రూట్ లేదా ఉడ్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. గట్టి తొక్కతో ఉండే ఈ పండు బయటికి సాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుజ్జు ఉంటుంది. పసుపు-నారింజ రంగులో కొద్దిగా సువాసనతో ఉండే ఈ గుజ్జుకు ప్రత్యేకమైన తీయటి రుచి ఉంటుంది. వెలగ చెట్లు భారతదేశంలోని వేడి ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో అధికంగా కనిపిస్తాయి. వెలగపండు గుజ్జును నీటిలో కలిపి బెల్లం లేదా చక్కెర వేసి తయారు చేసే షర్బత్ ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధి. ఇది సహజ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. శరీరానికి చల్లదనాన్ని, తక్షణ శక్తిని ఇచ్చి డీహైడ్రేషన్ నివారణకు సాయపడుతుంది. వెలగపండును ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యల కోసం ఉపయోగిస్తారు. విరేచనాలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో కడుపు బాగోలేకపోతే వెలగపండు గుజ్జును తినే అలవాటు ఇప్పటికీ ఉంది. సహజంగా శరీరాన్ని చల్లబరిచే ఈ పండును వేసవిలో ఆహారంలో చేర్చుకుంటే రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఆస్వాదించవచ్చు.
కరోండా పండు పోషకాలు మెండు

చిన్న పొదలపై పెరిగే పండు కరోండా. మొదట పచ్చగా ఉండే ఇవి పండిన తర్వాత గులాబీ, ఊదారంగులోకి మారతాయి. కొన్ని ప్రాంతాల్లో వీటిని వాక్కాయలు అని, కలే కాయలు, కలక్కాయలు అని పిలుస్తారు. ఈ పండు పుల్లగా ఉంటుంది. బాగా పండిన తర్వాత కాస్త తీపిని సంతరించుకుంటుంది. కరోండా మొక్కలు ఎక్కువగా పొదల రూపంలో పెరుగుతాయి. తక్కువ నీటితో పెరిగే ఈ మొక్కలు వేడి వాతావరణానికి బాగా సరిపోతాయి. ఉప్పు, మిరపపొడి వేసుకుని తింటే రుచిగా ఉంటాయివి. కొంతమంది దీన్ని పచ్చిగా తింటే, మరికొందరు పప్పులోను, పచ్చళ్లు, జామ్‌ల తయారీకి ఉపయోగిస్తారు . కరోండాలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఉన్నవారికి ఉపయోగపడుతుంది. వేసవిలో నీరసం తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. సహజంగా ఇమ్యూనిటీ పెంచే పండ్లలో ఇదీ ఒకటి.
ఫాల్సా… సహజ కూల్ డ్రింక్!

ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఫాల్సా పండు చిన్నగా కనిపించినా ఆరోగ్య ప్రయోజనాల్లో మాత్రం చాలా పెద్దది. గాఢ ఊదారంగులో ఉండే ఈ పండు వేసవిలో శరీరానికి సహజ చల్లదనం అందిస్తుంది. ఫాల్సా చెట్లు ఎక్కువగా వేడి ప్రాంతాల్లో పెరుగుతాయి. పండు రుచి తీపి, పులుపు కలిసినట్లుగా ఉంటుంది. విటమిన్ సి, ఫైబర్లతో పాటు ఐరన్, క్యాల్షియం, యాంటి ఆక్సిడెంట్లు ఇందులో అధికం. ఫాల్సా శరీరంలోని వేడిని తగ్గించి డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ఈ కాలంలో వచ్చే అలసట, నీరసం తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లని ఎక్కువగా జ్యూస్, షర్బత్, చల్లటి స్మూతీల్లాంటివి చేసుకునేందుకు ఉపయోగిస్తారు. అందుకే దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో సహజ సమ్మర్ డ్రింక్‌గా భావిస్తారు.