ఇచ్ఛామతీ ప్రవాహపు ప్రతి వంపులోనూ, అక్కడి అడవుల్లోని ప్రతి మూలలోనూ ఎన్నో రకాల ఆకులూ, పొదలూ, తీగలూ తరతరాలుగా మొలుచుకొస్తూనే ఉన్నాయి. బలారామ్భంగా వద్ద గట్టు తెగిపోయిన చోట మొలిచిన లేలేత రావిమొక్కలు కొన్ని సంవత్సరాల్లోనే అడవిగా విస్తరించాయి; బీడుపడిన నేలల్లో పడిన చింతగింజలు మొలకెత్తి దట్టమైన వృక్షాలుగా పెరిగాయి. వెంపలి, నాట, తంగేడు, ఇంకెన్నో రకాల అడవి మొక్కల పొదల నిండా పువ్వులు విరబూశాయి… వాటి మీదుగా ఎగిరే వలస పక్షుల కూతలు ఎప్పుడూ వినబడుతూనే ఉంటాయి. అడవి బాతుల సమూహాలు తామరతూళ్ళను నోట కరచుకుని లేతాకుపచ్చ వరిచేల మీదుగా, మేఘాల వరుసలను దాటుకుంటూ అలవోకగా ఎగిరిపోతూ కనబడతాయి. ప్రతి ఏడాదీ వర్షాకాలం ముగిసే సమయానికి ఊదానీలి వర్ణాల సమ్మేళనంతో మనోహరమైన మెట్టతామర పూలు నది గట్లను ముంచెత్తుతుంటాయి.
గాలిలో తేలివచ్చిన రెల్లుపూలు నది గట్లమీది బురదలో చిక్కుకుని, వర్షాకాలం ముగిశాక మొలకెత్తటంతో దట్టమైన రెల్లుదుబ్బులు పెరిగాయి దట్టంగా అల్లుకున్న గుమ్మడి తీగలు, వెలగచెట్లు వచ్చి చేరాయి. తిప్ప, బటానీ తీగలు, అడవి గన్నేరు చెట్లూ కూడా పెరిగాయి. బీడువారిన ఇచ్ఛామతీ తీర మైదానం వసంత రుతువులో దేవకాంచన పుష్పాల గుత్తులతో పరవశించి పోతుంది. ఫాల్గుణ, చైత్ర మాసాల్లో వర్తకుల నావలు ఈ గట్టు వద్దనే లంగరు వేసి, అడవి చెట్లకింద జాలరులు వంటలు చేసుకుంటారు. అక్కడి నుండి విశాలంగా వ్యాపించిన నదిలో సుందర్బన్స్కు ప్రయాణించి తేనెపట్ల నుండి మైనాన్ని, తేనెను, వివిధ వృక్షాల నుండి వచ్చే కల్లును సేకరిస్తారు.
పాంచ్పోతా గ్రామానికి ఇరువైపులా నీలిపంటను సాగుచెయ్యటం ఆగిపోయాక ఆ ప్రాంతమంతటా తురాయి, కానుగ, టేకు వృక్షాలతో అడవివలె మారింది. ఆ ప్రాంతంలో జాలరులు పడవలను ఆపుకోటానికీ, నీటిలోకి దిగటానికీ వీల్లేనంత దట్టంగా అడవి తీగలు అల్లుకుపోయాయి. భాద్రపద మాసంలో స్వాతి నక్షత్రాన కురిసిన వర్షపు చినుకులు ముత్యపు చిప్పల్లో పడి, మేలిమి ముత్యాలవుతాయని వాటిని సేకరించటానికి కొందరు ఎదురు చూస్తుంటారు.
– ఇచ్ఛామతీ తీరాన బిభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్ నవల నుంచి (అనువాదం: కాత్యాయని)