సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఒక్కరికీ ఓ సొంతిల్లు ఉండాలన్నది కల.. ఆ కలను నెరవేర్చుకునేందుకు సగటు మనిషి జీవితాంతం పోరాడుతాడు.. రూపాయి.. రూపాయి కూడబెట్టి తమ కలల సౌధంలో హాయిగా జీవనాన్ని గడపాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. కొందరు రియల్ వ్యాపారులు అందినంత దండుకుంటున్నారు.. చిన్న చిన్న రియల్ వ్యాపార సంస్థలే ఇలా చేస్తారనుకుంటున్న తరుణంలో ఈ కోవలోకి ప్రముఖంగా పేరొందిన బడా రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ ఈ జాబితాలో చేరింది.
డ్రీమ్ హోమ్ ఆశ చూపించి మధ్య తరగతి కుటుంబాల జీవితకాల పొదుపులను కొల్లగొట్టింది. తప్పుడు హామీలతో బయ్యర్లను ఆకట్టుకొని వారి నుంచి 81 శాతం ముందే డబ్బులు కట్టించి తీరా సమయానికి వారికి ఫ్లాట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వారిని రోడ్డున పడేసింది. కోట్లాది రూపాయలు పెట్టిన బయ్యర్లంతా ఏకమై వాసవి గ్రూప్ నిర్వాహకుల మోసాలపై రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నిర్వాహకులు ఎంతకు దిగి రాకపోవడంతో రెరా(తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా)ను ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన రెరా వాసవి గ్రూప్ నిర్వాహకంపై గట్టి షాక్ ఇచ్చింది. ఆలస్యంతో పాటు కొనుగోలుదారులకు తప్పుడు హామీలు ఇచ్చిన వాసవి గ్రూప్‌పై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొనుగోలుదారుల నుంచి 81 శాతం డబ్బులను ముందే తీసుకొని ఫ్లాట్లు సమయానికి ఇవ్వకపోవడం, కొనుగోలుదారులను తప్పుడు హామీలతో మభ్యపెట్టడం వంటి కారణాలతో చర్యలు తీసుకున్నది. కొనుగోలుదారుల నుంచి తీసుకున్న నగదుపై 10.85శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఖరాఖండిగా చెప్పేసింది. ఒప్పందం ప్రకారం హ్యాండోవర్ చేస్తానన్న తేదీ 2024 మార్చి నుంచి తిరిగి వారికి హ్యాండోవర్ జరిగే వరకు చెల్లించాల్సిందేనని రెరా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గట్టి షాక్‌నిచ్చిన రెరా
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట మంజీరా పైపులైన్ రోడ్డులో లేక్ సిటీ- వెస్ట్ పేరిట ప్రాజెక్ట్(రెరానంబరు P0 2500 001819) ను 2020లో అనుమతులు తీసుకున్నారు. సెల్లార్+గ్రౌండ్+14 ఫ్లోర్లతో ఏడు టవర్ల నిర్మాణం జరుగుతున్నది. ఇందులో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నాయి. తొలుత 2023 ఆగస్టు నాటికి ఫ్లాట్లు అందజేస్తామని వాసవి గ్రూప్ కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌తో కలిపి గరిష్ఠంగా గతేడాది ఫిబ్రవరిలో హ్యాండోవర్ చేయాలని నిబంధన ఉంది. కానీ ఇప్పటికీ (సెప్టెంబర్ 2025) ప్రాజెక్ట్ 60- 70% మాత్రమే పూర్తి కాగా, ఫ్లాట్ల హ్యాండోవర్ జరగలేదని రెరా గుర్తించింది. కొనుగోలుదారులు ఇప్పటికే ఫ్లాట్ ధరలో 81% వరకు చెల్లించినా వాసవి నిర్వాహకులు కేవలం తప్పుడు హామీలు, వాయిదా మాటలు మాత్రమే చెబుతూ వినియోగదారులను మోసగించినట్లుగా తేలింది. ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేయడం వల్ల కొనుగోలు చేసిన వారికి ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్లకు గురిచేసిన వాసవి తీరును సీరియస్‌గా తీసుకున్న రెరా.. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తంపై ప్రతి సంవత్సరం 10.85% వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.
50కి పైగా ఫిర్యాదులు
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్‌పై గడిచిన ఏడాది కాలంగా కొనుగోలుదారులు తిరుగుబావుటా ఎగురవేశారు. డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత ప్లాట్లను అప్పగించకపోవడంతో ఆగ్రహానికి గురైన బాధితులంతా ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మోసపూరితమైన కంపెనీ చేతిలో ఇరుక్కుపోయిన వందలాది మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయంటూ నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ లేక్ సిటీ ప్రాజెక్టుపై దాదాపు 50 మందికి పైగా రెరాలో ఫిర్యాదు (నంబరు 136 ఆఫ్ 2025) చేశారు. విచారణకు స్వీకరించిన రెరా కొనుగోలుదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉందని గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే కొవిడ్ -19 ప్రభావం, లిటిగేషన్ ఆలస్యాలు కారణమని వాసవి గ్రూప్ విచారణలో వాదించగా, రెరా ఆ వాదనలను సున్నితంగా తిరసరించింది. 2021 మార్చిలోనే కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకున్నందున, కొవిడ్ పరిస్థితులు తెలిసే ఉన్నప్పటికీ సమయానికి ఫ్లాట్లు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చారని రెరా వ్యాఖ్యానించింది. ప్రాజెక్ట్‌ను తక్షణమే పూర్తి చేసి ఫ్లాట్లు ఇవ్వాలని ఆదేశించింది.
మళ్లీ ఆలస్యం చేస్తే రెరా చట్టం 63వ సెక్షన్ ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. వాసవి ప్రవర్తన వల్ల హోమ్ బయర్స్లో నమ్మకం దెబ్బతింటోందని, ఇకపై తప్పులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని రెరా గట్టిగా హెచ్చరించింది. వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టిన వందలాది కుటుంబాలకు ఈ ఉత్తర్వులు కొంత ఊరటనిస్తే, మరోవైపు ఫ్లాట్ కల ఇంకా ఎప్పుడెప్పుడు నెరవేరుతుందో అనేది ప్రశ్నగానే మిగిలింది.
వాసవి సరోవర్పైనే హైడ్రా చర్యలు
వాసవి గ్రూప్ చేపడుతున్న ప్రాజెక్టుల్లో ఒక్కో చోట ఒక్కో రీతిలో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగితాల్లో చెప్పేదొకటి…క్షేత్రస్థాయిలోచేసేదొకటి అన్నట్లు అంతులేకుండా ఆక్రమాలకు పాల్పడుతున్నది. కొనుగోలుదారులే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులను చేపడుతున్నది. హఫీజ్‌పేట లేక్ సిటీ -వెస్ట్ ప్రాజెక్టులో కొనుగోలుదారులను మోసం చేస్తే కూకట్పల్లి ఖైత్లాపూర్‌లో వాసవీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణాలపై హైడ్రా సీరియస్‌గా వ్యవహరించింది.
భరత్‌నగర్-ఖైత్లాపూర్ మార్గంలోని కాముని చెరువు-మైసమ్మ చెరువులను కలుపుతూ సాగే వరద కాలువను కబ్జా చేసిన వాసవి నిర్మాణ సంస్థపై హైడ్రా కేసు నమోదు చేసింది. 17 మీటర్ల వెడల్పుతో పాటు ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ జోన్ వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి అక్రమాలను గుర్తించారు. హైడ్రా సూచన మేరకు ఇరిగేషన్ శాఖ కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదు చేసింది. కొంతమేర ఇరువైపులా రిటైనింగ్ వాల్స్‌తో నిర్మించిన కాలువ మధ్యలో స్లాబ్ వేసేందుకు ఉద్దేశించిన పిల్లర్లను కూడా తొలగించాలని నిర్ణయించారు.