తన గుట్టును కనిపెట్టిన ఇన్స్పెక్టర్ రుద్రపై పదునైన ఆయుధంతో దాడి చేయబోయిన నారాయణాద్రుల స్వామీజీని షూట్ చేసి చంపాడు సీఐ శరత్. ఒక్కసారిగా కంగుతిన్న రుద్ర.. ‘తొందరపడ్డార’ని శరత్‌తో అన్నాడు. ‘తొందరపడకపోతే, బాధపడేవాణ్ని’ అని బదులిచ్చిన శరత్.. బాలిక పోస్ట్‌మార్టమ్ నివేదికలో ఏముందని ఆరా తీశాడు. రేపటిలోగా చనిపోతుందన్న తన మాటను నిజం చేయడానికి మనుషులను పెట్టి అన్యాయంగా ఆ చిన్నారిని స్వామీజీనే చంపించాడని రుద్ర చెప్పడంతో అందరూ షాకయ్యారు.కాసేపు దీనిమీదనే చర్చించుకొన్న తర్వాత.. ‘నల్లమల మిస్టరీ’ని ఛేదించడానికి వెళ్దామా? అని శరత్ అనడంతో.. సమస్య ఉన్న ప్రాంతానికి రుద్ర అండ్ టీమ్ ప్రయాణమయ్యారు.
దారి మధ్యలో రామస్వామి మాట్లాడుతూ.. ‘శరత్ సార్.. మనం వెళ్తున్న ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయట నిజమేనా? మంత్రాలతో చెట్లను సైతం వశీకరణ చేస్తారటగా’ అని అనుమానాస్పదంగా అడగ్గానే రుద్ర కాస్త కోపంగా చూశాడు. రామస్వామి ప్రశ్నకు స్పందిస్తూ.. ‘రామస్వామి గారూ.. మీరు దెయ్యాలను నమ్ముతారా?’ అని శరత్ ఎదురు ప్రశ్నించాడు. ‘నమ్ముతాను’ అంటూ రామస్వామి బదులిచ్చాడో లేదో.. ‘బాబాయ్..?’ అంటూ గుడ్లురిమేలా చూశాడు. ఇంతలో వేగంగా వెళ్తున్న కారు ముందటి అద్దంపై కొట్టుకొచ్చిన ఓ ఎండిన తాటాకు పడింది. కారు రోడ్డుపక్కన నిలిపేసిన రుద్ర.. ఏంటా? అని దాన్ని చూశాడు. దానిపై రక్తంతో ఇలా రాసి ఉంది. ‘ఏయ్ రామస్వామి.. నేను నల్లమల వనరాచిని. నువ్వు అనుమానిస్తున్నది నిజమే.. మీరందరూ వెళ్తున్న ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయ్. అక్కడ మంత్రాల ప్రభావం ఎంతలా ఉంటుందంటే మనుషులు, జంతువులే కాదు.. ఏకంగా చెట్లు కూడా వశీకరణ అవుతాయి. జాగ్రత్త మరి’ అని రక్తంతో రాసి ఉంది. అది చూసిన రామస్వామి కెవ్వుమన్నాడు.
కారులో అనుకొన్న విషయాలు తాటాకుపై అక్షరాల రూపంలో రావడంతో ఇదేదో మాయాప్రపంచంలా ఉందని స్నేహిల్ భయపడ్డాడు. దాన్ని చదివిన రుద్ర ఏదో ఆలోచిస్తుండగా.. ‘నల్లమలలోకి ఇప్పుడే ఎంటరయ్యాం రుద్ర గారు. ఇక, ఇప్పటినుంచి మనం ఊహించనివెన్నో జరుగబోతున్నాయ్’ అంటూ వణుకుతున్న గొంతుతో శరత్ అన్నాడు. ‘సీఐ సార్.. మీరు కూడానా?’ అంటూ రుద్ర అనగానే.. ‘నేను చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నా. జరుగుతున్నవన్నీ అంతుచిక్కనివే. మీరు ఇప్పుడే వచ్చారుగా.. మీకు కూడా తెలిసొస్తుంది’ అని శరత్ ఆకాశంలోకి చూస్తూ అంటుండగానే.. ఆకాశంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొన్నాయి. పట్టపగలు చీకట్లు ముసిరాయి. జుత్తు విరబోసుకొన్నట్టు చెట్లన్నీ పిచ్చిపట్టినట్టు గాలికి ఊగుతున్నాయి. దూరంగా నక్కలు ఊలలు పెడుతున్నాయ్. ఇంతలో ఆకాశంలో పక్షులన్నీ గుంపులుగా దూరంగా ఎగిరిపోతుండటాన్ని చూసిన రామస్వామి.. ‘సార్.. ఇదేదో తేడాగా ఉంది. ఇంకా మనం ఎంటర్ కూడా అవలేదు. శుభం కార్డు పడేలా ఉంది. దయచేసి తిరిగి వెనక్కి వెళ్లిపోదాం’ అంటూ భయంతో అరిచాడు. జరుగుతున్న పరిణామాలు జయకు, స్నేహిల్‌కు ఏదో మర్మంతో కూడినవిగా అనిపిస్తున్నాయ్. అసలేం జరుగుతుందో రుద్రకు అంతుచిక్కడంలేదు. ఇలాంటి సందర్భాలను తాను ఇదివరకే చూశానని, ఇక్కడి నుంచి బయటపడటం మంచిదని శరత్ మరోసారి హెచ్చరించాడు.
ఇంతలో ఆకాశంలో వాయువేగంతో గుండ్రంగా ఆ ప్రాంతాన్ని చుడుతూ.. చుట్టూ తిరుగుతున్న ఓ పక్షిమీదకు రామస్వామి దృష్టిమళ్లింది. ‘సార్.. ఆ పక్షి ఎంత భయంకరంగా ఉందో చూడండి. అది చాలాసేపు నుంచి మనల్నే కోపంగా చూస్తుంది. వెళ్దాం సార్.. ప్లీజ్’ అని రామస్వామి అంటుండగానే.. దూరం నుంచి మరో తాటాకు పత్రం వచ్చి పడింది. ‘ఏయ్ రామస్వామి.. నువ్వు ఎంత మొత్తుకున్నా.. ఆ రుద్ర.. పట్టించుకోడు. సరే.. నల్లమల మంత్రశక్తి ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తా.. మీ చుట్టూ రాకాసుల్లా ఊగిపోతున్న ఈ చెట్లన్నీ నా ఆవాసాలే. నా వశీకరణ మంత్రానికి బానిసలే. పచ్చని ఆకులు, రంగుల పూలు, నిండైన పండ్లతో అలరారుతున్న ఆ చెట్లన్నీ మరికొద్దిసేపట్లో చచ్చిపోతాయ్. ఆకులు, పూలు, పండ్లు రాలి మొండి ముఖం వేసుకొని గుండెలవిసేలా ఏడుస్తాయ్. ఆ ఏడుపుకు మీ అందరి శరీరం భగ్గుమంటుంది. శ్వాస ఆడదు. గుటక కూడా వేయలేరు. చూస్తారా.. నా వశీకరణ మంత్ర మహిమ’ అంటూ అందులో రాసి ఉంది. దాన్ని చదవడం పూర్తయిందో లేదో.. చుట్టూ ఉన్న వందలాది చెట్లు.. ఒక్కసారిగా ఆకులను రాల్చాయి. పూలూ-పండ్లు నేలకొరిగాయి. పచ్చని పందిరిలా ఉన్న ఆ ప్రాంతమంతా నిమిషాల్లోనే ఎడారిగా మారిపోయింది. మోడువారిన చెట్లు నల్లటి కొమ్మలతో కొమ్ముల దెయ్యాల్లా కనిపిస్తున్నాయ్. జరుగుతున్న పరిణామాలకు రామస్వామితో పాటు శరత్, స్నేహిల్, జయ, శివుడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. కాసేపటికే, అందరి ఒళ్లంతా భగ్గుమని వేడెక్కడం మొదలైంది.
మరికాసేపటికే గొంతులో మంట. ఊపిరి తీసుకోవడం కూడా క్రమంగా కష్టమైంది. దీంతో ఏదిఏమైతే కానివ్వని.. రామస్వామి నోరు పెంచాడు. ‘సార్.. మీరు నాకు బాస్ కావొచ్చు. కానీ, బాబాయ్ అని నన్ను అభిమానంతో పిలుస్తారని ఓ మాట చెప్తున్నా.. మీ మొండితనంతో ఇంతమంది ప్రాణాలను బలిపెట్టడాన్ని నేనొప్పుకోను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్దాం’ అంటూ కోపంగా అరిచాడు. రామస్వామి అలా కోపంగా మాట్లాడటాన్ని రుద్ర ఎప్పుడూ చూడలేదు. దీంతో చేసేదేమీలేక.. కారులోకి వెళ్లి కూర్చున్నాడు రుద్ర. అతణ్ని అనుసరించారు అందరూ. కారును స్టార్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కావడంలేదు. ఇంతలో రామస్వామి మళ్లీ అందుకొని.. ‘నేను కోపంగా మాట్లాడినందుకు క్షమించండి సార్. కానీ, గమనించారా.. ఇంతవరకూ బాగా నడిచిన కారు.. ఇప్పుడే పాడైపోవడమేంటీ?’ అంటూ భయంతో అన్నాడు. రామస్వామికి జతకలుస్తూ.. ‘బయట ఉండగా ఆ మంత్ర బలంతో మన శరీరమంతా భగ్గుమంది. కారులోకి రాగానే పరిస్థితి మారింది’ అని శివుడు అన్నాడు. వెంటనే రుద్ర మెదడులో ఏదో ఆలోచన. రెండు నిమిషాలు నిశ్శబ్దంగా కండ్లు మూసుకొని ఆలోచించిన రుద్ర.. ఆ వెంటనే కండ్లు తెరిచి.. ‘ఆ భయంకర పక్షిలోనే మర్మమంతా దాగి ఉంది బాబాయ్’ అంటూ గట్టిగా అరిచాడు. చెట్లు మోడుల్లా మారడానికి, తమ ఒళ్లు భగ్గున మండటానికి గల కారణాలను రుద్ర అందరికీ వివరించాడు. రుద్ర చెప్పిన కారణాలు నమ్మశక్యంగా ఉండటంతో దెయ్యాలు, మంత్రాలు లేవని అందరూ కొద్దికొద్దిగా నమ్మడానికి వస్తున్నారు. ఇంతలో.. రామస్వామి మాట్లాడుతూ.. ‘సర్.. మీరు చెప్పినట్టు వశీకరణం, మంత్రాలు లేవని అనుకొందాం. అయితే, మనం కారులో అప్పుడే మాట్లాడుకొన్న మాటలు వనరాచికి ఎలా తెలిశాయ్. తాటాకుపై రక్తాక్షరాల మర్మమేంటి?’ అని అడగడంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. దాన్నిపక్కనబెడితే, చెట్లు మోడుల్లా మారడానికి, ఒళ్లు భగ్గున మండటానికి రుద్ర ఏ కారణాలు చెప్పాడో కనిపెట్టగలరా?
మనుషులు, జంతువులకు మెదడు, ఆలోచనా ధోరణి, నాడీకణాలు ఉంటాయి గనుకనే వశీకరణం చేయగలం. అయితే, చెట్లను చేయడం కుదరదు. ఇది తెలిసిన రుద్ర.. చెట్ల ఆకులు, పూలు, పండ్లు రాలిపోవడం వెనుక ఏదో మర్మం దాగి ఉందని అనుమానించాడు. ఇంతలో తమ శరీరం భగ్గున మండటం, శ్వాస సమస్యలు తలెత్తడంతో ఇదేదో రసాయనిక ప్రభావమని గుర్తించాడు. ఇథిలీన్ కెమికల్‌కు చెట్ల ఆకులను రాల్చడంతో పాటు శరీరంపై పొక్కులు, శ్వాస సమస్యలను కలిగించే లక్షణాలు ఉంటాయి. భయంకర పక్షిలా కనిపించే డ్రోన్‌తో తాము ఉన్న ప్రాంతంలో ఎవరో ఇథిలీన్ కెమికల్‌ను స్ప్రే చేశారని, అందుకే అలా జరిగిందని రుద్ర అందరికీ వివరించాడు. కారులోకి వచ్చిన కాసేపటికి ఒంటిపై మంట తగ్గడానికి కూడా కారణం అదేనని తెలిపాడు.
– రాజశేఖర్ కడవేర్గు