ఖైరతాబాద్, సెప్టెంబర్ 10 : ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి పొందేందుకు కేబుల్ ఆపరేటర్లుగా జీవితాన్ని ప్రారంభించామని, ప్రభుత్వ చర్యలతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, తమపై కనికరించి అనధికార కత్తిరింపులు ఆపాలని ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ రామాంతపూర్‌లో జరిగిన ఘటనను తమను బాధ్యులను చేయడం సరికాదని, లో లెవల్లో విద్యుత్ వైరు వెళ్లడం వల్ల విద్యుదాఘాతం జరిగిందని, ఆ శాఖపై చర్యలు తీసుకోకుండా ఏ పక్షంగా తమపై కక్షసాధింపులా వ్యవహరించడం బాధాకరమన్నారు.
ఈ కేబుల్ రంగంపై లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉందని, ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు, జీఎస్టీలు చెల్లిస్తున్నామని, కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేబుల్ కనెక్షన్లు కట్ చేయడం సరికాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల మధ్యతరగతి ఆపరేటర్ల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు. డాట్, ట్రాయ్ వారు 25 ఐఎస్బీ లైసెన్సులు ఇవ్వడం వల్ల కేబుళ్ల సంఖ్య పెరిగిందని, అండర్ గ్రౌండ్ సర్వీసు లేని కారణంగా ఈ పరిస్థితి నెలకొందన్నారు.
సింగిల్ ఫైబర్ సిస్టమ్ తీసుకువస్తే దానిని ఆపాదించుకోవడం కోసం సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తుందని ఎదురుచూస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ బ్రాండ్ ఉందని, అనేక మల్టీనేషనల్ సంస్థలు, ఐటీ పరిశ్రమలు ఇంటర్నెట్ సేవలపై ఆధారపడి ఉన్నాయని, అర్థాంతరంగా వాటిని నిలిపివేయడం వల్ల ఆయా రంగాలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఉప్పల్ స్టేడియంలో సైతం ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇలాంటి చర్యల వల్ల పూర్తి స్టేడియానికి ఆ సేవలు నిలిచిపోతుందన్నారు.
కొన్ని కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడానికే తమకు నష్టం చేయడం భావ్యం కాదన్నారు. 1998 నుంచి సేవలందిస్తున్నామని, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తాము కూడా అప్డేట్ చేసుకొని సేవలందిస్తున్నామన్నారు. ఈ వ్యాపారం పూర్తిగా చట్టబద్ధమైందని, కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమతో చర్చలను జరుపాలని, అలా కాకుండా ఏపక్షంగా వ్యవహరిస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి వెనుకాడమన్నారు. ఈ సమావేశంలో సంఘం ప్రధానకార్యదర్శి సలాం, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.