ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనం.. అందమైన పూలతో అలంకరణ.. ధగ ధగా మెరిసే విద్యుత్ దీపాల వెలుగులు.. చెరువు నిండా నీళ్లు.. చల్లని సాయంత్రం.. దసరా పండుగ రోజున భద్రకాళీ అమ్మవారికి నిర్వహించే తెప్పోత్సవం కనుల పండువగా సాగుతుంది.. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులను మైమరపింపజేస్తుంది. ఏటా అధికారికంగా నిర్వహించే ఈ క్రతువు.. ఈసారి జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయం.. అధికారుల ప్రణాళిక లేమితో భద్రకాళీ చెరువు ఇప్పుడు నీళ్లు లేక.. పిచ్చిమొక్కలు పెరిగి ఆలయ సంప్రదాయానికి గండికొట్టేలా కనిపిస్తున్నది.
హనుమకొండ, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వరంగల్ నగరంలోని భద్రకాళీ ఆల య సంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో భంగం కలుగుతున్నది. సర్కారు ఆదేశాలు, అధికారుల ప్రణాళిక లేమితో నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన క్రతువు నిర్వహించే పరిస్థితి లేకుండాపోతున్నది. సుందరీకరణ పేరిట ఏడాది క్రితం భద్రకాళీ చెరువులోని నీటిని తీసివేయగా, ఇటీవల కురిసిన వర్షానికి చెరువులోకి కొద్దిపాటి నీరు చేరడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అవతారంలో పూజాధికాలు చేయడంతో పాటు చివరిదైన దసరా రోజు తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనాన్ని అలంకరించి భద్రకాళీ చెరువులో ఊరేగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈ క్రతువు జరుగుతుంది. అయితే దసరా సీజన్లో నీళ్లతో నిండుగా ఉండే భద్రకాళీ చెరువులో ప్రత్యేక అలంకరణ, విద్యుత్ వెలుగుల్లో తెప్పోత్సవం చూడముచ్చటగా జరుగుతుంది. ప్రకృతి విపత్తు వల్ల గతంలో ఒకసారి తెప్పోత్సవం నిర్వహించలేదని, ఇప్పుడు అధికారుల తీరు వల్ల జరగకుండా పోతున్నదని ఆలయ పూజారులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రకాళీ చెరువు సందరీకరణతోపాటు ఆలయ మాఢ వీధుల నిర్మాణం, చెరువులో బోటింగ్, ట్యాంక్ బండ్ విస్తరణ పనులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేమి, హనుమకొండ జిల్లా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, సాగునీటి శాఖ అలసత్వంతో చెరువు సుందరీకరణ ప్రాజెక్టు అయోమయంలో పడింది. హడావుడిగా మొదలుపెట్టిన పూడికతీత పనులు సగంలోనే ఆగిపోగా, ఎప్పటికి పూర్తవుతాయనేది అంతుచిక్కడంలేదు.
పూడికతీత పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబరులో నిర్ణయించి 382 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులోని నీటిని హడావుడిగా ఖాళీ చేయించింది. చెరువులో 18 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక ఉన్నట్లు సాగునీటి శాఖ నిర్ధారించింది. చెరువును 5 జోన్లుగా విభజించి మొదట మూడింటిలో పూడికతీసి మట్టిని తరలించాలని నిర్ణయించింది. వానకాలం సీజను మొదలయ్యే జూన్ మొదటి వారంలోపు పూడికతీత పూర్తి చేయాలనే లక్ష్యంతో 2025 మార్చి 11న పనులు ప్రారంభించారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు అనుకున్నట్లుగా సాగలేదు. సాగునీటి శాఖ ఆధ్వర్యంలో 3.40 లక్షల క్యూబిక్ మీటర్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) నేతృత్వంలో మరో 3 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పూర్తయ్యింది. భద్రకాళీ ఆలయ మాఢ వీధుల పనులు సైతం కుడా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. చెరువు పక్కనే మాఢ వీధులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పూడిక మట్టిని నిర్మాణ స్థలానికి కుడా తరలించింది. సాగునీటి శాఖ, కుడా కలిపి మొత్తం 6.40 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీశాయి. రెండు నెలలుగా కురుస్తున్న వానలతో పనులు నిలిచిపోగా, వరదలతో మళ్లీ పూడిక వచ్చి చేరుతున్నది. చెరువు కట్టకు గండి పెట్టడంతో వచ్చిన వరద వచ్చినట్లుగానే కిందికి వెళ్తున్నది.
భద్రకాళీ చెరువు సుందరీకరణ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు వానకాలంలోపు పూడికతీత పూర్తి చేయలేపోయింది. ఈ నేపథ్యంలో మే ఆఖరులో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ పూడికతీత పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రణాళికా లోపం కారణంగా రెండున్నర నెలల్లో కేవలం 3.40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినే వెలికితీయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మార్చి, ఏప్రిల్, మేలో పగలు, రాత్రి పనులు చేసే పరిస్థితి ఉంటుంది.
అధికారుల నిర్లక్ష్యం, రెవెన్యూ, సాగునీటి శాఖ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కుడా మధ్య సమన్వయం లేకపోవడంతో పనులు పూర్తి కాలేదనే విమర్శలు ఉన్నాయి. భద్రకాళి చెరువులో మిగిలి ఉన్న 14.60 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను ఏం చేస్తారనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. పూడిక పూర్తిగా తొలగిస్తేనే భద్రకాళీ చెరువు సుందరీకరణ పనులు ముందుకు సాగుతాయి. అయితే పూడికతీతపై అస్పష్టతతో ఆలయ మాఢ వీధుల నిర్మాణం, చెరువులో బోటింగ్, ట్యాంక్ బండ్ విస్తరణ పనులపై అయోమయం నెలకొన్నది.