ఆంగ్లేయులకు వేసవి కాలం విడిది హిమాచల్ ప్రదేశ్. కానీ, ఇలాంటి చిల్లింగ్ స్టేట్‌కు మన భారతీయులు శీతకాలంలో వెళ్లడానికి ఉత్సాహం కనబరుస్తారు. అందులోనూ కాస్త డిఫరెంట్ డెస్టినేషన్ అయితే.. కాస్త ఎక్కువ కిక్ వస్తుంది. అలాంటి పర్యాటక ప్రాంతమే కుఫ్రీ. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. హిమగిరులు, కొండవాలులో విస్తరించి ఉన్న పైన్ చెట్లతో ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మలా అలరిస్తుందీ ప్రాంతం. ట్రెక్కింగ్ డెస్టినేషన్‌గా పేరొందిన కుఫ్రీలో పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మహాసు పర్వతం. దీనిపైకి గుర్రాలు ఎక్కి చేరుకోవచ్చు.
ఒక్కొరికి రూ.500 వరకు వసూలు చేస్తారు. మంచుతో నిండి ఉన్న కొండపై నాగదేవాలయం మరో ఆకర్షణ. పర్వతంపై ఉన్న వ్యూ పాయింట్ల నుంచి కుఫ్రీ అందాలన్నీ చూడొచ్చు. కొండపై ఉన్న కుఫ్రీ ఫన్ పార్క్ కావాల్సినంత ఆటవిడుపు లభిస్తుంది. రంగు హంగులతో తీర్చిదిద్దిన ఈ పార్క్ స్కీయింగ్ సహా రకరకాల ఆటలు ఉన్నాయి. సిమ్లా వచ్చిన పర్యాటకులు కుఫ్రీ వెళ్లి సాయంత్రం దాకా ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణం అవుతారు.
ఇలావెళ్లాలి: సిమ్లా.. చండీగఢ్ నుంచి 115 కి. మీ., దిల్లీ నుంచి 342 కి. మీ. దూరంలో ఉంటుంది. ముందుగా ఢిల్లీ చేరుకుంటే అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో సిమ్లా మీదుగా కుఫ్రీ వెళ్లొచ్చు.