ఈ తరం ఆడపిల్లలు కెరీర్లో రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నారు. పాతికేండ్లకే ఆరంకెల జీతం అందుకుంటున్నారు. జీతం ఎంతన్నది పక్కన పెడితే.. ఆర్థిక సాధికారత మహిళలకు ఓ భరోసాను ఇస్తుంది. అయితే, ఇన్ని సానుకూల అంశాలూ.. ఒక్కసారిగా కూలిపోవచ్చు. చిన్న అనారోగ్యం మీ కెరీర్‌కు కామా పెట్టొచ్చు. ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీయొచ్చు. అలా కావొద్దంటే.. మీ జీవితానికి హెల్త్ ఇన్సూరెన్స్ కవచం తొడగండి.
తరాలు మారేకొద్దీ మహిళల పాత్ర మారుతూ వస్తున్నది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. ఇప్పుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. చదువు, ఉద్యోగంలో మగవారి కన్నా ముందు ఉంటున్నారు. అయితే, మారిన కాలమాన పరిస్థితులు, ఆహార వ్యవహారాలు, జీవనశైలి ఇవన్నీ నవతరంపై పగబట్టాయి. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆడవాళ్ల అభివృద్ధికి అనారోగ్య సమస్యల రూపంలో మోకాలడ్డుతున్నాయి.
ముప్పయ్లోకి అడుగుపెట్టకముందే థైరాయిడ్, పీసీఓడీ లాంటి జీవనశైలి రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. గైనిక్ సమస్యలు వెంటబడుతున్నాయి. దీనికితోడు రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను ఇవి ఇరుకున పెడుతున్నాయి. వాళ్ల కెరీర్‌తోపాటు ఆర్థిక మూలాలనూ ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితి తలెత్తవద్దు అంటే.. ముప్పయ్లోకి అడుగుపెట్టకముందే ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి.
‘ఆరోగ్య బీమానా!.. మాకెందుకు?’ అని చాలామంది మహిళల అభిప్రాయం. పెండ్లయ్యాక పెనిమిటి చూసుకుంటాడులే అని కొందరి భావన. కానీ, అలా ఆలోచించడం సరైనది కాదు. దీపిక కథ చదివితే ఈ తరం ఆడపిల్లలకు ఆరోగ్య బీమా ఎంత అవసరమో తెలుస్తుంది. దీపిక వయసు 27 ఏండ్లు. పెండ్లికి ముందు ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేది. నెలకు లక్షకుపైగా జీతం అందుకునేది. కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండటంతో ప్రత్యేకంగా మరో హెల్త్ పాలసీ తీసుకోలేదు. పైగా ఇంత చిన్న వయసులో తనకేం సమస్యలు వస్తాయనే ధీమాతో ఉండేది. అనుకోకుండా ఆమెకు పెండ్లి కుదిరింది. నెలలో ముహూర్తం ఫిక్సయింది. అత్తవారింటి కోరిక మేరకు దీపిక ఉద్యోగానికి రాజీనామా చేసింది.
అంగరంగ వైభవంగా పెండ్లి జరిగింది. మూడేండ్లుగా కూడబెట్టిందంతా పెండ్లికి ఖర్చు చేసింది. రెండు లక్షల రూపాయల బ్యాంకు నిల్వతో అత్తవారింట అడుగుపెట్టింది. నెల తర్వాత దంపతులు ఇద్దరూ హనీమూన్‌కు వెళ్లారు. వస్తుండగా ఓ ప్రమాదం. అందులో ఇద్దరికీ తీవ్రమైన గాయాలయ్యాయి. దీపిక భర్తకు ఆఫీస్ వారిచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ లభించింది. నెల రోజులే కావడంతో భార్య పేరు అందులో నమోదు చేయలేకపోయాడు. దీపిక ఉద్యోగం మానేయడంతో ఆమెకు ఆఫీస్ వారిచ్చిన బీమా చెల్లకుండా పోయింది. ఆమె వైద్యానికయ్యే ఖర్చులన్నీ సొంతంగా భరించాల్సి వచ్చింది. ఆ దంపతులు డిశ్చార్జ్ అయ్యేసరికి దీపిక బిల్లింగ్ చూసి ఆమె ఇంట్లోవాళ్లకు కండ్లు తిరిగినంత పనైంది. అదే దీపికకు ఆరోగ్య బీమా ఉండి ఉంటే.. ఏ సమస్యా వచ్చేది కాదు!
దీపిక మాత్రమే కాదు, చాలామంది అమ్మాయిలు సరైన అవగాహన లేక.. ఆరోగ్య బీమాపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. చేసే పనిలో పర్ఫెక్షనిజం కోరుకునే అతివలు వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఇలా నిర్లిప్త ధోరణితో ఉండటం ఆశ్చర్యమే! ఇక ఆరోగ్య బీమా, జీవిత బీమా లాంటి పదాలు కూడా గిట్టనట్టు వ్యవహరిస్తుంటారు. కస్తూరి కథ మరో మేలైన ఉదాహరణ. పెండ్లికి ముందు ఆమె ఉద్యోగం చేసేది. పెండ్లయ్యాక మానేసింది. ఆమె భర్త చిరు వ్యాపారి.
పెండ్లయ్యాక ఆమె భర్త ఇద్దరి పేరిట ఆరోగ్య బీమా తీసుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది! రెండు నెలలకే కస్తూరి నెల తప్పింది. తొమ్మిది నెలల తర్వాత కాన్పు కోసం ప్రైవేట్ దవాఖానలో చేరింది. ఆస్పత్రి వర్గాలు.. ఆమెకు ఆరోగ్య బీమా వర్తించదని తేల్చిచెప్పారు. సాధారణంగా ఆడపిల్లల విషయంలో ఆరోగ్య బీమా తీసుకున్నాక రెండేండ్ల వరకు కాన్పునకు బీమా కవరేజీ రాదు! ఆ తర్వాతే వర్తిస్తుంది. ఇది తెలియక పెద్దాసుపత్రిలో చేరిన కస్తూరికి బిల్లు చూశాక మళ్లీ పురిటి నొప్పులు వచ్చినంత పనైంది. అదేదో, తను ఉద్యోగం చేసే రోజుల్లోనే బీమా తీసుకొని ఉంటే.. ఇప్పుడు కంగుతినాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. సంపాదించే ఆడవాళ్లు.. పెండ్లికి ముందే ఆరోగ్య బీమా తీసుకోవడం అనివార్యం.
హెల్త్ ఇన్సూరెన్స్ చేతిలో ఉంటే.. కాలం పగబట్టినా, మీ ఆస్తిపాస్తులు సేఫ్‌గా ఉంటాయి! మహిళల కోసం రకరకాల కవరేజీలతో ఆరోగ్య బీమాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నాచితకా సమస్యల నుంచి దీర్ఘకాలిక రుగ్మతలకూ వర్తించే పాలసీలు కోకొల్లలు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు పోటీపడి మరీ సరసమైన ప్రీమియంతో ఈ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. గర్భం దాల్చిన తర్వాత వైద్యులు సూచించే రకరకాల పరీక్షలు కూడా కవర్ అయ్యే ఆప్షన్స్ ఇందులో ఉంటున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన.. ఉద్యోగంలో ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ముప్పయ్ ఏండ్ల లోపు బీమా తీసుకుంటే ప్రీమియమ్ కూడా తక్కువగానే పడుతుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం ధరలు ప్రియం అవుతాయి. కొన్ని వ్యాధులకు కవరేజీ విషయంలో కాల పరిమితులు అడ్డుపడతాయి.
-ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in