భారతదేశంలో నాలుగు పదుల వయసు నిండకుండానే క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. నాసిరకపు జీవనశైలి, వాతావరణ కాలుష్యం ఈ సమస్యకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం, తగినంత శారీరక శ్రమ చేయకపోవడం కూడా యువతరంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయి. వీటికితోడుగా పొగాకు వినియోగం, మద్యపానం, ఊబకాయం, ఒత్తిడి లాంటివి తమవంతుగా క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం కోసం రోజూ తగినంత శారీరక శ్రమ చేయడం, స్వచ్ఛమైన నీళ్లు తాగడం, నాణ్యమైన పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక భారతదేశ యువతరంలో క్యాన్సర్ గురించి ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త్ భారత్ అనే ఎన్జీవో అధ్యయనం చేసింది.
ప్లాస్టిక్ నీళ్ల సీసాలు, డబ్బాల్లో బైస్ఫినాల్ ఏ (బీపీఏ) అనే రసాయనాన్ని వాడతారు. అయితే, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ నిర్వహించిన శాస్త్రీయ సమావేశాల్లో బీపీఏకు, మన శరీరంలో హార్మోన్ల పనితీరు దెబ్బతినడానికి లంకె ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఇంకా టైప్ 2 డయాబెటిస్ ముప్పును కూడా బీపీఏ పెంచుతుందట. మన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు బీపీఏ స్థాయులు రోజుకు 5 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చట. కానీ, ఇప్పుడు మనం వినియోగిస్తున్న డబ్బాల్లో దీని సంఖ్య 100 రెట్లు ఎక్కువగా ఉందట. అందువల్ల ప్లాస్టిక్కు బదులుగా స్టీలు, గాజు పాత్రలు ఎంచుకోమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. లేదంటే బీపీఏ లేని ప్లాస్టిక్ ఎంచుకోవాలట.
చెరువులు, సముద్రాల్లో స్నానం చేసినప్పుడు, లేదంటే నీళ్లలో గడిపినప్పుడు కొన్నిసార్లు చర్మం కందిపోతుంది. వాచిపోయినట్టు అనిపిస్తుంది. మంటగా ఉంటుంది. దీన్ని స్విమర్స్ ఇచ్ అని పిలుస్తారు. నీటి వనరుల్లో ఉండే నత్తల నుంచి విడుదలైన పరాన్నజీవులు స్విమర్స్ ఇచ్కు కారణమవుతాయి. దీని కారణంగా అసౌకర్యంగా ఉంటుంది. స్విమర్స్ ఇచ్ సమస్య తలెత్తినప్పుడు సొంత వైద్యం కాకుండా డాక్టర్ను సంప్రదించాలి. అతను కాలమైన్ లోషన్ లేదంటే యాంటిహిస్టమైన్ వాడమని సూచిస్తాడు. ఇక ఈత కొట్టడానికి తగిన ప్రదేశాన్నే ఎంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈత కొట్టిన తర్వాత మళ్లీ మంచినీళ్లతో స్నానం చేయాలి. మరో విషయం మనం ఈతకొట్టే ప్రదేశాల్లో పక్షులకు ఆహారం వేయకూడదు. ఇవి కూడా స్విమింగ్ ఇచ్ ఇన్ఫెక్షన్కు కారణమవుతాయి.