ప్రపంచమంతా పూలతో దేవుణ్ని పూజిస్తే, పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ.. బతుకమ్మ! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక! ఆడబిడ్డలంతా సంబురంగా జరుపుకొనే ఘనమైన వేడుక. ప్రకృతిని ఆరాధిస్తూ సాగే పూల పండుగ. తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, బంతులు, కట్లపూలు, గుమ్మడి పూలు.. ఒక్కటేమిటి తీరొక్క పూలు, బతుకమ్మకు నిండుతనాన్ని ఇస్తాయి. వీటిలో ఉండే ఔషధాల గుణాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
బతుకమ్మలో వాడే మరో ప్రత్యేకమైన పువ్వు.. పట్నం బంతి. ఇందులోని సుగుణాలు.. కండరాలు బిగదీసుకుపోకుండా నివారిస్తాయి. గొంతు నొప్పిని తగ్గించడంలోనూ చక్కగా పనిచేస్తాయి.
బతుకమ్మను పేర్చడం గుమ్మడి ఆకులతో మొదలై.. గుమ్మడి పువ్వులోని గౌరమ్మను ప్రతిష్ఠించడంతో పూర్తవుతుంది. పండుగతోపాటే గుమ్మడి తీగ కూడా మొగ్గలు తొడుగుతుంది. ఈ పూలల్లో సహజసిద్ధ ‘పసుపు గౌరమ్మ’ కొలువై ఉంటుంది. గుమ్మడి పువ్వులో విటమిన్-ఎ, సి పుష్కలం. వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది కూడా.
బతుకమ్మలో గుమ్మడి తర్వాత ఎక్కువ ప్రాధాన్యం కలిగిన పువ్వు.. తంగేడు. ఇది మన రాష్ట్ర పుష్పం. దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. ఈ పూల కషాయం తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. తంగేడు పూల పొడిని బెల్లంతో కలిపి తీసుకుంటే.. అతిమూత్ర వ్యాధి, నరాల బలహీనత దూరం అవుతాయి. తంగేడుపూల టీ తాగితే.. నెలసరి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. తంగేడు ఆకులు, పూలను చెరువులు, కుంటల్లో వేయడం వల్ల.. కొత్త నీటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది.
బతుకమ్మను పేర్చడంలో ఎక్కువగా వాడేవి గునుగు పూలు. ఇవి గడ్డిజాతికి చెందినవి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రక్తపోటును తగ్గించడంలో గునుగు పువ్వు ముందుంటుంది. నోటిలో పుండ్లు, ముక్కులో రక్తస్రావాన్ని తగ్గించడానికి దీనిని వాడుతారు. గునుగు పూలు చర్మంపై గాయాలు, పొక్కులను తగ్గిస్తాయి.
బతుకమ్మకు చక్కటి అందాన్ని ఇచ్చేవి పట్టుకుచ్చు (సీత జడ) పూలు. ఇది అమరాంథస్ కుటుంబానికి చెందిన మొక్క. పట్టుకుచ్చు పూలలో జలుబు, ఆస్తమాను తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి. వీటి ఆకులు గాయాలు, నోటి పొక్కులను నివారించడంలో సాయపడుతాయి.
ఆయుర్వేద మందులు, సుగంధ ద్రవ్యాల తయారీలో తామర పువ్వులు, నూనెను వాడుతారు. తామర తొడిమల నుంచి స్రవించే జిగురును డయోరియా నివారణలో, కొమ్మను అజీర్తి నివారణలో వినియోగిస్తారు. మలబద్ధకాన్ని తగ్గించడంలో తామర తైలం దివ్య ఔషధం. చర్మ సంబంధ వ్యాధులనూ నివారిస్తుంది.