అనుమానమే లేదు. మనది పురుషాధిక్య సమాజమే! ఇంట్లో రిమోట్ నుంచి కారు స్టీరింగ్ వరకూ పురుషులదే పైచేయి. కానీ, పిల్లల ఎదుగుదలలో మాత్రం తల్లిదే ముఖ్యపాత్రగా ఉండేది. ప్రసవ వేదనతో మొదలయ్యే తన త్యాగం, ఆ పిల్లలకు పురుళ్లు పోసినా ఆగేది కాదు. అందుకే, ప్రతి మగవాడి వెనుకా ఓ స్త్రీ ఉంటుంది అనే విషయం ఒప్పుకోకపోయినా… తన తల్లి పాత్ర మాత్రం ఉండితీరుతుంది అనేంతగా అమ్మను తల్చుకుంటాం. దేవుడైన శ్రీకృష్ణుణ్ని కొల్చుకున్నా యశోద ప్రస్తావన ఉండాల్సిందే. శివాజీని పొగిడినా జిజాబాయిని గుర్తుచేసుకోవాల్సిందే. మరి తండ్రి పాత్ర! ఆర్థికమైన అండ, దారి తప్పితే దండింపు… ఈ రెండు సందర్భాల్లోనే తను కనిపించేవాడు. ‘అమ్మో మా నాన్న చండశాసనుడు’, ‘మా నాన్న అడుగుల చప్పుడు వింటేనే వణుకు’, ‘గారాబంతో పాడైపోతాం అని ఆయన మమ్మల్ని దగ్గరకు తీయలేదు’… లాంటి మాటలు మనకు కొత్త కాదు. కానీ, కాలం మారుతున్నది. కనీసం తన పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నది. ‘నాన్న ఎందుకో వెనకబడ్డాడు…’ అంటూ కొత్తగా తనను తలకెత్తుకుంటున్నారు. పిల్లల కోసం నిశ్శబ్దంగా పాటుపడుతూ, తన చిన్నచిన్న కోరికలను సైతం కుటుంబం కోసం త్యాగం చేస్తూ, పెరిగిన జీవన వ్యయాన్ని పంటిబిగువున సహిస్తూ, ఇంటి బాధ్యతను సైతం పంచుకుంటూ… ఇంతాచేసి కష్టం వస్తే, దాన్ని తనలోనే అణచుకుంటున్న ఇప్పటి తండ్రుల పాత్రను విస్మరించలేం. ఫాదర్స్ డే సందర్భంగా వెనకబడుతున్న నాన్నలను గుర్తుచేసుకునే ప్రయత్నమిది.
– కె.సహస్ర
అది కొవిడ్ విజృంభిస్తున్న కాలం. ఒకవైపు మరణ భయం, మరోవైపు ఇంటి నుంచి బయటికి కదల్లేని పరిస్థితి. ఆఫీస్ నుంచి ఆహారం వరకూ అంతా ఇంటికే పరిమితం. ఆ సమయంలో మనం ఎన్నో మార్పులను గమనించాం. ఓటీటీల వాడకం, వర్క్ ఫ్రం హోం సంప్రదాయం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆన్లైన్ సేవలు… ఇలా ఎన్నో మార్పులు మన జీవితంలో స్పష్టంగా కనిపించాయి. కానీ, ఒక నిశబ్ద విప్లవాన్ని మాత్రం అతికొద్ది మంది గమనించారు. అదే ‘ప్యాండమిక్ ఫాదర్‌హుడ్’. అకస్మాత్తుగా తండ్రి ఎంతలా ఇంటికి సాయపడగలడో, పిల్లల బాధ్యత తీసుకోగలడో తెలిసొచ్చింది. కబుర్లు చెప్పే స్నేహితుడిగా, చదువులో అనుమానాలు తీర్చే గురువుగా, వంటింట్లో నలభీముడి వారసుడిగా, సలహాలు ఇచ్చే మార్గదర్శిగా, మంచిచెడులు దగ్గరగా గమనించే శ్రేయోభిలాషిగా… తన విశ్వరూపం కనిపించింది. అప్పటిదాకా నిద్రాణంగా ఉన్న తన పాత్ర స్పష్టమైంది. కొవిడ్ ముగిసినా అది కొనసాగుతూనే వచ్చింది.
పారిశ్రామిక విప్లవం తర్వాత ‘పనిలో’ మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతూ వచ్చిందన్న విషయం స్పష్టమే. కానీ, ఈ మధ్య అది మరింతగా పెరిగింది. పెరుగుతున్న అక్షరాస్యత, మహిళలకు సమాన హక్కులు, పెరిగిన జీవనవ్యయాన్ని తట్టుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరూ పని చేయక తప్పని పరిస్థితులు… ఇలా ఎన్నో కారణాలతో గత పదేళ్లలో ఈ వేగం మరింత పెరిగింది. భారతీయ అధికారుల లెక్క ప్రకారమే 2017-18లో 22 శాతం మంది మహిళలు మాత్రమే ఉపాధిరంగంలో ఉంటే, 2023-24 నాటికి అది 41.7 శాతానికి చేరుకుంది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేయడం పెరిగింది. NSSO అనే సంస్థ అంచనా ప్రకారం 2023 నాటికి మన దేశంలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేసే కుటుంబాల సంఖ్య 40 శాతం వరకూ ఉంది. ఈ మార్పునకు అనుగుణంగా, ఇంటి బాధ్యతలను కూడా తండ్రులు పంచుకుంటున్నారు. Pew Research Center ప్రకారం 1965లో ఓ సగటు తండ్రి ఇంటి బాధ్యతల కోసం కేవలం 2.5 గంటలు మాత్రమే కేటాయించేవాడు. కానీ 2011 నాటికి అది 7.3 గంటలకు చేరుకుంది. ఇది అమెరికాకి చెందిన రీసెర్చ్. మన దేశంలోనూ మార్పు స్పష్టంగానే ఉంది. YouGov-Mint-CPR Millennial Survey మన నగరాల్లో సేకరించిన సమాచారంలో తేలిందేమిటంటే… దాదాపు 60 శాతం మంది మగవారు.. ఇంటిపనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు! లాంటి సామెతలు, మాటలు చాలు… మన చుట్టూ విస్తృతంగా, బలంగా ఉన్న అభిప్రాయాన్ని సూచించడానికి. కానీ, రోజులు మారుతున్నాయి. పిల్లల్ని చూసుకునేందుకు మగవారు ఇంటిపట్టునే ఉండిపోవడాన్ని అంత ఆశ్చర్యంగా చూడటం లేదట. ఈమధ్యకాలంలో అలాంటి తండ్రుల సంఖ్య రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనం. మేము మరింతగా పిల్లలతో గడపడానికి, ఇంకాసేపు ఇంటి పనుల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమే అంటూ తండ్రులు సర్వేలలో చెప్పుకొచ్చారు. ఇంట్లో తగినంతసేపు గడపలేకపోతున్నాం అంటూ మరికొందరు వాపోయారు. ఆ మార్పునకు అనుగుణంగానే ప్యాటర్నిటీ లీవ్ ఓ విలాసంగా కాకుండా అత్యవసరంగా మారింది. ప్రతి సంస్థా దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, లేదా ప్రసవించిన ఆరునెలల లోపు 15 రోజుల సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రైవేటు కంపెనీల మీద ఇలాంటి ఆంక్ష ఏమీ లేకపోయినా వేర్వేరు సంస్థలు ఈ ప్యాటర్నిటీ లీవ్‌ను అందిస్తూనే ఉన్నాయి. కొన్ని సంస్థలు మరో అడుగు ముందుకు వేసి సుదీర్ఘకాలం సెలవు ఇస్తున్నాయి. ఉదాహరణకు విప్రో రెండు నెలల పాటు ఈ సెలవు మంజూరు చేస్తే, జొమాటో ఏకంగా 26 వారాల ప్యాటర్నిటీ లీవ్ అందిస్తున్నది.
చిన్న కుటుంబం కావడం, పిల్లల ప్రపంచమూ ఇంటికే పరిమితం కావడం, నగరీకరణ వల్ల ఇంట్లోనే అన్ని పనులూ చేసుకోవాల్సిన పరిస్థితి, భార్య కూడా ఉద్యోగానికి వెళ్లడం లాంటి సవాలక్ష మార్పుల వల్ల తండ్రి పాత్ర పెరగాల్సిన పరిస్థితి. ఇప్పుడు తను పిల్లలకు ఆర్థికంగానో, క్రమశిక్షణ కోసమో ఆలంబన కాదు. పిల్లలను స్నేహితులుగా భావిస్తూ వారికి దగ్గరగా మసిలే ప్రయత్నం చేస్తున్నారు. వారాంతాలలో వారితో వీలైనంత సమయాన్ని గడుపుతూ జీవితకాలపు జ్ఞాపకాలను అందిస్తున్నారు. పిల్లలకు వండిపెట్టడం నామోషీగా భావించడం మానేసి… పాకశాస్త్రంలో ప్రయోగాలు చేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ఇదంతా చేస్తూనే పిల్లల ఎదుగుదలను, వారి ప్రవర్తనను ఓ కంట కనిపెడుతూ ఎప్పటికప్పుడు వారికీ మార్గనిర్దేశం చేస్తున్నారు. కెరీర్లోకి అడుగుపెట్టిన పిల్లలకు నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని కాకుండా.. తన కలలను గమనిస్తూ వాటిని ఎలా సాకారం చేసుకోవాలో సూచిస్తున్నారు. పిల్లలకు పెళ్లిళ్లయ్యి వారికంటూ సంసారాలు ఏర్పడిన తర్వాత, ఇక తమ బాధ్యత అయిపోయిందని తండ్రి పాత్ర నుంచి రిటైర్ అవడం లేదు. ముందు తరాలనూ గమనించుకుంటున్నారు. ఇదంతా తమ ఖాళీ సమయాల్లో చేయడం లేదు. ఒకవైపు తాము కెరీర్లో పరుగులు పెడుతూనే, ఆఫీసులో అవమానాలను ఎదుర్కొంటూనే, పని ఒత్తిడిని తట్టుకుంటూనే, ఇంకొద్ది రూపాయల కోసం రెండు మూడు ఉద్యోగాలు చేస్తూనే… ఇంటి బాధ్యతను మరింతగా తలకెత్తుకుంటున్నారు.
తండ్రి పోలికలు, జన్యువులు, క్రమశిక్షణ, వ్యసనాలు… వీటి ప్రభావం నేరుగా కనిపిస్తుంది. కానీ, మన ఊహకు కూడా అందని విధంగా తన ప్రభావం నీడలా పిల్లల్ని వెన్నాడుతుందని సైన్స్ చెబుతున్నది. ఈ ప్రభావం పిల్లలు పుట్టక ముందు నుంచే మొదలవుతుందట.
గర్భధారణలోను, ప్రసవం తర్వాత ఆడవాళ్లకి ఏదో ఒక ఆరోగ్య సమస్య రావడం తెలిసిందే. కానీ తండ్రులకి కూడా కొన్ని సమస్యలు ఉంటాయంటే నమ్మశక్యం కాదు. కానీ నిజం…
తొలిసారి తండ్రికాబోతున్నవారి మెదడులో అనూహ్యమైన మార్పులు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల సంరక్షణను అందించేందుకు సిద్ధపడేలా ఈ మార్పులు జరుగుతాయట.
ప్రసూతి వైరాగ్యం! (Postpartum Depression). ఇది కేవలం మహిళలకే అనుకుంటాం. కానీ, పది శాతం తండ్రులలో కూడా ఇది ఏర్పడుతుందట. హార్మోన్లలో మార్పులు, సరిగా నిద్రలేకపోవడం, బంధాలలో మార్పులు, కొత్త బాధ్యతలు… ఇవన్నీ కూడా ఈ కుంగుబాటుకు కారణం అవుతుంటాయి. నిస్సత్తువ, కోపం, ఏకాగ్రత లోపించడం లాంటి సమస్యల్ని సృష్టిస్తాయి.
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ (Empty Nest Syndrome). ఒక వయసు వచ్చాక కెరీర్, ఉద్యోగం లాంటి కారణాలతో పిల్లలు దూరమవుతుంటారు. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన ఇప్పటి పరిస్థితుల్లో ఇది ఇంటింటా కనిపించే పరిస్థితే. ఏదో ఓ కారణంతో పిల్లలు దూరమైతే పడే బాధనే Empty Nest Syndrome అంటారు. తెలియని దిగులు, భయం, ఒంటరితనం, ఏదో కోల్పోయిన భావన… అన్నీ కూడా ఈ సిండ్రోమ్ వల్ల అనుభవంలోకి వస్తాయి.
చాలామంది బాల్యంలో ఏవో చేదు జ్ఞాపకాలను ఎదుర్కొంటారు. తమ తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమ లభించకపోవడం, హింస, అవమానం… లాంటి గాయాలు ఉండి ఉంటాయి. వాటిని ఎలాగొలా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగుతారు. కానీ, తిరిగి తను కూడా ఓ తండ్రి అయ్యే సమయంలో ఆ చేదు జ్ఞాపకాలన్నీ మేల్కొంటాయట.
ఒకప్పుడు తల్లుల కష్టం గురించి, వాటిని పంటిబిగువున తట్టుకుంటూ సాగే సహనం గురించీ, పిల్లల కోసం ఏ స్థాయి వరకైనా చేసే త్యాగం గురించీ చెప్పుకొనేవారం. మరి తండ్రుల సంగతి ఏమిటి. ఎవరూ గమనించని వారి ఒత్తిడి సంగతేంటి! ఇతరులు గమనించకపోయినా…
ఆ బాధ్యతలో ఉన్నవారు తమ కష్టానికి దారి తెలుసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
పిల్లలతో ఎక్కువసేపు గడపలేకపోతున్నాం అనే పశ్చాత్తాపం కంటే… ఎంత నాణ్యమైన సమసయాన్ని గడపగలం అనే ఆలోచన చేయాలి.
ఆరోగ్యంగా ఉంటేనే ఒత్తిడిని తట్టుకోగలం. అందుకే దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఊబకాయాన్ని తగ్గించుకోవడం, రక్తపోటు లాంటి సమస్యలను అదుపులో ఉంచుకోవడం, నడక, ధ్యానం, వ్యాయామం, ఆటలు… ఇలా మనను, మనసును ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
అడిగిన ప్రతిదీ కొనిపెట్టడం సామర్థ్యం కాదు, అందుకు అంతు కూడా ఉండదు. పైగా పిల్లలు అడిగిన వెంటనే కొనిపెట్టడం వల్ల వారిలో ఓర్పు, సహనం పాళ్లు తగ్గిపోతాయనే విశ్లేషణ ఉంది. అందుకే మన స్తోమత ఏంటి, పరిమితులు ఏంటి అన్నది పిల్లలకు వివరించగలగాలి.
ఒత్తిడి, కష్టం తట్టుకోలేకపోయినా కూడా దాన్ని పంటిబిగువున ఓర్చుకోవడం మగవారికి అలవాటు. మగవాడు ఏడవకూడదు అనే అభిప్రాయంతో కనీసం కన్నీటిని కూడా విడవరు. ఇతరులకు చెప్పుకొంటే పలచన అవుతామనే భయంతో పంచుకోరు. ఆ పరిమితిని దాటాలి. కష్టాన్ని భార్యతో, స్నేహితులతో చెప్పుకోగలగాలి. అదీ కుదరకపోతే ఓ థెరపిస్ట్‌ను సంప్రదించడంలో తప్పు లేదు.
ఆఫీసు పనిలో ఎలాగూ తీరిక ఉండదు. ఇంటికి వచ్చాక పిల్లలతో గడపడం, షాపింగ్, షికార్లు… అంటూ సమయం దొరకదు. మరి తనకంటూ కొంత సమయం కావాలి కదా. పుస్తకాలు చదవడమో, సంగీతం వినడమో, స్నేహితులను కలవడమో… అది తన ఇష్టం. అందుకే ‘తన సమయాన్ని’ కూడా గౌరవించాలి.
పితృదినోత్సవం సహా… చాలా రోజుల వెనకాల ప్రత్యేకమైన కారణాలు, సదుద్దేశాలు ఉన్నప్పటికీ… వాటిని ప్రచారం చేయడం వల్ల ఎక్కువగా లబ్ది పొందేది వాణిజ్య సంస్థలే! ముఖ్యంగా గ్రీటింగ్ కార్డ్ కంపెనీలు. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ఓ గ్రీటింగ్ కార్డ్ ఇస్తే బాగుండు అనే ఆలోచన చాలామందికి వస్తుంది. అందుకనే సదరు కంపెనీలు వీటిని విపరీతంగా ప్రచారం చేస్తుంటాయి. లాభాలు ఆర్జిస్తుంటాయి. కేవలం మాతృ, పితృ దినోత్సవాలే కాదు! బాస్ దగ్గర నుంచి నర్స్ వరకూ సవాలక్ష దినోత్సవాలను ప్రోత్సహిస్తుంటాయి. ఏకంగా అవి సెలవు రోజులుగా మారేందుకు కృషి చేస్తుంటాయి. కాబట్టి వీటన్నింటికీ ‘హాల్ మార్క్ హాలీడేస్’ అని పేరు.
మదర్స్ డే, పేరెంట్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే, సిబ్లింగ్స్ డే… ఇలా ప్రతి బంధానికీ ఓ రోజును ఏర్పాటు చేసేశారు. వీటి వెనకాల ఉన్న చరిత్ర అంత బలంగా ఏం కనిపించదు. కేవలం వారిని గుర్తుచేసుకోవడానికి ఓ రోజును కేటాయించినట్టే ఉంటుంది. కానీ, ఫాదర్స్ డే వెనకాల ఒకటి కాదు రెండు ఆసక్తికరమైన కథలు కనిపిస్తాయి. ఒకటి విషాదానికి ప్రతీకగా నిలిస్తే… మరొకటి త్యాగానికి మారుపేరులా కనిపిస్తుంది.
డిసెంబర్ 6, 1907న అమెరికాలోని మొనొన్గా అనే ఊరిలో ఓ ప్రమాదం జరిగింది. అక్కడి గనిలో జరిగిన పేలుడు వల్ల 362 మంది చనిపోయారట. అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువగా ఉండవచ్చని అనుమానం. ఈ చనిపోయినవారిలో ఇటలీ, గ్రీస్, ఆస్ట్రియా తదితర దేశాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన బడుగు జీవులే అధికం. అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద గని ప్రమాదం. ఈ ఘటనలో ఎక్కువగా యువకులే చనిపోవడంతో… వారి మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వీరిలో అయిదు వందలకు పైగా పిల్లలున్నారు. తమ కుటుంబం కోసం అలాంటి ప్రమాదకర పనిలోకి దిగి చనిపోయిన వారి జ్ఞాపకార్థం, మరుసటి ఏడు ఫాదర్స్ డే నిర్వహించాలని తలపెట్టారు. కానీ దీనికి అంతగా ప్రచారం లభించలేదు.
1910లో సొనారా అనే యువతి మరోసారి ఫాదర్స్ డే తలపెట్టింది. సొనారాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు తన తల్లి చనిపోయింది. సొనారాతో పాటు మరో అయిదుగురు పిల్లల ఆలనాపాలనా చూసుకున్నాడు తన తండ్రి విలియం డేవిడ్. వారిలో ఓ పసిగుడ్డు కూడా ఉంది. అప్పటికి కొత్తగా వచ్చిన మదర్స్ డేకి ప్రచారం లభించడంతో… తన తండ్రిలాంటి వారి కోసం ఫాదర్స్ డే ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనుకుంది. క్రమంగా జూన్ నెలలో మూడో ఆదివారాన్ని పితృదినోత్సవంగా నిర్వహించడం మొదలైంది. ప్రస్తుతానికి వందకు పైగా దేశాలు ఈ రోజును పాటిస్తున్నాయి.
పితృదినోత్సవం కథేంటి? ప్రత్యేకించి తనకోసం ఓ రోజు కావాలా! ఆ ఒక్క రోజే తనను పరిమితం చేయాలా? లాంటి ప్రశ్నలు అలా ఉండనివ్వండి. తండ్రికి కృతజ్ఞత చెప్పే అవకాశంగా, తనను తలుచుకునే సందర్భంగా ఈ రోజును గుర్తిద్దాం. నేరుగా తనకు చెప్పడానికి మొహమాటంగా ఉంటే… కనీసం తనతో కాసేపు మనసారా గడుపుదాం. తన ఆశల్ని అర్థం చేసుకుందాం. పడుతున్న కష్టాన్ని గ్రహిద్దాం. ఎదిగిన విలువల్ని పాటిద్దాం. కుదిరితే ఓ చిన్న థాంక్స్ చెబుదాం.