Viral news : మల్లెపూలు (Jasmine) తీసుకెళ్లినందుకు మలయాళ నటి (Malayal actress) నవ్య నాయర్ (Navya Nair) కు ఆస్ట్రేలియా (Australia) లోని విమానాశ్రయ అధికారులు ఇటీవల రూ.1.14 లక్షల జరిమానా విధించారు. నిషేధం ఉన్న వస్తువులను తీసుకెళ్తే అక్కడ జరిమానాలు మాత్రమే కాదు, ఒక్కోసారి జైలుశిక్షలు కూడా వేస్తారట. ఈ నేపథ్యంలో మల్లెపూలు తీసుకెళ్తే జరిమానా దేనికి..? అక్కడ మల్లెపూలపై నిషేధం ఎందుకు..? ఇంకా ఏయే వస్తువులపై నిషేధం ఉంది..? అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి.
ఆస్ట్రేలియాలో నిషేధం ఉన్న వస్తువులు, పదార్థాల విషయానికి వస్తే తాజా పువ్వులు, పండ్లు, కూరగాయలు.. ఎండిన పువ్వులు, పండ్లు, కూరగాయలపై నిషేధం ఉంది. మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ముడి గింజలు, విత్తనాలపై కూడా అక్కడి సర్కారు నిషేధం విధించింది. పాల ఉత్పత్తులు, బర్ఫీ, రసమలై, రసగుల్లా, దూద్పేడ, గులాబ్ జామున్, మైసూర్ పాక్ లాంటి స్వీట్లపై కూడా నిషేధం ఉన్నది. బియ్యం, టీ, తేనె, ఇంట్లో తయారుచేసిన ఆహారం, పెంపుడు జంతువుల ఆహారం, పక్షులు జంతువుల ఈకలు, ఎముకలు కూడా అక్కడ నిషేధం. అదేవిధంగా చర్మంతో చేసిన జాకెట్లు, బ్యాగులు, దుప్పట్లతోపాటు మూలికలను కూడా ఆస్ట్రేలియాలో అనుమతించరు.
నిషేధ వస్తువుల విషయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఆస్ట్రేలియా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. విదేశీ ప్రయాణికులు నిషేధిత వస్తువులను తీసుకువస్తే వాటిని స్వాధీనం చేసుకున్న వెంటనే ధ్వంసం చేసి, తెచ్చిన ప్రయాణికులకు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తారు. ఒకవేళ అవి తీవ్రమైన ఉల్లంఘనలైతే ప్రయాణికుల వీసాలను సైతం రద్దుచేసే అవకాశం ఉంటుంది.
అయితే ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రయాణికులు తాము తీసుకువెళ్తున్న ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించిన వివరాలను ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. అవి నిషేధిత జాబితాలో ఉంటే విమానాశ్రయం అధికారులు సీజ్ చేస్తారు. కానీ ఎలాంటి జరిమానా విధించరు. అలా కాకుండా దొంగచాటుగానో, తెలియకనో నిషేధిత వస్తువులను తీసుకెళ్తే మాత్రం తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదు.
ఆస్ట్రేలియా సర్కారు కొన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలపై నిషేధం విధించడం వెనుక ఒక కారణం ఉంది. వాటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతుండటం, ప్రజలకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉండటం లాంటి కారణాల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈవిధంగా ఆస్ట్రేలియా పాలకులు పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.