స్టేషన్లోకి అప్పుడే ఎంటరైన ఇన్స్పెక్టర్ రుద్ర మొబైల్ మోగింది. ‘ఏంటా?’ అని ఆరా తీస్తే, కృష్ణాపురం కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఫుడ్ పాయిజన్‌తో చనిపోయారని తెలిసింది. దీంతో తన సిబ్బందితో సరాసరి ఘటనాస్థలికి చేరుకొన్నాడు రుద్ర. ఇంట్లోని ఓ బెడ్రూమ్లో మంచంపై నోట్లోంచి నురగలు కక్కుకొని ఓ 17 ఏండ్ల అమ్మాయి చనిపోయి ఉన్నాడు. కిచెన్ పక్కనున్న డైనింగ్ టేబుల్ కుర్చీలో పదేండ్ల అబ్బాయి కూడా నోట్లోంచి నురగకక్కుకొని అదేవిధంగా మరణించి పడి ఉన్నాడు.
ఇద్దరి మృతదేహాలను చూస్తూ.. ‘అక్కా.. అన్నయ్య’ అంటూ ఓ ఎనిమిదేండ్ల్ల పిల్లాడు గుక్కపెట్టి ఏడుస్తూ కనిపిస్తున్నాడు. ఓ వృద్ధురాలు ఆ పిల్లాడిని ఓదారుస్తున్నది. మరో ఇద్దరు మహిళలు గుండెలు బాదుకుంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆ అరుపులు విని చుట్టుపక్కల వారంతా గుమిగూడారు. దీంతో ఇంటిబయట బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు అసలేం జరిగిందో వాకబు చేయడం ప్రారంభించారు. ‘అసలేమైంది?’ వృద్ధురాల్ని ప్రశ్నించాడు రుద్ర. ‘సార్.. నేను పక్కింట్లో ఉంటాను. బెడ్రూమ్లో చనిపోయిన అమ్మాయి పేరు మిత్ర. ఇదిగో ఈ కుర్చీలో చనిపోయిన బాబు పేరు మోక్ష. వీళ్లిద్దరూ అక్కా-తమ్ముళ్లు. నా చేతుల్లో ఉన్న ఈ బాబు దేవాన్ష్. వాళ్లకు చిన్నతమ్ముడు. వీళ్ల తల్లిదండ్రులు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు’ చీర కొంగుతో కండ్లు తుడుచుకొంటూ చెప్తూ పోయింది ఆ వృద్ధురాలు.
‘సార్.. వీళ్లది ఎంతతిన్నా తరగని ఆస్తి. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లల ఆలనాపాలన పేరిట ఆస్తిపై కన్నేస్తూ ఇంట్లోకి చేరేవారు ఎక్కువయ్యారు. ఇది గమనించిన పిల్లల మేనమామ సురేశ్.. ఆస్తిని కంటికి రెప్పలా కాపాడుతూ ఇన్నేళ్లూ వస్తున్నాడు. పిల్లలు మేజర్లయ్యాక వారికి దాన్ని అప్పగించాలని అతని ఆలోచన. బిజినెస్ పనిమీద మూడ్రోజుల కిందటే అతను ఢిల్లీకి వెళ్లాడు. ఇంతలో.. పిల్లల నోట్లోంచి నురగవస్తోందంటూ పనిమనిషి రమణమ్మ, పిల్లల పిన్ని సునయన పరిగెత్తుకొంటూ బయటకు వచ్చారు. నేను వచ్చేలోపు పిల్లలు నిర్జీవులుగా పడి ఉన్నారు.. ’ అని బాధతో వృద్ధురాలు చెప్తూ పోయింది.
‘మీరేనా సునయన?’ అడిగాడు రుద్ర. అవునంటూ తలూపింది ఆమె. ‘పిన్ని అంటే, పిల్లల తల్లికి మీరు సిస్టరా?’ రుద్ర అడిగాడు. ‘ఓన్ సిస్టర్ను కాదు. అక్కచెల్లెల్ల బిడ్డలం’ బదులిచ్చింది సునయన. ‘మీరేం చేస్తారు?’ రుద్ర ప్రశ్న. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా..’ ఆమె సమాధానం. ‘సరే.. పిల్లలు ఏం తిన్నారు?’ సూటిగా మ్యాటర్‌లోకి వచ్చాడు రుద్ర. ‘మోక్ష పాయసం తిన్నాడు. మిత్ర యాపిల్ తిన్నది’ బదులిచ్చింది సునయన. ‘పాయసం ఎవరు చేశారు?’ అడిగాడు రుద్ర. ‘మోక్ష బాబు బర్త్‌డే అని సునయనమ్మే చేశారు’ బదులిచ్చింది రమణమ్మ. ‘పాయసం తినడం ఇష్టంలేదంటే, మిత్ర అమ్మగారికి కూడా యాపిల్‌ను బలవంతపెట్టి మరీ సునయనమ్మే తినిపించారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది’ అంటూ రమణమ్మ గగ్గోలు పెట్టింది. ఇంతలో.. పాయసంలో, యాపిల్‌లో విషం కలవడంతోనే పిల్లలు చనిపోయారని ఫోరెన్సిక్ టీమ్ తేల్చిచెప్పింది. ‘మేడమ్ సునయన.. మీరు మాతో స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది’ అన్నాడు రుద్ర.
‘ఇన్స్పెక్టర్.. పిల్లల్ని నేనే చంపానంటున్నారా? మోక్షకు పాయసం నేనే ఇచ్చా. మిత్రకు యాపిల్‌ను కూడా నేనే ఇచ్చా. కాదనట్లేదు. అయితే, మోక్షకు ఇచ్చిన పాయసాన్నే నేను, రమణమ్మ తాగాం. మిత్రకు ఇవ్వగా మిగిలిన సగం యాపిల్‌ను దేవాన్ష్‌కు కూడా ఇచ్చా. వాడు కూడా తిన్నాడు. ఒకవేళ, నేను నిజంగా వాటిల్లో విషం కలిపి ఉంటే, పాయసం తిన్న మేము, యాపిల్ తిన్న వాడు కూడా చనిపోవాలిగా?!’ కండ్లు తుడుచుకొంటూ ప్రశ్నించింది సునయన. ‘మేడమ్.. సివిల్స్ ట్రిక్స్ ఇక్కడ వద్దు. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ముందు స్టేషన్‌కు పదండి. రమణమ్మ నువ్వు కూడా నడువ్’ అంటూ హెడ్ కానిస్టేబుల్ రామస్వామి గద్దించాడు. ‘బాబాయ్.. ’ అంటూ రామస్వామి బిహేవియర్‌ను తన స్వరంతో తప్పుబట్టాడు రుద్ర. అందరూ స్టేషన్‌కు కదిలారు.
స్టేషన్‌కు చేరుకొనే సమయంలో రుద్ర దీర్ఘాలోచనలో పడ్డాడు. సునయన అడిగిన ప్రశ్నలే అతని మెదడును తొలుస్తున్నాయి. ఆమె అడిగిన వాటిలో కూడా నిజం ఉందిగా అనుకొన్నాడు. ‘నిజంగా సునయన ఆ పని చేయలేదని అనుకొందాం. మరెవరు చేసినట్టు? ఎలా చేసినట్టు? విషం కలిసిన పాయసాన్ని అందరూ తింటే, ఒక్కరే ఎలా చనిపోయినట్టు? రెండు ముక్కల యాపిల్‌ను తిన్న ఒకరు చనిపోతే, మరొకరు ఎలా బతికి ఉన్నట్టు?’ ప్రశ్నలతో రుద్ర మెదడు వేడెక్కిపోయింది. ఇంతలో తాను గతంలో సాల్వ్ చేసిన ‘స్మిత-రాణి-హారిక ఐస్‌క్యూబ్స్ కేసు’ గుర్తుకొచ్చింది రుద్రకు. దీంతో ఫోరెన్సిక్ టీమ్ హెడ్‌కు కాల్ చేసిన రుద్ర.. మరిన్ని విషయాలు అడిగి సమాధానాలు రాబట్టుకొన్నాడు.
అలా.. అరగంటలో స్టేషన్‌కు చేరుకొన్నారో లేదో.. ‘పాయసాన్ని గ్లాస్లో పోసిందెవరు? యాపిల్ కట్ చేయడానికి చాకును అక్కడ పెట్టిందెవరు?’ సూటిగా ప్రశ్నించాడు రుద్ర. ‘రమణమ్మ’ సమాధానమిచ్చింది సునయన. ‘సునయనమ్మ ఇవ్వమంటేనే ఇచ్చా’ వణికిపోతూ రమణమ్మ బదులిచ్చింది. సునయన, రమణమ్మ ఫోన్లలోని కాల్ హిస్టరీని చెక్ చేసిన రుద్ర.. రమణమ్మను లోపలికి తీసుకెళ్లమని లేడీ కానిస్టేబుల్స్‌ను పురమాయించాడు. ఢిల్లీకి వెళ్లానని అబద్ధం చెప్పిన సురేశ్‌ను కూడా రెండు గంటల్లో పోలీసులు పట్టేసుకొన్నారు. ఇంతకీ, పిల్లల హత్య ఉదంతాన్ని రుద్ర ఎలా కనిపెట్టగలిగాడు??
రమణమ్మ ఈ రెండు హత్యలు చేసింది. విషాన్ని మోక్ష తాగే గ్లాసుకు పూసింది. అందులో సునయన చేసిన పాయసం పోసింది. ఇక, పాయసం వద్దన్న మిత్ర కోసం సునయన యాపిల్ తెమ్మంది. తొలుత చాకుకు రెండు వైపులా విషాన్ని పూయాలనుకొన్న రమణమ్మ.. రెండో యాపిల్ ముక్క ఒకవేళ సునయన తింటే ఆమె చచ్చి.. ఈ మొత్తం కేసు తనమీదకు వస్తుందని భయపడింది. అందుకే మిత్రకు ఇచ్చే ముక్క వైపునే చాకుకు విషం పూసింది. అలా మిత్రను చంపేసింది. సునయనే పాయసం చేయడం, యాపిల్ తీసుకురమ్మనడంతో పోలీసు కేసు ఆమె మీదకు వస్తుందని రమణమ్మ భావించింది. ఇక, సునయన ఈ కేసులో జైలుకు వెళ్లాక చిన్న పిల్లాడిని బిల్డింగ్ మీద నుంచి తోసి చంపాలనుకొన్నది రమణమ్మ. కాగా రుద్ర మెదడు పాదరసంలా పనిచేయడంతో రమణమ్మ ఇలా దొరికిపోయింది. కాగా ఆస్తి కోసం మంచివాడిలా నటించిన సురేశ్ పురమాయించడంతోనే.. వచ్చే ఏడాది మేజర్ కాబోతున్న మిత్రను, అలాగే మోక్షను రమణమ్మ ఇలా చంపేసినట్టు వాళ్లు మాట్లాడుకొన్న కాల్ సంభాషణల ద్వారా తెలిసింది.
…? రాజశేఖర్ కడవేర్గు