ఇటీవల ఢిల్లీలో ఓ 32 ఏండ్ల ఐటీ ఉద్యోగిని పిత్తాశయం నుంచి డాక్టర్లు 1,500 రాళ్లను తొలగించారు. ఇది వైద్యరంగాన్ని కుదిపివేసింది. ఇక సమస్యకు కారణం ఆ ఉద్యోగిని క్రమం తప్పకుండా జంక్‌ఫుడ్, కొవ్వులు ఎక్కువున్న ఆహారం తీసుకోవడమేనట. దీంతో ఆమెకు కడుపు ఉబ్బిపోయినట్టుగా, బరువుగా ఉండేది. దీన్ని అధిగమించడానికి మూడు నాలుగు నెలలపాటు యాంటాసిడ్లు తీసుకుంటూ లాక్కొచ్చింది. ఆమె పొత్తికడుపు పైభాగంలో నొప్పిగా, వికారం, వాంతులతో బాధపడింది. చివరికి డాక్టర్‌ను కలిసింది. అల్ట్రాసౌండ్ పరీక్షలో ఆమె పిత్తాశయం (గాల్‌బ్లాడర్) రాళ్లతో నిండిపోయిందని తేలింది. ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ డాక్టర్లు ఆమెకు సర్జరీ చేసి రాళ్లతోపాటు పిత్తాశయాన్ని కూడా తొలగించారు. కాబట్టి, వేళకు పోషకాలతో కూడిన భోజనం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
పిల్లలు అల్లరి మొదలుపెట్టగానే వారి చేతికి స్మార్ట్‌ఫోన్ ఇచ్చి ఊరకుంచడం ఇటీవల అందరు తల్లిదండ్రులు చేస్తున్నదే. అయితే, తల్లిదండ్రులు ఇలా చేయడం పిల్లలు భవిష్యత్తులో తమ భావోద్వేగాల నియంత్రణ మీద అదుపు కోల్పోవడానికి దారితీస్తుందని హంగరీ, కెనడా దేశాలకు చెందిన పరిశోధకులు కనుక్కొన్నారు. దీనికోసం పరిశోధకులు రెండు నుంచి ఐదు ఏండ్ల మధ్య వయసున్న పిల్లల 300 మంది తల్లిదండ్రులను ఏడాదిపాటు పరిశీలించారు. అందుకని పిల్లల అల్లరిని డిజిటల్ పరికరాలతో తగ్గించలేమని వారు వెల్లడించారు. పిల్లలు తమ భావోద్వేగాలను తామే గుర్తించి, అదుపు చేసుకునేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించడం మంచిదని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు.
మితం తప్పితే అమృతమైనా విషమే అనే సామెత తెలిసిందే. ఆహారం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మన శరీర అవసరాలకు తగిన విధంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంతేతప్ప ప్రొటీన్లు ఉన్న ఆహారం మంచిదనో… మరొకటనో నిర్ణయించేసుకుని అలాంటి ఆహారమే తింటూ కూర్చోవద్దట. కండరాలు పెరగడానికి, వాటి మరమ్మతుకు మన శరీరానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. అయితే, ప్రొటీన్ల మోతాదు మించితే వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రొటీన్లు ఎక్కువైపోతే మూత్రపిండాలు, కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికీ మంచిది కాదు. కాల్షియం లోపానికి దారితీస్తుంది. దీంతో కీళ్లనొప్పులు తలెత్తుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణమవుతుంది. క్యాన్సర్ లాంటి రోగాల ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి, శరీర బరువు, వయసు, శారీరక శ్రమ ఆధారంగా ఆహారంలో ప్రొటీన్లు పరిమాణం ఉండేలా చూసుకోవాలి.