మా అయిదుగురు మేనత్తల్లో ముగ్గురివి జనగామ దగ్గర్లో ఇటూ అటుగా అన్నీ పల్లెటూళ్లే. చాలా మారుమూల గ్రామాలనో, లేక నీటి వసతి ఉండదనో, ప్రయాణం చేస్తుంటే విపరీతమైన దుమ్ము రేగి, ఒంటి నిండా సన్నటి ధూళి పడడం వల్లనో… మరెందుకో గానీ, మా చిన్నాయన వాళ్లు ఆ ప్రాంతాన్ని దుబ్బరాజ్యం అనేవాళ్లు.
మా నాయనమ్మ వాళ్ల ఊరు కూనూరుకు ఈ ఊర్లు ఇంకా దూరం.అక్కడినుంచే మేము ఉండే ఊరికి వచ్చి ఇక్కడ బస్సెక్కి వెళ్లేవాళ్లు. మొదట్లో ప్రైవేటు బస్సు గానీ, ఆ తరువాత ఆర్టీసీ బస్సు గానీ, లద్నూరు, నర్మెట, తరిగొప్పుల లాంటి ఊర్లకే వెళ్లేది. అక్కడి నుంచి సవారీ కచ్చడంలోనో, కాలినడకనో మళ్లీ మేము వెళ్లాల్సిన ఊరికి పోయేవాళ్లం.
‘నిప్పులు కడిగే ఆచారం’ అంటే ఏమిటో మా పెద్ద మేనత్త వాళ్లింట్లో చూస్తే తెలిసేది. అప్పట్లో మడీ, ఆచారాలూ ఎక్కువగానే ఉండేవి గానీ, వాళ్లింట్లో మరీ ఎక్కువ అనిపించేవి. ఉదాహరణకు వాళ్లు ప్రతి రోజూ మట్టి పొయ్యిలు అలకడంతోపాటు, బొగ్గుల కుంపటినీ, కిరసనాయిలు (గ్యాసునూనె) స్టవ్నీ, పట్టకార్లనూ కూడా కడిగేవారు. పొద్దున్నే పెద్ద గిన్నెలో చాయ్ చేయగానే దాన్ని దేవుడి గది ముందు ఉంచి ఆరగింపు చేసేది. తర్వాత మా అత్తయ్య వాళ్ల అత్తగారి ముందు పెడితే వరుసగా నిలబడ్డ వాళ్లందరికీ ఆమే గ్లాసుల్లో పోసి ఇచ్చేది. టీకి కూడా ఇంత తతంగం ఉండటం మాకు చాలా వింతగా ఉండేది. వాళ్లది మొదట్లో పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆ తరువాత రోజుల్లో వేరే టౌన్లకు వెళ్లినా మామయ్య పోస్ట్ మాస్టర్ అవడం వల్ల మా అత్తయ్య వాళ్లు మటుకు ఆ ఊర్లోనే ఉండేవారు.
అత్తయ్య వాళ్లింట్లో కూడా ఓ బావి ఉండేది గానీ, అందులో నీళ్లు పాతాళానికి తాకేలా ఉండేవి. పెద్ద చేంతాడుతో నీళ్లు తోడాల్సి వచ్చేది. అవి కూడా చాలా ఉప్పగా ఉండేవి. ఆ ప్రాంతాల్లో నీళ్ల కరువు చాలా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే మొత్తం బావులు ఎండిపోయేవి. కొన్ని నీళ్లు ఊరగానే బొక్కెనతో చేది ఆ ఎర్ర నీళ్లను పేరబెట్టి పై పై నీళ్లతో స్నానాలు చేసేవాళ్లం. అడుగున బోలెడు మట్టి ఉండేది. స్నానం చేసాక కూడా ఒంటి నిండా దుమ్ము ఉన్నట్టే అనిపించేది. పొలాల దగ్గరి మోటారు పంపుల వద్ద మంచి నీళ్లు తెచ్చుకునేవారు.
మా అత్తయ్య స్నానం చేసి తడిబట్టలతో బయటి నుండి నీళ్లు తెస్తుంటే మాకెంతో బాధేసేది. కానీ, ఏమి చెయ్యడానికీ వీల్లేదు. అసలు ఆ ఇంట్లో ఏదైనా ముట్టుకోవాలన్నా భయమే! ‘ఒద్దు, మడి … పిల్లలు ఇటు దిక్కు రావొద్దు’ అనేవాళ్లు. ఆ మాటలు కూడా మాకు అర్థమయ్యేవి కావు. అప్పటికే పెళ్లి అయిన పెద్ద వదిన తప్ప మిగతా ముగ్గురు కజిన్స్ బయట ఊళ్లలో చదువుకోవడం వల్లనో, మారిన కొత్త తరం అవడం వల్లనో ఏమో ఆ చాదస్తాలేవీ లేకుండా మామూలుగా పెరిగారు. మామయ్య కూడా ఆచారాలన్నీ పాటించినా, మాతో సరదాగా నవ్వుతూ ఆప్యాయంగా ఉండేవారు. అక్కడే నేను పోస్టు కట్టడం, మనియార్డర్లు చేయడం, ఉత్తరాలు రాగానే బట్వాడా చేయించడం వంటి పనులు ఎలా చేస్తారో చూశాను. మా అత్తయ్య వాళ్ల బావగారి కొడుకు బ్యాంకు మేనేజర్‌గా పనిచేసే ఆయన పెట్టిన మామిడి తోట చూట్టానికి ఓ రోజు వెళ్లాం. చిన్న సైజు మామిడి కాయలకు అంటుకుని కాజూ పప్పుల కాయలుండడం చూసి బోలెడు ఆశ్చర్యపోయాను. ‘అరె, కాజూలు (జీడిపప్పు) మామిడి చెట్లకు కాస్తయా?’ అని అడిగాను. నేను జీడి మామిడి తోటను చూడ్డం అదే మొదలు. అక్కడినుంచి మా పెద్దత్తయ్య కూతురు వాళ్ల ఊరికి సరదాగా కచ్చడంలో వెళ్లాను. పది నిమిషాల్లోనే వాళ్ల ఊరొచ్చింది. వదినను దింపి అదే బండిలో వెనక్కు వస్తుంటే తను ఇంట్లోకి వెళ్లి దీపం గూట్లోంచి పావలా తెచ్చి నా చేతిలో పెట్టి వేళ్లు మూయడం ఇప్పటికీ మర్చిపోలేను. ఆ పావలా చాలా రోజులు దాచుకున్నాను.
ఓసారి గాజుల మలారం అతడు వచ్చాడు. అత్తయ్య నాకు సరిపోయే సైజులో చిలక పచ్చ రంగు గాజులు డజను కొనిచ్చి రెండు చేతులకూ వేసుకోమంది. నేను చేతుల నిండా గాజులు వేసుకోవడం తక్కువ. అందుకని ‘ఎందుకులెండి అత్తయ్యా !’ అంటే ‘నేను ఇంతకంటే ఏమి కొనిస్తానే ?!’ అంది. అత్తయ్య కళ్లల్లో తడి చూసి నా మనసంతా దిగులుగా అయిపొయింది. సరేనని ఆమె సంతోషం కోసం వేసుకున్నాను. అవతలి వాళ్లను ఆనందపెట్టడం ఇంత తేలికా అనిపించింది. మా పెద్దత్తయ్య మహాసాధ్వి. అందంగా ఉండేది. నెమ్మదిగా, నిశ్శబ్దంగా ఉంటూ అన్ని పనులూ చేయడమే కాదు, ఎవర్నీ నోరెత్తి ఒక్కమాట అనని సుతిమెత్తని స్వభావం ఆమెది. చక్కటి గొంతు. బోలెడు పుస్తకాలు చదివేది, మంచి పాటలు పాడుతుంది. తొంబై మూడేళ్ల వయస్సులో ఇప్పుడు హైద్రాబాదులో ఉంటున్నది. మా అమ్మకు తనంటే చాలా ఇష్టం.
మా అయిదుగురు మేనత్తల్లో పెద్దావిడ పిల్లలు పుట్టకుండానే చనిపోయిందట. ఇక మధ్యలో ఒక మేనత్త కూడా తొందరగా చనిపోయింది కనుక మాకు తెలియదు. మా మేనబావతోనూ, మేనవదినతోనూ మాకు మంచి సంబంధాలున్నాయి. వాళ్ల ఊరు కూడా దుబ్బరాజ్యమే కానీ, ఇప్పుడక్కడ ఎవరూ ఉండట్లేదు. ఇక మా చిన్న మేనత్తది ఇంకా పల్లెటూరు అమ్మాపురం. రెండుమూడు సార్లు వెళ్లి ఉంటాం. ఒకసారి నర్మెటలో, మరోసారి లద్నూరులో బస్సు దిగి ఆ ఊరికి నడిచి వెళ్లిన జ్ఞాపకం ఉంది. మా చిన్నత్తయ్య చాలా యాక్టివ్. మాతో చిన్నపిల్లలా సరదాగా కలిసిపోతుంది. అది కూడా దుబ్బరాజ్యంలో భాగమే కనుక ఎక్కడో దూరంగా ఉండే బావి దగ్గరికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవడం మామూలే! కాకపొతే ఇక్కడ రూల్స్ పెద్దగా ఉండేవి కావు గనుక పిల్లలమే వెళ్లి నీళ్లు తెచ్చేవాళ్లం. అత్తయ్య కూతురు మా అక్క తోటిది. తనతో బాగా ఆటలాడేవాళ్లం.
అప్పుడప్పుడు ఊరి బయట ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లేవాళ్లం. మామయ్య పోయినా చిన్నత్తయ్య చాలా రోజులు ఆ ఊళ్లోనే ఉంది. ఇప్పుడు అడపాదడపా వచ్చినా ఎక్కువగా ఖమ్మంలో కూతురు దగ్గర ఉంటున్నది. ఈ మధ్య ఓసారి తనను దింపడానికి కారులో వెళితే నలభై నిమిషాల్లో వాళ్ల ఊరు వచ్చేసింది. అటువైపు ఊళ్లన్నీ మారిపోయాయి. ముఖ్యంగా ఇప్పుడు నీటి ఎద్దడి లేదు, రోడ్లూ, బస్సులూ ఏర్పడ్డాయి. ఒకప్పటి దుబ్బరాజ్యం కాదిప్పుడు. అన్నట్టు అమ్మాపురం తోలుబొమ్మలాడే కళాకారులకు ప్రసిద్ధి. ఇన్నేళ్లలో మేము మా మేనత్తల ఊళ్లకు అంతా కలిపి రెండుమూడు సార్లు వెళ్లి ఉంటామంతే. కానీ, ఆ ప్రేమలు ఆప్యాయతలు చాలా గొప్పవి, మరువలేనివి.