‘ది ఆల్కెమిస్ట్’ స్రుప్రసిద్ధ బెజిల్ రచయిత పాలో కొయిలో నవల. ఇందులో కథానాయకుడు శాంటియాగో. ఈజిప్టులో పిరమిడ్ల దగ్గర ఉన్న నిధిని సొంతం చేసుకునేందుకు అతను చేసిన ప్రయాణం, పోరాటం ఈ నవల ఇతివృత్తం. దీని ద్వారా మనంఎన్నో పాఠాలు నేర్చుకుంటాం.
మన కలలు మనమే సాధించుకోవాలి
శాంటియాగో జీవితం మన కలల్ని మనమే తెలుసుకోవాలని నేర్పుతుంది. వాటిని సాకారం చేసుకోవడానికి మనం చేయగలిగినంతా చేయాలి. కలల సాధనలో కొంతమంది మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. కొంతమంది అండగా నిలవొచ్చు. ఏది ఏమైనా ముందుకు సాగాల్సింది మనం మాత్రమే.
వెనకడుగు వద్దు నిధిని సాధించుకునే
ప్రయత్నంలో శాంటియాగో సాగించిన ప్రయాణంలో సవాళ్లెన్నో. అయినప్పటికీ అతను వాటికి తలవంచడు. చివరికి తాను కలగన్నది, ప్రయత్నించింది సాధించుకుంటాడు. కాబట్టి, ప్రయత్నాన్ని విడిచిపెట్టవద్దు. పరిశ్రమ నుంచి తప్పుకోవద్దు.
వర్తమానంలో జీవించాలి
శాంటియాగో వర్తమానంలోనే జీవిస్తాడు. తాను కోల్పోయిన వాటి గురించి, సాధించేవి లేదా సాధించలేని వాటి గురించి చింతించకుండా వర్తమానంలో తనకు దక్కినదాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు.
భయాలను జయించాలి
రాటుదేలిన వాళ్లను కూడా దారి మళ్లించగలిగే, జడిపించగలిగే బలమైన భావోద్వేగం భయం. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు మనల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు.
Books
మనసు మాట వినాలి
ది ఆల్కెమిస్ట్లో హృదయం (మనసు) ముఖ్యపాత్ర పోషిస్తుంది. శాంటియాగో తన మనసు గందరగోళంలో పడినప్పుడు సంయమనంతో ఉంటాడు. కాబట్టి, మనసు మాట వినాలి. దానికి కారణం తెలుసుకోవాలి. దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి.
ప్రయాణం-గమ్యం
గమ్యమైన నిధి కోసం జరిగే అన్వేషణలో శాంటియాగోకు తాను చేసే ప్రయాణం కూడా ప్రధానమైనదే. కాబట్టి మనం కూడా యాత్రను ఆస్వాదించాలి. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. గమ్యాన్ని చేరుకోవాలి.
నమ్మకంలోనే శక్తి
జీవితంలో నమ్మకం చాలా ప్రధానమైనది. అతీతమైన శక్తి ఒకటి ఉందని, అది అవసరమైన వేళల్లో మనకు మార్గదర్శనం చేస్తుందని నమ్మాలి.
కంఫర్ట్ జోన్ నుంచి…
శాంటియాగో జీవితాంతం గొర్రెల కాపరిగా బతకాలనుకుంటే అలాగే బతికేసేవాడు. ఆ జీవితం నుంచి బయటపడి నిధిని సాధించుకునేందుకు అతను తన సురక్షిత ప్రదేశం (కంఫర్ట్ జోన్) నుంచి బయటికి వచ్చేస్తాడు.
ప్రేమ అవసరం
శాంటియాగో జీవితం తీసుకుంటే గొర్రె అయినా, తాను ఇష్టపడిన ఫాతిమా విషయంలో అయినా చివరి వరకు అన్నీ ప్రధానంగానే ఉంటాయి. ఏ రూపంలో అయినా సరే ప్రేమ మన కలల్ని సాకారం చేసుకోవడంలో, జీవితంలో మరింత ఉత్తమంగా నిలవడంలో ప్రేరణనిస్తుంది.