రెబ్బెన, సెప్టెంబర్ 8 : యూరియా కోసం కర్షకులు కన్నెర్ర చేశారు. గంటలతరబడి నిరీక్షించినా బస్తాలు పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. రెబ్బెన పీఏసీఎస్ కార్యాలయానికి సోమవారం లారీ లోడ్ యూరియా రాగా, వందలాది మంది రైతులు తరలివచ్చారు.
ఇదివరకే ఇచ్చిన టోకెన్లతో గంటల తరబడి క్యూ కట్టారు. ఎంతకూ యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో మండిపడ్డారు. అంతర్రాష్ట్ర రహదారిపైకి చేరుకొని గంటకుపైగా ధర్నా చేయగా, ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గణపతిబొప్పా మోరియా.. కావాలయ్యా యూరియా.. అంటూ రైతులు చేసిన నినాదాలు మారుమోగాయి.
ఈ విషయం తెలుసుకున్న రెబ్బెన సీఐ సంజయ్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రైతు ఆర్టీసీ బస్సు ముందు పడుకొని నిరసన తెలిపాడు. మరో రైతు సరిపడా యూరియా ఇవ్వాలంటూ పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నాడు. సీఐ జోక్యం చేసుకొని.. పై అధికారులతో మాట్లాడి అందరికీ యూరియా అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఆసిఫాబాద్‌లో పోలీసులతో వాగ్వాదం
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 8 : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రానికి ఆదివారం 444 బ్యాగుల యూరియా వచ్చింద ని, అవసరమున్న వారు రావాలని అధికారులు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. దీం తో సోమవారం తెల్లవారు జామున మూడింటి నుంచే రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. 83 మందికి యూరియా బస్తాలు పంపిణీ చేశారు. మిగతా వారికి అందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంటల తరబడి క్యూ కట్టినా బస్తాలు ఇవ్వరా అంటూ మండిపడ్డారు. పోలీసులు వారించేందుకు యత్నించగా, రైతులు వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు యూరియా లభించని వారి వద్ద నుంచి పేపర్లు తీసుకొని టోకెన్లు జారీ చేశారు. వచ్చే స్టాక్‌లో పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఆటో కిరాయి భారం తమపై పడిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
లారీని అడ్డుకున్న రైతులు
చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 8: చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ దుకాణా యజమాని లారీలో ఎరువులు తెప్పించుకోగా, సోమవారం రైతులు ఆ లారీని అడ్డుకున్నారు. పీఏసీఎస్ సెంటర్లో కొరత ఉంటే.. ప్రైవేట్ షాపులకు ఎలా యూరియా దొరుకుతుందని మండిపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఇక చెన్నూర్‌లోని సొసైటీ ముందు రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. సొసైటీకి రావాల్సిన యూరియా లారీని చాకెపల్లి గ్రామానికి తరలించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క చాకెపల్లి గ్రామానికి 233 బస్తాలను పంపిణీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
జిరాక్స్‌లు బయటపడేయడంపై వివాదం
కోటపల్లి, సెప్టెంబర్ 8 : కోటపల్లి మండల కేంద్రంలోని రైతువేదిక, పీఏసీఎస్ కేంద్రం వద్ద రైతులు ఉదయం ఆరింటి నుంచే క్యూ కట్టారు. ఒక్కో రైతుకు ఒకే బస్తా ఇవ్వడంతో సహనం కోల్పోయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పట్టాపాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను రైతుల నుంచి స్వీకరించిన అధికారులు వారికి యూరియా పంపిణీ చేయకుండానే వాటిని బయటపడేయడం వివాదాస్పదమైంది.
క్యూలో పాస్‌బుక్కులు, ఆధార్ కార్డులు
దండేపల్లి, సెప్టెంబర్ 8 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని నెల్కివెంకటాపూర్ పీఏసీఎస్, గూడెం సొసైటీ గోదాంల వద్ద సోమవారం యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో ఆధార్, పాస్‌బుక్స్ జిరాక్స్‌లతో తరలివచ్చి వరుస పెట్టారు. రెండెకరాలకు యూరియా బస్తా చొప్పున అందజేశారు.
పోలీసు పహారా మధ్యన పంపిణీ
లక్షెట్టిపేట, సెప్టెంబర్ 8 : లక్షెట్టిపేటలోని పీఏసీఎస్‌కు సోమవారం యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు ఎగబడ్డారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసు పహారా నడుమ రైతులకు యూరియా పంపిణీ చేశారు. కేవలం 222 బస్తాలే రావడంతో ఒక్కో రైతుకు రెండు బస్తాలు అందజేశారు. కొందరి రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.