గంభీరావుపేట, సెప్టెంబర్ 8: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఓవైపు యూరియా, మరోవైపు కరెంట్ కోసం తండ్లాడుతున్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట వాగు శివారులో కరెంట్ లేక జనరేటర్లు పెట్టుకుని వ్యవసాయ మోటర్లు నడిపిస్తూ ఎండుతున్న వరిని కాపాడుకుంటున్నారు. పది రోజుల క్రితం పడిన భారీ వర్షాలతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహించి కరెంట్ స్తంభాలు నేలవాలాయి. విద్యుత్తు తీగలు తెగిపోయాయి. అప్పటి సంది ఇప్పటి వరకు మరమ్మతులు లేక వాగు పరీవాహక ప్రాంతంలో కరెంట్ సరఫరా ఆగిపోయి బోరు బావులలో పుష్కలంగా నీరున్నా పారించలేని పరిస్థితి వచ్చింది. రామాంజపురం, పంగిల్ల శివారులో 110 ఎకరాలలో పొట్టకు వచ్చిన వరి ఎండిపోతున్నది. దిక్కుతోచని స్థితిలో కొందరు రైతులు తమ పొలాల వద్ద జనరేటర్లు, ట్రాక్టర్ ఇంజన్ ద్వారా డైనమోలతో విద్యుత్తు ఉత్పత్తి చేసుకుని వ్యవసాయ మోటర్లు నడిపించుకుంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు మరమ్మతులు చేపడితేనే తమ పంటలు పండుతాయని, లేకుంటే ఎండిపోయి పెట్టుబడి మునిగే కాలం ఉన్నదని రైతులు రాచర్ల భూపతి, బీర ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. జనరేటర్‌తో రోజుకు రూ. 1500 ఖర్చు వస్తున్నదని వాపోతున్నారు. ఎండిపోతున్న పొలాలను చూస్తూ రైతులు కన్నీరుపెడుతున్నారు.