నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 8: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్ కార్యాలయాలు ధర్నాలతో దద్దరిల్లాయి. పింఛన్లు పెంచాలని, ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఇవ్వాలని లబ్ధిదారులు, సరిపడా యూరియూ అందించాలని రైతులు, అటవీశాఖాధికారులు తమ పంటలను నాశనం చేస్తున్నారని ఆదివాసీలు, తమ సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంలు ధర్నాలు చేశారు. పలు చోట్ల సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి ఆయా సంఘాల నాయకులు, పార్టీల కార్యకర్తలు మద్దతు పలికారు. పాలన చేతగాని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని నినదించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, బీడీ కార్మికుల పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని డిమాం డ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
పంటలకు సరిపోయే యూరియా పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. సాగు చేసుకుంటున్న పంటలను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేస్తున్నారని, ఆ భూముల జోలికొస్తే ఊర్కునేది లేదని బీకేఎంఎస్ నాయకులు, ఆదివాసీ గిరిజనులు ఆ శాఖ అధికారులను హెచ్చరించారు. పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేశారు. ఎమ్మార్పీఎస్ ప్రతినిధులను పోలీసులు అడ్డుకోగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ గేట్‌పై నుంచి లోపలికి వెళ్లడానికి యత్నంచేయగా భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ లాఠీచార్జి చేశారు.
దీంతో ఎమ్మార్పీఎస్ నాయకు లు అంబాల చంద్రమౌళి, మడిపెల్లి శ్యాంబా బు, రాంచందర్, రేణుకుంట్ల సంపత్, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు గా యాలయ్యాయి. దీంతో కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. సీఐ నరేశ్‌కుమార్‌ను సస్పండ్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. పింఛన్ల పెంపు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ‘పోలీస్ జులుం నశించాలి, కలెక్టర్ డౌన్ డౌన్, ఇదేమి రాజ్యం ఇదే మి రాజ్యం దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. సంగారెడ్డి జిల్లా అందోల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూం కాలనీవాసులు ఆందోళనకు దిగారు. మాజీ సీఎం కేసీఆర్ తమకు ఎంతో పెద్ద మనస్సుతో ఇండ్ల ను అందజేస్తే ఈ ప్రభుత్వం ఇండ్లను ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడంపై కాలనీవాసులు మండిపడ్డారు. బీఆర్ఎస్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
పింఛన్లు పెంచకుండా వంచించిన రేవంత్
రంగారెడ్డి, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ) : హామీ నిలబెట్టుకోకుండా దివ్యాంగులు, వృద్ధులు, ఇతర పింఛన్‌దారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగులు, వృద్ధులు, ఇతర పింఛన్‌దారులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో మందకృష్ణ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దివ్యాంగులకు రూ.6వేలు, ఆసరా పింఛన్‌దారులకు రూ.4వేలు, గీత, నేత, ఒంటరి మహిళల పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించారని మందకృష్ణ మండిపడ్డారు. పింఛన్ల పెంపుతోపాటు కొత్త పింఛన్లు ఇచ్చేవరకు తాను పేదల వెంట ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని హెచ్చరించారు.