కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మల్లన్నసాగర్ ఆయువు పట్టులాంటిది. గత సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్టు సాంకేతికంగా రుజువైంది. అటు మెదక్, ఇటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాలకు కేవలం భూమ్యాకర్షణ శక్తి ద్వారా నీటిని తరలించేందుకు అనువైన ప్రదేశంలో దీన్ని కట్టారు. అలాంటి మల్లన్నసాగర్ నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రతో అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు అదే మల్లన్నసాగర్ నుంచి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు నీళ్లు తరలించేందుకు సోమవారం శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 8 (నమస్తే తెలంగాణ) : వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అవుతుందా? కాదని లోకమంతటికీ తెలుసు. కానీ నక్క మాత్రం అదే భ్రమలో ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మల్లన్నసాగర్ రిజర్వాయర్ విషయంలో కాంగ్రెస్ తీరు ఇట్లనే తయారైంది. హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపు పథకం 2-3 దశల శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 1.5 టీఎంసీలతో ప్రతిపాదించిన మల్లన్నసాగర్ ఎక్కడ? 50 టీఎంసీలతో కేసీఆర్ విజయవంతంగా నిర్మించిన మల్లన్నసాగర్ ఎక్కడ? నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా! అయినా కేసీఆర్ పూర్తి చేసిన మల్లన్నసాగర్‌కు నిస్సిగ్గుగా వైఎస్ హయాంలో శంకుస్థాపన జరిగిందంటూ కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించి నవ్వుల పాలయ్యారు. ముఖ్యంగా మల్లన్నసాగర్‌పై రేవంత్ వేసిన పిల్లిమొగ్గలు మరెవరూ వేయలేదేమో! వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ రిజర్వాయర్‌ను ప్రతిపాదించింది వాస్తవమే అయినా అప్పుడు ఆ రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 1.50 టీఎంసీలు మాత్రమే. ఆమాటకొస్తే అసలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మొత్తం చూసినా గోదావరి జలాల నిల్వ సామర్థ్యం 16.03 టీఎంసీలే.
అందునా తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ఐదు టీఎంసీల నీటి నిల్వతో బరాజ్ నిర్మిస్తేనే! కానీ ఆ ప్రాజెక్టును తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా రీడిజైనింగ్ చేసిన కేసీఆర్ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 50 టీఎంసీలకు పెంచారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని 141 టీఎంసీలకు పెంచారు. అప్పుడే కాదు.. ఇప్పటికీ తెలంగాణ గడ్డపై ఇంత భారీస్థాయి నీటి నిల్వతో నిర్మించిన ఆఫ్‌లైన్ రిజర్వాయర్ మరొకటి లేదు. అందుకే మల్లన్నసాగర్ అనేది ఒక చరిత్ర. ఇదే రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం జరిగే సమయంలో ప్రాజెక్టును అడ్డుకునేందుకు అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. రేవంత్, కోదండరాం కలిసి అనేక సదస్సులు నిర్వహించి.. 50 టీఎంసీలతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మిస్తే భూకంపాలు వస్తాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నాడు ఏనోటితో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకించారో ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరానికి 16 టీఎంసీల కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి తక్కువ ఖర్చు రూ.1006 కోట్లతో గ్రావిటీపై గోదావరి జలాలను తరలించేందుకు పథకాన్ని రూపొందిస్తే రేవంత్‌రెడ్డి వచ్చి మల్లన్నసాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీలు ఉందంటూ రూ.7,360 కోట్లతో 20 టీఎంసీల జలాలను తరలించేందుకు పథకం చేపడుతున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఆయువు పట్టులాంటి మల్లన్నసాగర్ నిర్మాణాన్ని సరైన ప్రదేశంలో నిర్మించనుండటంతో అనేక రకాలుగా ప్రయోజనాలున్నాయని సాంకేతికంగా రుజువైంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 535 మీటర్లు. అంటే చాలా ఎత్తులో ఉన్న ప్రదేశం. దీంతో అటు మెదక్, ఇటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కేవలం భూమ్యాకర్షణ శక్తి ద్వారా జలాల్ని
తరలించేందుకు అనువైన ప్రదేశంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది.