శరీర పనితీరు సవ్యంగా సాగిపోవడంలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. ఇక వయసు పెరిగేకొద్దీ వివిధ రకాలైన ఒత్తిళ్లకు లోనవుతుంటాం. కాబట్టి మెదడు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. మెదడు చురుగ్గా ఉండటానికి, విశ్రాంతిగా అనిపించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయాలి. ఏడు నుంచి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ కాసేపు పుస్తకాలు చదవడం, ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, పజిల్స్ పూరించడం చేయాలి. వీటివల్ల మెదడుకు ఎప్పటికప్పుడు పదును పెట్టినట్టు అవుతుంది. ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలను పెంపొందించుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. యోగా, ధ్యానం మొదలైన ప్రక్రియల ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ధూమపానం చేయకూడదు. మద్యం కూడా పరిమితికిలోబడే తీసుకోవాలి.
ఇప్పుడు చిన్నవయసులోనే పిల్లలు మధుమేహం బారినపడుతున్నారు. దీనికి వంశపారంపర్య కారణాలు ప్రధానంగా నిలుస్తాయి. అయితే, పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్ ఎలా వస్తుందనే దాని గురించి కార్డిఫ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇందులో పరిశీలించిన వివరాలను బట్టి మిగిలిన వారితో పోలిస్తే తండ్రులకు డయాబెటిస్ ఉంటే, పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ ముప్పు రెండు రెట్లు ఎక్కువని కనుక్కొన్నారు. కాగా, ఈ అధ్యయనం ‘డయాబెటాలజియా’ జర్నల్లో ప్రచురితమైంది. పైగా డయాబెటిస్ ఉన్న తల్లుల కంటే తండ్రుల నుంచే ఈ వ్యాధి ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక గర్భిణిగా ఉన్నప్పుడు తల్లికి మధుమేహం ఉన్నప్పటికీ అది పిల్లలకు సంక్రమించే ముప్పు తక్కువగా ఉంటుందట. అయితే కడుపులో ఉన్నప్పుడే పిల్లలో డయాబెటిస్ బారిన ఎలా పడుతున్నారనే విషయమై మరింత పరిశోధన అవసరం అంటున్నారు శాస్త్రవేత్తలు.