నాటకంలో నటించడం వేరు. నాటకం రచించడం వేరు. దర్శకత్వం వహించడం వేరు. తెరవెనుక సంగీత సాంకేతిక సహకారం అందించడం వేరు. వాటన్నిటిలో అనుభవంతో ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా నవ్యంగా, నాణ్యంగా నాటకాన్ని కొత్తపుంతలు తొక్కించడం వేరు. అలాంటి ప్రయోగ వ్యామోహం కలిగి ఉండి, ఆచరించే వారిని ప్రయోక్త అంటారు. ఆధునిక తెలుగు నాటక రంగంలో సిద్ధహస్తులైన ప్రయోక్తలను వేళ్ల మీద లెక్కించవచ్చు. డాక్టర్ గరికపాటి రాజారావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్.కృష్ణ, చాట్ల శ్రీరాములు.. ఇలాంటి వారి ఒరవడిలో భాసిల్లిన నాటక రంగ ప్రయోక్త గరికపాటి ఉదయభాను. ఇటీవల కన్నుమూసిన ప్రయోగశీలి ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం..
కాకి బంగారం (ఎస్.హనుమంతరావు), చల్ చల్ గుర్రం (తనికెళ్ల భరణి), మరీచిక (శివాజీ), గాంధీ దర్శన్ (డాక్టర్ సినారె), మహా నగరం (డీఎస్ఎన్ మూర్తి), కొడుకు పుట్టాల (గణేశ్ పాత్రో), డామిట్ కథ అడ్డం తిరిగింది (యండమూరి), గోపాత్రుడు (కేఎన్‌వై పతం+జలి) తదితర నాటికలు ఉదయభాను దర్శకత్వంలో ప్రదర్శించినవే. రాజదర్శన్, నాగమండల్, 58 నాట్ అవుట్, యమరాజ్ బోలే సౌసాల్ జీయే, బోర్ లగానే హైసా లాంటి హిందీ నాటకాలను కూడా ఆయన ఇతర రాష్ర్టాల్లో ప్రదర్శించారు. వీటిలో కొన్ని ఆయన స్వీయ రచనలు.
ఆధునిక తెలుగు నాటకం మూడు పాయలుగా చీలి వృద్ధి అవుతున్నట్టు పరిశోధకులు మొదలి నాగభూషణ శర్మ ఉటంకించారు. 20వ శతాబ్దం ప్రథమార్ధం నుంచే ఈ పరిణామం కొనసాగింది.
1. విశ్వవిద్యాలయ రంగస్థల విద్యాబోధనా పద్ధతుల ద్వారా
2. నాటక కళా పరిషత్ పోటీ ప్రదర్శనల ద్వారా
3. కళ… కళ కోసం కాదు ప్రజల కోసం అంటూ ప్రజా చైతన్యం లక్ష్యం గల ప్రజానాట్య మండలి లాంటి సంస్థల ద్వారా..
ప్రస్తుతం సాంఘిక నాటక రంగానికి పోటీ పరిషత్ నాటకమే దిక్కయ్యింది. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు కూడా ఆ కోవలోనే నడిచాయి. ఉదయభాను నంది నాటకోత్సవాల్లో పాల్గొని అనేక పురస్కారాలు పొందినప్పటికీ పోటీ పరిషత్ నాటకాలను సమర్థించలేదు. నాటకాలు చూసే జనాన్ని పట్టుకోవడానికి, ఆకట్టుకోవడానికి పట్టుపట్టిన ‘భూమిక’ పేరుతో ఓ నాటక సంస్థను నెలకొల్పారు. భూమిక వేదికగా ఎన్నో విశిష్టమైన నాటకాలను ప్రేక్షకులకు అందించారు. పోటీ నాటకాల రూటులో పోటాపోటీగా పొలికేకలు వేయొద్దని ఒట్టు పెట్టుకుని, కొత్త కథలతో, కొత్త కొత్త ప్రదర్శన పద్ధతులతో, కొంగొత్త ప్రయోగాల కోసం ‘భూమిక’ ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొనేవారు.
నాటకాల్లో నటించాలనే ఔత్సాహిక కళాకారులకు మరింత శిక్షణనిచ్చి ప్రోత్సాహం కల్పించేందుకు సంకల్పించిన సంస్థ భూమిక. ఉదయభాను నాటక రంగ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధిగా పాటుపడ్డారు. దాదాపు పాతిక బృందాలకు అంటే 200 పైచిలుకు కళాకారులకు శాస్త్రీయ నాటక శిక్షణను అందించారు. కళాకారిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆత్మీయ వాతావరణం తీసుకు వచ్చేందుకు కృషిచేశారు. చరణదాసు, ద్రౌపది, ఉడత రామాయణం, ఓ సినీ భస్మాసుర వంటి గొప్ప నాటకాలను కొత్త పాతల మేలు కలయిక కళాకారులతో స్పష్టించి ప్రదర్శింపజేశారు. చరణదాసు నాటకానికే మూడు నందులు వచ్చాయి!
నాటకం పట్ల ఉదయభానుకు గల నిబద్ధత ఎంత వరకూ వెళ్లిందంటే… ‘మీ ముంగిట్లోనే నాటకం. మీ కాలనీలోనే, మీ అపార్ట్మెంట్స్ వద్దనే ప్రదర్శిస్తాం. మీరు టీవీ బందుపెట్టి, మీ సొంత పనులు వాయిదా వేసుకురండి. గంటా గంటన్నర సమయం మా నాటకాన్ని కచ్చితంగా కూర్చుని చూస్తారు’ అని కరపత్రం ద్వారా హామీ ఇచ్చి మరీ ప్రదర్శించారు. రైల్వే ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్ సహకారం ఉన్నా అధిక వ్యయప్రయాసలతో కూడుకున్న ఈ ప్రయత్నానికి నడుంకట్టారు. ఎందుకంటే నాటకం చూడడం ఉత్తమ కళాభిరుచికి నిదర్శనమని ఉదయభాను నిక్కచ్చి నమ్మకం. టీవీ సీరియల్స్ కన్నా, క్రికెట్ హైలైట్స్ కన్నా, నాటకం గొప్పదనేది ఆయన భావన. నాటకం విద్యార్థుల్లో, యువతలో కచ్చితంగా ఆత్మస్థయిర్యాన్ని పెంచుతుందని వక్కాణించేవారు. నిజమే కదా!
ఇదంతా ఒక ఎత్తు అయితే పిల్లలతో ఆయన చేసిన ప్రయోగం మరో ఎత్తు. అసిస్టెజ్ సంస్థ బాధ్యునిగా అంతర్జాతీయ నాటక శిక్షకుడు ఆశిష్ ఘోష్ (ఢిల్లీ)తో కలిసి దేశ విదేశాల్లో పర్యటించారు. ఇద్దరూ పిల్లల కోసం థియేటర్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఆకర్షణీయంగా కథలు చెప్పడం, చెప్పించడం, కథ చెబుతుండగా దృశ్యాలను చూపించడం, కథలనే నాటకాలుగా మలిచి పిల్లలతో ప్రదర్శించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. మరీ చిన్న పిల్లల కోసం పెద్దవాళ్లతో కష్టపడి నాటకాలు ప్రదర్శించారు. వీటిలో కూడా ఉదయభాను ఒక ప్రయోక్తగా నిమగ్నమై ఉండేవారు. అలా ఆధునిక తెలుగు నాటక రంగ కళాకారులకు ఉదయభాను ఒక ఆదర్శ నాటక ప్రయోక్తగా నిలిచారు. ప్రయోక్తకు నాటక శిల్పంపై సదవగాహనతోపాటు ప్రాపంచిక దృక్పథం కూడా తెలిసి ఉండాలి. లేకుంటే నాటక ప్రదర్శనను ప్రేక్షకులతో సమన్వయ పరచలేడు కదా! ఈ రెంటిలోనూ అపారమైన ప్రజ్ఞ కలిగినవాడు ఉదయభాను. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో అస్తమించారు. ఉదయభాను తీర్చిదిద్దిన కళాకారులు, మెరుగులు దిద్దిన కథలు, రూపుదిద్దిన ప్రదర్శనలు తన జ్ఞాపకాలుగా మిగిల్చి జీవన రంగస్థలంపై తన పాత్రకు ముగింపు పలికారు.
– కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు