రామచంద్రాపురం,సెప్టెంబర్10: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో బీఆర్ఎస్ హయాంలో రూ.33.13కోట్లతో మొదలైన తాగునీటి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై రిజర్వాయర్‌ను ప్రారంభించారు.
అంతకు ముందు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధంకొమ్ములో మరో రిజర్వాయర్‌ను ప్రారంభించిన సందర్భంగా స్థానిక మహిళలు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, ఇక్కడ సుమారు 3వేల ఓట్లు ఉన్నాయి అని ఎంపీ, ఎమ్మెల్యేకు చెబుతుండగానే ఓట్లతోనే భయపెట్టకుర్రి, మీ సమస్యలు ఎంటో చెప్పండి, ఓట్ల కోసం భయపడేటోడు ఎవడూ లేడు అని ఎమ్మెల్యే సమాధానం చెప్పాడు. దీంతో ఎంపీ కల్పించుకొని అధికారులకు చెప్పి సమస్యలు పరిష్కరిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు రాగానే తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించే ప్రయ త్నం చేశాడు.
నువ్వే పెద్ద లీడరువు, నువ్వే అన్ని చేయించుకురా అని ఎమ్మెల్యే చెప్పా డు. దీంతో లేదు అన్న సమస్య మీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నా అన్నాడు రమణ. నువ్వే లీడర్షిప్ చేస్తున్నావు, తమాషాలు చేస్తున్నావా.. నీకంపెనీ పని నువ్వు చూసుకో అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన చూసిన అక్కడి వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడికి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ వాసులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు.