జహీరాబాద్, సెప్టెంబర్ 10: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని శేఖపూర్‌లో నిర్వహించే హజ్రత్ షేక్ షాబుద్దీన్ షాహిద్ దర్గా ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని మంగళవారం రాత్రి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,బీఆర్ఎస్శ్రేణులతో కలిసి ఆయన దర్గాను సం దర్శించారు. దర్గా నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
చాదర్, దట్టి సమర్పించి ప్రత్యే క ప్రార్థనలు చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ హజ్రత్ షేక్ షాబుద్దీన్ షాహిద్ దీవెనలు ప్రజలపై ఉండాలన్నారు. వర్షాలు సవృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండి రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో గడిపేలా చూడాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి దర్గా ఉత్సవాలకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఖవ్వాలిని తిలకించారు. ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే హజ్రత్ షేక్ షాబుద్దీన్ షాహిద్ దర్గా ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దర్గా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జహీరాబాద్ డీఎస్పీ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, రూరల్ ఎస్సై కాశీనాథ్ భారీ బందోబస్తు నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు నామ రవికిరణ్, నారాయణ, వెంకటేశం, సంజీవ్‌రెడ్డి, నర్సింహులు, కౌసర్ మొహీజొద్దీన్, యాకూబ్, నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ చిన్నారెడ్డి, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, దర్గా కమిటీ చైర్మన్ చస్మొద్దీన్ పాల్గొన్నారు.