నల్లవక్కల్లాగే తెల్లవక్క కూడా ప్రసిద్ధే. భోజనానంతరం తమలపాకులో ముక్కలు చేసిన తెల్లవక్క, సున్నం, కాసు.. ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాలతో ‘పాన్’ కట్టడం ఒక కళ. సేవించడం ఒక దర్పం. తెల్లవక్కల చెట్టు కూడా పామ్ జాతికి చెందినదే. శృంగేరి సమీపంలో దీనిని ఎక్కువగా సాగు చేస్తారు. శృంగేరి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు తెచ్చాను. ఇవి తక్కువ ఉష్ణోగ్రతల్లో పెరుగుతాయి. శుభమంగళ, సుమంగళ, ఇంటర్ మంగళ, మోహితో నగర్ మొదలైన రకాలెన్నో తెల్లవక్కల్లో ఉన్నాయి. గోదావరి జిల్లాలు, కర్నాటక, కేరళ, తమిళనాడు, మేఘాలయ (చిరపుంజి)లో వాణిజ్య పంటగా విస్తారంగా తెల్లవక్కలను సాగు చేస్తున్నారు.
తెల్లవక్కలకు చార్మినార్ దగ్గర మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. హిందువుల శుభకార్యాల్లో బహుమతులతోపాటు ఆకు, వక్క, పసుపు, కుంకుమతో గౌరవించుకుంటారు. పాతతరం వాళ్లు చేతిలో పాన్ డబ్బా పట్టుకుని తిరిగేవారు. వక్క నమలడం అంత వ్యసనం. వ్యసనంగా కాకుండా తరచుగా నమిలితే ఆరోగ్యానికి మేలే. తెల్లవక్కలు నులి పురుగులను తగ్గిస్తాయి. ప్రయాణ వికారం ఉండదు. మొటిమలు తగ్గుతాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు