నీలి మేఘాల మేలి ముసుగు కప్పుకొని, చినుకుల చిరుమువ్వల సవ్వడితో, మెరుపుల వెలుగులతో వానాకాలం వైభవంగా అడుగిడుతుంటే భారతదేశంలోని పచ్చని లోయలు… విచ్చుకునే పువ్వులు… ఘనమైన స్వాగతాన్ని పలుకుతుంటాయి. ఈ సుందర దృశ్యాన్ని మదినిండా ఆవాహన చేసుకుని
అంతులేని ఆహ్లాదాన్ని పొందేందుకు ప్రకృతి ప్రేమికులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇందుకు సరైన వేదికలయ్యే సుందర ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసు కుంటే మనమూ ఆ అందాల్ని ఆరాధించే అవకాశాన్ని పొందిన వాళ్లమవుతాం!
‘గాడ్స్ ఓన్ కంట్రీ’ గా పిలిచే కేరళంలోని మున్నార్ జూన్ నెలలో సరికొత్త అందాలను సంతరించుకుంటుంది. ఈ మాసంలో కేరళంను తాకే నైరుతి రుతుపవనాల వల్ల ఇక్కడి ప్రకృతి పచ్చటి తివాచీ పరిచినట్లుగా మారుతుంది. కొండలపై తేలుతూ వచ్చే మేఘాలు, చిరుజల్లులు మున్నార్‌ను మరింత రొమాంటిక్‌గా మారుస్తాయి. ఇక్కడి ఎరవికుళం నేషనల్ పార్కులో మేఘాల తెరల మధ్య హాయిగా నడవచ్చు. అరుదైన నీలగిరి తార్ (కొండ గొర్రె) జంతువుల నివాసం ఇది. దట్టమైన అడవులు కొండల నడుమ స్పీడ్ బోటింగ్ చేసే అవకాశాన్ని కల్పించే మట్టుపెట్టి డ్యామ్, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అనముడి ఇక్కడే ఉంటాయి . వానాకాలంలో ఈ కొండ మొత్తం పొగమంచుతో నిండి, మేఘాల అంచున నిలబడిన భావన కలిగిస్తుంది. కొండల నుంచి ఉధృతంగా దుమికే అట్టుకాల్ జలపాతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇక్కడి టీ మ్యూజియంను సందర్శిస్తే తేయాకు చరిత్ర తెలుస్తుంది.
ఉత్తమ సీజన్: మున్నార్‌ను ఏడాది పొడవునా సందర్శించవచ్చు. అయితే పచ్చదనాన్ని, జలపాతాల అందాలను ఆస్వాదించాలంటే జూన్ నుంచి సెప్టెంబర్ (రుతుపవనాల సమయం) అనుకూల సమయం.

దేశమంతటా వానాకాలం మొదలై చిరుజల్లులు కురుస్తున్న వేళ, కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ సరికొత్త అందాలతో పర్యాటకులను పలకరిస్తుంది. భౌగోళికంగా దీనిని ‘శీతల ఎడారి’ అని పిలిచినప్పటికీ, జూన్ – జూలై నెలల్లో ఇక్కడి వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా మారుతుంది. చుట్టూ మంచుతో నిండిన పర్వత శిఖరాలు, వాటి మధ్య నుంచి నిర్మలంగా ప్రవహించే నదులు, నీలిరంగు సరస్సులు రుతుపవనాల మాసాలలో ఒక మాయా ప్రపంచాన్ని తలపిస్తాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రోడ్లలో ఒకటిగా పేరుగాంచిన ఖర్దుంగ్ లా పాస్, ఆకాశపు వర్ణాన్ని బట్టి రంగులు మారే ప్రసిద్ధ పాంగాంగ్ త్సో సరస్సు, సుదూర తీరాల అందాల నుబ్రా వ్యాలీ, బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక హెమిస్ మొనాస్టరీ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. నుబ్రా వ్యాలీలోని ఇసుక తిన్నెలపై రెండు మోపులున్న అరుదైన ఒంటెలపై సవారీ చేయడం పర్యాటకులకు మరువలేని అనుభూతిని ఇస్తుంది.
ఉత్తమ సీజన్: లడఖ్ అందాలను కళ్లారా వీక్షించడానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అత్యంత అనుకూలమైన సమయం. అదే శీతాకాలంలో ఇక్కడి రహదారులన్నీ మంచుతో మూసుకుపోతాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక హిల్ స్టేషన్ పచ్‌మఢీ. దీనిని ‘సాత్పురా కీ రాణి’ (సాత్పురా రాణి) అని పిలుస్తారు. సాత్పురా పర్వత శ్రేణులలో, దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ప్రదేశం వానలు కురిసే కాలంలో పచ్చదనంతో, చల్లని గాలులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి పురాణ గాథలు, గుహలు ప్రత్యేక ఆకర్షణ.
ఏమేం చూడాలి: పాండవులు వనవాస సమయంలో నివసించారని నమ్మే ‘పాండవ గుహలు’, బీ ఫాల్స్ జలపాతం, జటాశంకర్ గుహలు, సూర్యోదయ సూర్యాస్తమయాలను అద్భుతంగా చూపించే మధ్యప్రదేశ్ లోనే ఎత్తైన శిఖరం ధూప్‌గఢ్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు.
ఉత్తమ సీజన్: నిండైన పచ్చదనంతో అలరారే ఈ ప్రాంతాన్ని చూడాలనుకునే వారికి జూలై నుంచి సెప్టెంబర్ మంచి కాలం. అదే పొడి వాతావరణం ఇష్టపడితే అక్టోబర్ నుంచి జూన్ వరకు అనుకూలమైన సమయం. రుతుపవనాల ఆరంభంలో ఇక్కడి ప్రకృతి మరింత అందంగా మారుతుంది.

దక్షిణ భారతదేశంలో కాఫీ సువాసనలు వెదజల్లే అందమైన హిల్ స్టేషన్ కూర్గ్ (కొడగు). కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని ‘ఇండియాస్ స్కాట్లాండ్’ అని పిలుస్తారు. జూన్ నెలలో కురిసే తొలి రుతుపవనాల జల్లులకు ఇక్కడి కాఫీ తోటలు, అడవులు నూతన ఉత్తేజాన్ని పొంది, పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
నేలంతా పరుచుకునే పచ్చదనం ప్రకృతి ప్రేమికులను అక్కడి నుంచి కదలనివ్వదు అందంగా దుమికే అబ్బే జలపాతం, సూర్యాస్తమయాన్ని సుందరంగా చూపించే ప్రదేశం రాజాస్ సీట్, దుబారే ఏనుగుల క్యాంప్, మడికేరి కోట, అలాగే ఇక్కడి ‘నమ్డ్రోలింగ్ మొనాస్టరీ’ (బైలకుప్పే)లోని స్వర్ణ దేవాలయం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు .
ఉత్తమ సీజన్: అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం అద్భుతంగా ఉంటుంది. కానీ జలపాతాల జోరును, ప్రకృతి అసలైన పచ్చదనాన్ని చూడాలనుకునే వారికి జూన్ నుంచి సెప్టెంబర్ సరైన సమయం.

హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుత దృశ్యం ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’. ఉత్తరాఖండ్లోయునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ లోయ జూన్ నెలలో నిద్ర లేస్తుంది. శీతాకాలమంతా మంచుతో నిండి ఉండే ఈ ప్రాంతం, జూన్ నెల ప్రారంభంతో రంగురంగుల అడవి పూలతో నందనవనాన్ని తలపిస్తుంది. సముద్రమట్టానికి 3600 మీటర్ల ఎత్తున ఉండే ఈ లోయలో వీడిన మంచు తెరల మధ్య అందమైన హిమాలయ పర్వత సానువుల్ని, కరిగి జాలువారే హిమానీ నదాలను వీక్షించొచ్చు.
వర్షాలు చక్కగా కురిసే జూలై, ఆగస్టు మాసాల్లో అక్కడ విరబూసే 500 పైగా పుష్ప జాతుల అందాలు కళ్లకు నిజమైన విందు చేస్తాయి. 87 చదరపు కిలోమీటర్లలో పరచుకున్న పూలతోటల్ని ఇక్కడ మనం చూడొచ్చు. వందలాది జాతుల హిమాలయ పుష్పాలు, అరుదైన కస్తూరి మృగాలు, మంచు చిరుత పులులు ఉండే ఈ లోయలో ట్రెకింగ్ చేయడం ఒక అద్భుత అనుభూతి. దీనితో పాటు సమీపంలో ఉన్న పవిత్ర హేమకుండ్ సాహిబ్ గురుద్వారాను కూడా సందర్శించవచ్చు.
ఉత్తమ సీజన్: ఈ పూల లోయను చూడటానికి కేవలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగిలిన నెలల్లో ఇది పూర్తిగా మంచుతో మూసుకుపోతుంది.

ఈశాన్య భారతదేశపు స్కాట్లాండ్‌గా పిలిచే షిల్లాంగ్, మేఘాలయ రాజధాని. జూన్ నెలలో ఇక్కడ రుతుపవనాలు ప్రారంభమవడంతో, ఆకాశంలో మేఘాలు కొండలను తాకుతూ వెళ్లే దృశ్యాలు కనువిందు చేస్తాయి. చుట్టూ పైన్ వృక్షాలు, ఎటు చూసినా జలపాతాల హోరుతో ఈ ప్రాంతం జీవకళతో ఉట్టిపడుతుంది.
ఏడాది పొడవునా చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ఈ చోట వానాకాలంలో ప్రకృతి మరింత మనోహరంగా దర్శనమిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ‘చిరపుంజి’, ‘మాసిన్రామ్’ ప్రాంతాలు, అక్కడి ‘లివింగ్ రూట్ బ్రిడ్జెస్’ (చెట్ల వేర్లతో సహజంగా ఏర్పడిన వంతెనలు) తోపాటు షిల్లాంగ్ పీక్, ఎలిఫెంట్ ఫాల్స్, ఉమియం సరస్సు (బారాపాని)లను తప్పక చూడాలి. \
ఉత్తమ సీజన్: షిల్లాంగ్‌ను సెప్టెంబర్ నుంచి మే వరకు సందర్శించడం మంచిది. అయితే, భారీ వర్షాలను, జలపాతాల ఉధృతిని ఇష్టపడేవారు జూన్ నుంచి ఆగస్టు మధ్య వెళ్లవచ్చు.

హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత ఎత్తైన, చల్లని పర్వత లోయ స్పితి. సాహస యాత్రికులకు, బైక్ రైడర్లకు ఇది ఒక కలల ప్రపంచం. ప్రశాంతతకు చిరునామా. జూన్ నెలలో ఇక్కడి మంచు కరిగి రహదారులు క్లియర్ అవుతాయి. బౌద్ధ సంస్కృతి, హిమాలయాల గంభీరమైన అందాలు ఇక్కడి ప్రత్యేకత.
ఇక్కడి చల్లని గాలి, నిర్మలమైన ఆకాశం చూపరుల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. ఏమేం చూడాలి: ప్రపంచంలోనే ఎత్తైన గ్రామం ‘కిబ్బర్’, పురాతనమైన ‘కీ మొనాస్టరీ’, ధంకర్ కాంప్లెక్స్, చందమామ ఆకృతిలో ఉండి హిమాలయాల స్వచ్ఛమైన నీటిలో ఆకాశాన్ని ప్రతిబింబించే చంద్రతాల్ సరస్సులు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
ఉత్తమ సీజన్: స్పితి వ్యాలీని సందర్శించడానికి అత్యంత సురక్షితమైన, ఉత్తమమైన సమయం మే నుంచి అక్టోబర్. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయి.