గౌరమ్మను బతుకమ్మగా కొలిచే సంప్రదాయం తెలంగాణ నేలది. పరమేశ్వరికి పూల మేడలు కట్టి ఆనందిస్తుంది ఇక్కడి మట్టి. అమ్మవారి ఆలయం ఉన్న ప్రతి ఊరూ ఈ సమయంలో వైభవానికి వేదికగా మారుతుంది. దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా ఆమెను అర్చించి తరిస్తుంది. రోజుకో రూపంలో వెలిగిపోయే ఆ సిరుల తల్లికి విరులతోనూ అలంకారం చేస్తున్నారు. వీటిని చూస్తుంటే పుణ్యమంతా పువ్వులదేనేమో అనిపిస్తుంది.
అమ్మవారికి ఏ పువ్వు ఇష్టం… అన్న ప్రశ్న ఉండదు నవరాత్రి సందర్భంలో! పువ్వులన్నీ ఆమెవే… పూజలన్నీ ఆమెకే! సభక్తికంగా సమర్పించిన ప్రతి కుసుమమూ ఆమె ఆప్యాయతను అందుకుంటుంది. పొందికగా ఆమె సరసన చేరుతుంది. గౌరమ్మ కురులు… చంపక, అశోక, పున్నాగలాంటి పువ్వుల సువాసనలను విరాజిల్లుతుంటాయని చెబుతుంది లలితా సహస్రనామం. నిరంతరం పూలమాలలు ధరించడం ఆమెకు ఇష్టం. కదంబ వనవాసిని ఆమె. నిత్య సువాసినిని సువాసనలు వెదజల్లే పువ్వులతో అర్చించడం, అలంకరించడం అనాదిగా వస్తున్నదే. కానీ సర్వమంగళను సర్వం మంగళ ప్రదమైన పుష్పాలతో ముంచెత్తే అలంకారాలు ఇటీవల ఆకట్టుకుంటున్నాయి. పువ్వుల్లో గౌరి మొగ్గల్లో గౌరీ… పచ్చన్ని పాలవెల్లే గౌరమ్మ మీ ఇంటి కోడళ్లమే… అని బతుకమ్మ పాటల్లో పాడుకున్నట్టు… ఈ రూపంలో మనం పువ్వుల్లో గౌరమ్మను చూస్తున్నాం. పరాశక్తి రూపిణిని పరమానంద రూపిణిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
అమ్మ ఎంత అందంగా ఉంటుందో అలంకారమూ అంత బాగుండాలని కోరుకుంటారు భక్తులు. ఇంపు సొంపుల చీరలు తీసుకొస్తారు. ముచ్చటైన రంగులు ఎన్నుతారు. అంచులు ఆడంబరంగా కనిపించాలని భావిస్తారు. దానిపైన పెట్టే నగలూ, దండలూ వేటికవే సరిసాటిగా ఉండేలా చూసుకుంటారు. అయ్యగారు ఏం అడిగినా చిటికెలో సమకూర్చి పెడతారు. ఈ ఆరాటమంతా జగద్ధాత్రికి ప్రత్యేకమైన నవరాత్రి సమయంలో ఆమె అలంకారం అద్భుతంగా ఉండాలన్నదాని కోసమే. అలాంటి చూడచక్కటి అలంకారాన్ని అచ్చంగా పువ్వులతోనూ చేస్తున్నారు కొందరు అర్చకస్వాములు. పూలదొంతరల మధ్య గౌరమ్మ ఒదిగినట్టే… ఈ ముస్తాబుల్లో అమ్మవారి విగ్రహం విరుల వరుసల్లో ఒదిగిపోతుంది.
బతుకమ్మ పేర్చడానికి తంగేడు మొదలు కలువల దాకా… టేకు పూల నుంచి గుమ్మడి పూల దాకా… ఎలా విభిన్న రకాలను వాడతారో…ఇక్కడా అలంకారాల కోసం రకరకాల పువ్వులను ఉపయోగిస్తున్నారు. ఎన్నెన్ని వర్ణాల పువ్వులు… ఏ దేవుడిచ్చెనే రంగులు… అన్నట్టు, ఒక్కో పువ్వుదీ ఒక్కో వర్ణం. దేని అందం దానిది. దేని ఆకర్షణ దానిది. కనకాంగద కేయూరను కనకాంబరాలతో అలంకరిస్తున్నారు ఒకచోట. నిత్యానందకరిని ముత్యమంటి మల్లెలతో ముంచెత్తుతున్నారు మరొకచోట.
పద్మాసనికి పద్మాల రేకులు ఓ చోట అలంకారమయ్యాయి. గుడాన్న ప్రీతకు గులాబీలు ఇంకోచోట కోకలయ్యాయి. సరిగంచు చీరకు సరిసాటి అన్నట్టు.. పూల మాలలే నూలు పోగులుగా ఇందులో చీరలు నేస్తున్నారు. నీల మణులను పోలిన నీలి రంగు పువ్వులు అక్కడక్కడా మిరుమిట్లు గొలుపుతున్నాయి. చేమంతులూ, సంపెగలకూ సరిపడా చోటిస్తున్నారు. గన్నేరునూ చిన్నబుచ్చడంలేదు. అలంకారాల విషయంలో ఏ చేతి నైపుణ్యం ఆ చేతిది. ఏ అమ్మ అందం ఆ అమ్మది. పండుగ వేళ మెత్తటి పూల మధ్య ఒదిగిన ఆ అమ్మ, చల్లటి మనసుతో దీవిస్తే అదే మనకు పదివేలు… ఆ ఆనందమే చాలు!!