‘డబ్బుకు లోకం దాసోహం గణనాథా.. దాచాలన్నా దాగని సత్యం గణనాథా’ అనే సినిమా పాట డబ్బు కోసం మనిషి ఎంతగా దిగజారతాడో చెబుతుంది. పల్లెటూరి పామర జనంలో సైతం డబ్బు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద మనుషులుగా ముసుగేసుకున్న వారు తీరని ధనదాహంతో అవసరమైతే ముసుగులు చీల్చుకుని నరహంతకులుగా మారతారని తెలియచెప్పే నాటిక ‘కుందేటి కొమ్ము’.
ఉప్పు-నిప్పు వంటి రెండు ఊళ్లు. పెద్ద ఊరికి పెద్దయ్య సర్పంచ్. చిన్న ఊరికి చిన్నయ్య సర్పంచ్. రెండు గ్రామాలకు మధ్య బలమైన సరిహద్దు రేఖ. ఆ రెండు గ్రామాల వాళ్లూ తమ సర్పంచ్ మాటను జవదాటరు. అక్కడక్కడా మెలోడ్రామా తొంగి చూసినా, నాటిక ఆసాంతం స్వార్థజీవుల చిత్త ప్రవృత్తులు క్షణక్షణం మారే తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఈ నాటిక కథాంశం చాలా చిన్నది. తెరలేచేసరికి… సరిగ్గా ఆ రెండు ఊళ్ల మధ్య ఓ శవం పడి ఉంటుంది. దారిన పోయే ఓ బాటసారి ఆ మృతదేహాన్ని చూసి ఊరి పెద్దలకు చెప్తాడు. రెండు ఊళ్ల పెద్దల (సర్పంచ్ల)తోపాటు జనం కూడా అక్కడికి చేరకుంటారు. ఆ మృతదేహానికి అంత్యక్రియలు ఎవరు చేయాలనే చర్చ మొదలవుతుంది.
ఆ శవం ఎక్కువ భాగం ఎవరి ఊర్లో ఉంటే ఆ ఊరివాళ్లే అంత్యక్రియలు చేయాలనుకుంటారు. రెండు ఊళ్ల వాళ్లూ ఆ శవాన్ని పక్క ఊరికి అంగట్టాలని చూస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరు శవాన్ని అటు పక్కకి, ఇటు పక్కకి జరుపుతారు. ‘మీ ఊరి కిందకే వస్తుందంటే.. కాదు మీ ఊరి కిందకే వస్తుంది’ అంటూ రెండు ఊళ్ల జనం వాదనకు దిగుతారు. ఆ గొడవ జరుగుతున్న సందర్భంలో శవం పక్కనున్న సంచిలోంచి ఓ ఉత్తరం బయటపడుతుంది. ఆ ఉత్తరంలో తన వాటాకు దక్కే పాతిక లక్షల రూపాయలతో అంత్యక్రియలు జరిపించాలని ఉంటుంది. వెంటనే సర్పంచ్లు ప్లేటు ఫిరాయిస్తారు. అంత్యక్రియలు ‘మేం చేస్తాం.. అంటే మేం చేస్తాం’ అంటూ ముందుకొస్తారు. శవం చెరోపక్కకి లాగుతారు. పాడే పల్లకి ఖర్చు, పట్టుదుస్తులు, పూలదండలు, మేళతాళాలు, గంధపుచెక్కలు అంటూ నానా హంగామా చేస్తారు.
జనమంతా సద్దుమణిగాక, చీకట్లో సర్పంచ్లు ఒక్కటైపోతారు. ఒక లక్షతో కార్యక్రమం అంతా తూతూ మంత్రంగా నిర్వహించి, మిగతా సొమ్ము నొక్కేద్దామని ఇద్దరూ అనుకుంటారు. బాటసారి వచ్చి వారి అసంబద్ధ ప్రవర్తన చూసి అసహ్యించుకుంటూనే పెద్దగా నవ్వుకుంటాడు. ఆ సంచి, అందులోని ఉత్తరం ఆ శవానిది కాదని, అది తనదని కుండబద్దలు కొడతాడు. ఆ మాటలు విన్న సర్పంచ్ల ముఖాలు మారిపోతాయి. క్రోధంతో కళ్లు ఎరుపెక్కుతాయి. అంగరక్షకులకు క్రీగంట ఆదేశాలు వెళ్తాయి. అంతే.. మెరుపు వేగంతో ఆ బాటసారిపై దాడి చేస్తారు. అతని గొంతు నులిమి హత్య చేస్తారు. ఏమాత్రం జాగు చేయకుండా పాడె మీద ఉన్న శవాన్ని తీసి కింద పడేస్తారు.
బాటసారి శవాన్ని సకల హంగులతో పాడెపై శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుపోతారు. మొదటి శవం అక్కడే ఉంటుంది. కల్లాకపటం తెలియని ఓ తాగుబోతు, మాయామర్మం ఎరుగని ఓ ఎర్రి బాగులవాడు ఆ దిక్కులేని శవానికి దిక్కయి దహన క్రియలకు నడుం కట్టడంతో తెర నెమ్మదిగా వాలుతుంది. భూమిక థియేటర్ ఫెస్టివల్ సందర్భంగా ఇటీవల సికింద్రాబాద్లో దీన్ని ప్రదర్శించారు. నాటకం ఉత్తరాంధ్ర మాండలికంలో సాగుతుంది. సమాజంలో పడగవిప్పి బుస కొడుతున్న విష స్వార్థాన్ని ఈ నాటిక నాలుగు దశాబ్దాల కిందటే కళ్లకు కట్టింది. అభినయంతోపాటు రంగాలంకరణ, రంగోద్దీపనలోనూ దర్శకుడి ప్రతిభాముద్ర విస్పష్టంగా కనిపిస్తుంది.
నాటిక : కుందేటి కొమ్ము
రచన: మాడభూషి దివాకర్ బాబు
డిజైన్, దర్శకత్వం: గరికపాటి ఉదయభాను
పాత్రధారులు: సాగర్, ఉస్మాన్, రావణ్, గౌతం, రఫీక్, ఉదయ్, రోహిత్, హరీత్, పూజ్యంక్