మన దగ్గర అంతగా ఇబ్బంది పెట్టే చలి ఉండదు కనుక.. మూడు కాలాల్లోకీ ‘చలికాలం’ నాకెంతో ఇష్టం. ఆరునెలల పరీక్షలు అయిపోవడం, సంక్రాంతి సెలవులు రావడంతో, పగ్గాలు విడిచిన లేగదూడల్లా గంతులేసేవాళ్లం.
అప్పట్లో సిలబస్ కూర్చేవాళ్లు ఎంత ముందుచూపుతో చేసేవాళ్లో గానీ.. చలికాలం మొదలవుతూనే ‘శీతాకాలము’ అని తెలుగు పాఠం సరిగ్గా ఆ రోజుల్లోనే బోధించేలా వచ్చేది. బహుశా తొమ్మిదో తరగతిలో అనుకుంటా! అది కంకంటి పాపరాజు రచించిన ‘ఉత్తర రామ చరితము’లో ‘శీత ఋతు వర్ణన’ అని జ్ఞాపకం. అందులో రెండు పద్యాలు గుర్తున్నాయి. వాటిని చదువుతూ మన దగ్గర చలికాలాన్ని పోల్చుకుంటూ ఉండేవాళ్లం.
శిశిరమరుదెంచె నంతట
నిశలాయత గతి వహించె నెత్తమ్మి తెగల్
కుశలత డించె, దినంబులు
కృశియించె వడంకు ముంచెనెల్ల జనంబులన్;
దాని అర్థం.. మాకు తెలుగు చెప్పే నరసింహమూర్తి సార్ ఎంతో బాగా వివరించి చెప్పేవారు. చలికాలం రాగానే రాత్రులు దీర్ఘంగా అయ్యాయనీ, పగళ్లు తగ్గిపోయాయనీ, తమ్మి పూలు చలికి ముడుచుకు పోయాయనీ, జనాన్ని వణుకు ముంచెత్తిందనీ.. ఆయన చెబుతుంటే ప్రకృతి వర్ణన ఎంత బాగుంటుందో తెలిసేది.
కాచె నుసిరికలు తరచుగ
పూచెన్ చేమంతి విరులు, భూమికి బరువై
తోచెన్ జనపాది సస్యము
లేచెన్ పలు మంచు చెదల హేమంతమునన్
హేమంత రుతువులో ఉసిరికాయలు బాగా కాస్తాయి. చేమంతి పూలు విరివిగా పూస్తాయి. జనుము లాంటి పంట చేలు గుత్తులుగా కంకులతో భూమికే బరువయ్యేంతగా వంగిపోతాయి. మంచు ఆకాశాన్ని తాకుతుందా అన్నంతగా పేరుకుని పోతుంది.. అని చెబుతూ, “చెదల అంటే ఏంది నాయినా?!” అని ఓ పిల్లగాణ్ని లేపి అడిగాడు ఆయన. ఆ అబ్బాయి రెండు చేతులూ కట్టుకుని.. ‘ఓ.. గది తెల్వదా?!’ అన్నట్టు ఓ చూపు పారేసి.. “దర్వాజలకు, తనబ్బీలకు, చెక్క అల్మారాలకు, కట్టెలకు మట్టి గడ్డల్లెక్క ఒస్తది సార్! లోపల పురుగులుంటయి. మొత్తం చెక్కను తినేదనుక పైకి తెల్వదు. గ దాన్నే చెదలంటరు” అని ఎంతో ధీమాగా చెప్పాడు. వేరే సార్లయితే ఆ పిల్లగాడి అరచేయో, వీపో శిక్షకు సిద్ధంగా ఉండేది. కానీ, నరసింహ మూర్తి సార్ తీరే వేరు. ఎంత విధ్వంసపు అల్లరి చేసినా తల్లులకు వాళ్ల పిల్లలు అమాయకుల్లాగే కనిపించినట్టు.. ఆయనకు విద్యార్థులందరూ మంచివాళ్లే!
“అట్లగాదు నాయినా.. చెదలు వేరు. చెదల వేరు! చెదలు అంటె నువ్వనేదే గానీ, చెదల అంటే ఆకాశం. ఆకాశాన్ని తాకేటట్టు మంచు పేరుకున్నదంటే అతిశయోక్తి అలంకారమన్నట్టు!” అని వివరంగా చెప్పారు. అది మనసులో అలా నిలిచిపోయింది. ఇంకో పద్యం మొత్తం గుర్తు లేదు గానీ.. ఆఖరి చరణం మాత్రం గుర్తుంది. ‘శీతర్తు ప్రభువిచ్చు వజ్రంపు రాశింబోలి నల్వంకలన్’ అని ఉండేది. “శీత ఋతు ప్రభువు ఆ భూదేవికి మంచు బిందువులను కానుకగా పంపిస్తే.. అవి పచ్చటి మైదానాలలో గడ్డి పోచలపైన మెరుస్తూ వజ్రాల రాసుల్లాగా కన్పించాయట” అంటూ మా నరసింహ మూర్తి సార్ పాఠం చెప్పే విధానానికి అవన్నీ మనసులో ముద్రించుకు పోయాయి. ఆ తరువాత రోజుల్లో నాకు కవిత్వం అంటే ఇష్టం ఏర్పడటానికి సారే కారణం.
‘పూచె చేమంతి విరులు’ అని కవి తన పద్యంలో చెప్పినట్టుగానే మా ఇంట్లో చలికాలంలో ఎన్ని చేమంతులు పూసేవో చెప్పలేను. నాలుగైదు మొక్కలు పెడితే చాలు.. అవి మరుసటి సంవత్సరానికి కొన్ని వందల మొక్కలయ్యేవి. పెద్దపెద్ద మళ్లలో ఏ రంగుకా రంగువి విడివిడిగా నాటి కుండల కొద్దీ నీళ్లుపోసి పెంచేది అమ్మ. ఆదివారాల్లో మేము కూడా అమ్మ చేదబావిలోంచి నీళ్లు తోడిస్తే అక్కా, నేనూ చెరికొన్ని మొక్కల చొప్పున పంచుకుని చిన్న బిందెలతో పట్టుకెళ్లి మొక్కలకు పోసేవాళ్లం. చలికాలంలో చేమంతులు విరగబూసేవి. ఆకులు కనిపించనంతగా గుత్తులు గుత్తులుగా ఉన్న ఆ పూలను చూస్తేనే చాలు.. ఆనందం వేసి, తెంపబుద్ధయ్యేది కాదు. మా స్నేహితులు ఎప్పుడైనా ఇంటికొచ్చి చూసి.. “అబ్బ! మీ ఇంట్ల గిన్ని పూలు పూస్తయి. మీరు అస్సలు బడికి పెట్టుకరారేందుల్లా?!” అనేవారు.
“పాపం! మీ అమ్మ భుజాన కుండెత్తుకొని కష్టపడి పెంచితె అవ్వి పూలు పూస్తున్నయ్. మీరు ఎవరొచ్చినా.. ‘మా పూలు జూద్దురు రాండి. మా చెట్లు జూద్దురు రాండి’ అని అందర్ని పెరట్లకు తీస్కరాకండి! జిష్టి గొడుతది” అనేది నానమ్మ. అమ్మ ఆ సీజన్లో రెండుమూడు సార్లు పూలన్నీ తెంపి విడివిడిగా పాకెట్లు కట్టి.. “ఇగ మీ దోస్తులకు ఇచ్చుకోండి” అని ఇచ్చేది. ఆ రోజంతా మేము ఎవరెస్టు శిఖరం ఎక్కినట్టు ఫీలయ్యేవాళ్లం. పారిజాతాలు కూడా చెట్టు కింద రాలిపడి సన్నటి పరిమళం వస్తుండేది. ధనుర్మాసం నెలరోజులూ అమ్మ తెల్లవారు ఝామున నాలుగింటికే లేచి స్నానం చేసి, తిరుప్పావై చదువుతుండేది. పొద్దున ఆరింటివరకే పూజ పూర్తిచేసి బియ్యం, మిరియాలు, నెయ్యి, బెల్లం, పెసరపప్పుతో చేసిన ఘుమఘుమలాడే వేడి పొంగలిని ప్రసాదంగా పెట్టేది. ఇందుకోసం మార్ఘళి పాశురాలు (తమిళ శ్లోకాలు లేదా పద్యాలు) కష్టపడి నేర్చుకున్నది. ఎలా నేర్చుకున్నదో మరోసారి చెబుతాను.
చలికాలంలో పొద్దున లేవాలంటే గండంగా ఉండేది. పచ్చడం (రెండు వరుసలతో నూలు బట్టతో మగ్గం మీద నేసిన దుప్పటి) కప్పుకొని మరికాసేపు వెచ్చగా పడుకోవాలనిపించేది. తప్పనిసరై లేచాక కూడా ఎండపొడలో కాసేపు, స్నానాలకు కొప్పెరలో నీళ్లు కాగబెట్టే కట్టెల పొయ్యి దగ్గర కాసేపు గడిపి.. ఆలస్యంగా స్నానం చేసేవాళ్లం. హేమంత రుతువు చలి గాలులు ఒక పక్క, వెచ్చని మంటకు చేతులు చూపుతూ, ఒళ్లు కాపుకోవడం మరో పక్క.. చాలా గమ్మత్తుగా ఉండేది. తరువాత రోజుల్లో చలికి వణుకుతూ ఫుట్‌పాత్‌ల పక్కన పడుకున్న వాళ్ల ఫొటోలు చూసినప్పుడు, ‘చలితో వృద్ధులు చనిపోయారు’ అన్న వార్తలు చదివినప్పుడు.. ‘అయ్యో! వాళ్ల బాధల ముందు మన ఇబ్బంది ఎంత చిన్నది?’ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి చలికాలంలోనూ తప్పకుండా కొన్ని దుప్పట్లు, బ్లాంకెట్స్ కొని.. ముసలివాళ్లకో, గుడిసెల్లో, రేకుల షెడ్లలో, రోడ్ల మీదనో ఉండే వాళ్లకో తప్పనిసరిగా వెతికివెతికి ఇచ్చి వస్తుంటాను.