ఏందే మల్లన్న
బొత్తిగా నల్ల పూస అయినవ్ అంటే
ఎద ఏడనో మీటినట్లు అవుతుంది
లీడర్ సాబ్ గీ పనిచేసి పెట్టు
నీ కడుపున పుడతా మళ్ళా
బంధాలు అల్లుకుంటాయి మల్లె తీగోల్లే
నీకు చేతకాక పొతే చెప్పరాదే
అల్లుని కాళ్లు మేమే కడుగుతం
అరుగు మీద ముసలమ్మ ఆత్మీయ హెచ్చరిక
పల్లె పరాష్కాలు
తేనె పిండుకున్నట్లు ఉంటది
వరసలు పెట్టీ అంతా వదినా మరిదిలే
పొలాల గట్లపొంటి
పగుళ్ళ, తెగుళ్ల చర్చ
గత యేడాది గుణపాఠాల పాఠశాల
బతుకమ్మ వాయినాలు
కట్ట మైసమ్మ బోనాలు
ఆత్మీయతలు అలుగు దునుకుతాయి
ఒక్కరు కాలం జేస్తే
ఊరంతా ముట్టుడు అయితది
వాగులో దుఃఖం పాయలుగా ప్రవహిస్తుంది..
దాసరి మోహన్: 99853 09080