Ayodhya Ram Mandir | బాలరాముడి పాలబుగ్గలు ముద్దాడిన సౌభాగ్యనగరి అయోధ్య. కౌసల్య తనయుడి కౌశలాన్ని తొట్టతొలిగా చూసి పొంగింది అయోధ్య. చందమామను అద్దంలో చూస్తూ పాలబువ్వ తింటున్న రామచంద్రుడిని కండ్లప్పగించి చూసింది అయోధ్య. అంతేనా, బుడిబుడి అడుగుల రాముడి పాదముద్రలు మోసి పరవశించింది. వడివడి పరుగుల రాముడి వాయువేగానికి ఊగిపోయింది. మర్యాదకు మన్నననిచ్చే దశరథ రాముణ్ని చూసి గర్వించింది. సీతమ్మ తోడుగా వచ్చిన కల్యాణరాముడికి దిష్టి తీసింది. తండ్రిమాటకై కానలకేగిన రాఘవుణ్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. లోక కంటకుడైన దశకంఠుడిని మట్టుపెట్టి వచ్చిన కోదండపాణికి హారతి పట్టింది. సహస్ర నామాల వాడిని శతవిధాలా కీర్తించే భాగ్యం దక్కించుకున్న అయోధ్య మరోసారి మురిసిపోతున్నది. భవ్యమందిరంలో బాలరాముడి దివ్యమూర్తి ప్రతిష్ఠతో… జగదానంద కారకుడికి శుభ స్వాగతం పలుకుతున్నది అయోధ్య.
ఇప్పుడు పుణ్యమంతా అయోధ్యదే! యుగాలుగా వినుతికెక్కిన పుణ్యక్షేత్రం పేరు మరోసారి విశ్వ యవనికపై సువర్ణాక్షరాలతో ప్రతిష్ఠితమవుతున్నది. కల్పాంతాలకు వెరవని కల్పతరువు మరో సత్సంకల్పానికి వేదిక అవుతున్నది. ముముక్షువులు చేరి తరించాలనుకునే మోక్షనగరి.. తరలివస్తున్న రాఘవుడికి సుముహూర్తాంజలి ఘటిస్తున్నది.
‘ఆలము సేయుటకా.. అయోధ్య పాలన సేయుటకా ఓ రాఘవా.. ఏలావతారమెత్తుకుంటివి రాముడై’ అని త్యాగరాజస్వామి కీర్తించినట్టు.. రాముడు యుద్ధం చేయడానికి పుడితే… రావణ సంహారంతో అవతార లక్ష్యం పూర్తికావాలి. కానీ, రాముడు పుట్టింది ‘అయోధ్య’ కోసం. అయోధ్యా నగర ప్రజల కోసం. కోసల రాజ్య సౌభాగ్యం కోసం. అవనిపై మానవుడు ధర్మబద్ధంగా, న్యాయ సమ్మతంగా ఎలా నడుచుకోవాలో తెలియజేయడం కోసం.
రామచంద్రుడు దశరథ మహారాజు కన్నులపంట. కౌసల్యాదేవి నోముల పంట. రాముడి రాకకోసం వీళ్లిద్దరు మాత్రమే కాదు.. అయోధ్యంతా ఎదురుచూసింది. వారందరి తపఃఫలంగా నారాయణుడు నరుడిగా అవతరించి.. అవనిని తరింపజేసిన వైనం. ధర్మ, జ్ఞాన స్వరూపమైన అయోధ్యను ఎంచుకోవడం రామలీల. తాను ఇక్కడే పుడతాననీ, రావణుడిని సంహరిస్తాననీ, ఈ ధరణిని పదకొండువేల సంవత్సరాలు పాలిస్తాననీ స్వయంగా విష్ణుమూర్తి చేసిన ప్రకటన… అయోధ్యకు జాతర. రావణుడి దురహంకారానికి పాతర.
అయోధ్య అంటే శత్రువులు ఎవరూ జయించలేనిది అని అర్థం. అయోధ్య అంటే.. వైకుంఠం అని తాత్విక భావం. అందుకే.. ఆ వైకుంఠనాథుడు అయోధ్యను తన జన్మభూమిగా ఎంపిక చేసుకున్నాడేమో! పవిత్రమైన సూర్యవంశంలో.. దార్శనికుడైన దశరథుడి నందనుడిగా రావాలనుకున్నాడు. పుత్రకామేష్ఠి ఫలితంగా కౌసల్య కడుపు పండింది. నిత్య వసంతంతో శోభిల్లే అయోధ్యలో నవ వసంత నవమి (చైత్ర శుద్ధ నవమి) నాడు రాజీవ లోచనుడు కన్ను తెరిచాడు. పసి రాముడి ముసిముసి నవ్వులకు సరయూ ఉప్పొంగింది. రాచవీధుల్లో వెలుగులు. పురవాడల్లో జిలుగులు. ఒక యుగం ముందే.. అయోధ్యకు దీపావళి వచ్చేసింది. నేటికీ శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో దీపావళి జరుగుతున్నది. సరయూ తటిపై వెలిగించిన దీపాలు.. ఆ నదీమతల్లి జల తరంగిణులపై తటిల్లతా హారాలై రామచంద్రుడికి హారతి పడతాయి. ‘సియావర్ రామచంద్ కీ జై..’ అని అయోధ్య అంతా రాజారాముణ్ని ఎలుగెత్తి కీర్తిస్తుంది.
ముక్కోటి దేవతలు ముచ్చటగా ఎదురుచూస్తున్న సుముహూర్తం ఆసన్నమైంది. కొద్ది గంటల్లో బాలరాముడి ప్రతిష్ఠ జరగనుంది. న్యాయ సమ్మతంతో అయోధ్యకు మళ్లీ పునర్వైభవం పట్టింది. యుగాల కిందటే అయోధ్య అద్భుత నగరి. కోసల రాజధాని వైభవాన్ని రామాయణంలో వాల్మీకి విశేషంగా వర్ణించాడు. స్కాంద పురాణంలోనూ ఈ మోక్షపురి విలక్షణత ‘అయోధ్య ఖండం’ పేరుతో కనిపిస్తుంది. మార్కండేయ పురాణం, నృసింహ పురాణంలోనూ అయోధ్య ప్రస్తావన ఉంది.
కోసలో నామ ముదితః స్పీతో జనపదో మహాన్
నివిష్టః సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్
(వాల్మీకి రామాయణం- బాలకాండ)
‘సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ ప్రదేశం ఉంది. అది ధనధాన్య సంపదలతో తులతూగుతూ ఉంటుంది. అందుకే అక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తుంటారు. అలాంటి కోసల దేశంలో అయోధ్య అనే పేరున్న మహానగరం ఉంది. ఈ నగరాన్ని మనువు స్వయంగా నిర్మించాడు. అందుకే అది లోక ప్రసిద్ధమైంది. ఆ మహానగరం పన్నెండు యోజనాల పొడవు, మూడు యోజనాల వెడల్పుతో గొప్పగా విలసిల్లుతుంటుంది’ అని అయోధ్య విస్తీర్ణం సహా అనేక విశేషాలను తెలియజేశాడు ఆదికవి వాల్మీకి. గొప్ప రాజ్యం ఎలా ఉండాలి? రాజ్య నిర్మాణం ఎలా ఉండాలి? ప్రజల పట్ల పాలకులు ఎలా వ్యవహరించాలి? పాలకులపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి? ప్రజాక్షేమం, జన జీవనం ఎంత హాయిగా ఉండాలి.. ఇవన్నీ అయోధ్యను ఉటంకిస్తూ విశ్లేషించాడు.
‘అయోధ్య చుట్టూ ఇంపైన ప్రాకారాలు.. సొంపైన ద్వారాలు.. ద్వార బంధనాలు కలిగి ఉంటుంది. నగరంలో వరుసలు తీరిన అంగళ్లు కనిపిస్తాయి. యంత్రాలు, ఆయుధాలతో పరిపుష్టమైన రక్షణ వలయం రాజధానిని కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. సకల కళలకూ కాణాచిగా ఈ నగరం అలరారుతుంటుంది. మేలుజాతి గుర్రాలు, వేగంగా పరిగెత్తగల ఏనుగులు, ఎద్దులు, ఒంటెలు ఎన్నెన్నో ఇక్కడ కనిపిస్తుంటాయి. జూదపు పలకలాగా అష్టపద్మాకారంలో ఉన్న చిత్రవిచిత్ర రాజగృహాలు కోకొల్లలు..’ వాల్మీకి రామాయణంలో అయోధ్య వర్ణన ఇలా ఇంపుగా సాగిపోతుంది.
అయోధ్య ఎంత విశాలమో.. అయోధ్యవాసుల హృదయాలూ అంతే విశాలం. రాముడు పుట్టిన్నాటి నుంచీ ఇంటింటా రామనామం ప్రతిధ్వనించేది. రాముడి చూపు కోసం పరివార సమేతంగా కోటలోకి వెళ్తుండేవారు. రాజ దర్శనం కన్నా… రామ దర్శనం మిన్నగా భావించేవారు. వంతులవారీగా వెళ్లి బాలరాముడిని చూసి.. మనసంతా రామతత్వాన్ని నింపుకొనేవారు. పొద్దువాలిపోతుండగా ఇండ్లకు చేరేవారు. వాళ్ల దేహాలు మాత్రమే తిరుగుముఖం పట్టేవి. మనసు మాత్రం రాముడి చెంతే నిలిచి ఉండేది. అయోధ్యలోని ఆబాలగోపాలమూ రాముడిని తమవాడిగా భావించేవారు. తన రాజ్యప్రజలు రాముణ్ని అంతగా ఆరాధిస్తున్నారన్న ముచ్చట తెలిసి దశరథ మహారాజు ముచ్చటపడేవాడట. ‘అయోధ్యా పట్టణీ ప్రజ కంటిపాప వెలుగు’ అని దశరథ మహారాజు రాముణ్ని పిలిచేవాడని ‘రామాయణ కల్పవృక్షం’ కావ్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చేసిన ప్రయోగం అయోధ్యవాసులకు రాముడంటే ఎంత ప్రీతో తెలియజేస్తుంది. రఘుకుల తిలకుణ్ని వేనోళ్లా కీర్తించిన అయోధ్యవాసులు నిజంగా అదృష్టవంతులే! రామచంద్రుడి కాలంలోనే పుట్టడానికి వాళ్లు జన్మజన్మల తపస్సు చేసుకొని ఉంటారని భాగవతుల భావన.
శుక్ల పక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతున్న రామచంద్రుడిని చూసి పులకిస్తున్న అయోధ్యకు విశ్వామిత్రుడి రాక అశనిపాతమైంది. యాగ సంరక్షణకు రాముణ్ని పంపాలని విశ్వామిత్రుడు కోరగా.. దశరథుడు హతాశుడయ్యాడు. చతురంగ బలాలతో తానే వస్తానంటాడు కానీ, రాముణ్ని పంపడానికి సాహసించడు. ఈ సందర్భంలో రాజ మందిరంలో దశరథుడు ఎంతగా వగచాడో… అయోధ్య పురవాసులూ అంతే కుదేలయ్యారు. రాముడు యాగ రక్షణకు విశ్వామిత్రుడి వెంట వెళ్తున్నాడన్న వార్త దావానలంలా నగరమంతా వ్యాపించింది. పిల్లలు, తల్లులు, పెద్దలు అందరూ బాలరాముడిపై పెద్ద భారం మోపుతున్నారే అని కంగారుపడ్డారు. యాగం పూర్తయిన వెంటనే వస్తాడని తెలిసినా.. ఆ కొన్ని రోజులు కూడా రాముణ్ని చూడకుండా ఎలా ఉండగలమని వాళ్ల బాధ. అంతలోనే.. విశ్వామిత్రుడితో వెళ్తే విశ్వవిజేతగా నిలిచే శక్తి సామర్థ్యాలు తమ రాముడికి వస్తాయని ఊరడిల్లారు.
వశిష్ఠుడు చెప్పినట్టుగా, దశరథుడు ఆశించినట్టుగా, అయోధ్యవాసులు కోరుకున్నట్టుగా.. విశ్వామిత్రుడి అనుగ్రహంతో రాముడు సర్వాస్త్ర ప్రవీణుడయ్యాడు. రాముడిగా వెళ్లి కల్యాణధాముడిగా తిరిగివచ్చాడు. నవదంపతులు నగరంలోకి అడుగుపెట్టే వేళకు ప్రతి ఇంటిపైనా పతాకాలు ఎగురవేశారు ప్రజలు. ప్రతి లోగిలినీ ముగ్గులతో ముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రతి వీధీ జనంతో కిటకిటలాడింది. తమ ఇంట్లోనే పెండ్లి అయిందన్నట్టుగా అందరూ జేజేలు కొడుతూ.. మంగళాశీర్వాదాలు పలుకుతూ కొత్తజంటను స్వాగతించారు. నగరంలోని ప్రముఖులు, పండితులు స్వయంగా దశరథుడి దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తంగా విశ్వామిత్రుడి వెంట వెళ్తున్న రాముణ్ని చూసి దిగాలు పడిన అయోధ్య ప్రజలు.. జానకి రాముడిగా తరలివస్తున్న తమ వేల్పును చూసి వేనోళ్లా అభినందించారు. ‘బొమ్మ వధువు.. అంత అందంగా ఉంద’ని రెప్పవాల్చకుండా సీతమ్మ వంకే చూసి మురిసిపోయారని విశ్వనాథ ప్రస్తావించారు.
రఘువంశంలో అందరూ యోధులే! ప్రజారంజక పాలకులే! వారి పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు. తమ పూర్వికుల కీర్తిని మరింత ఇనుమడింపజేశాడు
దశరథుడు. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. అయినా.. తమ రాముడు ఎప్పుడెప్పుడు పట్టాభిరాముడు అవుతాడా అని ఎదురుచూసేవారు కోసల ప్రజలు. ఆ ముహూర్తం రానే వచ్చింది. రాముణ్ని ఇంతగా ఆరాధిస్తున్న ప్రజలకు అతణ్ని రాజును చేయడం కన్నా విలువైన బహుమతి ఏముంటుందని అనుకున్నాడు దశరథుడు. ప్రజాభిప్రాయం కోరాలనుకున్నాడు. నగర ప్రజలను, జానపదులను, ప్రముఖులను, సామంత రాజులను పిలిపించుకొని తన అభిప్రాయం వారితో పంచుకున్నాడు. రామ పట్టాభిషేకానికి అందరూ ముక్తకంఠంతో అంగీకరించారు.
ఇచ్ఛామో హి మహాబాహుం రఘువీరం మహాబలం
గజేన మహతా యాంతం రామం ఛత్రావృతాననమ్
(అయోధ్య కాండ)
‘శత్రుంజయ గజాన్ని అధిరోహించి, శ్వేతచ్ఛత్ర ఛాయలో పురవీధుల్లో ఊరేగుతూ వచ్చే రాముణ్ని చూడాలనీ, చూసి ఆనందించాలనీ మేమంతా మిక్కిలి ఉవ్విళ్లూరుతున్నాం’ అని ప్రకటించారు. ‘దశరథ మహారాజా! మీ కుమారుడు సకల కల్యాణ గుణాలకు పెన్నిధి. దైవతుల్యుడు, ధీశాలి. ఈ లోకంలో రాముడి వంటి సత్పురుషుడు మరొకడు లేదు. శ్రీరాముడు చంద్రుడిలా ప్రజలకు ఆహ్లాదకారుడు. బుద్ధిలో బృహస్పతి, పరాక్రమంలో సాక్షాత్తూ ఇంద్రుడు’ అని సభలోని వారంతా రాముణ్ని తామెంతగా ఆరాధిస్తున్నారో ప్రకటించారు. రాముడిపై అయోధ్యవాసులకున్న అభిమానం ఎంతటిదో మరోసారి నిరూపితమైంది. ‘రేపే రాముడికి పట్టాభిషేకం’ అని ప్రకటించాడు దశరథుడు.
తమ కంటి ముందుపెరిగిన చంటిపాప.. తమను కంటికిరెప్పలా కాపాడే రాజవుతున్నాడని అయోధ్య పులకించింది. ఆ రోజంతా సంబురాలే. ప్రతి ఇంటా సందడే. వీధి వీధంతా జనాలే. రామచంద్రుడి నివాసానికి తండోపతండాలుగా ప్రజలు రాసాగారు. ఏ గవాక్షంలో నుంచైనా రాముడి కొనచూపైనా సోకకపోతుందా అని ఆశపడ్డారు. పట్టాభిషేకానికి ఏ విఘ్నాలూ రాకూడదని తమ ఇష్టదేవతలను పూజించారు. దారికి ఇరువైపులా అరటిబోదెలు కట్టి.. పచ్చతోరణం చుట్టారు. ఎప్పుడెప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని ఎదురుచూడసాగారు. రాత్రి జాములు దాటుతున్నా.. ఇండ్లను అలంకరిస్తూ కాలం గడిపారు. పొద్దు పొడవకముందే వాకిట్లో కస్తూరి కలిపి కల్లాపి చల్లారు. రంగవల్లులు తీర్చిదిద్దారు. మంగళవాద్యాలు మోగించారు. జానపదులు పాటలతో హోరెత్తించారు. రాముడి రాకకై వేయికండ్లతో ఎదురుచూస్తూ… రోజంతా గడిపారు.
‘తామొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచిందని’ సామెత. పితృవాక్య పరిపాలన కోసం రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్తున్నాడు అని తెలిసి అయోధ్య ఘొల్లుమన్నది. రాముడు రాజు అవుతాడన్న తమ కలలు కల్లలయ్యాయని కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రజలు. ఛత్రఛాయలో ఉండాల్సిన రాముడు.. నారచీరలు ధరించడాన్ని భరించలేక పోయారు. అంతఃపుర రాజకీయాల గురించి చెవులు కొరుక్కున్నారు. ఎవరికి వారే రాముడి వెంట అడవికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ‘రాముడు అడవికి వెళ్తే.. ఇక్కడుండి ఏం చేస్తాం.. మనమూ వెళ్లిపోదాం. రాఘవుడున్న నెలవే అయోధ్య. ఆయనతోనే మనకు సయోధ్య’ అని నిశ్చయించుకున్నారు. సీతాలక్ష్మణ సమేతుడై రథమెక్కాడు రాముడు. రథం కదులుతున్నది. మదుపుటేనుగులు కోపంతో ఘీంకరించాయి. గుర్రాలు పాదాలపై నిలవక తత్తరపాటుగా కదిలాయి. పిల్లలు, పెద్దలు, మూడుకాళ్ల ముసళ్లు కూడా రథం వెంట నడవసాగారు. తనను అందుకోవాలన్న ప్రజల యాతన చూసి రథాన్ని నెమ్మదించమన్నాడు రాఘవుడు. ‘ఒక్కసారి రామయ్య ముఖం చూడనివ్వండి..’ అంటూ రథం వెంట పరుగులు తీశారట కొందరు. రాఘవుడు వెళ్లింది మొదలు అయోధ్య సౌభాగ్యం కోల్పోయింది. ఆవులు పాలు ఇవ్వడం మానేశాయట. లేగలు పాలు తాగడం మర్చిపోయాయట. సూర్యుడు త్వరగా అస్తమించాడట. పిల్లలు తినడం మానేశారట. తల్లులు వంట చేయడం ఆపేశారట. అగ్నిహోత్రం ఆరిపోయిందట. రాముడి వెంట వెళ్లిన వాళ్లు మర్నాడు తిరిగి వస్తే.. వారిని అందరూ నిందించారట. ‘ఏం సాధించాలని వెనక్కి వచ్చారు’ అని పెదవి విరిచారట. ఇవీ రాముడిపై
అయోధ్యవాసులకు ఉన్న ప్రేమాభిమానాలు.
రామ విరహంతో విలపించిన అయోధ్య కళ తప్పింది. తమ ప్రభువు లేక అయోధ్యవాసులు కుంగిపోయారు. కానీ, అయోధ్య రాముడు ఎక్కడ అడుగుపెడితే అది క్షేత్రమవుతుందని వాళ్లకు వాళ్లు సముదాయించుకున్నారు. రాముడు మునకేసిన నీళ్లు తీర్థాలు అవుతాయని మనసుకు సర్దిచెప్పుకొన్నారు. 14 ఏండ్లు గతించాయి. రాముడు వచ్చాడు. సీతాసమేతంగా వచ్చాడు. రావణాసురుణ్ని అంతమొందించి జగదభిరాముడిగా వచ్చాడు. అవతార లక్ష్యం నెరవేర్చుకొని అయోధ్య పాలనకు మళ్లీ వచ్చాడు. పట్టాభిరాముడు అయ్యాడు. అయోధ్యవాసుల ఆనందం అంతా ఇంతా కాదు. ధర్మపాలనలో తరించింది అయోధ్య. నెలకు మూడు వానలతో పసిడి పంటలు పండాయి. ధర్మమూర్తి పాలనతో రాజ్యమంతా ధర్మమే.
అనర్థం లేదు, వ్యాధుల్లేవు, దొంగల్లేరు, వంచకుల్లేరు, పిల్లలకు కర్మ చేయాల్సిన దుస్థితి పెద్దలకు పట్టలేదు, అకాల మరణాల్లేవు. ఆనందమూర్తి పాలనలో అయోధ్య ప్రజలు బ్రహ్మానందం పొందారు. రామరాజ్యం యుగయుగాలకు ఆదర్శ రాజ్యమైంది. శ్రీరాముడి పరిపాలన… పాలకులకు పాఠమైంది. ఇన్నాళ్లకు అయోధ్య కొత్తకళ సంతరించుకుంది. రాముడు పుట్టిపెరిగిన ప్రాంతంలో దివ్యమందిరం వెలిసింది. ఆ కోవెలలో కోదండపాణి బాలరాముడిగా కొలువుదీరుతున్నాడు. ఈ రాముడు ఎక్కడికీ వెళ్లడు. తరతరాలు నిలిచి ఉంటాడు. యుగయుగాలు అనుగ్రహిస్తాడు. ఈ పుణ్యం కేవలం అయోధ్యది మాత్రమే కాదు.. మన యావత్ భారతానిది. సమస్త హైందవానిది. సంపూర్ణ ప్రపంచానిది. మొత్తం విశ్వానిది.
రాముడు నడయాడిన అయోధ్యలోని ప్రతి నెలవూ కోవెలే! రాముడు సేవించిన, స్నానం ఆచరించిన ప్రతి చెలిమె పుణ్య తీర్థమే!! అయోధ్య నగరంలో ఎన్నెన్నో తీర్థాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని. గో ప్రసాద తీర్థం ముఖ్యమైనదిగా చెబుతారు. ఇక్కడే అయోధ్యలో ఉన్నవారందరికీ రాముడు దివ్యగతులు ప్రసాదించాడని అంటారు. మనుషులకు మాత్రమే కాదు పక్షులకు, క్రిమికీటకాలకు కూడా ముక్తినిచ్చాడట. గో ప్రసాద తీర్థంతోపాటు చక్రతీర్థం, అగ్ని తీర్థం, బృహస్పతి తీర్థం, బ్రహ్మకుండ తీర్థం, కోటి తీర్థం, సప్తర్షి తీర్థం, బిల్వ తీర్థం, రామ తీర్థం… ఇలా అయోధ్యలోని బహుళ తీర్థాల విశేషాల గురించి విష్ణుపురాణంలో కనిపిస్తుంది.
అయోధ్యలోని సరయూ నది గంగ అంత పవిత్రమైనది. గంగ శ్రీహరి కుడి పాదం నుంచి ఉద్భవిస్తే… సరయు ఎడమ పాదం నుంచి పుట్టిందని విష్ణు పురాణం చెబుతున్నది. బ్రహ్మ నుంచి ఆవిష్కృతమైన మానస సరోవరం నుంచి సరయూ ప్రవాహం మొదలవుతుంది. రాముడు స్నానం చేయడంతో సరయూ మరింత పవిత్రతను సంతరించుకుందని భాగవతుల విశ్వాసం. చివరికి రాముడు అవతార పరిసమాప్తి చేసింది కూడా సరయూలోనే. శ్రీరామ నవమి (చైత్ర శుద్ధ నవమి) నాడు సర్వతీర్థాలూ అయోధ్యకు చేరుకుంటాయట. వేదాలు తమ శక్తులతో సరయూలోకి ప్రవేశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు, మునులు నదిలో స్నానం చేసి తరిస్తారట. తులసీదాసు ‘రామచరిత్ మానస్’ కావ్యాన్ని శ్రీరామ నవమి నాడే, సరయూ ఒడ్డునే ప్రారంభించాడని తెలుస్తున్నది. ఇంతటి పవిత్రమైన నదీమతల్లి దర్శనం, అందులో పుణ్యస్నానం జన్మకో అదృష్టం.
మన తెలుగింటి కవయిత్రి మొల్ల అల్లిన సీసపద్యం.. నగరాల్లో కెల్లా అయోధ్య కొల్లని చాటుతూ ఉల్లాన్ని జల్లున పొంగిస్తుంది.
సీ॥ సరయూ నదీ తీర సతత సన్మంగళ
ప్రాభవోన్నత మహా వైభవమ్ము
కనక గోపుర హర్మ్యఘన కవాటోజ్జల
త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము
గజవాజి రథ భట గణికాతపత్ర
చామరకేతు తోరణ మండితమ్ము
ధరణీ వధూటి కాభరణ విభ్రమ రేఖ
దరిసించు మాణిక్య దర్పణమ్ము
తే॥ భానుకుల దీప రాజన్య పట్టభద్ర
బాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము
నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము
ధర్మనిలయమ్ము, మహి నయోధ్యాపురమ్ము
‘సరయూ నదీతీరంలో ఉన్న ఆ అయోధ్యాపురం ఎల్లప్పుడూ వైభవంతో ఎక్కువ ప్రాభవాన్ని కలిగి ఉంది. బంగారు గోపురాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, భటులు, గొడుగులు, చామరాలు పట్టేవాళ్లు.. అన్నిటా మిన్నగా నిలుస్తూ మాణిక్యానికి దర్పణం పడుతున్నది. ఈ అవనిలో ధర్మ నిలయమై విలసిల్లుతున్నది’ అని అయోధ్యను పదాడంబరంతో భావస్ఫోరకంగా వర్ణించింది మొల్ల.
సర్వోన్నతంగా నిర్మించిన అయోధ్య రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేవాలయంగా రూపుదిద్దుకుంటున్నది. పునాది నుంచి ఆలయ శిఖరం వరకు ఎక్కడా ఇనుము, సిమెంట్ వాడలేదు. పూర్తిగా రాతితో నిర్మించిన అద్భుతం ఇది. మూడు దశాబ్దాలుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వినియోగించారు. ఈ సుందర మందిరంలో 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. విల్లంబులు ధరించిన కౌసల్య తనయుడు మంగళవారం నుంచి ‘కౌసల్యా సుప్రజా రామ..’ అని సుప్రభాత సేవలు అందుకోనున్నాడు.
శంకుస్థాపన: 2020 ఆగస్టు 5
ప్రాణ ప్రతిష్ఠ: 2024 జనవరి 22
వెడల్పు: 235 అడుగులు
ఆలయ శిఖరం ఎత్తు: 161 అడుగులు
నిర్మాణ విస్తీర్ణం: 57,400 చదరపు అడుగులు
ఆలయం పొడవు: 360 అడుగులు
సుముహూర్తం: మధ్యాహ్నం 12.29 గంటల 8 సెకండ్ల నుంచి 12.30 గంటల 32 సెకండ్ల వరకు (84 సెకండ్లు)
రామ మందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం: 110 ఎకరాలు ప్రధాన ఆలయ ప్రాంగణం విస్తీర్ణం: 2.77 ఎకరాలు
ప్రవేశ ద్వారాలు: 12
-కణ్వస