జరిగిన కథ
భాణుసత్తి ఆహ్వానాన్ని కాదనలేక ఇంట్లోకి అడుగు పెడతాడు సాధనానందుడు. వామదేవుణ్ని గుర్తించక స్పృహ కోల్పోయేటట్లు కొట్టి, చీకటి కొట్టు బయటికి వచ్చిన జయసేనునికి.. ఒకవైపు నుంచి ఈసాణుడు, మరొకవైపు నుంచి ఒక యువతి రావడం కనిపిస్తుంది. ఆ తర్వాత..
హఠాత్తుగా అటువైపు నుంచి వస్తున్న ఈసాణుడి మీద సౌగంధిక దృష్టి పడింది. ఒక్కక్షణం ఏం చేయాలో తోచలేదు ఆమెకు. ఇంతకాలం ఎవరిని తప్పించుకొని తిరుగుతున్నదో, వాణ్నే వెతుక్కుంటూ వచ్చినట్లయింది. ఇప్పటికిప్పుడు వెనుదిరిగి గదికి వెళ్లిపోతే తాను బతికి పోతుంది. కానీ, చీకటి కొట్టు గుమ్మం ముందు పడి ఉన్నవారు ఎవరైనా, తనకు బాగా కావలసినవారే అయి ఉంటారు. వారు ఎవరైనా సరే.. కాపాడుకోవడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం! ఆ ప్రయత్నంలో తనకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా వెనుకడుగు వేయడం సరికాదని అనుకొని వేగంగా అక్కడికి చేరుకున్నది. అతణ్ని పోల్చుకోలేక పోయింది. వామదేవుడైతే కాదు. అంటే కచ్చితంగా జయసేనుడే కావచ్చు అనుకున్నది. అతను ఎవ్వరికీ కనిపించకుండా అడ్డుగా కూర్చుని.. “అన్నా! నీవు జయసేనుడవే కదా! నేను సౌగంధికను. నిన్ను కాపాడేందుకు వామదేవుడు ఇటే వచ్చినాడు. అటు నుంచి ఈసాణుడు వస్తున్నాడు. నీవు ఆలస్యం చేయకుండా వెంటనే లోపలికి పో!” కంఠస్వరం తగ్గించి హెచ్చరించింది. జయసేనుని కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. ‘అంటే.. నేను దాడి చేసింది నా మిత్రుడు దేవ మీదనా?’ అనుకోగానే ఆగలేకపోయినాడు. గబుక్కున లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
సౌగంధిక తల నిండా ముసుగు కప్పుకొని, వినయం ప్రదర్శిస్తున్నట్లు వంగి నిలబడ్డది. ఈసాణుడు వెళ్తూ వెళ్తూ యథాలాపంగా ఆమె వంక చూసి, ముందుకు కదిలి.. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు పక్కనున్న భటునితో ఏదో అన్నాడు. వాడు వెనుక్కి వచ్చి.. “ఏయ్ పిల్లా! ఈ వేళప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావ్?” అన్నాడు వెకిలిగా నవ్వుతూ. “అన్నా! ఏటి గట్టుకు..” అంటూ ప్రాకృతిక అవసరం కోసం అన్నట్లు ఇబ్బందిగా చెప్పింది. “ఛిఛీ! పాడు పిల్ల! పో! తొందరగా పో!” అంటూ ఈసడించుకొని, ఈసాణుడి వద్దకు వెళ్లి.. ఇదే విషయం చెప్పినాడు. కొంచెం ముందుకు వెళ్లి, మలుపు తిరిగిన తర్వాత గుర్తొచ్చింది ఈసాణుడికి. ‘ఏరు ఇటువైపున కదా ఉన్నది! మరి ఆ చిన్నది అటు వెళ్తూ ఏటి గట్టు అంటున్నదేం?’ అనుకొని అదేమాట ఆ భటునితో అన్నాడు. “అవును మహారాజా! నేను కూడా ఆలోచించలేదు!” అని బుర్ర గోక్కున్నాడు వాడు. “ఏదో మోసం జరుగుతున్నట్లు అనిపిస్తున్నది రా! ఆ పిల్లని ఇక్కడికి తీసుకొని రా! దాన్ని అడిగితే అన్ని సంగతులు సరిగ్గా తెలుస్తాయి!” అన్నాడు వెంటనే. ఆ భటుడు వెనుక్కి పరుగెత్తుకొని వచ్చి, ఇందాక సౌగంధిక కనిపించిన చోట చూసినాడు. ఆ పిల్ల కనిపించలేదు! ఆ దారిన చాలాదూరం పరికించాడు. ఎక్కడా దాని ఆనవాలు కనిపించలేదు! ఈ విషయం మహారాజు గారికి చెప్తే ఏం జరుగుతుందో తలుచుకోగానే వాని శరీరం కనిపించసాగింది.
భాణుసత్తి ఆహ్వానం అందుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించిన సాధనానందునికి ముందు గదిలోనే ముసలమ్మ దర్శనమిచ్చింది! “ఎవరు భాణూ.. వచ్చింది?” అన్నది ఆమె అనుమానంగా. “అతను ఆహవకు బావ వరస! వైద్యం తెలుసునట! నిన్ను పరీక్ష చేయడం కోసం రమ్మన్నాను అత్తమ్మా!” అన్నది అప్పటికప్పుడు అబద్ధాన్ని అతికిస్తూ. ఆ తర్వాత భాణు.. ‘ఇంత తెలివిగా మాట్లాడింది నేనేనా?’ అని ఆశ్చర్యపోయింది. కోరికలు మనిషి తెలివిని కూడా పదునెక్కిస్తాయన్న నిజం అర్థమైంది ఆమెకు. అయినా కమలసత్తి (సిరిసత్తి) అనుభవ జ్ఞానం ముందు భాణుసత్తి అమాయక జ్ఞానం అల్పమైందే కదా! “అయ్యో కొడుకా! నామీద మీరంతా ఎంత జాలి చూపిస్తున్నారు నాయనా! కోడలంటే నా కోడలే కోడలు! ఎన్ని కష్టాల సాగరాలను ఈదుతున్నా, మగనిపట్ల మమకారం చెడకుండా కాపాడుకుంటూ వస్తున్నది” అంటూ, లోకం తీరు గురించి ఇట్లా అన్నది..
“కలిమిలేము లందు కష్ట సుఖాలలో తెలిసి నడుచుకొనెడి వలపు కలిగి కాపురములు చేయు కాంతలే కాంతలు! అన్యలంత ప్రాణ హానికరము! (సంపదలోనూ, పేదరికంలోనూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, భర్త పరిస్థితిని గ్రహించి నడుచుకోగల భార్యలే నిజమైన భార్యలు! అట్లా నడుచుకోలేని ఇల్లాళ్లు ఎప్పటికైనా ప్రాణహాని కలిగిస్తారు!)” ఆ మాటలతో.. భాణుసత్తి మత్తు వదిలింది! సాధనానందునిలో కర్తవ్యం జాగృత్తమైంది! వెంటనే.. “నిజం పెద్దమ్మా!” అంటూ వరస కలుపుతూ.. “కొడుకా! అని ప్రేమతో పిలిచినావు, నిజంగా నీ కొడుకులాగా నీకు వైద్యం చేస్తాను! నీ కంటి చూపును తెప్పించే ప్రయత్నం చేస్తాను!” అన్నాడు. ఆమె వద్దకు వెళ్లి, కళ్లు రెండూ పరీక్షించినాడు. “పొగ మంట వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చింది పెద్దమ్మా! ఇది కొంచెం గంభీరమైందే కానీ, వైద్యానికి లొంగనంత కఠినం మాత్రం కాదు! దీనికి ప్రత్యేక మూలికతో చికిత్స చేయాలి. రెండు రోజుల్లో నేను మూలికను సాధించుకొని మళ్లీ కలుస్తాను!” అంటూ భాణుసత్తి వైపు చూడనైనా చూడకుండా వెళ్లిపోయినాడు.
ఇదంతా బయట నుంచి గమనిస్తున్న ఆహవ మనసులోనే ఆ మహానుభావునికి దండం పెట్టుకున్నది. అయినా.. ఈ పరిచయం, పర్యవసానాలను గురించి ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది. మరొక పక్క భాణుసత్తి ఆ వెళ్లిన బాటసారి వంకనే కన్నార్పకుండా చూస్తున్నది. అతను వెళ్లి చాలాసేపు అయిందన్న స్పృహ కూడా ఆమెకు ఉన్నట్లు లేదు! “ఎవరో మహానుభావుడు! దేవుడు పంపినట్లే వచ్చినాడు. ఇటువంటి వాళ్ల వల్లనే కొడిగట్టే ఆశలు నిలబడతాయి! జీవితం మీద నమ్మకం కలుగుతుంది” తనలో తానే అనుకున్నట్లు కమలసత్తి గొణుక్కుంటూ, మళ్లీ మంచం మీద ఒత్తిగిలి పడుకున్నది. ఆ మాటలకు ఆహవసత్తి పెదవుల మీద క్షణకాలం చిరునవ్వు మెరిసి మాయమైంది! అక్క కూడా ఇటువంటి ఆలోచనతోనే ఉన్నట్లున్నది. బుద్ధదేవుడు చెప్పినట్లు.. ‘దుఃఖానికి కారణం కోరికలే!’ అనే మాట అన్ని సందర్భాలకు వర్తిస్తుందో లేదో కానీ, మనిషి బతకడానికి కారణం కోరికలే! అనే మాట మాత్రం అందరికీ, ఎప్పటికీ వర్తిస్తుంది! అనుకుంటూ భాణుసత్తిని పలకరించింది. “అక్కా! అతను వెళ్లి చాలాసేపైంది” అంటూ, భుజంమీద చేయి వేసి కుదిపింది. ఆహవను గట్టిగా హత్తుకున్నది భాణు. గుండెలో గూడు కట్టుకున్న దుఃఖం కట్ట తెగిన చెరువైంది.
“అర నిముసమునైన నాతని యెడబాటు సైపలేను; అగ్ని సరణి నన్ను కాల్చు చుండె చూడు! కాయమున్ను కృషించె చావు నీయ డొక్కొ దేవుడైన! (ఆ దేవుడు నన్ను తొందరగా తీసుకొని పోతే బాగుండును! ఆయన ఎడబాటును అర నిమిషం కూడా నేను భరించ జాలను. అది నన్ను అగ్నిలా కాల్చి వేస్తున్నది! ఈ దేహం కూడా ఎంతగా కృశించిపోయిందో చూడు!)” అన్నది. నిజమే! అక్కకు ఏమీ తెలవదు. ఎండ కన్నెరుగని సుకుమారి ఈ రాకుమారి! బావనే సర్వస్వంగా నమ్మి, జీవితాన్ని అర్పిద్దామని వచ్చింది. ఆమె ప్రాణాలన్నీ అతని మీదనే! ఆమె ఎంతగా కోరుకున్నదో అంతగా అతను దూరమవుతూనే ఉన్నాడు. అసలు ఉన్నాడో లేడో! ఎక్కడున్నాడో! ఎట్లా ఉన్నాడో! లోకం తీరు తెలవని మా అక్క గారికి మనసు ఏం చెబుతుందో అదే మాట్లాడటం తెలుసు. బాధైనా, సంతోషమైనా, ఆవేశమైనా, ఆశ్చర్యమైనా.. ఏదీ దాచుకోకుండా మట్టి పరిమళంలా ఆమె మాటల్లో బయటపడుతుంది. లోకం తెలియని ఈమెకు శోకాన్ని వరంగా ప్రసాదించిన ఆ దేవుణ్ని ఏమనాలి? ‘అయినా, తను ఆలోచిస్తున్నది దేశాంతరంలో ఉన్న భర్త గురించా? లేక ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిన ఈ బాటసారి గురించా?’ అనే ఆలోచన ఆమెను ఉలిక్కిపడేటట్లు చేసింది.
వచ్చిన భటునికి సమాధానం అయితే చెప్పింది కానీ, నిజానికి ఏరు ఎటువైపు ఉన్నదో సుద్ది (సౌగంధిక)కి మాత్రం ఏం తెలుసు? ‘నేను చెప్పిన సమాధానం తప్పు అని తెలిస్తే వాడు ఊరుకున్నా, అనుమానపు పీనుగు ఈసాణుడు ఊరుకోడు! ఇప్పుడేం చేయాలి?’ అనుకుంటుంటే ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తలుపు వైపు ముఖం పెట్టి లోపల ఉన్న జయసేనునికి వినిపించేటట్లు.. “అన్నా! నేను ప్రమాదంలో ఉన్నా. తొందరగా తలుపు తెరువు!” అన్నది. వెంటనే తలుపు తెరుచుకోవడం, ఆమె లోపలికి వెళ్లగానే మూసుకోవడం క్షణంలో జరిగిపోయింది. ఉత్తర క్షణంలో ఆమెను వెతుక్కుంటూ అక్కడికి చేరిన భటునికి ఆమె కనిపించలేదు! కంగారులో వాడు తలుపు బయట తాళం లేదనే సంగతి గమనించలేదు కానీ, గమనిస్తే కథ మరోలా ఉండేది. లోపల.. కటిక చీకటి! చీకటి బతుకుల గురించి ఆమెకు తెలుసు కానీ, చీకటి ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి సౌగంధిక అనుభవంలోకి వచ్చింది. ఈ చీకటి గొయ్యారంలో పాములు, తేళ్లు, మండ్రగబ్బలు, గబ్బిలాలు వంటివి ఎన్ని ఉంటాయో అనుకోగానే.. ఆమె దేహం చిగురుటాకులా వణికింది. “సౌగంధికా!” ఆర్ద్రంగా పిలిచినాడు జయసేనుడు. “అన్నా! చీకటి ఇంత దారుణంగా ఉంటుందా! ఎట్లా భరిస్తున్నావన్నా?” అన్నది ఆందోళనగా. అనుకోకుండా ఆమె కళ్ల నుంచి నీళ్లు నిశ్శబ్దంగా జారినై. “అంతకంటే భరించలేనిది ఇంకొకటి జరిగిందేమోనని నాకు భయం వేస్తుంది తల్లీ!” దిగులుగా అన్నాడు అతను. “ఏమిటది?” భయంగా, అనుమానంగా, అయోమయంగా, ఆందోళనగా అన్నది ఆమె.
కొన్ని క్షణాలు తటపటాయించి, ఇట్లా అన్నాడు జయసేనుడు. “వచ్చినవాడు దేవా అని తెలియక లోపలికి రాగానే మీదపడి, ఇష్టం వచ్చినట్లు కొట్టినాను! స్పృహ తప్పి పోయినాడు! నిజంగానే స్పృహ కోల్పోయినాడో లేక ప్రాణాలే..” అతని మాట పూర్తి కాలేదు; ఆమె గుండె ఆగినట్లయ్యింది. “అంత ఆందోళన అవసరం లేదులేరా! ఆ దేవుని దయ ఈ దేవుని మీద.. కాదు కాదు ఇప్పుడు నేను దేవిని; ఈ దేవి మీద నిండుగా ఉన్నది!” అన్నాడు సన్నగా నవ్వుతూ వామదేవుడు. మాటల శబ్దాన్ని బట్టి అతను ఉన్న స్థలానికి చేరుకొని, గాలిలో చేయి ఆడించింది సౌగంధిక. “దేవా!” అన్నది ప్రేమ ఉప్పొంగగా. ఆమె అలికిడి ఆనవాలుగా దేవి రూపంలోని వామదేవుడు తాను కూడా గాలిలో చేతిని కదిలించినాడు. ఇద్దరి చేతులూ కలుసుకున్నాయి! పరస్పర స్పర్శతో ఒండొరులను గుర్తించుకున్నారు! ఒక్కసారిగా అతణ్ని గట్టిగా అల్లుకున్నది సౌగంధిక. “సౌగంధీ!” గుండె లోతుల్లో నుంచి తడిగా వచ్చిన ఆ ప్రేమ పిలుపు దేహమంతటా విద్యుత్తులా ప్రవహించి, ఆమె హృదయంలో వేయి దీపాలు వెలిగించింది.
“దేవా!” అన్నది, అంతకు మించిన ప్రేమతో వణుకుతున్న గొంతుతో సౌగంధిక. ఆ చీకటి లోకంలో ప్రేమ శరత్ జోత్స్న అయ్యింది! కొంచెంసేపు వాళ్ల ప్రణయ రసవాహినిని అడ్డుకోకుండా మౌనంగా ఉండిపోయినాడు జయసేనుడు. తర్వాత ఒకేసారి వాళ్లిద్దరికీ గుర్తొచ్చినట్లున్నది. ఆ గాఢాంధకారంలో తమతోపాటు మరొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడని, అతని కోసమే తాము వచ్చినామని గుర్తుచేసుకున్నారు.. వామదేవుడు, సౌగంధిక. నెమ్మదిగా కౌగిలి సడలింది. అయినా ఆమె అతని నుంచి విడివడలేక పోయింది. గుండెలో తల పెట్టుకొని, అతని మెడవంపు అందిస్తున్న హాయిలో లీనమవుతూనే ఉన్నది. “జయా! ఎలా ఉన్నావురా? అసలు ఉన్నావో లేదో అనుకొని ఎంత బాధపడ్డానో! ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానో తెలుసా?” అన్నాడు కన్నీరై ప్రవహిస్తూ.. దేవి రూపంలోని దేవ.. వామ దేవుడు. “నా సంగతి సరే! నీవు ఇక్కడికి ఎట్లా వచ్చినావు? నీ సంగతి సరే.. నా చెల్లి సౌగంధికను ఎందుకు తెచ్చినావు?” అన్నాడు జయసేనుడు. “ఆ సంగతులన్నీ చర్చించుకోవడానికి ఇది సమయం కాదు; అనువైన స్థలమూ కాదు! ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి!” అన్నాడు వామదేవుడు. సరిగ్గా అప్పుడే ఆ గది తలుపులు భళ్లున తెరుచుకున్నాయి.