జంగిటిలో ఆహవసత్తి సచ్చసామిని తప్పించగానే అక్కడ సాధనానందుడు ప్రత్యక్షమవుతాడు. చంద్రహత్థి తాను ఒంటరిగా పోటిసుణ్ని కలుసుకునేందుకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. బుధవారం సంతలో వామదేవుడు చేసిన పొరపాటుకు భటులు అతని మీదికి ఆయుధాలు ఎక్కుపెడుతారు. తర్వాత..
సు ద్ది రూపంలో ఉన్న సౌగంధిక గుండెలో రాయి పడ్డట్లయింది. కాళ్లు చేతులు వణకడం మొదలైంది. ‘అసలు తాము అనుకున్న దేమిటి? ఇక్కడ జరుగుతున్న దేమిటి?’ అనే విషయం ఆలోచిస్తుంటే.. ఆమెకు మతి తప్పుతున్నది. వామదేవుడు ఆవేశపరుడని తెలుసు కానీ, ఇంత అనాలోచితంగా ప్రవర్తిస్తాడని ఏమాత్రం ఊహించలేదు. వామదేవుడు కూడా తన తప్పిదాన్ని ఆలస్యంగా గ్రహించినాడు. హఠాత్తుగా అవణాయరుడు అంత అనుచితంగా ప్రవర్తిస్తాడని ఊహించని వామదేవుడు.. అసంకల్పితంగా అతని చెంప పగలగొట్టినాడు. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఊహించలేక ఇరుక్కొని పోయినాడు. “ఎవరు నువ్వు? మీరు ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ కనిపించలేదు. ఆయన ఎవరో తెలుసా? ప్రభువుల వారికి అత్యంత సన్నిహితులు. ఎందుకు ఇట్లా వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించినారు? దీనికి దండన చాలా భయంకరంగా ఉంటుంది” అంటూ భటుల్లోని ముఖ్యమైనవాడు ఈటెను దేవి (వామదేవుని) గొంతు వద్ద మరింత బలంగా అదుముతూ అన్నాడు. వెంటనే ఏడుస్తూ, తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించినాడు దేవి రూపంలోని వామదేవుడు. “అయ్యో! దేవుడా! దేవుని వంటి ఈ రాజుగారికి మేలు చేయాలని నేను చేసిన పని మీకు రాజద్రోహంలా అనిపించిందా? అయ్యో ప్రభూ! మీరైనా చెప్పండి! నా తప్పిదం ఏమీ లేదని. చెప్పండి ప్రభూ!” అన్నాడు, ప్రేమతో అవణాయరు ముఖంలోకి చూస్తూ. అయోమయంలో పడిపోయినాడు అవణాయరు. ఆమె ప్రేమను చూసి, బాధ మరచి పోయినాడు. “తప్పుకోండి.. తప్పుకోండి..” అంటూ భటులను దూరం జరిపినాడు. వాళ్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. అదే అదనుగా దేవి విజృంభించింది.. “మీ మెత్తని నున్నని బుగ్గ మీద.. అదే నా పెదాలు ఆటాడుకోవలసిన రంగస్థలం మీద.. ఒక రాకాసి దోమ వాలి మీ రక్తం తాగాలనుకుంది ప్రభూ. నేను అది భరించలేక..” ఆపై మాట్లాడలేక ఒకింత ఏడ్చి, “నిజంగా ఇది నా తప్పయితే నన్ను దండించండి!
మీరు ఏ శిక్ష వేసినా నాకు సమ్మతమే!” అంటూ కన్నీళ్లు తుడుచుకొని, అతని రెండు చేతులనూ తన రెండు చేతుల్లోకి తీసుకొని సుతారంగా వత్తింది. నిప్పుకణిక లాంటి అవణాయరు.. ఆ చర్యతో మంచు ముద్దగా మారిపోయినాడు. “ఒరేయ్ మూర్ఖులారా! ఇది దెబ్బ కాదురా! ప్రణయకేళి! కావాలంటే ఈ చెంప మీద కూడా కొడుతుంది. చూస్తారా?” అన్నాడు రెచ్చిపోతూ. ఆ మాటలతో అందరితోపాటు వామదేవుడు కూడా ఉలిక్కిపడ్డాడు. సౌగంధిక అయితే.. ‘ఇది నిజంగా జరుగుతున్నదా? లేక తాను కలగంటున్నదా?’ అన్న సందిగ్ధంలోనే ఉన్నది ఇంకా. అవణాయరు గుసగుసలాడుతున్నట్లు దేవితో.. “కొట్టు సుందరీ! ఈ చెంప మీద కూడా కొట్టు! దోమ కోసం కొట్టానంటే అబద్ధం అనుకుంటారు. ప్రేమతో కొట్టానంటే ప్రణయ విలాసం అనుకుంటారు. నీవు నాతో ప్రేమలో ఉన్నావంటే ఎవరూ నీ వంక కన్నెత్తి కూడా చూడరు!” అన్నాడు. ‘నువ్వు ఇట్లా ఉన్నావ్ ఏందిరా? మట్టి ముద్దవనుకున్నా.. పేడముద్ద కంటే అధ్వాన్నంగా ఉన్నావు. చావు నా కొడకా!’ అనుకుంటూ.. మరింత బలంగా రెండో చెంప పగలగొట్టినాడు వామదేవుడు. అంగడి మొత్తం ఉలిక్కిపడ్డది ఆ దెబ్బకు. కళ్లల్లో నీళ్లు దూకినాయి అవణాయరుకు. అయినా కప్పిపుచ్చుకుంటూ.. “ఇదీ.. ప్రేమ కలాపం అంటే! నావి కన్నీళ్లు అనుకున్నారా? కావు.. ఆనంద బాష్పాలు! కదా సుందరీ..!” అంటూ వామదేవుని చేతులు పట్టుకున్నాడు. “ప్రాణేశ్వరా! మీ ప్రేమ అపూర్వం! అపురూపం! అనంతం! అత్యంత ధీమంతం!..” అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడ సాగినాడు దేవి రూపంలోని వామదేవుడు. భటులతోపాటు అక్కడ గుమిగూడిన జనం.. “ఛీ! థూ!” అనుకుంటూ వెళ్లిపోయినారు. ఆ నాటకం పూర్తిగా అర్థం కాక; వామదేవుణ్ని సరిగ్గా అంచనా వేయలేక సతమతమవుతూ ఆశ్చర్యంగా అతణ్నే చూస్తున్నది సుద్ది (సౌగంధిక). ఈ నాటకం ప్రారంభానికి ముందు అమాయకుడైన వామదేవుణ్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకున్నది సౌగంధిక. కానీ ఇప్పుడు అతని అద్భుతమైన నటన చూసి, తన మనసు మార్చుకున్నది. ‘అతను చెప్పినట్లు తాను వినడమే మేలు’ అని నిర్ణయించేసుకున్నది.
సచ్చసామి తనంతకు తాను దూరంగా వెళ్లిపోయేటట్లు చేసి, పక్కకు తిరిగి చూసి ఉలిక్కిపడింది ఆహవసత్తి. పక్కలో అక్క భాణుసత్తి లేదు. పరికించి చూస్తే తను ఇంటి వైపు వెళ్తున్నది. ‘అంతలోనే ఇంటికి ఎందుకు వెళుతున్నదో!’ అనుకుంటూ, పరికించి చూసింది. ఆమె కంటే ముందు ఒక యువకుడు వెళుతున్నాడు! ఆహవకు చెమటలు పట్టినాయి. పరుగులాంటి నడకతో అక్క వద్దకు చేరుకున్నది. అక్క భాణుసత్తి కూడా కొంచెం నడకవేగం పెంచింది. ఇంటి గుమ్మం వద్దకు చేరుకున్నారు ఒకరి తర్వాత ఒకరు. ముందు నడుస్తున్న యువకుడు ఇదేమీ పట్టనట్లు తిరిగి చూడకుండా వెళుతున్నాడు. అతనికి వినిపించేటట్లు భాణుసత్తి.. “ఓ యువ కిశోరమా! ఆగు!” అన్నది. ఆ మాట ఎక్కడో విన్నట్టున్నది అనుకొని వెనుదిరిగినాడు సాధనానందుడు. భాణుసత్తిని చూసి నిశ్చేష్టుడై, నిలువు గుడ్లేసుకొని మెదలకుండా ఉండిపోయినాడు. మనిషి ఉన్నంతకాలం మోహం వీడకుండా ఉంటుందని చెప్పడానికే అన్నట్లు ఆ సుందరాంగి తాను ఎక్కడికి వెళ్లినా, తనను వదలకుండా వెంటాడుతున్నది. అవును! ఆమె తనకు తొలిసారి జలపాతం వద్ద కనిపించిన సౌందర్యరాశి! కోటి మందిలో ఉన్నా గుర్తించగలడు తాను. ‘ఆమె ఇక్కడ ఎందుకున్నది?’ ఆలోచిస్తూ ఉండిపోయినాడు. కానీ, భాణుసత్తిగా పేరు మార్చుకున్న రోహాదేవికి అతనెవరో తెలియదు. తెలియకుండానే మల్లికాగిరి పొలిమేరలో అంధకూపంలో నుండి తన చెల్లెలు సీహాదేవితో కలిసి కాపాడింది; తనను జలపాతం వద్ద చూసి దేశ బహిష్కారానికి గురి అయినవాడు, అంధకూపంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు, ఇప్పుడు ఎదురుగా కన్నార్పకుండా చూస్తున్నవాడు ఒక్కడే! ప్రణాలుడు! వాడే సాధనానందుడుగా మారిన వాడని రోహకు ఏమాత్రమూ తెలవదు.
అగ్ని ప్రమాదం నుండి బయటపడి, రహస్య మార్గం ద్వారా అనుకోకుండా జంగిటికి చేరుకున్నారు తాను (భాణుసత్తి అనే రోహాదేవి), అలసుద్ది (ఆహవ సత్తి), అత్త సిరిసత్తి (కమల సత్తి). అగ్ని ప్రమాదంలో అత్త చూపును కోల్పోయింది. కువిందుడు తాను కలిసేదాకా మారుపేర్లతో ఉండాలని కోట నుండి తప్పించుకుని వచ్చేటప్పుడు చెప్పినాడు. అతని సూచనలను అనుసరించే పేర్లు మార్చుకొని కథ నడిపిస్తున్నది ఆహవసత్తి పేరుతోనున్న అలసుద్ది. అయితే తాము అక్కడి నుంచి బయలుదేరగానే కోట బుగ్గి అయిపోయిందని; కువిందుడు ప్రాణాలు కోల్పోయినాడని వీళ్లకు తెలవదు. ఇక్కడ ఆహవకు భాణుసత్తిని కాపాడుకోవడం కత్తిమీద సాముగా మారింది. ఆమె అందానికి మగవాళ్లంతా కమలం చుట్టూ భ్రమరాల్లా వెంటపడుతూ ఉండటం ఒక ఎత్తు అయితే, తోడు కోసం తహతహలాడుతున్న అమాయిక రోహ.. నాలుగు గోడలు దాటి విశాల ప్రపంచంలో తిరుగాడుతూ ఉండటం మరొక ఎత్తు. ప్రస్తుతం తాను అంతఃపురాంగన కాదని, ఒక మామూలు స్త్రీగా పదిమందిలో తిరుగాడుతున్నానన్న సంగతి ఆమెలో మరింత స్వేచ్ఛా భావాన్ని పెంచింది. తననే చూస్తున్న ఆ యువకునితో ఇట్లా అన్నది భాణుసత్తి “చేతి పుస్తకమ్ము చెప్పుచున్నది జ్యోతి షుడవొ, వెజ్జు వీవొ సుందరాంగ! ఇంట గుడ్డి అత్త; ఒంటి నవోఢను వర్తకమ్ము కేగె భర్త; రమ్ము! (ఓ సుందరాకారా! నీ చేతిలో పుస్తకం చూస్తుంటే నీవు జ్యోతిష పండితుడవో లేక వైద్యుడవో అనిపిస్తున్నది. నేను కొత్తగా పెళ్లయిన దాన్ని. భర్త వ్యాపారం కోసం వెళ్లినాడు. ఇలా ఒంటరిగా ఉండటం బాధాకరం! ఒక్కసారి ఇంటిలోనికి రా! ఇంట్లో అత్త ఉన్నది కానీ ఆమె గుడ్డిది)” అన్నది నర్మగర్భంగా. అంటే అతను వైద్యుడు అయినా, పండితుడైనా తప్పనిసరిగా ఇంట్లో అడుగు పెట్టవలసిందే! వైద్యుడు అయితే గుడ్డి అత్తకు చికిత్స చేయాలి; జ్యోతిషుడు అయితే దూరదేశంలో ఉన్న భర్త ఎప్పుడు వస్తాడో చెప్పాలి. ఇదంతా గమనిస్తున్న ఆహవసత్తి కలవరపడి పోతున్నది. ఎందుకంటే.. అంతా బాగానే ఉన్నది కానీ.. ‘నేను కొత్తగా పెళ్లయిన ఆడదాన్ని. ఓ సుందరాకారా! ఇంట్లోనికి రా!’ అని అక్క ఎందుకంటున్నది? అనే విషయంలో స్పష్టత లభించడం లేదు దానికి.
* * *
కళింగ రజాంతఃపురంలోని చీకటి కొట్టులో జయసేనుడు! గదినిండా గబ్బిలాల కంపు; ఒంటిమీద ఈసాణుడు చేసిన కత్తి గాయం మంట అప్పుడప్పుడూ బాధ పెడుతున్నది. అంతకు మించిన బాధ.. వాడు చేసిన ఘోర కృత్యాలను తలుచుకున్నప్పుడు కలుగుతున్నది. పోదనలో తమ మేడ అగ్నికి ఆహుతి అయిందన్న వేదన కంటే తన తల్లి, తన భార్య ఏమైపోయారోనన్న బాధ దుఃఖమై అతణ్ని ముంచెత్తుతున్నది. అంత దుఃఖంలోనూ అతణ్ని ఎంతో కొంత ప్రశాంతంగా ఉండేటట్లు, బతికుండేటట్లు చేస్తున్న ఒకేఒక్క ఆశ.. కువిందుడు! అతను ఉన్నంతకాలం అమ్మకు, రోహకు ఏ ప్రమాదమూ కలగదు. ఆస్తులు మళ్లీ సంపాదించుకోవచ్చు; ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే.. ఆలోచించి, ఆలోచించి జయసేనుని మెడ నరాలు చిట్లిపోతున్నాయి; తల దిమ్మెక్కి పోతున్నది; ఆకలితో, దాహంతో పేగులు పిడచగట్టుకొని పోతున్నాయి. చీకటిలో రాత్రీ పగలు తేడా తెలియడం లేదు. ఎన్ని రోజులైందో అంతు చిక్కడం లేదు. ఎడతెగని ఆలోచనలు.. ఏదో ఒక అద్భుతం జరగకపోదన్న ఆశ; తాను ఈ బాధ నుండి తప్పక బయటపడగల నన్న నమ్మకం అతని ప్రాణాలను కాపాడుతున్నది. అతని ఆశలకు జీవం పోస్తున్నట్లు గది తలుపు తెరుచుకుంటున్న అలికిడి వినిపించింది.
అందంతో, అంతకుమించిన మాటకారితనంతో అవణాయరును బుట్టలో వేసుకోవడంలో కృతకృత్యుడైన వామదేవుడు (దేవి), తన ప్రియురాలు సౌగంధిక (సుద్ది)తో సహా కోటలో పాగా వేసినాడు. తన మందిరానికి పక్కనే ఉన్న గదిలో అత్తా కోడళ్లయిన దేవీ, సుద్దిలకు ఉండే ఏర్పాటు చేయించినాడు అవణాయరు. ఆరోజు రాత్రి అవణాయరుతో చాలాసేపు ముచ్చటించింది దేవి. సంతలో జరిగిన సంఘటనతో పూర్తిగా దేవి వశమై పోయినాడు అవణాయరుడు. ఆమె ఏం చెబితే అది చేయాలి; ఆమెకు ఏ కష్టమూ కలగకుండా చూసుకోవాలి! అనుకునే స్థితికి చేరుకున్నాడు. ఏమడిగినా కాదనకుండా చేయదలుచుకున్నాడు. ఈ పరిస్థితి చూసి సుద్ది (సౌగంధిక) మాత్రం లోలోన ఉడికిపోతూ; ఆశ్చర్యపోతూ; ఆనందపడుతూ తన ప్రియుని గొప్పతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయసాగింది. “ప్రభువుల వారు మా సేవలు ఏవైనా నిస్సంకోచంగా వాడుకోవచ్చు, ఇంకా పరాయి వాళ్లమన్న భావన లేకపోతే..” వగలు పోయింది దేవి; కరిగిపోయినాడు అవణాయరు. “అయ్యయ్యో! మావాళ్లు అనే కదా నా మందిరం పక్కన స్థానం ఇచ్చినాను!” అన్నాడు. “అంతేలెండి మహాప్రభూ! మేం మాత్రం మీ మందిరంలో స్థానం ఆశించినామా?” అన్నది, ఓరకంట చూస్తూ. ఆ మాటకు కంగారుపడి, అంతలోనే తేరుకొని.. “మా హృదయ మందిరంలోనే చోటిచ్చినాము కదా సుందరీ!” అన్నాడు తెలివిగా. “అయితే, తమరికి తలనొప్పిగా ఉన్నదని, శిరోమర్దనం చేయుమని అడగనేలేదు..” అన్నది దేవి చిరు కోపంతో. ‘నాకు.. తలనొప్పి.. లేదే..! ఓహో! ఆమె నాకు దగ్గర కావడానికి ఇది ఎత్తుగడ కాబోలు!’ అని అర్థం చేసుకొని, “అవునవును.. నాకు నొప్పి, తలనొప్పి.. కొంచెం సౌగంధిక..” ఆ మాట వినగానే కొద్దిదూరంలో ఉన్న సౌగంధిక.. “చెప్పండి ప్రభూ!” అన్నది పరధ్యానంగా. ఉలిక్కిపడ్డారు ఇద్దరూ!