కమాన్‌బజార్, మే 16 : ఖమ్మం లకారం సర్కిల్లో ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులను నగర పాలక సంస్థ అధికారులు శనివారం రాత్రి తొలగించారు. ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల ప్రస్థానంపై ఆయన అభిమానులు.. ఆ ప్రాంగణంలో పైలాన్ నిర్మించడంపై ‘పీవీ ప్రాంగణంలో ఇతర విగ్రహాలొద్దు’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో శనివారం వార్త ప్రచురితమైన విషయం విదితమే.
దీనిపై స్పందించిన నగర పాలక సంస్థ అధికారులు పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో తుమ్మల 40 ఏళ్ల ప్రస్థానంపై నిర్మిస్తున్న పైలాన్ పనులను నిలిపివేశారు. కట్టడాలను అక్కడి నుంచి పూర్తిగా తొలగించారు. కాగా, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పైలాన్‌ను వెంటనే తొలగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పైలాన్ నిర్మాణంపై ప్రజలు, ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో స్పందించిన మంత్రి వెంటనే నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యను ఆదేశించి, పైలాన్ పనులు నిలిపివేసి అక్కడి శకలాలను తీసివేయాలని సూచించారు.
పీవీ విగ్రహానికి క్షీరాభిషేకం
ఖమ్మం నగరంలోని లకారం సర్కిల్ పీవీ ప్రాంగణంలో నిర్మిస్తున్న పైలాన్‌ను మున్సిపల్ అధికారులు తొలగించడంతో బ్రాహ్మణ సంఘం ఆధ్వరంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, నివాళులర్పించారు. తమ మనోభావాలను గుర్తించి, నిర్మాణాలను తొలగించడం పట్ల ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు సురావర్జుల వాసు, ఊటుకూరు రవికాంత్, మాటూరు లక్ష్మీనారాయణ, యర్రంరాజు రాధాకృష్ణ, జమలాపురం కేశవరావు, చాగంటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.