సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): నగరంలోని బస్తీలు, కాలనీల్లో తాగునీరందక ప్రజలు అల్లాడుతుంటే జలమండలి అధికారులు మాత్రం అపార్ట్మెంట్లకు నిరంతర నీటి సరఫరా చేస్తున్నారు. పరిమితికి మించి తాగునీటిని అందిస్తూ పెద్దలకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ పేదలను వేధింపులకు గురిచేస్తున్నారు. నగరంలోని బస్తీల ప్రజలు తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతుంటే.. అన్ని వసతులుండి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉన్న పెద్దలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కపాడుతున్నారు. పేదలను దాహార్తితో అల్లాడిస్తూ పెద్దలను కంటికి రెప్పలా కాపాడుతున్నారని జలమండలి వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులే అపార్ట్మెంట్ వాసులతో కుమ్మక్కయి నీటి దందా సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సరిపడా సరఫరా కావడం లేదు..
జలమండలి పరిధిలోని కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గబ్చిబౌలి, నానక్రామ్గూడ, కొత్తగూడ, మియాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా అపార్ట్మెంట్లు, హాస్టళ్లు, కార్పొరేట్ కార్యాలయాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో కమర్షియల్ నల్లా కనెక్షన్లే ఉన్నాయి. వాటికి ఎప్పుడూ నీటి సమస్య రావడంలేదు. తమకు తాగునీరు సరిపడా సరఫరా కావడం లేదని నిరసనలు, ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఎక్కడా కనిపించడం లేదు.
కానీ బస్తీలు, పేద, మధ్య తరగతి ప్రజలుండే ఇతర ప్రాంతాల్లో మాత్రం నిత్యం నీటి కటకట ప్రజలను వేధిస్తున్నది. ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్డెక్కుతున్నారు. జలమండలి కార్యాలయాల మందు ఆందోళనలు చేస్తున్నారు. అధికారులు వందలాదిగా ఫిర్యాదులు చేస్తున్నారు. ధనవంతులు, ఎగువ మధ్య తరగతి ప్రజలుండే అపార్ట్మెంట్లలో నీటి ఇబ్బందులు ఎందుకు రావడం లేదు? పేదలుండే బస్తీల్లోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే ఏంటి కారణం? అనే ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి. దీనికంతటికీ కారణం జలమండలి అధికారులు అపార్ట్మెంట్ వాసుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ వారికి పరిమితికి మించి నీటిని సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.
క్షేత్రస్థాయి సిబ్బందితో వసూళ్లు!
జలమండలి లైన్మెన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పోటీపడి మరీ తాగునీటిపై వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. నగరంలోని ఖరీదైన ప్రాంతాలు, కమర్షియల్ కనెక్షన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు జలమండలి అధికారులు, సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి. నగరంలోని నీటి ఎద్దడి వారికి అక్షయపాత్రగా మారుతున్నది. ఆయా డివిజన్లలో కమర్షియల్ భవనాలు, అపార్ట్మెంట్లకు ఇష్టానుసారంగా నీటిని సరఫరా చేసి.. డబ్బులు వసూలు చేసేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకున్నారని తెలుస్తున్నది.
ఒక్కో అపార్ట్మెంట్, కమర్షియల్ భవనానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. వసూళ్ల కోసం తమకు అనుకూలమైన కిందిస్థాయి సిబ్బందిని ఏండ్ల తరబడిగా బదిలీ చేయకుండా కాపాడుకుంటున్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. వారి ద్వారా లక్షలాది రూపాయలను వసూలు చేస్తూ అధికారుల స్థాయిని బట్టి వాటాలు పంచుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారుల వసూళ్ల దందా వల్ల పేద ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. నీరంతా అపార్ట్మెంట్లకు వెళ్తుండటంతో బస్తీల్లో తరచూ లోప్రెషర్, సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వసూళ్ల దందా సాగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని.. తాగునీటి సరఫరాల వ్యత్యాసాలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.